సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 22వ భాగం.


కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 22వ భాగం.

శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.

అనుభవం - 25

బాబా శిరిడీలో దేహత్యాగం చేసిన రోజు రాత్రి పార్లేలో నా సోదరుని కుమారుడు చి|| మాధవ్ కు “నాసిక్ లో ఒక గొప్ప యోగి సమాధి చెందినట్లుగా” స్వప్నం వచ్చింది. అదేవిధంగా ముంబాయిలో నివసించే హనుమాన్ ప్రసాద్ జోషి అనే భక్తుని ఇంట్లోనున్న బాబా ఫోటో ఉన్నట్టుండి అటూ, ఇటూ ఊగసాగింది. ఆ విధంగా వేరు, వేరు ప్రదేశాలలోని బాబా యొక్క ముఖ్య భక్తులలోని చాలా మందికి వివిధరీతులలో బాబా తమ దేహసమాధి గురించిన సూచనను ఇచ్చారు.

బాబా దేహత్యాగం చేసే రెండు, మూడు నిమిషాల ముందు "నన్ను వాడాలోనికి తీసుకువెళ్ళు” అనే పదాలను ఉచ్చరించారు. దేహవాసన జరిగిన తరువాత బాబా యొక్క పార్థివదేహాన్ని ఎక్కడ ఉంచాలనే దాని గురించి భక్తులందరూ  సంప్రదింపులు జరుపసాగారు. బాబా ఉచ్చరించిన పై మాటలను ఆధారం చేసుకుని కొందరు  "బాబాను వాడాలోకి తీసుకు వెళ్ళమని చెప్పారు. ఆ మాటలను బట్టి చూస్తే బాబా పార్థివ దేహాన్ని బూటీ సాహెబ్ వాడాలో సమాధి చేయాలి” అని అన్నారు. దానికి వ్యతిరేకంగా కొందరు “బాబా దేహాన్ని ఏ ఒక్కరికో చెందిన వాడాలో కాకుండా, ఎక్కడయినా ప్రజలందరికీ చెందిన ఖాళీ స్థలంలో సమాధి చేయాలి” అని అన్నారు. దాని గురించి ఒకరోజు వాగ్వివాదం జరిగి, చివరకు బాబా దేహాన్ని బాపూసాహెబ్ బూటీ వాడాలోనే సమాధి చేయాలని అందరి అనుమతితో నిర్ణయించడం జరిగింది. నిర్ణయించిన విధంగానే చేయడం జరిగింది. మొదట ఆ వాడాను బాపూసాహెబ్ తన నివాసంగా ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు. వాడా యొక్క పనులు కొంచెం పూర్తయ్యాక 1916 డిశంబరులో బాబా అనారోగ్యానికి గురయ్యారు. అప్పుడు నానాసాహెబ్ చందోర్కర్ కు “ఇది కేవలం వ్యక్తిగత నివాసం కాకుండా, ఒక దేవాలయంగా ఉండాలి” అనే స్పూర్తి కలిగింది. బాబాను ఈ విషయం గురించి అడుగగా, బాబా కూడా దేవాలయంగా మార్చాలని ఆజ్ఞాపించారు. ఆ విధంగానే మధ్యభాగాన్ని దేవాలయంగా మార్చి, మిగిలిన భాగాన్ని నివాసంగా మార్చాలని నిర్ణయించారు. దేవాలయ నిర్మాణం కోసం పనివాళ్ళను నాగపూర్ నుండి పిలిపించారు. వారు వచ్చి కొంత పని కూడా చేసారు. కాని వారికి ఏదో కారణంగా ఉన్నట్టుండి వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు దేవాలయ నిర్మాణం అసంపూర్తిగా మిగిలిపోయి, మిగిలిన పనిని కొనసాగించారు. దేవాలయ నిర్మాణకార్యం బాబా దేహవిసర్జన చేసేంతవరకు అలాగే ఆగిపోయింది. అందువలన ఆ భాగంలో బాబా పార్థివదేహాన్ని సమాధి చేయడం జరిగింది. అంటే వాడా బాబా దేవాలయం అయింది. “ఈ స్థలం మనదే, మనం ఇక్కడే ఉండాలి” అని బాబా ఎన్నో సంవత్సరాల నుండి ఎప్పుడూ అంటుండేవారు.

