సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 65వ భాగం....

ఈరోజు భాగంలో అనుభవం: 

  • బాబా అమ్మలకే అమ్మ

యు.ఎస్. నుండి పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

'ఓం సాయి రాం' అనే అద్భుతమైన మూడు పదాలు నా జీవితంలో సంతోషాన్ని నింపుతున్నాయి. ఆ పదాలే(oms AIR am) నేను శ్వాసించే శ్వాస. బాబా తన భక్తులను తన చెంతకు చేర్చుకునే విధానాన్ని ఎవరూ అర్థం చేసుకోలేరు. ఆయన సంకల్పిస్తేనే ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళగలిగేది, ఆయన్ని చూడగలిగేది. ఇక నా అనుభవానికి వస్తే.....

2018 గురుపౌర్ణమి నాడు నేను బాబా మందిరానికి వెళ్లి పూజకు హాజరయ్యాను. కానీ గత సంవత్సరం ఇండియాలో బహిరంగంగా రోడ్డుమీద ఆడుతూ, పాడుతూ ఆనందంగా గడిపిన పండుగ క్షణాలను గుర్తుచేసుకుని, ఇప్పుడు నేనిక్కడ చాలా మిస్ అవుతున్నానని బాధపడ్డాను. మన మనసు తెలిసిన బాబా ఊరుకుంటారా? తరువాత న్యూయార్క్ సాయిమందిరం నుండి నాకు ఫోన్ వచ్చింది. విషయమేమిటంటే, మరుసటిరోజు వాళ్ళు గురుపూర్ణిమ జరుపుకుంటున్నారు. ఆ సందర్భంగా 'సాయిసచ్చరిత్ర' మీద ఒక క్విజ్ నిర్వహిస్తూ, ఆసక్తి ఉంటే అందులో పాల్గొనమని చెప్పారు. దాంతో అక్కడికి వెళ్లడానికి 12 గంటలు ప్రయాణం చేయాల్సి ఉన్నా, బాబా నన్ను అక్కడికి లాగుతున్నారని నాకనిపించి నేను అక్కడికి వెళ్లాలనుకున్నాను. అనుకున్నట్లే అక్కడికి వెళ్లాను. సాయిభక్తుల ఇంట్లో ఉండడానికి నాకు ఏర్పాటు చేశారు. నేను ఫ్రెషప్ అయ్యి మందిరానికి వెళ్లి  క్విజ్‌లో, పల్లకీ ఉత్సవంలో పాల్గొన్నాను. వాళ్లు ఎంతో ఘనంగా వాటన్నింటినీ నిర్వహించారు. ఇండియాలో లాగానే పల్లకీతోపాటు రోడ్డుమీద ఆడుతూ, పాడుతూ ఆనందంగా గడిపాను. బాబా నా మనసులోని చిన్న కోరికను కూడా నెరవేర్చారని చాలా సంతోషించాను.

క్విజ్‌లో నేను ఫైనల్ రౌండుకి సెలెక్టయ్యాను. కానీ ఫైనల్ రౌండ్ సమయానికి అనుకోని కారణాల వలన యు.ఎస్. లో ఉంటానా లేదా అన్న పరిస్థితి ఏర్పడింది. అందువలన అంతదూరం ప్రయాణం చేసి ఫైనల్ రౌండుకి వెళ్లడం గురించి ఆలోచనలోపడ్డాను. పైగా నాకు అంత ఆసక్తి కూడా లేదు. అయితే బాబా పద్ధతులు అనూహ్యమైనవి. ఆ సమయానికి నేను న్యూయార్క్‌లో ఉండగలిగేలా బాబా ఏర్పాటు చేసారు. ఫైనల్ రౌండుకి సరిగ్గా నెలరోజులు ఉందనగా న్యూజెర్సీలో నాకు ఉద్యోగ అవకాశం వచ్చింది. దాంతో నేను ఉద్యోగంలో చేరి, ప్రతి వారాంతంలో న్యూయార్క్ లోని సాయిమందిరానికి వెళ్లొస్తుండేదాన్ని. అలా ఫైనల్ రౌండుకి హాజరయ్యాను. కానీ మునుపటిలాగా అన్ని ప్రశ్నలకి సమాధానం తెలియక కొన్ని ప్రశ్నలు ఖాళీగా వదిలేసి పేపర్ ఇచ్చేసాను. దసరారోజు ఫలితాలు విడుదల చేస్తామని వాళ్ళు చెప్పారు. ముందు రౌండులో నేను 100% స్కోర్ చేసి ఉండటంతో ఖచ్చితంగా మొదటి మూడు స్థానాలలో నేనుంటానని అందరు ఆశ పెట్టుకున్నారు. కానీ నేను సరిగ్గా వ్రాయకపోవడంతో మొదటి మూడు స్థానాల్లో వస్తానో లేదోనని టెన్షన్ పడుతూ, రోజూ బాబాను ప్రార్థిస్తూ ఉండేదాన్ని. చివరికి దసరారోజు రానే వచ్చింది. ఆశ్చర్యం! బాబా నన్ను రెండవ స్థానంలో నిలబెట్టారు. నాపై అందరూ పెట్టుకున్న నమ్మకాన్ని బాబా నిజం చేసినందుకు నేనెంతగానో సంతోషించాను.

ఈ అనుభవానికి సంబంధించి మరికొన్ని వివరాలు చెప్తాను. 

న్యూజెర్సీలో నేను ఉద్యోగంలో చేరాక వాళ్ళు కొత్త ఐడి కార్డు ఇచ్చారు. మందిరంలో చాలామంది జనం ఉండటం వలన ఆ ఐడి కార్డును బాబా పాదాల చెంత పెట్టలేకపోయాను. అది నేను చేసిన పెద్ద పొరపాటేమో! అందువలనే నేను నా ఉద్యోగాన్ని కోల్పోయానేమో! కానీ ఆలోచిస్తే అంతా బాబా ప్రణాళిక అనిపిస్తుంది. ఎందుకంటే, నిజానికి నేను క్విజ్ ఫైనల్ రౌండుకి వెళ్లడానికి ఇష్టపడలేదు కానీ, నెల ముందు న్యూయార్క్‌కి దగ్గరలో ఉన్న న్యూజెర్సీలో నాకు ఉద్యోగ అవకాశాన్నిచ్చారు బాబా. దాంతో నేను హ్యాపీగా క్విజ్‌లో పాల్గొన్నాను. అది పూర్తయ్యాక నా ఉద్యోగం పోయి మళ్ళీ నేను నా మునుపటి సిటీకి చేరుకున్నాను. అదంతా ఆయన ప్రణాళిక అని కూడా ఖచ్చితంగా చెప్పలేను కానీ, అలా నడిచింది. మరో విషయం ఏమిటంటే, న్యూజెర్సీలో ఉద్యోగం రావడానికి ముందు, "బాబా! ఇంటి పనులని, పిల్లల్ని, భర్తని చూసుకోవడంతో సమయం గడిచిపోతోంది, ఒక్క రోజు కూడా ఖాళీ సమయం దొరకట్లేదు, కనీసం అమ్మా వాళ్ళ ఇంటికి వెళ్దామన్నా కుదరడంలేద"ని బాబాకు చెప్పుకుంటూ ఉండేదాన్ని. అందుకేనేమో బాబా నన్ను ఒక నెలరోజుల పాటు ఇంటికి దూరంగా సౌకర్యవంతంగా ఉండేలా చేసి తల్లిలా ఇంటికి పంపించారు. న్యూయార్క్‌లో నాకు ఆశ్రయమిచ్చిన సాయిభక్తులతో నాకు సన్నిహిత సంబంధం ఏర్పడింది. వాళ్లు న్యూయార్క్ నుండి వచ్చేముందు నాకు రెండు జతల కొత్తబట్టలు పెట్టారు. క్విజ్‌లో నేను 500 డాలర్స్ గెలుచుకున్నాను. సాధారణంగా మనం పుట్టింటికి వెళ్తే, తిరిగి వచ్చేటప్పుడు కొత్తబట్టలు పెట్టి, చేతిలో డబ్బులు పెట్టి, కొన్ని పిండివంటలతో సాగనంపుతారు. అదేవిధంగా బాబా నన్ను న్యూయార్క్ నుండి సాగనంపారు. అందుకే బాబా అమ్మలకే అమ్మ.

బాబా అంత ఆనందాన్నిచ్చినా ఉద్యోగాన్ని కోల్పోయి, మళ్లీ ఆందోళనకరమైన జీవితాన్ని కొనసాగించాలని భారమైన మనసుతో ఇంటికి చేరుకున్నాను. బాబా ఎందుకిలా  చేశారో, మళ్లీ ఎప్పుడు అనుగ్రహిస్తారో నాకు తెలియదు. నేనిక్కడ యు.ఎస్. లో మాస్టర్స్ చేస్తున్నాను కానీ, నాకు ఇక్కడ ఉండే పరిస్థితులు లేవు. పైగా నేను నా భర్తపై ఆధారపడాలని అనుకోవడం లేదు. కాబట్టి, ప్రియమైన సాయిభక్తులారా! నాకు ఉద్యోగం త్వరగా రావాలని బాబాని ప్రార్థించండి.

ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

source: https://www.shirdisaibabaexperiences.org/2019/05/shirdi-sai-baba-miracles-part-2345.html

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo