సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 36వ భాగం.


కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 36వ భాగం.

శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.

అనుభవం -55

ఒకరోజు బాబా వఝేను “నీవు ఏ పని చేస్తుంటావు?” అని అడిగారు. అందుకు  వఝే "ద్వారకామాయిలో ఏదయిన పని ఉంటే చేస్తుంటాను” అని సమాధానమిచ్చాడు. అప్పుడు బాబా “వాడాలో కూడా ఏదయినా పని ఉంటే చేయి” అని చెప్పారు. ఆ మరుసటి రోజు వాడాలో ఎంతో ఉపయోగకారి అయిన పండిట్ అనే వ్యక్తి అస్వస్థుడు అయ్యాడు. అప్పుడు  వఝేకు బాబా మాటలలోని అంతరార్థం బోధపడి ఎంతో సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. వాడాలోని బాధ్యతంతా భుజస్కంధాలపై వేసుకొని, పండిట్ పూర్తిగా కోలుకునేవరకు తన పనంతా  వఝే ఎంతో శ్రద్దగా చేసాడు.

అనుభవం -56

దహణులో హరి భావు కార్నిక్ అనే గృహస్తు ఉండేవాడు. తాను 1918 గురుపూర్ణిమ నాడు శిరిడీకి వెళ్ళాడు. హరిభావు స్నేహితుడు ఒకరు శిరిడీ నుండి  బయలుదేరడానికి అనుమతి తీసుకోవడానికై బాబా వద్దకు వెళ్ళాడు. తనతో పాటుగా హరిభావు కూడా వెళ్ళాడు. ఆ స్నేహితునికి ఒక గృహస్థు బాబా వద్ద నుండి అనుమతిని ఇప్పించాడు. ఆ గృహస్తే  హరిభావుకి కూడా అనుమతిని ఇప్పించాడు. వెంటనే వారిద్దరిని కిందకు వెళ్ళమని ఆ గృహస్థు చెప్పాడు. క్రిందకు వచ్చాక హరిభావుకి బాబాకి ఒక రూపాయి దక్షిణగా ఇవ్వాలి అని మనసులో అనిపించింది. కానీ ద్వారకామాయిలో నున్న గృహస్థు “ఇక వెళ్ళండి” అని పైనుండే చెప్పారు. ఇక చేసేది లేక వారిరువురు అలాగే బయలుదేరారు. వారు నాసిక్ లో దిగారు. అక్కడ ఒక దేవాలయంలో ఒక దిగంబరస్వామి ఉండేవారు. ఆయన దర్శనానికై వారు వెళ్ళారు. ఆ స్వామితో పాటుగా వెంట చాలామంది ఉన్నారు. కాని హరిభావు వెళ్ళగానే ఆ స్వామి ఒక్కసారిగా లేచి హరిభావు వద్దకు వచ్చి మణికట్టు పట్టుకొని “నా రూపాయి ఏది? ఇవ్వు” అంటూ హరిభావు వద్దనుండి ఒక రూపాయిని తీసుకున్నారు. ఆ విధంగా బాబాకు దక్షిణ సమర్పించుకోవాలనే తన కోరికను బాబా తీర్చారు.

అనుభవం -57

డాక్టర్ మెహతా అనే పార్శీ గృహస్థు 1920వ సంవత్సరం నుండి శిరిడీకి వస్తున్నాడు. బాబా దేహధారిగానున్న రోజులలో తనకు బాబా ప్రత్యక్షదర్శనం కాలేదు. అయినప్పటికీ వేరు వేరు పరిస్థితులలో బాబా ప్రసాదించిన అనుభవాల వలన తనకు బాబా చరణాలపై సంపూర్ణ శ్రద్ధ కలిగింది. రెండు సంవత్సరాలకు పూర్వం తాను శిరిడీకి వచ్చాడు. అప్పుడు హైకోర్టులో తనపై ఒక ఫిర్యాదు జరిగిందని తాను నాకు చెప్పాడు. తాను ఒక గృహస్తుకి డబ్బులు ఇవ్వకుండా మూడువేల రూపాయలకు కే ప్రామిసరీ నోటు వ్రాసిచ్చాడు. ఆ గృహస్థు ఆ ప్రామిసరీ నోటు ఆధారంగా డాక్టర్ మెహతాపై హైకోర్టులో ఫిర్యాదు చేసాడు. కనుక డాక్టర్ తరపున నేను కేసు వాదించాలని ఆయన నన్ను అభ్యర్థించసాగాడు. నేను న్యాయవాది వృత్తి చేయడం పూర్తిగా వదిలేసినందువలన తనను నా స్నేహితుడు మాణిక్ లాల్ వద్దకు సిఫారసు ఉత్తరం  పంపించాను. శ్రీ మాణిక్ లాల్ కేసుని పూర్తిగా విని “సాక్షిదారుడు ఎవరు?” అని ప్రశ్నించాడు. “సాక్షిదారుడు ఎవరూ లేరని, ప్రామిసరీ నోటు వ్రాసిచ్చేటప్పుడు తాను మరియు ఫిర్యాదిదారుడు మాత్రమే ఉన్నామని” డాక్టర్ చెప్పాడు. అప్పుడు మాణిక్ లాల్ మనవైపు కొంచెం నిరాశాజనకంగా ఉందని, అందువలన మీరు మరియు  ఫిర్యాదిదారుడు కోర్టు బయట రాజీపడండని సలహా ఇచ్చాడు. అప్పుడు డాక్టర్ “మీరు కోర్టులో వాదించడానికి ప్రయత్నం చేయండి. ఆ పైన బాబా ఎలా సంకల్పిస్తే అలా జరుగుతుంది అని శ్రీ మాణిక్ లాల్  అభ్యర్థించారు. డాక్టర్ గారి అభ్యర్థనతో శ్రీ మాణిక్ లాల్  కోర్టులో ఒక పిటీషన్ వేసారు. కేసు విచారణకు వచ్చే ముందు వచ్చి కలవవలసిందిగా శ్రీ మాణిక్ లాల్ డాక్టర్ గారికి ఉత్తరం వ్రాసారు. కానీ డాక్టర్ గారు కలవలేదు. ఇక కేసు రెండు రోజులలో విచారణకు వస్తుందనగా శ్రీ మాణిక్ లాల్ గారు తమ గుమస్తాని పంపించి డాక్టర్ గారిని ఆఫీసుకి పిలిపించారు. అపుడు డాక్టర్ గారు అస్వస్థుడైనందువలన పార్శీ శానిటోరియంలో చేరారని, అందువలన కలవలేకపోయారని శ్రీ మాణిక్ లాల్ గారికి తెలిసింది. శ్రీ మాణిక్ లాల్ మరలా డాక్టర్ కు కోర్టు బయట రాజీపడే సలహాను ఇచ్చారు. అలా రాజీపడకపోతే మొత్తం డబ్బులను వడ్డీతో కలిపి మరియు కోర్టు ఖర్చులతో కలిపి ఇవ్వవలసి వచ్చే ప్రమాదముందని డాక్టర్ గారికి గట్టిగా చెప్పారు. అందుకు డాక్టరు “నేను రాజీ పడటానికి వెళ్ళను. నా దగ్గర ఇవ్వడానికి డబ్బులు కూడా లేవు. ఏదిఏమైనా నా పరువుపోదు అనే నమ్మకం నాకుంది. నాకు కొన్ని రోజుల ముందు బాబా స్వప్నంలో కనిపించి నేను నీ పరువు పోనివ్వను అని చెప్పారు. ఆయన మాటలు ఎన్నడూ వృథాగా పోవు. కాబట్టి కేసు వాదించేందుకు మీరు సిద్ధం కండి” అని దృఢంగా చెప్పాడు. అప్పుడు శ్రీ మాణిక్ లాల్ కేసుని క్షుణ్ణంగా పరిశీలించాడు. ఆ రోజురాత్రి ఎనిమిది గంటలవరకు వాళ్ళు ఆ కేసు పని మీద ఉండి, శ్రీ మాణిక్ లాల్ మరుసటిరోజు ఆదివారం డాక్టరుని ఇంటికి వచ్చి కలవమని చెప్పారు. మరుసటిరోజు డాక్టరు శ్రీ మాణిక్ లాల్ ని కలవడానికి వెళ్ళబోతుండగా ఒక స్నేహితుడు తన వద్దకు వచ్చారు. “ఈ కేసుకి సంబంధించి మేము ఒక రాజీ సూత్రాన్ని తయారుచేసాము. దానికి మీరు కచ్చితంగా ఒప్పుకోవాలి. లేకపోతే మేము ఇక్కడ నుండి కదిలేది లేదు. ఆ రాజీ సూత్రం ప్రకారం మీరు ఫిర్యాదుదారునికి మొత్తం ఎనిమిది వందల రూపాయలు ఇవ్వాలి. అవి కూడా ఒక్కసారిగా ఇవ్వనక్కరలేదు. నెలకు యాభై రూపాయల చొప్పున ఇవ్వాలి. ఖర్చులు ఎవరివి వారే  భరించాలి. అటువంటి పరస్పర అంగీకార పత్రాన్ని కోర్టులో దాఖలు చేయాలి అని స్నేహితుడు డాక్టరు గారికి చెప్పారు. ఆ స్నేహితుని అభ్యర్థన మేరకు డాక్టర్ అంగీకరించారు. ఆ విధంగానే అంగీకార పత్రాన్ని కోర్టులో దాఖలు  పరచారు. నెలసరి వాయిదా తక్కువ కావడం వలన, ఆ వాయిదా కట్టడంతో డాక్టర్ గారికి కష్టం కాలేదు. "నేను నీ పరువు పోనివ్వను” అనే బాబా మాటలలోని భావం అందరికీ అనుభవమైంది".

తరువాయి భాగం రేపు 

సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo