సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 82వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:


  1. సాయినాథుని కృపతో మా అబ్బాయికి ఉద్యోగం
  2. కలలో నెరవేర్చిన కోరిక - కోరికలు నెరవేరుతాయని ఇచ్చిన సూచన

సాయినాథుని కృపతో మా అబ్బాయికి ఉద్యోగం

నెల్లూరునుండి మోదడుగు వాసుగారు మరో అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

బాబా మా అబ్బాయికి ఉద్యోగాన్ని అనుగ్రహించిన అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

ఓం సాయి శ్రీ సాయి జయజయసాయి.
మా అబ్బాయి పేరు హనీష్ కుమార్ మోదడుగు. తనూ బాబా భక్తుడే. బాబా దయవలన రెండు, మూడుసార్లు తను సచ్చరిత్ర మహద్ గ్రంథ పారాయణను ఒక్కరోజులో పూర్తి చేశాడు. తను డిగ్రీ పూర్తి చేశాక 2015 - 2016 సంవత్సరంలో నంద్యాలలో బ్యాంకు సంబంధిత పరీక్షలకు కోచింగ్ తీసుకున్నాడు. మొదటిసారి తను బ్యాంకు పరీక్ష వ్రాసిన తరువాత మా కుటుంబమంతా శిరిడీ వెళ్ళాము. మేము శని శింగణాపూరులో ఉండగా ఫలితాలు వచ్చాయి. అయితే మా అబ్బాయి ఆ పరీక్షలో ఉత్తీర్ణుడు కాలేదు. వాడితోపాటు మేము కూడా చాలా బాధపడి, "ఏమిటి బాబా మాకీ పరీక్ష? మేము మీ సన్నిధిలోనే ఉన్నప్పటికీ ఫలితం వ్యతిరేకంగా వచ్చిందే!?" అని అనుకుని, "అయినా కూడా పర్వాలేదు, ముందు జరగబోయే పరీక్షలో బాబా మంచి ఫలితాన్నే ఇస్తారులే" అని మమ్మల్ని మేము సమాధానపరచుకున్నాము. నిజంగా బాబా అనుగ్రహించారు. శిరిడీనుండి వచ్చిన వెంటనే మళ్ళీ నోటిఫికేషన్ రావడం, మా అబ్బాయి దరఖాస్తు చేసుకోవడం వెంట వెంటనే జరిగిపోయాయి. ఈసారి బాగా కష్టపడి ప్రిపేరై పరీక్షకు హాజరయ్యాడు. బాబా దయతో పరీక్ష బాగా వ్రాసాడు. ఫలితం కూడా బాబా కృపవలన అనుకూలంగా వచ్చింది. తేదీ.30-01-2017న మా అబ్బాయి బ్యాంక్ ఉద్యోగంలో జాయినయ్యాడు. ప్రస్తుతం నెల్లూరు సమీపంలోని చిత్తూరు జిల్లా వరదయ్యపాలెంలో S.B.I. బ్రాంచ్ జూనియర్ అసోసియేట్ గా పనిచేస్తున్నాడు. ఇదంతా బాబా మా కుటుంబంపై చూపిన అనుగ్రహం. ఇలా బాబా మాకెన్నో అద్భుతమైన అనుభవాలను ప్రసాదించారు. మన అనుభవాలను పంచుకునే అవకాశం కల్పించిన 'సాయి మహరాజ్ సన్నిధి బ్లాగు' వారికి నా ధన్యవాదాలు.

కలలో నెరవేర్చిన కోరిక - కోరికలు నెరవేరుతాయని ఇచ్చిన సూచన

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాలను ఇలా తెలియజేస్తున్నారు:

సాయిభక్తులందరికీ ఓం సాయిరామ్! నేను యునైటెడ్ స్టేట్స్‌లో నా భర్త, కుమార్తెతో ఉంటున్నాను. అందరిలాగే నేను కూడా నా జీవితంలోని కొన్ని పరిస్థితులతో పోరాడుతున్నాను. అవి బాబాకు మాత్రమే తెలుసు. నేను దసరారోజు నవ గురువార వ్రతాన్ని పూర్తి చేసి బాబాకు నైవేద్యం సమర్పించాను. తరువాత బాబా వద్దనుండి పువ్వులు పొందాలని అనుకున్నాను. కానీ నేను మందిరానికి వెళ్ళినప్పుడు చాలా రద్దీగా ఉండటంతో పువ్వులు పొందలేకపోయాను. దానితో నేను నిరాశచెంది, "బాబా! ఎందుకు మీరు నా ప్రార్థనలను అంగీకరించడం లేదు?" అని అడిగాను. ఆ దిగులుతోనే నేను నిద్రపోయాను. ఆ రాత్రి నాకొక కల వచ్చింది. కలలో నేను శిరిడీ వెళ్లి, బాబా సమాధి వద్ద నిలబడి ఆరతి పాడుతున్నాను. చాలా ఆనందకరమైన అనుభూతిలో ఉండగా, అక్కడున్న పూజారి నన్ను, మా ఆంటీని పైకి వచ్చి బాబా పాదుకల వద్దనున్న పసుపురంగు పూలను, నాణేలను తీసుకోమని చెప్పారు. నేను ఆనందంగా వాటిని తీసుకున్నాను. నేను మేల్కొన్నాక కలను జ్ఞాపకం చేసుకుంటే నాకు నోట మాట రాలేదు. "బాబా! దయచేసి ఇదేరీతిన ఎల్లప్పుడూ మీపట్ల విశ్వాసాన్ని నిలుపుకోగలిగేలా మమ్మల్ని అనుగ్రహించండి".

రెండవ అనుభవం:

సాధారణంగా నేను రోజూ ఉదయం 1100 సార్లు 'ఓం సాయిరామ్' అని జపిస్తూ బాబా ప్రత్యక్ష దర్శనం చూస్తూ ఉంటాను. ఒకసారి నేను ఒక కోరిక విషయమై బాబా సమాధానం కోసం ఎదురుచూస్తూ, ప్రత్యక్ష ప్రసారం చూస్తూ, "బాబా! 6 నెలల పసిబిడ్డను పూజారి మీ పాదాల దగ్గర ఉంచినట్లు నేను చూసినా, నామజపం పూర్తిచేసేలోపల ఎవరైనా ఒక పెద్ద పూలమాలను తెచ్చినట్లైనా నా పని పూర్తి అవుతుంది" అని అనుకున్నాను. 20 నిమిషాల సమయం గడిచినా నేను అనుకున్నట్లు ఏమీ జరగలేదు. నా నామజపం పూర్తి చేయబోతుండగా ఒక వ్యక్తి ఒక పసిబిడ్డను పూజారికి అందించాడు, అతను ఆ బిడ్డను బాబా పాదాల దగ్గర ఉంచాడు. నేను మంత్రముగ్ధురాలినై ఆనందంతో బాబాను చూస్తూ వుండిపోయాను. ఆ తరువాత నా లాప్‌టాప్ క్లోజ్ చేస్తుండగా ఒక వ్యక్తి మూడు పెద్ద పూలమాలలను తెచ్చాడు. అది చూసిన నా ఆనందానికి అవధులు లేవు. ఈ సంకేతాలతో బాబా నా కలలు నెరవేరుస్తారని నాకు నమ్మకం కలిగింది. "థాంక్యూ, థాంక్యూ సో మచ్ బాబా! నా కూతురి పుట్టినరోజు ఎటువంటి ఇబ్బందీ లేకుండా సజావుగా సాగేలా చూడండి. నాకు అన్నివిషయాలలో మీ ఆశీస్సులు, సహకారం కావాలి. దయచేసి నాకు మానసిక ప్రశాంతతను, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. అవి ప్రస్తుతం నాకు చాలా ఆవశ్యకం. నా ఇతర సమస్యలను పరిష్కరించండి. కేవలం నేను మీవలనే జీవిస్తున్నాను. నాకున్న ఒకే ఒక ఆశ, ధైర్యం మీరే బాబా!"

అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

source: https://www.shirdisaibabaexperiences.org/2019/05/shirdi-sai-baba-miracles-part-2372.html

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo