సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 76వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవం:

  1. అవసరంలో అందిన బాబా సహాయం
  2. సాటి సాయిభక్తుల అనుభవం ద్వారా చేకూరిన మనశ్శాంతి

అవసరంలో అందిన బాబా సహాయం

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నా తోటి సాయి కుటుంబసభ్యులందరికీ నమస్కారం. గత 20-22 సంవత్సరాలుగా నేను సాయిభక్తురాలిని. సాయి నా జీవితంలోకి వచ్చే సమయానికి మా కుటుంబంలో ఎవ్వరూ సాయి భక్తులు కాదు. నేను ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరంలో ఉన్నప్పుడు ఒకసారి నా బ్యాగులో ఒక సాయి ఫొటో కనిపించింది. అది అందులోకి ఎలా వచ్చిందో నాకు ఏమాత్రం తెలియదు. అది నాకిప్పటికీ ఆశ్చర్యకరమైన విషయమే. అలా సాయి నా జీవితంలోకి వచ్చారు. తరువాత నాకు తెలియకుండానే ఆయనను ప్రేమించడం మొదలుపెట్టి, క్రమంగా నేను ఆయనకు అంకిత భక్తురాలిగా మారిపోయాను. ఆయన నాకెన్నో అనుభవాలు ఇచ్చారు. వాటిలో ఒక రెండు అనుభవాలను మీతో పంచుకుంటాను.

బాబా నాకిచ్చిన మొదటి అనుభవం: 

నేను కాలేజీలో చదువుతున్నప్పుడు కంప్యూటర్ కోర్సులో చేరాలని అనుకున్నాను. అయితే ఆ సమయంలో నా తల్లిదండ్రులు ఆర్థిక సమస్యలు ఎదుర్కుంటున్నారు. వాటినుండి బయటపడటానికి ఏం చేయాలా అని వాళ్ళు ఆలోచిస్తూ ఉండేవారు. అటువంటి స్థితిలో వాళ్ళను ఏమీ అడగలేక నేను ప్రశ్నలు - సమాధానాల పుస్తకంలో బాబాను అడిగాను. పదిరూపాయలు దానం చేయమని వచ్చింది. బాబా మందిరం దగ్గర ఉన్న ఒక వ్యక్తికి నేను పదిరూపాయలు దానం చేశాను. ఆ వ్యక్తి పదిరూపాయల నోటును చూసి చాలా సంతోషించాడు. అతని ముఖంలో కనిపించిన సంతోషం నాకు కూడా సంతోషాన్నిచ్చింది. తరువాత ఒకటి, రెండు రోజుల్లో ఒక అద్భుతం జరిగింది. ఆకస్మికంగా మా బంధువు ఒకరు మా ఇంటికి వచ్చి, మా నాన్న చేతిలో డబ్బులు పెట్టాడు. అసలు విషయం ఏమిటంటే, చాలా ఏళ్ళ క్రితం అతను మా నాన్నగారి వద్దనుండి డబ్బులు అప్పుగా తీసుకున్నాడు. మా నాన్న తన డబ్బు తనకివ్వమని అదివరకు ఒకటి, రెండుసార్లు అడిగారు కానీ, అతను తిరిగి ఇవ్వలేదు. మేము ఆ డబ్బు మాకు తిరిగి వస్తుందన్న ఆశను పూర్తిగా వదులుకున్నాము. అలాంటిది అతనంతట అతనే వచ్చి డబ్బులు మాకిచ్చి వెళ్ళాడు. తరువాత నా తల్లిదండ్రులు నా కోర్సు కోసం ఆ డబ్బును నాకిచ్చారు.

ఇటీవల జరిగిన మరో అనుభవం:

ఈమధ్య ఒకసారి నాకు డబ్బు అవసరమైంది. అయితే ఆ సమయంలో నా వద్ద డబ్బు అందుబాటులో లేదు. కాబట్టి డబ్బుల కోసం ఏదైనా అమ్మడానికి బాబా అనుమతి అడిగాను. బాబా నుండి "ఈరోజు వద్దు, రేపటి రోజు చేయండి" అని సమాధానం వచ్చింది. మరుసటిరోజు అమ్మమని ఆయనెందుకు చెప్పారో నాకు అర్థం కాలేదు. కానీ మనకు ఏది మంచిదో, అది మాత్రమే ఆయన చేస్తారని నాకు తెలుసు కాబట్టి బాబా ఆజ్ఞ ప్రకారమే చేశాను. ఆరోజు అమ్మడం వలన నాకు చాలా మంచి లాభం వచ్చింది. దానితో నేను అనుకున్నది చేయగలిగాను. "చాలా చాలా ధన్యవాదాలు సాయీ!"

source: https://www.shirdisaibabaexperiences.org/2019/05/shirdi-sai-baba-miracles-part-2357.html

సాటి సాయిభక్తుల అనుభవం ద్వారా చేకూరిన మనశ్శాంతి

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నేను చిన్నప్పటినుంచి సాయిభక్తురాలిని. మొదట్లో నాకు బాబా గురించి అంతగా తెలియనప్పటికీ, ఆయననే పూజిస్తూ, ప్రార్థిస్తూ, స్మరిస్తూ ఉండేదాన్ని. రానురాను ఆయనకు అంకిత భక్తురాలిగా మారిపోయాను. ప్రస్తుతం నా జీవితంలో ఆయన ఆలోచన లేని ఒక్క క్షణం కూడా లేదు. నేను చాలా సమస్యల్ని ఎదుర్కుంటున్నప్పటికీ సచ్చరిత్ర చదువుతూ, బాబా నామం వ్రాస్తూ, నామజపం చేస్తూ, నవ గురువార వ్రతం చేస్తూ నేను పొందుతున్న ఆనందాన్ని, ప్రశాంతతను, ధైర్యాన్ని మాటల్లో చెప్పలేను. ఆయన ఆశీస్సులు, సహాయ సహకారాలతోనే నా జీవితం సాగుతోంది.

ఈమధ్యకాలంలో నేను కొన్ని సమస్యల కారణంగా  చాలా ఒత్తిడిని అనుభవిస్తుండేదాన్ని. నవ గురువార వ్రతం చేసి, "సమస్యలకు పరిష్కారం చూపి నా మనసుకు ప్రశాంతత చేకూర్చమ"ని బాబాను ప్రార్థించాను. తర్వాత ఒకరోజు యాదృచ్ఛికంగా బ్లాగులో బాధతో కూడుకున్న ఒక అనుభవాన్ని చదువుతూ కన్నీళ్లు పెట్టుకున్నాను. తర్వాత హఠాత్తుగా ఒక అనుభవాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే అది నా సమస్యలాంటిదే. పైగా ఆ అనుభవం వ్రాసిన వారి పేరు కూడా నా పేరే! నేను ఎంతో ఆసక్తిగా ఆ అనుభవాన్ని చదివాను. దాంతో నాకొక ఆశాకిరణం కనిపించి, మానసికబలం చేకూరింది. ఆ అనుభవంలో సమస్యలనుండి బయటపడటానికి బాబాయందు విశ్వాసముంచమని, సచ్చరిత్ర, హనుమాన్ చాలీసా చదువుతూ ఉండమని చెప్పబడి ఉంది. నేను అలాగే చేయాలని నిశ్చయించుకున్నాను. మరుసటిరోజు నా మనసుకెంతో నిశ్చింతగా అనిపించింది. రోజురోజుకీ ఆ నిశ్చింత ఎక్కువగా అనుభవం కాసాగింది. అంతా సాయి కృప. ఇప్పటికీ నాకు సమస్యలున్నాయి కానీ, వాటినుండి బయటపడేలా బాబా సహాయం చేస్తారని నాకు పూర్తి విశ్వాసం ఉంది. కష్టాలలో, బాధలలో కూరుకుపోయి ఉన్నవారికి ఆయన అండగా నిలుస్తారు.

ఓం సాయిరామ్! సాయిచరణం - దుఃఖహరణం.

source: https://www.shirdisaibabaexperiences.org/2019/05/shirdi-sai-baba-miracles-part-2354.html

No comments:

Post a Comment

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo