కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 46వ భాగం.
శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.
అనుభవం - 78
ఒకసారి మన్మాడ్ స్టేషన్లో కోపర్గాంకు వెళ్ళే రైలులో కూర్చొన్నాను. నేను డబ్బాలోకి ఎక్కి కొన్ని ఉత్తరాలు వ్రాస్తున్నాను. ఇంతలో ముగ్గురు సైనికులు ఆ పెట్టెలో ఎక్కారు. వారు నాతో “వెళ్ళి, వేరే పెట్టెలో కూర్చోండి” అని అన్నారు. “వేరే డబ్బాలోకి వెళ్ళను, నేను ఇక్కడే కూర్చొంటాను” అని చెప్పాను. “మిమ్మల్ని ఇక్కడ కూర్చోనివ్వము” అని అన్నారు. ఇంతలో నేను వ్రాస్తున్న ఉత్తరాలు పూర్తయి, వాటిని పోస్టుడబ్బాలో వేయడానికి వెళ్ళాను. వెళ్ళేటప్పుడు మనసులో బాబాతో “ఈ రోజు వారితో నేను గొడవ పెట్టుకోవాలనేదే మీ కోరిక అయితే అలాగే కానివ్వండి. మీ ఇష్టం” అని చెప్పుకుని, డబ్బాలో ఉత్తరాలను వేసి తిరిగి వచ్చేటప్పటికి ఆ సైనికులు తమ సామానును దించుకుని వేరే డబ్బాలోనికి వెళుతున్నారు. నేను ఒక్కడినే ఆ డబ్బాలో ప్రయాణించాను. ఆ విధంగా బాబా జరుగబోయే గొడవను తప్పించారు.
అనుభవం - 79
ఒకసారి సాయంకాలం ఆఫీసు నుండి క్రిందకు వచ్చి, రోడ్డు పైకి రాగానే ఒక యువకుడైన భిక్షకుడు నా వద్దకు వచ్చాడు. నవ్వుతూ, నవ్వుతూ నన్ను డబ్బులు అడుగ సాగాడు. తనను చూసి నాకు ఒక రకమైన పూజ్యభావం ఏర్పడి, తనకు డబ్బులు ఇచ్చాను. ఆ డబ్బులు తీసుకొని వెంటనే వెళ్ళిపోయాడు. తాను కనిపించకుండా పోయేంత వరకు నేను చూస్తూనే ఉన్నాను. తాను ఇంకెవరినీ డబ్బులు అడుగలేదు. అదే రోజు నేను శిరిడి వెళ్ళాను. అక్కడకు వెళ్ళిన తరువాత బాబా వద్దకు వెళ్ళి “మీరు బిక్షువు రూపంలో వచ్చారా?” అని అడిగాను. అందుకు బాబా “అవును. నేనే" అని సమాధానమిచ్చారు.
అనుభవం - 80
కొన్ని రోజుల క్రితం శ్రీమతి జోగ్ కళ్ళకు వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి రోజు రోజుకూ పెరగసాగింది. తాను ఇంటి వైద్యం చాలా చేసింది. కానీ ఎటువంటి ఉపయోగం కనపడలేదు. అప్పుడు ఆమె బాబాను ప్రార్థించింది. బాబా ఆమెకు ఒక ఔషధం చెప్పారు. ఆ ఔషధం ఎంతో సులభమైనది. “ఆ ఔషధాన్ని ఎవరికీ చెప్పకు మరియు ఏ వ్యాధిగ్రస్త కళ్ళలోనూ వేయకు” అని బాబా స్పష్టంగా ఆదేశించారు.
అనుభవం - 81
నా పినకుమారుడు చి. మాధవ్ కొన్ని రోజులు ఖడ్కీ గ్రామంలో రనడే గారింట్లో ఉన్నాడు. అక్కడ ఉండేటప్పుడు తాను అనారోగ్యానికి గురయ్యాడు. శ్రీ రనడే గారి కుటుంబసభ్యులు తనను ఉత్తమరీతిలో చూసుకున్నారు. కానీ తన కుటుంబసభ్యులు ఎవరూ లేకపోవడం వలన సహజంగానే తాను దిగులుపడ్డాడు. అప్పుడు బాబా తనకు దర్శనమిచ్చి “నీవు ఆందోళన చెందవద్దు. నేను నీ వద్దనే ఉన్నాను. నీవు తొందరలోనే కోలుకుంటావు” అని అభయమిచ్చారు. ఆ విధంగానే తాను ఆరోగ్యవంతుడయ్యాడు.
అనుభవం - 82
|శ్రీ రఘువీర్ భాస్కర్ పురంధరే గారు బాబాను ప్రథమంగా దర్శించుకోవాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు వారి తల్లి గారిని ఊరినుండి పిలిపించారు. బయలుదేరే ముందు రోజు రాత్రి పురంధరే కూతురుకి విపరీతమైన జ్వరం వచ్చింది. అప్పుడు పురంధరే గారి తల్లి ప్రయాణం చేసేందుకు కొంచెం తటపటాయించింది. కానీ పురంధరే మాత్రం తన ప్రయాణంలో ఎటువంటి మార్పు చేయలేదు. శిరిడీకి వెళ్ళిన తరువాత మూడవరోజు బాబా, శ్రీమతి పురంధరేకు స్వప్నదర్శనం ప్రసాదించారు. ఆ స్వప్నంలో అనారోగ్యంతో బాధ పడుతున్న పురంధరే కూతురికి ఊదీ పెట్టారు. అప్పటినుండి ఆ అమ్మాయి ఆరోగ్యం కుదుటపడసాగింది.
అనుభవం - 83
శ్రీ దామోదర్ బాబరే ఉరఫ్ అణా సాహెబ్ చింఛణీకర్ శిరిడీలో ఉన్నపుడు, ఆయన భార్య చింఛణీలోనే ఉన్నారు. అక్కడ ప్లేగు వ్యాపించి, గ్రామస్తులంతా గ్రామం నుండి బయటకు వెళ్ళిపోయారు. శ్రీమతి బాబరే ఒక్కరే ఉండిపోయి చాలా భయపడసాగారు. అప్పుడు బాబా ఆమెకు జాగృదవస్థలో ప్రత్యక్షదర్శనం ప్రసాదించారు. ప్లేగు అంతరించి, గ్రామస్తులు తిరిగి వచ్చేవరకు బాబా పది, పన్నెండు సార్లు అదే విధంగా ప్రత్యక్షదర్శనాన్ని ప్రసాదించారు.
తరువాయి భాగం రేపు
సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.
సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.
No comments:
Post a Comment