సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 24వ భాగం.


కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 24వ భాగం.

శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.

అనుభవం - 31

ఒకసారి నేను నగర్ నుండి పూలగుచ్ఛాన్ని తెప్పించాను. ఆ పూలగుచ్ఛాన్ని తీసుకొని బాబా దర్శనానికి వెళ్ళాను. వెళ్ళేటప్పుడు ఇరవై ఐదు రూపాయలను బొడ్డు క్రింద పంచెలో చుట్టుకొని తీసుకువెళ్ళాను. అప్పుడు బాబా “ఏమిటది తీసుకువచ్చావ్?” అని అడిగారు. “పూలగుచ్చం" అని నేను సమాధానమిచ్చాను. అప్పుడు బాబా "దానితో పాటుగా రూ.25/-లు దక్షిణ కూడా కావాలి కదా” అని అన్నారు. అందుకు నేను "మీరు ముందే నాకు ఆ ఆలోచన కలిగించారు. అందుకే తీసుకువచ్చాను” అని చెప్పి, ఆ దక్షిణ సమర్పించాను.

అనుభవం - 32

హరిభక్తి పరాయణుడు మాధవ్ బువా బడోద్ కర్ ఒకసారి “మీరు, నేను కలసి ఒకసారి శ్రీసద్గురు సాయిబాబా దర్శనానికి వెళదాం” అని అన్నారు. కానీ ఆ సందర్భం కలసి రాలేదు. కానీ ఆయన బావగారు సంగమనేర్‌‌లో మమల్తదార్‌‌గా పని చేసేటప్పుడు తాను సంగమనేర్ వెళ్ళాడు. అక్కడ తాను శిరిడీకి వెళ్ళాలనే కోరికను వెలిబుచ్చడంతో, వాళ్ళ బావగారు తన కోసం ఒక టాంగాను ఏర్పాటు చేసారు. ఆ టాంగాలో తాను శిరిడీ వచ్చారు. ఆ సమయంలో నేను కూడా శిరిడీలోనే ఉన్నాను. నేను, ఆయన ఇద్దరం ద్వారకామాయిలో కలిసాము. నేను తనతో "వచ్చారు కాబట్టి, ఒకరోజు ఉండండి” అని చెప్పాను. కాని టాంగాలో వెంటనే తిరిగి వెళ్ళాలనే ఆయన దృఢమైన ఆలోచనను చూసి మేమిద్దరము బాబా వద్దకు వెళ్ళాము. బాబా కూడా ఆయనకు బయలుదేరడానికి అనుమతిని ఇచ్చారు. “వెనువెంటనే బయలుదేరి వెళ్ళు” అని చెప్పారు. తాను ఒక మైలుదూరం వెళ్ళాడో, లేదో విపరీతంగా వర్షం కురవసాగింది. కాని చమత్కారం ఏమిటంటే తాను కొంచెం కూడా తడవలేదు. ఆయన ఒంటిపై కేవలం సాధారణమైన తెల్లని వస్త్రాలు ఉన్నాయి. అయినప్పటికీ చలిగాలుల వలన తనకు కొంచెం కూడా ఇబ్బంది కలుగలేదు.

అనుభవం - 33

నేను ఒకసారి శిరిడీలో ఉండేటప్పుడు శ్రీ సద్గురు సాయిబాబా మధ్యాహ్నం పూట “ప్రధాన్ వచ్చాడా?” అని అడిగారు. “రాలేదు” అని నేను సమాధానం ఇచ్చి, “తనను పిలిపించాలా?” అని అడిగాను. అందుకు బాబా “మంచిది” అని మాత్రం అన్నారు. ఏ రోజైతే బాబా పైవిధంగా అడిగి ప్రధాన్ ను గుర్తుకు తెచ్చుకున్నారో, అదేరోజు ప్రధాన్ ముంబాయి హైకోర్టులో న్యాయవాదులు కూర్చొనే గదిలో తల తిరిగినట్టే నిశ్చేష్ణుడిగా  పడిపోయాడు. అలా స్పృహ తప్పుతుండగా తాను బాబాను స్మరించుకున్నాడు. తాను ఆ విధంగా నిశ్చేష్ణుడిగా పడిపోవటం చూసి ఇతర న్యాయవాదులందరు పరుగెత్తుకుంటూ వచ్చారు. తనను స్పృహలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేయసాగారు. కాని ప్రధాన్ తనకు తానే లేచి కూర్చొన్నాడు. కొంచెం సేపటికి “తనను మోటారుకారులో ఇంటికి చేరుస్తాము” అని తోటి న్యాయవాదులు అనసాగారు. కాని "అలా చేయాల్సిన అవసరం లేదు, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను” అనే భరోసాను ప్రధాన్ తన మిత్రులకు ఇచ్చాడు. తన మిత్రులు రామ్‌‌దాస్ దేశాయి, రామకృష్ణ శ్రీ కృష్ణ నావల్కర్లు తనను ఇంటికి తీసుకువెళ్ళారు. మరుసటిరోజు బాలా షింపి అనే శిరిడీ గ్రామస్థుడు శ్రీ సద్గురు సాయిబాబా ఊదీ తీసుకొని ప్రధాన్ వద్దకు వెళ్ళాడు. శ్రీ ప్రధాన్ జరిగిన వృత్తాంతాన్ని నాకు తెలియ చేస్తూ ఉత్తరం వ్రాసాడు. “నాకు కూడా బాబా తమ ఆహ్వానాన్ని పంపారు” అనే వివరంతో ఉత్తరం వచ్చింది. గురుదేవులు భక్తుల సంకట నివారణార్థమై ఏ విధంగా పరుగెత్తుకుంటూ వస్తారో అనేదానికి ఈ ఉత్తరం ఒక ఉదాహరణ!

తరువాయి భాగం రేపు

సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo