కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 31వ భాగం.
శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.
అనుభవం -51
శ్రీ వాసుదేవ్ సీతారాం రాతాంజన్ కర్, హైదరాబాద్ నివాసి, ఇంటి నెంబర్, 163, శ్రీ హరిసీతారాం దీక్షిత్ కు 18-8-1921 వ రోజు వ్రాసిన ఉత్తరంలోని సారాంశం!
శ్రీ సాయి మహారాజ్‌ను దర్శించుకున్న తరువాత అక్కడ ఎన్నో అనుభవాలు వచ్చాయి. ఆ తరువాత ఆయనపై పద్యాలు వ్రాయాలని అనిపించడంతో ఒక పద్యమాలను తయారుచేసాను. ఆ తరువాత ఒక పెద్ద చమత్కారిక సంఘటన జరిగి గొప్ప అనుభవం వచ్చింది. నిజంగానే ఆ అనుభవం అపూర్వమైనది. ఆ మొత్తం సంఘటనంతా ఎంతో విస్తారమైనది, అయినప్పటికీ సంక్షిప్తంగా వివరిస్తాను.
కైలాసవాసి శ్రీ దామోదర్ రంగనాధ్ జోషి దేగాంవ్ కర్ గారి కన్య సౌ. మాలణ్ బాయి (ఈమె నాకు పిన్ని కూతురు) జ్వరంతో చాలా రోజులు అనారోగ్యంగా ఉంది. జ్వరం బాగా ఎక్కువై మంచం పట్టింది. చాలమంది డాక్టర్లను, ఆయుర్వేద వైద్యులను మరియు ఇతర చిన్నా చితక ఉపాయాలను ప్రయత్నించిచూసారు. కానీ, ఏమాత్రం గుణం కనపడలేదు. ఇక చివరి ఉపాయం అన్నట్లుగా ప్రతిరోజు బాబా ఊదీని ఇవ్వడం మొదలు పెట్టారు. ఔషధోపచారం కూడా కొనసాగుతూనే ఉంది. తరువాత ఆ అమ్మాయి ఔషధాలు తీసుకొని, తీసుకొని విసుగెత్తిపోయి మందులు వద్దంటే, వద్దనసాగింది. చివరకు తాను “నన్ను శ్రీ సాయిబాబా దర్శనానికి తీసుకెళ్ళండి, లేకపోతే నేను ఆరోగ్యవంతురాలిని కాలేను” అని మొండి పట్టుపట్టింది. అనారోగ్యంవలన శరీరం బాగా క్షీణించిపోయింది. లేచికూర్చోపెట్టటమే కష్టమైపోయింది. అటువంటి స్థితిలో దూరప్రయాణానికి తీసుకువెళ్ళటం ఎంతో ప్రమాదమని, ధైర్యం చేయలేకపోయారు. చివరకు డాక్టర్లు “మనోధైర్యం వలన గుణం కనిపిస్తుందేమో చూడండి, బహుశః రావచ్చు కూడా" అని చెప్పడంతో, వారి సలహా, మరియు అనుమతి, మేరకు అతిభయంకరస్థితిలో నున్న అమ్మాయిని తీసుకొని తన కోరిక మేరకు, ఏమయితే అది అయిందని బాబా వద్దకు వెళ్ళడానికి నిశ్చయించుకున్నారు. ఇద్దరు, ముగ్గురిని వెంట తీసుకొని ప్రయాణం చేసారు. అక్కడ బాబాను దర్శించుకున్న తరువాత, బాబా తిట్ల వర్షం కురిపించడం మొదలుపెట్టారు. “తనను రగ్గుపై పడేయండి, కుండలోని నీళ్ళను త్రాగిస్తూ అలా పడుండనివ్వండి” అని బాబా అన్నారు. 7-8 రోజులు అన్నం లేకుండా కేవలం నీళ్ళు త్రాగి నెట్టుకొచ్చింది. కానీ, ఆ అమ్మాయి మాత్రం “తాను బాగైతే మాత్రం బాబా కృప వలనే” అనే పరిపూర్ణవిశ్వాసంతో ఉంది. 7-8 రోజుల తరువాత సుమారు తెల్లవారుఝాము ప్రాంతంలో ఆ అమ్మాయి ఆఖరి శ్వాస విడిచింది. అందరూ శోకగ్రస్తులయ్యారు. సుమారుగా అదే సమయంలో బాబా మేల్కొనే సమయం అయినప్పటికీ బాబా నిద్ర లేవలేదు. కాకడ ఆరతికి వెళ్ళినవారు అక్కడే నిలబడి ఉన్నారు. "ఇదేమిటి ఇలా? బాబా ఎందుకు ఇంకా లేవలేదు?” అని వచ్చినవారందరూ వారిలోవారే చర్చించుకుంటున్నారు. ఇక్కడ మృతురాలైన అమ్మాయికి దహనసంస్కారం ఏర్పాట్లలో బంధువులు అందరూ మునిగిపోయారు. ఆ అమ్మాయి తల్లిగారు రోదిస్తూ అక్కడే కూర్చొండిపోయారు. సాఠె కాక అనే ఒక సాయి భక్తుడు కూడా అక్కడే ఉన్నాడు. ఆయన కూడా వారిని ఓదార్చే ప్రయత్నం చేసాడు. ఇంతలో ఆ అమ్మాయి కదులుతున్నట్లుగా కనిపించి, ఒక్కసారిగా ఆవులిస్తూ కళ్ళు తెరిచింది. భయపడుతూ నాలుగువైపులా చూడసాగింది. బంధువుల సంతోషానికి అంతులేదు. తాను ఏం జరిగిందో క్రింది విధంగా చెప్పసాగింది. “ఒక నల్లని వ్యక్తి నన్ను తీసుకొని వెళుతుండగా నేను భయపడి బాబాను పిలిచాను. బాబా వచ్చి తనను సటకాతో విపరీతంగా కొట్టి, నన్ను విడిపించి ఆయనతో పాటుగా చావడికి తీసుకు వెళ్ళారు” అని ఆ అమ్మాయి జరిగిన విషయమంతా చూసినట్లుగా చెపుతోంది. ఇక్కడ ఈ విధంగా జరుగుతూ ఉండగా, చావడిలో బాబా ఇంకా నిద్రపోతున్నారేమిటో అని అందరూ చర్చించుకోసారు. ఒక్కసారిగా బాబా పెద్దపెట్టున అరుస్తూ, సటకా ఊపుతూ మేలుకున్నారు. అక్కడి నుండి వడివడిగా నడుస్తూ అమ్మాయి ఉన్న ప్రదేశానికి (దీక్షిత్ వాడాకు) వచ్చారు. ఆయనతో పాటుగా భక్తులందరూ వచ్చారు. ఈ విషయం చెప్పటానికి ఆ అమ్మాయి వాళ్ళు బయటకు రాబోతుండగా, బాబానే ఎదురుగా వచ్చారు. ఆ రీతిలో ఆనందమయుడైన ప్రభువు అందరినీ ఆనందపరుస్తూ, భక్తకైవారి అయిన శ్రీ సాయిబాబా సంకటాలను ఎలా నివారిస్తారో అనే దానిని ప్రత్యక్షంగా చూడటం జరిగింది. ఇంకా ఎన్నో అద్భుతమైన చమత్కారాలు ఉన్నాయి. విస్తరణ భయంతో ఇంతటితో ముగిస్తున్నాను.
తరువాయి భాగం రేపు
సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.
I’m not tһat much of a online reader to be honest but our blogs really nice,
ReplyDeletekeeep it up! I'll goo ahead and bookmark your wеbsite to come back ɗown the roаd.
All the best
🕉 sai Ram
ReplyDelete