బాబా ఆశీర్వాదం వలన, వందల సంఖ్యలో బిడ్డలు లేని వారికి పుత్రసంతతి కలిగి, వారు ఆనందంగా ఉన్నారు. రావ్ బహదూర్ హరి వినాయక్ సాఠే, నగర్ కు చెందిన దాము, నాందేడ్ కు చెందిన రతన్ జీ సేటు, గోపాల్ గుండ్, రావేర్ కు చెందిన దేశ్ ముఖ్  అనే సర్వమండలి బాబా దర్శనానికై సంతానప్రాప్తి ఇచ్చతో వచ్చారు. వారందరికీ బాబా దయవలన పుత్రసంతానం కలిగి సుఖసంతోషాలతో ఉన్నారు. అంతేకాదు ఎంతో మంది పేదవారికి కూడా బాబా దయవలన పుత్రప్రాప్తి కలిగింది. రామనవమి ఉత్సవ సమయంలో పిల్లలు పుట్టాలనే కోరికతో ఎంతోమంది వచ్చేవారు. అంతేకాదు ప్రతి గురువారం కూడా వచ్చేవారు. మరి కొందరు ఇక్కడకు రాకుండా వారింటిలోనే ఉండి బాబాకు మొక్కుకునే వారు. బాబా వారి మొక్కును ఫలింపచేసేవారు.

ఆ విధంగానే పూనాకు చెందిన ఒక స్త్రీ పుత్రసంతానం కోసం ఎంతో ఆతురపడుతూ, తాను బాబాకు మొక్కుకుంది. ఆ తరువాత తొందరలోనే బాబా ఆమెకు స్వపంలో  కనిపించి, ఆమెను ఆశీర్వదించి ఒక కొబ్బరికాయను ప్రసాదంగా ఇచ్చారు. ఆ స్త్రీ మేల్కొని చూస్తే నిజంగానే ఆ కొబ్బరికాయ తన పడక దగ్గరలో ఉండటం జరిగింది. ఆమె ఎంతో ఆనందభరితురాలైంది. యోగ్యమైన వేళలో ప్రసవించి ఒక మగ బిడ్డకు తల్లయింది. పిల్లవానికి సంవత్సరం నిండాక, తనను తీసుకొని ఆమె శిరిడీకి వచ్చింది. బాబా పాదాల వద్ద ఆ పిల్లవానికి పుట్టువెంట్రుకలు తీయడం జరిగింది. బాబా ఎవరైన పుత్రేచ్ఛ కలిగిన స్త్రీకి కొబ్బరికాయను ప్రసాదించారంటే, ఆ స్త్రీకి సంతానం కలుగుతుందనేది అందరి అనుభవం. అంతేకాదు, బాబా మహాసమాధి చెందిన తరువాత కూడా బాబాకు మొక్కుకున్నారంటే, వారికి పుత్రసంతానం కలిగిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. దీనికి సంబంధించి తాజా ఉదాహరణను ఇవ్వాలంటే, జగన్నాథ్ అనే వ్యక్తి ఇక్కడ బాబా యొక్క గుఱ్ఱం బాగోగులు చూసుకునే పనిలో ఉండేవాడు. తాను ఒకసారి పన్వేల్ తాలుకాలో ఉళ్ వే అనే పేరు కలిగిన గ్రామంలోని శంకరుని దేవాలయంలో కూర్చొన్నాడు. తాను అక్కడ కూర్చొని ఉండగా శంకర్రావ్ సేటు పత్ని శ్రీమతి ఉమాబాయితో పరిచయం జరిగింది. శంకర్ రావుకు పుత్రసంతతి లేకపోవడం వలన తాను ఉమాబాయి విన్నపంతో ఇంకొక వివాహం చేసుకున్నాడు. కాని ఆమెకు కూడా పిల్లలు కలుగలేదు. ఒకరోజు జగన్నాథ్ శ్రీమతి ఉమాబాయి చెప్పడంతో ఆమె సవతి ఒడిలో ఒక కొబ్బరికాయను వేసి “మీకు పుత్ర సంతానం కలిగినట్లయితే, శిరిడీ వెళ్ళి బాబా సమాధిని దర్శించుకోమని” చెప్పాడు. జగన్నాథ్ చెప్పిన విధంగానే శ్రీమతి ఉమాబాయి “నా సవతికి పుత్ర సంతానం కలిగినట్లయితే శిరిడీ వచ్చి మీ సమాధిని దర్శించుకుంటాను” అని మొక్కుకుంది. మొక్కుకున్న తరువాత ఒక సంవత్సరంలోపే, ఆమెకు కొడుకు పుట్టాడు. ఆ మొక్కును తీర్చుకోవడానికై ఉమాబాయి ఇక్కడకు వచ్చింది. జగన్నాథ్ తరువాత ఉళ్ వే గ్రామాన్ని వదిలాడు. కానీ ఏ రోజయితే ఉమాబాయి ఇక్కడకు దర్శనానికి వచ్చిందో, ఆ రోజు జగన్నాథ్ కూడా ఆకస్మికంగా ఇక్కడకు వచ్చాడు.

తరువాయి భాగం రేపు

సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.

1 comment:

  1. Thanks fоr tһе mаrvelous posting! I gеnuinely enjoyed reading it, you miɡht be
    a ɡreat author. Iwill be sure to bookmaгk yoᥙr blog and may come back own the road.
    I want too encourage one to continue you great ѡriting,
    have a nice holiday weekend!

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo