సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 87వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:
  1. సాయి అనుగ్రహంతో నయమైన చెవి సమస్య
  2. బాబా నుండి లభించిన భరోసా
  3. కలలో ఊదీ ప్రసాదించి మా సమస్యలు తీర్చిన బాబా

సాయి అనుగ్రహంతో నయమైన చెవి సమస్య


సద్గురు సాయినాథునికి, గురువుగారు శరత్‌బాబూజీ గారికి నా నమస్కారాలు. నా పేరు సత్య. మొదటిసారిగా నేను నా అనుభవాన్ని మీతో పంచుకోబోతున్నాను. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. బ్లాగు నిర్వాహకులకు నా నమస్కారములు. బ్లాగులోని అనుభవాల ద్వారా బాబాకు ఇంకా ఇంకా దగ్గర అవుతున్న అనుభూతి కలుగుతుంది. 25 సంవత్సరాలుగా బాబా నన్ను సంరక్షిస్తున్నారు. 8 సంవత్సరాల నుండి నేను కష్టాలు పడుతున్నాను. అడుగడుగునా బాబా కనిపిస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్నారు. 10 రోజుల క్రితం నా చెవికి ఒక సమస్య వచ్చింది. చెవినుండి చీము కారుతుంటే అశ్రద్ధ చేసి ఆలస్యంగా డాక్టరును సంప్రదించాను. ఇ.ఎన్.టి డాక్టరు కొంచెం అనుమానంగా, చెవి నరం లోపల పుండు అయినట్లుంది, ఎక్స్‌-రే తీయించమన్నారు. నాకు చాలా  భయమేసి, "ఐదు రోజులు మందులు వాడాక కూడా తగ్గకపోతే అప్పుడు ఎక్స్-రే తీయించుకుంటాను" అని చెప్పాను. తరువాత నేను బాబాని ప్రార్థించి, రోజూ మందులు వేసుకుంటూ, బాబా ఊదీ చెవికి రాసుకుంటూండేదాన్ని. బాబా కృపవలన ఐదు రోజులు పూర్తయ్యేసరికి పూర్తిగా నయమైపోయింది. నా బాబా నా భర్తను నా దగ్గరకు తీసుకుని వస్తే నా రెండవ అనుభవంతో మళ్ళీ నేను మీ ముందుకొస్తాను. సాయినాథుని ఆశీస్సులు నా మీద ఉండాలని ప్రార్థిస్తూ...


బాబా నుండి లభించిన భరోసా

సాయిబంధువు శిరీషగారు తన అనుభావన్నిలా పంచుకుంటున్నారు:

15రోజుల క్రితం నా బిడ్డ విషయంలో భరోసానిచ్చి, నన్ను ఆనందింపజేసిన బాబా లీలను నేనిప్పుడు మీతో పంచుకుంటాను. ఇది ఈ బ్లాగులో నేను పంచుకుంటున్న మూడవ అనుభవం. ముందు అనుభవంలో నా కుటుంబసభ్యులకు దేవుని మీద నమ్మకం లేదని ప్రస్తావించాను. 15 రోజుల క్రితం నేను మా అబ్బాయి, అమ్మాయితో కలిసి నా తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళాను. మా అబ్బాయికి 17 సంవత్సరాల వయస్సు. ప్రయాణంలో ఉండగా నేను, "బాబా! నా కొడుకుని మీ పాదాల చెంతకు తీసుకోండి. వాడికి మీయందు విశ్వాసం కలిగేలా చేయండి. వాడిని మీ మనవడిలా భావించి సంరక్షించండి" అని ప్రార్థించాను. మరుసటిరోజు అంటే 2019, జూన్ 11న నేను మా అబ్బాయి, అమ్మాయితో కలిసి బాబా మందిరానికి వెళ్ళాను. వాళ్లిద్దరూ మందిరం లోపలికి రావటానికి ఇష్టపడక మందిరం వెలుపల కూర్చున్నారు. నేను లోపలికి వెళ్లే సమయానికి సంధ్య ఆరతి జరుగుతూ ఉంది. నేను ఆరతిలో పాల్గొన్నానే కాని నా మనసంతా విచారంగా, అలజడిగా ఉంది. ఆరతి పూర్తైన తరువాత నేను బయటికి వచ్చి మందిర ప్రవేశద్వారం వద్ద కూర్చున్నాను. పిల్లలు నా దగ్గరకు వచ్చి నా పక్కన కూర్చున్నారు. అప్పుడు మా అబ్బాయి, "ఇది ఏ మందిరం?" అని అడిగాడు. నేను, "సాయిబాబా మందిరం" అని చెప్పాను. అందుకు తను, "మరి మందిరం లోపల ఇతర దేవతల ఫోటోలు ఎందుకున్నాయి?" అని అడిగాడు. నేను, "దేవతలందరూ ఒకటే"నని చెప్పి, కారును చూడటానికి బయటికి వెళ్ళాను. అక్కడినుండి వెనక్కి తిరిగి చూసి ఆనందంలో మునిగిపోయాను. కారణమేమిటంటే, మందిర ప్రధాన ద్వారం తలుపుల మీద నిలబడివున్న పెద్ద సాయిబాబా రూపం చెక్కబడి ఉంది. మా అబ్బాయి సరిగ్గా బాబా పాదాల వద్ద కూర్చుని ఉన్నాడు. తన తలను బాబా పాదాలు తాకుతున్నాయి. నేను కోరుకున్నట్లుగా మా అబ్బాయి విషయంలో బాబా నుండి నాకు భరోసా లభించింది. "ఇంత చక్కటి  అనుభవాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు బాబా!"

కలలో ఊదీ ప్రసాదించి మా సమస్యలు తీర్చిన బాబా

విజయనగరం నుండి సాయిబంధువు లక్ష్మీనారాయణ తమ అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

నేను సాయిభక్తుడిని. నా పేరు లక్ష్మీనారాయణ. నేను విజయనగరంలో ప్రభుత్వ ఉద్యోగిని. మాకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. గత 4 సంవత్సరాలుగా మా అమ్మాయి వివాహం కోసం మేము చేయని ప్రయత్నమంటూ లేదు. ఏ కారణం చేతనో మా అమ్మాయి తనకు వివాహం వద్దని అంటుండేది. నేను కేవలం బాబాని మాత్రమే నమ్ముకున్నాను, ఆయనే ఏదో ఒకటి చేస్తారని. మా ఆవిడ మాత్రం తిరగని గుడిలేదు, నోచని నోము లేదు. ఎన్ని మ్రొక్కులు మ్రొక్కిందో ఆవిడకే తెలియదు. ఇలా ఉండగా ఒక సంబంధం వచ్చింది. అన్నివిధాలా మాకు నచ్చింది. ఇక ముహూర్తం పెట్టుకోవడమే తరువాయి అనుకున్న సమయంలో మగపెళ్లివాళ్ళు మా అమ్మాయి నచ్చలేదని కబురుపెట్టారు. అనుకున్న సంబంధం కాస్తా చేజారిపోయినందుకు అందరమూ బాధపడ్డాము. అదే సమయంలో మా అబ్బాయికి రావలసిన ఉద్యోగం కూడా చేజారిపోయింది. ఈ రెండు సంఘటనలు మమ్మల్ని బాగా కలచివేశాయి. 

ఆరోజు నేను బాగా కలతచెంది నిద్రపోయాక ఒక కల వచ్చింది. కలలో ఎవరో ఒక ముసలాయన తెల్లని కఫ్నీ ధరించి పని చేసుకుంటున్నారు. దగ్గరకి వెళ్ళి చూస్తే ఆయన మరెవరో కాదు, బాబానే! వెంటనే నేను కన్నీళ్ళతో, "బాబా! ఇలా జరిగిందేమిటి?" అని అడిగాను. అందుకు బాబా ఏమీ మాట్లాడకుండా ఒక కాగితంలో ఊదీ నాకిచ్చి, నవ్వుతూ వెళ్లిపోయారు. ఇది 2019 జనవరిలో జరిగింది. తరువాత రెండు నెలలు తిరిగేసరికి మా అమ్మాయికి మంచి సంబంధం కుదరడం, మే 26న పెళ్ళి జరిగిపోవడం అంతా కలలో జరిగినట్లు చకచకా జరిగిపోయాయి. అసలు పెళ్లే చేసుకోనన్న మా అమ్మాయి పెళ్లికి ఒప్పుకోవడం, కాపురానికి వెళ్లిపోవడం బాబా దయే తప్ప ఇంకేమీ కాదు. ఆయన తప్ప ఇంకెవరూ ఈ సమస్యను తీర్చలేరు. కలలో ఊదీ ప్రసాదించి బాబా మా సమస్యలు తీర్చేశారు. ఆ కరుణామూర్తికి ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పుకోగలం, జీవితాంతం ఆయన పాదాలు విడువనని చెప్పగలగడం తప్ప!?

సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

2 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo