సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 48వ భాగం.


కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 48వ భాగం.

శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.

అనుభవం - 88

నా యొక్క తొమ్మిదవ (లేదా) పదవ శిరిడీ యాత్రలో క్రింది విధంగా ఒక లీల జరిగింది. నేను టాంగాలో వెళూతూ ఉండగా ఒక స్త్రీ జామపండ్ల బుట్టను తల మీద పెట్టుకుని వెళుతోంది. అప్పుడు టాంగావాలా "బాబా కోసం జామపండు తీసుకుంటారా?” అని అడిగాడు. నేను ఆ పండ్ల బుట్టనంతా కొని టాంగాలో పెట్టించాను. జామకాయలు చాలా బాగున్నాయి. ఎంతో మంచి కమ్మటి వాసన రాసాగింది. నాకు కూడా వాటిని తినాలనిపించి నోటిలో నీళ్ళూరసాగాయి. వెంటనే మనసులో నాకు “బాబా నా మనసులో అలా ఎందుకనిపిస్తుంది” అని అనిపించింది. వెంటనే ఆశ్చర్యకరంగా ఆ జామపండ్ల నుండి కమ్మటి వాసన రావడం ఆగిపోయింది. జామపండ్ల బుట్ట మా వద్ద ఉందనే విషయం కూడా మరచిపోయాము.

అనుభవం - 89

మాధవరావు దేశ్ పాండేను ఒకసారి పాము కరచింది. అక్కడ ఒక విఠోబా స్థానం ఉంది. పాము కరచిన వారిని అక్కడికి తీసుకువెళితే, వారు బాగవుతారని వారి విశ్వాసము మరియు అనుభవం. అందువలన అందరూ తనను అక్కడికి  వెళ్ళమని చెప్పారు. అప్పుడు మాధవరావు “బాబా ఎలా ఆజ్ఞాపిస్తే అలా చేద్దాము” అని సమాధానమిచ్చారు. అప్పుడు బాబా వద్దకు వెళ్ళారు. మాధవరావు క్రింద ఉండగానే బాబా “పైకెక్కవద్దు” అని ఆజ్ఞాపించారు. మాధవరావు బాబా తననే ఆజ్ఞాపిస్తున్నారనుకుని ద్వారకామాయి మెట్లు ఎక్కలేదు. కానీ బాబా “పైకెక్కవద్దు” అని అన్నది పాము యొక్క విషాన్ని అని అనిపిస్తుంది. కారణం బాబా ఆ మాట అన్నప్పటినుండి విషం పైకెక్కడం ఆగిపోయింది. తరువాత మాధవరావు బాబా కృప వలన ఏవిధమైన ఔషధోపచారం లేకుండా పూర్తిగా కోలుకున్నాడు. ఈ విషయానికి సంబంధించి తనకు సరిగ్గా ఇలాగే జరుగుతుందనే దృష్టాంతం తనకు ఒక సంవత్సరం ముందే వచ్చింది.

అనుభవం - 90

ఒకసారి నేను శిరిడీలో ఉండగా నా స్నేహితులు ఒకరికి డబ్బు సమస్య వచ్చింది. ఆ సమయంలో నా వద్ద కూడా డబ్బులు లేవు. కానీ మనసులో “డబ్బులు వస్తే నా స్నేహితునికి కొంచెమైనా సహాయపడాలి” అని అనిపించింది. కానీ నా స్నేహితుడు నా సహాయాన్ని స్వీకరిస్తాడా, లేదా అనే సందేహం నాకు కలిగింది. నామనసులోని ఆలోచనను నేను ఎవరికీ చెప్పలేదు. డబ్బులు వచ్చాక ఒక నోటును కవరులో ఉంచి, దాంతో పాటుగా ఒక ఉత్తరం ఉంచి నా స్నేహితునికి పంపాలని నిర్ణయించుకున్నాను. కానీ బాబా ఆజ్ఞ లేకుండా ఎవరికీ డబ్బులు ఇవ్వకూడదనే నిబంధన బాబా పెట్టారు. అందువలన బాబా అనుమతి కోసమై వెళ్ళాను. కానీ బాబా వద్ద చాలా మంది ఉన్నారు. అందరి ముందు స్పష్టంగా అడిగే విషయం కాదు కాబట్టి, నేను మామూలుగా “బాబా ఈ కవరును  పంపించమంటారా?” అని అడిగాను. బాబా “సరే” అన్నారు. నేను ఆ ప్రకారమే నా స్నేహితునికి ఆ కవరు పంపించాను. సాయంకాలం ఆ స్నేహితుడు కలసి "మీ" కవర్ రావడానికి రెండు గంటల ముందు బాబా నా భార్యతో “నేను ఈ రోజు మీ ఇంటికి వస్తున్నాను, నన్ను తిరస్కరించవద్దని మీ ఆయనకు చెప్పు" అని చెప్పారు. అంటే మీరు ఆ కవరు పంపిస్తారని బాబా ముందే ఆ విధంగా సూచించడంతో  నాకు మీ సహాయం తీసుకో బుద్ధి పుట్టింది” అని నాతో అన్నారు.

(ఈ లీలలో కాకాసాబ్ "నా స్నేహితుడు " అని ప్రస్తావించింది భక్త మహల్సాపతి గురించి)

తరువాయి భాగం రేపు

సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.


2 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo