సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 26వ భాగం.


కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 26వ భాగం.

శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.

అనుభవం -37

ఒకసారి నేను శిరిడీకి వెళ్ళేటప్పుడు మోరేశ్వర్ రావ్ ప్రధాన్ నన్ను కలవడానికి బోరీబందర్ స్టేషన్‌‌కు వచ్చాడు. శాంతాక్రుజ్‌‌లో తన ఇంట్లో గణపతిని ప్రతిష్ఠించే విషయమై బాబాను అడుగవలసిందిగా నాకు చెప్పాడు. నేను ఆ విధంగానే శిరిడీకి వెళ్ళాక బాబాను ఆ విషయం గురించి అడిగాను. బాబా “సరే”నని అనుమతిని ప్రసాదించారు. "బాబా ఆజ్ఞ ఇచ్చారనే” విషయాన్ని తెలియచేస్తూ ప్రధానకు ఉత్తరం వ్రాసాను. బాబాను అడిగి ఆ ఉత్తరాన్ని అదేరోజు పోస్టులో వేశాను. అదేరోజు రాత్రి తెల్లవారుఝామున శాంతాక్రుజ్‌‌లో మోరేశ్వరరావు యొక్క వదినకు “ఒక దేవాలయంలో ఎంతో సుందరమైన గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించినట్లుగా” స్వప్నం వచ్చింది. ఆ ఉదయం లేవగానే తనకు వచ్చిన స్వప్నం గురించి అందరికీ చెప్పింది. మరుసటి ఉదయం బాబా అనుమతి ఇచ్చారనే వార్తతో ఉత్తరం అందింది. అంటే స్వప్నం ద్వారా బాబా ముందుగానే తమ సందేశాన్ని ఇచ్చారు.

అనుభవం-38 

మేఘ అనే బాబా భక్తుడు ఉండేవాడు. తాను ప్రతిరోజు మధ్యాహ్న ఆరతి చేసేవాడు. తాను శిరిడీలోని అన్ని దేవాలయాలలో సర్వదేవతలకు పూజ చేసి, తరువాత బాబా వద్దకు వెళ్ళేవాడు. ఒకరోజు ఖండోబా మందిరంలో పూజ చేయడానికి వెళ్ళినప్పుడు, ఎంత ప్రయత్నించినా తలుపులు తెరుచుకోలేదు. ఆలస్యం అవుతుందని పూజ చేయకుండానే, బాబా వద్దకు వచ్చాడు. అప్పుడు బాబా “ఇంకా అందరి దేవతల పూజ జరుగలేదు. అది పూర్తి చేసుకుని తరువాత ఇక్కడకు రా” అని చెప్పారు. అప్పుడు మేఘుడు “తలుపులు మూసి ఉండటం వలన ఇక్కడకు వచ్చాను” అని చెప్పాడు. అందుకు బాబా “ఇప్పుడు తలుపులు తెరిచే ఉన్నాయి, వెళ్ళు” అని అన్నారు. మేఘుడు బాబా ఆజ్ఞప్రకారం ఖండోబా మందిరానికి వెళ్ళాడు. బాబా చెప్పిన విధంగానే తలుపులు తెరిచే ఉన్నాయి. అప్పుడు మేఘుడు నిత్యనియమం ప్రకారం ఖండోబా మందిరంలో పూజ చేసుకుని, తరువాత బాబా వద్దకు వచ్చాడు. అప్పుడు బాబా తనను పూజ చేసుకోనిచ్చారు.

అనుభవం-39

నా స్నేహితుడు ఒకరు ఒకరోజు నా ఆఫీసుకు వచ్చాడు. వచ్చాక నాతో “నేటికి ఎనిమిది రోజుల నుండి నాకు నిద్ర రావడం లేదు. డాక్టరు ఇచ్చిన మందులు వేసుకుంటున్నాను, కానీ ఏమీ ఉపయోగం కనపడటం లేదు” అని చెప్పాడు. అప్పుడు నేను తనకు బాబా ఊదీని ఇచ్చి, మూడు రోజులు తీసుకోమని చెప్పాను. మరుసటి రోజు తాను మరలా నా ఆఫీసుకు వచ్చి “నిన్న రాత్రి నేను ఊదీని తీసుకున్నాను. నాకు రాత్రంతా మంచి నిద్రపట్టింది” అని చెప్పాడు.

అదేవిధంగా బాంద్రాలో నివసించే నా స్నేహితుని కుమారునికి రెండు నెలల నుండి నిద్రపట్టడం లేదు. తనను తీసుకొని తన తండ్రి బాబా దర్శనానికి వెళ్ళాడు. ఆ రాత్రి   తనకు మంచినిద్ర పట్టింది. అప్పటినుండి ప్రతిరోజు తనకు నిద్రపట్ట సాగింది.

అనుభవం-40

గత గురుపూర్ణిమ రోజు నేను బాబాకు పూజ చేసుకున్నాను. అందులో ఒక కొరత ఉండిపోయింది. అది నా గమనికలోకి రాలేదు. అటువంటి సందర్భంలో పూజ పరిపూర్తిగా జరగాలి. దక్షిణ సమర్పించాను, కాని తాంబూలం సమర్పించడము మరచిపోయాను. తాంబూలం సమర్పించే అలవాటు నాకు లేకపోవడం వలన నాకు ఆ విషయం గమనికలోకి రాలేదు. మూడవ ప్రొద్దులో బాబా నన్ను పిలిపించారు. నన్ను రెండు, మూడు కిళ్ళీలను తీసుకురమ్మని చెప్పారు. నేను ఆ విధంగానే కిళ్ళీలను తయారు చేసుకొని బాబావద్దకు తీసుకువెళ్ళాను. బాబా వెనువెంటనే ఒక తాంబూలాన్ని పొడిచేయకుండానే తినేసారు. ఆ విధంగా బాబా నా పూజను పరిపూర్తి చేసారు.

తరువాయి భాగం రేపు 

సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo