సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 88వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:

  1. సాయి ప్రసాదంతో నా తోటి ఉద్యోగులలో మార్పు
  2. నాకు, నా తల్లిదండ్రులకు బాబా ఇచ్చిన సంతోషం
  3. సమయానికి బాబా ఇచ్చిన మెసేజ్
  4. బాబా మనసుకు ఊరటనిచ్చారు

నా నుండి ఏమీ ఆశించకుండా బాబా నాపై చూపే ప్రేమను తోటి సాయి బంధువులతో పంచుకోకుండా అంతటి ప్రేమను నాలో నేను దాచుకోలేను. అందుకే కొన్ని కారణాల రీత్యా నా పేరు వెల్లడించలేకపోతున్నప్పటికీ నేను నా అనుభవాలను మీతో పంచుకుంటాను.  

సాయి ప్రసాదంతో నా తోటి ఉద్యోగులలో మార్పు:

ఓం సాయిరామ్! మనం బాబా ఊదీ మహిమలు ఎన్నో చూసాం. నేటికీ అవి కొనసాగుతున్నాయి. అలానే బాబా ప్రసాదానికి కూడా చాలా మహత్యం ఉందని ఇటీవల జరిగిన ఒక అనుభవం ద్వారా నేను తెలుసుకున్నాను. నేను సాఫ్ట్‌వేర్ డెవలపర్‌ని. నేను డెవలప్‌మెంట్ విభాగంలో ఉన్నప్పుడు టెస్టింగ్ విభాగంలోని వాళ్ళందరూ నాతో చక్కగా మాట్లాడేవారు. కొన్నాళ్ళకు నేను డెవలప్‌మెంట్ నుండి టెస్టింగ్‌లోకి మారాను. అప్పటినుండి వాళ్లంతా నేను వాళ్ళకి పోటీ అనుకున్నారో ఏమోగానీ నాతో సరిగా మాట్లాడటం మానేశారు. నాకై నేను వాళ్ళని పలకరించినా ఏదో ముక్తసరిగా స్పందించేవాళ్ళే గాని మాట్లాడేవాళ్ళు కాదు. వర్కులో ఏదైనా సందేహం వచ్చి వాళ్ళని అడిగినా విసుక్కుంటూ సరిగా సమాధానం చెప్పేవాళ్ళు కాదు. వాళ్ళ సహకారం లేనందున వర్క్ ప్రోగ్రెస్ అవడంలేదని నాకు చాలా ఆందోళనగా ఉండేది. మా మేనేజర్ చాలా మంచి వ్యక్తి. ఆయన వర్క్ స్టేటస్ అడిగితే ఏం చెప్పాలో తెలిసేది కాదు. అలాగని వాళ్ళ మీద మా మేనేజరుకి ఫిర్యాదు చేస్తే పరిస్థితి ఇంకా ఇబ్బందికరంగా మారిపోతుంది. అటువంటి పరిస్థితుల నడుమ ఆఫీసుకి వెళ్లాలంటేనే ఇబ్బందిగా ఉండేది. నాకు ప్రతి గురువారం ఏదైనా నైవేద్యం తయారుచేసి బాబాకు పెట్టడం అలవాటు. ఒకవారం నా సమస్యను బాబాకు చెప్పుకుని ప్రసాదాన్ని ఆఫీసుకి తీసుకుని వెళ్ళాను. బాబా "ఎవరినీ ద్వేషించవద్ద"ని చెప్తారు కదా! ఆ మాటలు దృష్టిలో పెట్టుకుని నాతో నా టెస్టింగ్ టీమ్ వాళ్ళు ఎలా నడుచుకుంటున్నా, అదేమీ పట్టించుకోకుండా వాళ్ళకి కూడా ప్రసాదం పెట్టాను. ఆశ్చర్యం! అప్పటినుండి వాళ్లలో మార్పు రావడం మొదలైంది. ఇప్పుడు వాళ్లంతా నాతో మామూలుగా మాట్లాడుతూ వర్కులో కొంచెంకొంచెంగా సహాయం చేస్తున్నారు. బాబా దయవల్ల త్వరలో పూర్తి సహకారం అందుతుందని ఆశిస్తున్నాను.

నాకు, నా తల్లిదండ్రులకు బాబా ఇచ్చిన సంతోషం:

నా పెళ్ళైన తరువాత జరిగిన గొడవల కారణంగా నా తల్లిదండ్రులు మా ఇంటికి రావడం మానేశారు. పోనీ నేను మా ఊరికి వెళదామన్నా ఇద్దరి పిల్లలతో వెళ్ళలేకపోతున్నాను. నేను నా తల్లిదండ్రుల దగ్గరకి వెళ్లడం మా అత్తగారు వాళ్ళకి నచ్చదు. ఇదే పరిస్థితి కొనసాగితే రేపు వాళ్ళకి ఏదైనా అవసరమైతే నేను వెళ్ళలేనేమో అనే దిగులు నన్నెప్పుడూ వెంటాడుతుంటుంది. అందువల్ల, "ఇలా అయితే ఎలా బాబా?" అని బాబాతో అనుకుంటూ ఉంటాను. అయితే ఈమధ్య వేసవి సెలవుల్లో మా అత్తగారు మా పిల్లల్ని తీసుకుని పనిమీద వాళ్ళ ఊరు వెళ్లి, అక్కడే ఉన్నారు. ఇప్పట్లో ఆమె వచ్చే సూచన కనపడటం లేదు. పిల్లల్లో బాబుకు 12వ తేదీ నుండి, పాపకి 19వ తేదీ నుండి స్కూల్ ప్రారంభం కానుండటంతో నేనే వెళ్లి వాళ్ళని తెచ్చుకోవాలి. నేను జూన్ మొదటివారంలో సెలవు తీసుకుని పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చి, జూన్ 19 వరకు ఇంటినుండి ఆఫీసు వర్కు చేసుకుంటూ వాళ్లతో సంతోషంగా గడుపుదామని అనుకున్నాను. మా అత్తగారి ఊరు, మా అమ్మా వాళ్ళ ఊరికి దగ్గరే. కాబట్టి అమ్మావాళ్లతో కూడా రెండు రోజులు గడుపుదామని అనుకుని ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. తీరా అక్కడికి వెళ్ళాక తెలిసిందేమిటంటే, వాళ్ళు మా సొంత ఊరికి మారుతున్నారు అని. ఇక నేను వారంరోజుల పాటు అక్కడే ఉండి సామాను సర్దడంలో వాళ్ళకి సహాయం చేశాను. అలా అనుకోకుండా వారంరోజులు వాళ్లతో గడిపి, వాళ్ళకి సహాయపడగలిగినందుకు నాకెంతో ఆనందంగా అనిపించింది. నా తల్లిదండ్రులు కూడా చాలా సంతోషించారు. నేను ఇక్కడ, వాళ్ళు అక్కడ ఉంటూ మేము పడుతున్న బాధను చూస్తున్న బాబా సమయానికి నన్ను అక్కడికి పంపారు. "థాంక్యూ సో మచ్ బాబా!"

సమయానికి బాబా ఇచ్చిన మెసేజ్:

ఈమధ్య జరిగిన కొన్ని గొడవల కారణంగా నేను మానసికంగా చాలా కృంగిపోయాను. బాధతో ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. ఎలాగైనా చనిపోవాలని నిశ్చయించుకుని నిద్రమాత్రలు కొనితెచ్చుకునేవరకు వెళ్ళాను. కానీ తొందరపడి నేనేమీ చేసుకోకుండా బాబా కాపాడారు. సాధారణంగా నాకు చిన్న చిన్న సినిమాలు(షార్ట్ ఫిలిమ్స్) చూడటం ఇష్టం ఉండదు. ఎప్పుడూ చూడలేదు కూడా. కానీ ఆరోజు ఏడ్చి ఏడ్చి, దిగులుగా కూర్చుని ఒక చిన్న సినిమా చూసాను. ఆ సినిమాలోని కథ ఆత్మహత్యలకు సంబంధించినది. నాకు ఆశ్చర్యం వేసింది. సినిమా ముగింపు ఏమిటంటే, "మీ మానాన మీరు ఆత్మహత్య చేసుకుంటే కని, పెంచి, పెద్దచేసిన తల్లిదండ్రులు ఏమైపోతారు? ఆ వయస్సులో వాళ్ళ పరిస్థితి ఏమిటి? మీమీదే ఆధారపడి ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమిటి? అందువలన ఎవరో మనసును గాయపరచారని ఆత్మహత్య చేసుకోవడం సరైనది కాదు" అని. అది చూశాక నేను ఎంత పిచ్చిగా ఆలోచించానో అర్థమై నా నిర్ణయాన్ని మార్చుకున్నాను. అప్పడు నాకు సచ్చరిత్రలోని అంబాడేకర్ కథనం గుర్తుకు వచ్చింది. అక్కడ పుస్తకం ద్వారా బాబా మెసేజ్ సమయానికి అందిస్తే, ఇక్కడ నాకు సినిమా ద్వారా అందించారు. అసలు చిన్న సినిమాలే చూడని నేను ఆ సినిమా చూడటం ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది. "సృష్టిలో ప్రతి కదలికా బాబా సంకల్పానుసారమే జరుగుతుంది" అనడానికి ఇదే ఉదాహరణ.

బాబా మనసుకు ఊరటనిచ్చారు:

కొంతమంది సాయిభక్తుల అనుభవాల్లో, "శిరిడీలోని ద్వారకామాయిలో ఒక పిల్లి ఉంటుంది, అది మన ఒడిలో కూర్చుంటే మనకి మంచి జరుగుతుంది, అది బాబా అనుగ్రహానికి సంకేతం" అని వ్రాసారు. మా ఇంటి దగ్గర ఉన్న బాబా గుడిలో కూడా ఒక పెంపుడు పిల్లి ఉంది. చాలాసార్లు ఆ గుడికి నేను వెళ్ళాను. కానీ ఎప్పుడూ ఆ పిల్లి నా దగ్గరకి రాలేదు. మా పాప దానితో ఆడుకునేది. ఒక నెలరోజులుగా మా ఇంట్లో గొడవలతో మనసంతా బాధగా ఉంది. 2019, జూన్ 16, ఆదివారం నేను, మా పాప బాబా గుడికి వెళ్ళాము. నేను బాధతో, "సాయీ! నా పరిస్థితి నీకు తెలుసు. దయచేసి నా కర్మని తొలగించి, నాకు మనశ్శాంతిని ప్రసాదించండి" అని ఏడ్చాను. నేను దర్శనం చేసుకుని రాగానే పిల్లి వచ్చి నా ఒడిలో కూర్చుంది. చాలాసేపు అలానే ఉంది. "బాబా నా ప్రార్థన విన్నారు, త్వరలోనే నాకు మంచిరోజులు వస్తాయి" అని అనిపించింది. పోయిన సంవత్సరం ఏప్రిల్‌లో నేను శిరిడీ వెళ్లినపుడు పిల్లి కనిపిస్తుందేమో అని గమనించాను గానీ, అది నాకు కనపడలేదు. కానీ ఇప్పుడు నేను కష్టంలో ఉన్న సమయంలో బాబా ఇలా నన్ను అనుగ్రహించారు. 

No comments:

Post a Comment

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo