కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 42వ భాగం.
శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.
సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.
శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.
అనుభవం - 71
శ్రీ హరిసీతారాం దీక్షిత్ గారికి 20-3-24 రోజున శ్రీ కృష్ణ నారాయణ్ ఉరఫ్ శ్రీ చోటూభయ్యాసాహెబ్ పారూళ్కర్, ఆనరరీ మెజిస్ట్రేట్, హార్ధా గారి వద్ద నుండి వచ్చిన ఉత్తరంలోని సారాంశం!
మొన్న 14వ తారీఖు శివరాత్రి! అందువలన ఇంట్లోని వారందరూ శ్రీ సిద్దనాథ్ దర్శనానికై వెళ్ళారు. అందరూ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు బయలు దేరారు. దారిలో బండి చక్రం యొక్క ఇరుసు ఊడిపోవడం వలన బాగా ఆలస్యమైంది. సాయంత్రపు చీకట్లు అలుముకున్నాయి. నర్మదా నదీతీరం చేరుకునేటప్పటికి చీకటి పడటం వలన పడవలు నడపడం ఆపేసారు. చీకటి పడిన తరువాత ఎవరినీ పడవలో ఎక్కించుకోవద్దని ఆ పడవ వాళ్ళకు ఉత్తర్వులు ఉన్నాయి. నర్మదాతీరం చేరుకున్నాక మా నౌకరు ఆ పడవవానిని ఎంతో బ్రతిమాలుకున్నాడు. రెట్టింపు సొమ్ము చెల్లిస్తామని చెప్పాడు. అయినా సరే ఆ పడవవాడు ససేమిరా అన్నాడు. దాంతో అందరూ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలనే ఆలోచనలో పడ్డారు. అంతలో మా శ్రీమతి “బాబా మీ ఇష్టం” అని ప్రార్థించి, నౌకరుతో “బండి కట్టి దగ్గరలో ఎక్కడికైనా దేవాలయానికి తీసుకువెళ్ళు” అని చెప్పింది. ఇంతలో ఎటువంటి చమత్కారం జరిగిందంటే ఒక ఫకీరు కఫ్నీ వేసుకొని, బాబా ఏ విధంగానైతే తలకు గుడ్డ కట్టుకునేవారో, అదే విధంగా తలకు గుడ్డ కట్టుకుని అక్కడకు వచ్చారు. ఆ ఫకీరు పడవ వానితో “మేము పగలంతా అటూ, ఇటూ తిరుగుతున్నాము. పద, మమ్మల్ని ఆవలి తీరంకు తీసుకువెళ్ళు” అని అన్నారు. కానీ ఆ పడవవాడు “కుదరదు” అని చెప్పాడు. అప్పుడు ఆ ఫకీరు మా కుటుంబసభ్యులు కూర్చొన్న చోటుకు వచ్చి “మీరు కూడా అవతలి ఒడ్డుకు వెళ్ళాలా?” అని అడిగారు. “అవున"ని చెప్పడంతో “మీరు ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చారు? ఇంకొంచెం ముందర రావాల్సింది” అని అన్నారు. అప్పుడు మా నౌకరు “బాబా, దారిలో బండి చక్రం యొక్క ఇరుసు ఊడిపోయింది. అందువలన ఆలస్యమైంది” అని చెప్పాడు. అప్పుడు ఆ ఫకీరు “ఇక్కడ అజమాయిషీ అంతా ఎవరు చేస్తారు?” అని అడిగారు. “ఇదంతా ఆంగ్లేయుల అధీనంలో ఉంది” అని చెప్పగానే, ఆ ఫకీరు “నేను ఇప్పుడే స్టేషన్కు వెళ్ళి ఉత్తర్వులు తీసుకువస్తాను. అప్పుడు వాళ్ళ బాబు కూడా తీసుకు వెళతాడు. మీరు ఆందోళన పడవద్దు” అని చెప్పి పదడుగులు వేసి కనిపించకుండా అదృశ్యమయ్యారు.
ఇంతలో ఏ పడవవాడైతే కుదరదని చెప్పాడో, అదే పడవవాడు హడావిడిగా వచ్చి, "మిమ్మల్ని పడవలో తీసుకువెళతాను” అని చెప్పి, తానే సామానంతా తీసుకువెళ్ళి పడవలో పెట్టసాగాడు. మా నౌకరుకు సహాయం చేసి, రెండు బండ్లను కూడా పడవలో పెట్టాడు. అప్పుడు మా శ్రీమతి నౌకరుతో, "డబ్బులు ఎంతో ముందే అడుగు, లేదంటే అక్కడికి వెళ్ళి ఇంత కావాలి, అంత కావాలి అని నసుగుతాడు” అని చెప్పింది. అప్పుడు మా నౌకరు ఆ పడవవాడిని “ఎంత తీసుకుంటావో ముందు చెప్పు” అని అడిగాడు. “మీకు తోచినంత ఇవ్వండి, అసలు ఇవ్వకపోయినా ఫర్వాలేదు, ముందు త్వరగా కూర్చుంటే మిమ్మల్ని అవతలి ఒడ్డుకి చేర్చివస్తాను” అని పడవవాడు చెప్పాడు. ఎప్పుడైతే ఆ ఫకీరుబాబా “నేను స్టేషనుకి వెళ్ళి ఉత్తర్వులు తెస్తాను” అని పదడుగులు వేసి అదృశ్యమయ్యారో అప్పుడే మా కుటుంబసభ్యులందరికీ కళ్ళల్లో నుండి నీళ్ళు వచ్చాయి. అందరూ చేతులు జోడించి “బాబా! మా కోసం మీరు ఎంతో శ్రమించారు” అని ప్రార్థించారు. తరువాత అందరూ ఆ పడవలో ఆవలితీరానికి చేరి సురక్షితంగా ఇంటికి చేరారు. ఇది బాబా యొక్క లీల అని మా అందరికీ అర్థం అయ్యింది. ఆ సమయంలో నా భార్యాపిల్లలు మరియు నౌకరు తప్ప ఇతరులు ఎవరూ లేరు. బాబా ప్రతిచోటా మనలను వెన్నంటే ఉండి ఎలా కాపాడుతారు అనేదానికి ఇది ఒక ఉదాహరణ. మా వంటి మూర్ఖులు మరియు సంసారచక్రంలో ఇరుక్కుపోయిన వారికి ఇటువంటి లీలలను చూడకుంటే బాబా చరణాలపై శ్రద్ధ కలుగదు. ఆయన చరణాలపై పూర్ణశ్రద్ద కలిగేటట్లు చేయమని బాబాను ప్రార్థిస్తున్నాము.
- కృష్ణారావ్ నారాయణ పారుళ్ కర్
తరువాయి భాగం రేపు
సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.
🕉 sai Ram
ReplyDelete