సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 70వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:

  1. బాబా ఇచ్చిన రెండు మధురానుభవములు
  2. సాయికి చేసిన చిన్న ప్రార్థనతో కంప్యూటర్ లాగిన్ సమస్య పరిష్కారం

బాబా ఇచ్చిన రెండు మధురానుభవములు

సాయిబంధువులకు నా హృదయపూర్వక వందనాలు. నా పేరు పలుకూరి సుధాకర్ రావు. నా సొంత ఊరు ఒంగోలు అయినా ప్రస్తుతం లాయరుగా గుంటూరులో ఉంటున్నాను. సుమారు 35 ఏళ్ల క్రితం నాకు 20 సంవత్సరాల వయస్సులో నేను సాయిబాబా పాదాల చెంతకు చేరుకున్నాను. అప్పట్లో ఒంగోలులోని లాయరుపేటలో ఒక చిన్న సాయిబాబా మందిరం ఉంది. అక్కడి బాబా విగ్రహాన్ని శ్రీ ఎక్కిరాల భరద్వాజగారు స్థాపించారు. రోజూ సరదాగా ఆ మందిరానికి వెళ్ళేవాడిని. ఆ విధంగా సాయిబాబా కృపకు పాత్రుడనై సాయిబాబాతో నా ప్రయాణం ప్రారంభమైంది. ఇప్పుడు నా ప్రతిరోజూ బాబా స్మరణతో మొదలవుతుంది. నిద్రలేస్తూనే మంచంపైన కొంత సమయం బాబా చింతనలో గడుపుతాను. బ్లాగు నిర్వహిస్తున్న వారికి నా అభినందనలు, ఎంతో మంచి కార్యాన్ని చేస్తున్నారు. ఎప్పటికీ బ్లాగు బాబా ఆశీస్సులతో నిరంతరాయంగా కొనసాగాలని కోరుకుంటున్నాను. నేను రోజూ బ్లాగులోని అనుభవాలు చదువుతూ ఎంతో ఆనందాన్ని పొందుతున్నాను. ప్రస్తుతం బ్లాగులో వస్తున్న 'దీక్షిత్ డైరీ' చదివాకే నా రోజువారీ కార్యక్రమాలు మొదలుపెడుతున్నాను.

మొదటి అనుభవం:

మొదటిసారి సాయిబాబా నాకు ఎలా సహాయపడ్డారో తెలియజేసే నా మొదటి అనుభవాన్ని నేనిప్పుడు మీకు వివరిస్తాను. 1987లో మా కుటుంబమంతా ఋషీకేశ్, బదరీనాథ్, గంగోత్రి మొదలైన క్షేత్రాలకు తీర్థయాత్ర ప్లాన్ చేసుకున్నాం. పెద్దవాళ్ళైన మా తల్లిదండ్రులను తీసుకుని మా అన్నయ్య విమానంలో ఢిల్లీ చేరుకోవాలని, నేను మాత్రం రెండు రోజుల ముందు ఏపీ ఎక్స్‌ప్రెస్‌కి బయలుదేరి ఢిల్లీ చేరుకోవాలని మా ప్రణాళిక. అక్కడికి వెళ్ళాక యాత్రీభవన్‌లో రూము తీసుకుని ఉండమని, తాము అక్కడికి వస్తామని మావాళ్లు చెప్పారు. అందుకు అవసరమయ్యే ఖర్చుల నిమిత్తంగా 500 రూపాయలు కూడా నాన్న ఇచ్చారు. అనుకున్నట్లుగానే నేను ముందుగా ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్ నుంచి ఢిల్లీ చేరుకున్నాను. తీరా అక్కడికి చేరాక చూసుకుంటే నాన్న ఇచ్చిన డబ్బులు లేవు. వాటిని హైదరాబాదులోనే నేను మర్చిపోయాను. విమానాశ్రయానికి ఫోన్ చేస్తే, "హైదరాబాద్ నుంచి రావాల్సిన విమానం షెడ్యూల్ రాలేదు, ఈరోజు రాకపోవచ్చు" అని చెప్పారు. నా వద్ద కేవలం వందరూపాయలు మాత్రమే ఉన్నాయి. నేను తిరిగి హైదరాబాద్ వెళ్లడానికి ఆ డబ్బులు చాలవు. నాకేమో హిందీ రాదు. ఏమి చేయడానికీ దిక్కుతోచని స్థితిలో పడిపోయాను. చాలాసేపు నాలో నేను మధనపడ్డాక, "ఏమి జరిగితే అది జరుగుతుంది, రాత్రి తొమ్మిదింటికి ఉన్న హైదరాబాదు ఏపీ ఎక్స్‌ప్రెస్ ఎక్కేస్తాను, అంతా బాబా చూసుకుంటారు" అని అనుకున్నాను. రూము తీసుకోవడానికి డబ్బులు లేక యాత్రీభవన్ హాలులో కూర్చుని, "బాబా! నా కష్టాన్ని తీర్చండి" అని చెప్పుకుని, బాబా జీవితచరిత్ర చదువుకుంటూ ఉండిపోయాను. కొంతసేపటికి ఒక పెద్దావిడ వచ్చి, "ఇక్కడ ఎందుకు కూర్చున్నావు?" అని అడిగింది. వచ్చీరాని భాషలో ఏదో చెప్పాను. అందుకామె, "బాబా ఉన్నారు. ఆయన నీకే ఇబ్బందీ లేకుండా చూసుకుంటారు" అని చెప్పి వెళ్లిపోయింది. తినడానికి డబ్బులు లేకపోవడంతో  ఉదయం నుండి సాయంత్రం వరకు టీ మాత్రం త్రాగుతూ బాబా చరిత్ర చదువుతూ గడిపాను. 7 గంటల 30 నిమిషాలకి నేను అలా బయటకు వెళ్ళాను. అదే సమయానికి మా అన్నయ్య నన్ను వెతుక్కుంటూ అక్కడికి వచ్చాడు. అక్కడ విచారిస్తే సుధాకర్ పేరుతో రూము ఎవరూ తీసుకోలేదని వాళ్ళు చెప్పారు. దానితో ఏం చేయాలా అని అటూ ఇటూ చూస్తుంటే, నేను అక్కడ పెట్టిన సామాను చూసి గుర్తుపట్టి నేనక్కడే ఉన్నానని తనకి అర్థమై నాకోసం వేచి ఉన్నాడు. కాసేపటికి నేను వచ్చి అన్నయ్యని చూసి ఆనందాన్ని పట్టలేకపోయాను. అసలు విషయం ఏమిటంటే, ఆరోజు రాదన్న విమానం తరువాత షెడ్యూలై ఆలస్యంగా ఢిల్లీ వచ్చింది. బాబానే నాకే కష్టం లేకుండా ఆ సహాయం చేసారు, లేకపోతే నా పరిస్థితి ఏమయ్యేదో నాకే తెలియదు. బాబా తన అపారమైన కరుణ చూపించి మమ్మల్ని కలిపారు. తరువాత మా తీర్థయాత్ర అంతా సౌఖ్యంగా కొనసాగింది.

ఇంకొక అనుభవం:

దాదాపు మూడేళ్ళనుండి నా అరికాలికి కురుపు లేచి ఎంతో ఇబ్బంది పడుతున్నాను. వైద్యుడు మందులిచ్చినా ఏ ప్రయోజనం లేకపోయింది. షుగర్ వ్యాధి ఉండటం వల్ల తగ్గుముఖం పడుతున్నట్లే కనిపించినా మళ్ళీ మొదటికి వస్తుండేది. నొప్పివలన నిద్ర కూడా పోలేక పోయేవాడిని. ఇలా మూడేళ్ళగా నరకయాతన అనుభవిస్తున్నాను. నాకే కష్టం వచ్చినా బాబాకి తెలియనిదేముందన్న ఉదేశ్యంతో ఆయనతో ఏమీ చెప్పుకోను. అయితే ఈమధ్య, 'అడగనిదే అమ్మైనా పెట్టదు, అలాంటప్పుడు మన కష్టం బాబాకు చెప్పుకోకపోతే ఎలా?' అనే భావంతో ఒక మెసేజ్ చూసాను. అది చూసాక నా కష్టం గురించి బాబాతో చెప్పుకోవాలనిపించింది. ఇంతలో బ్లాగులో వస్తున్నటువంటి ఊదీ సంబంధిత అనుభవాలు చూశాను. ఎందుకో నాకు ప్రేరణ కలిగి బాబాను ప్రార్థించి ఉదయం, సాయంత్రం సాయి నామజపం చేసుకుని కొంచెం ఊదీ నుదుటిపై ధరించి, మరికొంత పుండు మీద రాసి, మరికొంత నీటిలో కలిపి త్రాగడం మొదలుపెట్టాను. అన్ని సంవత్సరాలుగా ఏ వైద్యానికీ లొంగనిది కేవలం రెండు, మూడు రోజులలో చాలావరకు నయమయింది. ఇప్పుడు దాదాపు తగ్గిపోయినట్లే. మొదటిసారిగా ఊదీ అద్భుత మహిమ ఏమిటో తెలుసుకున్నాను. ఈ అనుభవాన్ని మీతో పంచుకోవాలని నా మనసుకి అనిపించింది. ఈ అవకాశం ఇచ్చిన ఆ సాయినాథునికి, బ్లాగు నిర్వాహకులకు నా ధన్యవాదాలు. బాబా దయ అందరిమీదా సదా ప్రసరించాలని కోరుకుంటూ...

మీ సాయిభక్తుడు
సుధాకర్.

సాయికి చేసిన చిన్న ప్రార్థనతో కంప్యూటర్ లాగిన్ సమస్య పరిష్కారం

బెంగళూరునుండి సాయిభక్తురాలు అనిత ఉల్లపు తన చిన్న అనుభవాన్ని ఇలా తెలియజేస్తున్నారు:

ఒకరోజు నేను నా కంప్యూటర్ ఆన్ చేశాను. అయితే అది నార్మల్‌గా స్టార్ట్ కాకుండా తెలుపు, ఎరుపు, నీలం రంగులతో స్క్రీన్ ఆగకుండా బ్లింక్ అవుతూ ఉంది. లాగిన్ స్క్రీన్ మాత్రం రాలేదు. నేను రెండు, మూడుసార్లు కేబుల్స్ తీసిపెట్టి, రీబూట్ చేశాను, కానీ నా ప్రయత్నాలేవీ ఫలించలేదు. అప్పుడు నేను, "బాబా! నా కంప్యూటర్ మాములుగా పని చేసినట్లైతే నా అనుభవాన్ని బ్లాగు ద్వారా సాయిబంధువులతో పంచుకుంటాను" అని ప్రార్థించాను. మరుక్షణంలో యు.ఎస్.బి కార్డ్ రీడర్ తీసి ఆన్ చేయమని సాయి నాకు ఒక ఆలోచన ఇచ్చారు. ఆ ఆలోచన ప్రకారం నేను యు.ఎస్.బి కార్డ్ రీడర్ తీసి కంప్యూటర్ ఆన్ చేశాను. వెంటనే కంప్యూటర్ నార్మల్‌గా స్టార్ట్ అయింది. "థాంక్యూ సో మచ్ బాబా!" 

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo