సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 75వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవం:
  • ఊదీ పెట్టుకుంటే అంతా మంచి జరుగుతుంది

ఒక అజ్ఞాత సాయిభక్తుడు ఇలా తెలియచేస్తున్నారు:

సాయిబాబా అనుగ్రహం పొందిన అమాయక భక్తులలో నేను ఒకడిని. నా దంతాలలో రూట్ కెనాల్ ప్రాబ్లెమ్ ఉండటంతో నేను కూల్‌డ్రింక్స్ కానీ, ఐస్‌క్రీమ్ కానీ తీసుకోలేకపోయేవాడిని. అయితే ఒకసారి నేను అనుకోకుండా బాగా చల్లగా ఉండే కోకాకోలా త్రాగాను. దాంతో ఆ రాత్రంతా పంటినొప్పి వలన చిగుళ్లు వాచిపోయి, నోరు కూడా కదిలించలేకపోయాను. అప్పుడు అర్థరాత్రి 2-3 గంటల సమయం కావటంతో నేను ఏమీ చెయ్యలేకపోయాను. ఉదయాన్నే నా తమ్ముడు తెచ్చిచ్చిన పంటినొప్పి మాత్ర వేసుకున్నాను. అప్పటికి కాస్త తగ్గినా, మళ్ళీ సాయంత్రానికల్లా నొప్పి తిరగబెట్టింది. ఆ నొప్పివల్ల నేను ఏమీ తినలేకపోయాను, త్రాగలేకపోయాను. ఆకలి తీవ్రమై ఆహారం కోసం చిన్నపిల్లాడిలా ఏడవటం మొదలుపెట్టాను. మళ్ళీ నొప్పి తగ్గించే మాత్ర ఇంకొకటి వేసుకున్నాక కానీ నేను మామూలు మనిషిని కాలేకపోయాను. నొప్పి తగ్గించే మాత్రలు తీసుకోవటం మన శరీరానికి అంత మంచిది కాదని నా స్నేహితులు చెపుతుండేవాళ్ళు. కానీ నాకున్న ఆర్థిక ఇబ్బందుల వల్ల నా దంతాలకు రూట్ కెనాల్ చేయించుకోలేకపోయాను. నేను ప్రతిరోజూ బాబా ఊదీ పెట్టుకుంటూనే ఉన్నా, నొప్పి తగ్గటం లేదు. అందువల్ల నా బాధ తగ్గించమని బాబాను ఆర్తిగా ప్రార్థించటం మొదలుపెట్టాను. కనీసం త్రాగటానికి, తినటానికి వీలుగా ఉండేలా నన్ను కాపాడమని వేడుకున్నాను. 4 రోజుల తరువాత, ఒక గురువారంనాడు నేను బాబా మందిరానికి వెళ్ళాను. బాబా ఆరతిలో పాల్గొన్న తరువాత అక్కడే బాబా ప్రసాదం స్వీకరించాను. ప్రసాదం తీసుకొనేటప్పుడు ఎటువంటి పంటినొప్పి రాలేదు. ఆరోజు రాత్రి కూడా ఎటువంటి నొప్పి లేదు. 

బాబా నా పంటినొప్పిని పోగొట్టారని, దానివల్ల నేను ఇప్పుడు త్రాగటము, తినటము చక్కగా చెయ్యగలుగుతున్నానని నేను మా అమ్మతో అన్నాను. నేను అడగకుండానే బాబా నా పంటినొప్పిని తొలగించి నన్ను మామూలు మనిషిని చేశారు. అలా ప్రతిక్షణమూ నన్ను రక్షిస్తున్నందుకు నేను బాబాకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. బాబా వల్లనే నేను ప్రతిరోజూ సంతోషంగా ఉండగలుగుతున్నాను. 

నాకు పంటినొప్పి అసలు ఎందుకు వచ్చిందో అని ఒకసారి తిరిగి చూసుకుంటే...

నేను ప్రతిరోజూ స్నానం చేసిన తరువాత బాబా ఊదీని నా నుదుటన ధరిస్తాను. కానీ నాకు పంటినొప్పి వచ్చిన రోజున, ఆఫీసుకు వెళ్ళే హడావిడిలో నేను ఊదీ పెట్టుకోవటం మరవటంతో నా పంటినొప్పి మొదలయ్యింది. అదేకాదు, ఇంకొకసారి నేను ఊదీ పెట్టుకోవటం మరచిన రోజున, ఆఫీసులో నా మేనేజర్ నన్ను మందలించినందువల్ల నేను ఏడ్చాను. అలా ఊదీ పెట్టుకోవటం మరచిన ప్రతిసారీ ఏదో ఒకటి జరిగి నేను కలతచెందేవాడిని.

నేను అదే రోజున (గురువారం) నా ఈ అనుభవాన్ని బ్లాగులో వ్రాద్దామనుకున్నాను. కానీ బద్ధకంతో వాయిదా వేసినందుకు బాబాను క్షమాపణ వేడుకుంటున్నాను. నా పంటినొప్పి తగ్గితే బాబాకు ఒక కొబ్బరికాయ సమర్పిస్తానని కూడా మ్రొక్కుకున్నాను. కనీసం అది కూడా తీర్చనందుకు బాబాను క్షమించమని ప్రార్థిస్తున్నాను. నేను రేపు ఉదయాన్నే కొబ్బరికాయను సమర్పించుకుంటాను.


బాబా నా జీవితంలోకి రాకముందు నేను నిరాశ, నిస్పృహలతో బాధపడుతుండేవాడిని. కానీ బాబా దగ్గరకు వచ్చిన తరువాత, బాబా మందిరానికి వెళ్ళి నుదుటిపై ఊదీ పెట్టుకున్నాక ఎంతో సంతోషంగా అనిపించేది. తరువాత ఒకసారి 'ప్రశ్న-బాబా సమాధానం' నుంచి కూడా, “ఊదీ పెట్టుకుంటే అంతా మంచి జరుగుతుంది” అని వచ్చింది. అప్పటినుంచి ప్రతిరోజూ నా నుదుటిపై ఊదీ ధరించి కాలేజీకి వెళుతుండేవాడిని. చిన్నగా నా జీవితంలో ఎంతో మార్పు వచ్చి, మంచి, మానవత్వం గల మనిషిగా మారాను. ఇప్పుడు నాకు ఎటువంటి చెడు ఆలోచనలు రావు. నేను జబ్బుతో బాధపడను. నాకు అంతా మంచే జరుగుతున్నది. ఊదీ రూపంలో బాబా నా ప్రారబ్దాన్ని మార్చివేసి, అది ఎంత చెడురోజయినా సరే, దానిని ఎంతో మంచిరోజుగా మారుస్తారు. ఎంతటి చెడుకర్మనయినా మంచికర్మగా మార్చే శక్తి ఊదీకి ఉంది. చెడు లేదా హాని చేసే కర్మల నుండి ఊదీ నన్ను రక్షిస్తూనే ఉన్నది. ఊదీ నుదుటన ధరిస్తున్నానంటే నాకు సంతోషాన్నిస్తుందని కాదు, అది బాబా నన్ను రక్షిస్తున్నారని తెలియచేస్తుంది. ఇదే నేను చెప్పదలుచుకొన్నది. 

"బాబా! నేను ఎంత బద్ధకస్తుడనైనా, దురహంకారంతో ఉన్నా, చేతకానివాడనైనా, ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు మిమ్మల్ని మర్చిపోయినా నన్ను వదలకుండా ప్రతిక్షణమూ నాతోనే ఉండి నన్ను రక్షించి నా పూర్తి బాధ్యతను మీరు తీసుకుని, నాపైన అవ్యాజమైన ప్రేమ కురిపిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. మీరు నా కోరికలు తీర్చినప్పుడు నేను చేసిన వాగ్దానాలు చెల్లించలేకపోయినందుకు నన్ను క్షమించండి. నా వాగ్దానాలన్నీ నేను త్వరలోనే పూర్తిచేస్తాను. కొంచెం ఓపికతో ఉండండి తండ్రీ!" నేను నా అనుభవాన్ని చాలా క్లుప్తంగా, టూకీగా వ్రాద్దామనుకున్నాను, కానీ ఊదీ గురించి ఇంత పెద్ద అనుభవాన్ని వ్రాసేలా చేసింది. ఇదంతా కేవలం బాబా అనుగ్రహ ఆశీస్సుల ఫలితమే. నా అనుభవాన్ని ఇంత విపులంగా నాచే వ్రాయించిన బాబాకు కృతజ్ఞతలు. "నా తండ్రీ! నీ లీలలను నేను మాటల్లో వర్ణించలేను. అందుకే మిమ్మల్ని ప్రేమిస్తున్నాను."

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo