సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 66వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:

  1. సాయినామంలోని మహిమ మరియు స్తవనమంజరి మహత్యం
  2. ప్రేమతో ఏ కష్టం లేకుండా చేసి, తమ బ్లాగ్ వర్కుకి ఆటంకం రాకుండా చూసుకున్న బాబా

సాయినామంలోని మహిమ మరియు స్తవనమంజరి మహత్యం

శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

"బాబా! ఎప్పుడూ మీరు మీ బిడ్డలకి శ్రేయస్సునిచ్చేవే చేస్తారు. కానీ మేము ఏదైనా అడిగినప్పుడు మీరు ఇవ్వడం ఆలస్యమైతే, మీరెందుకు వెంటనే ఇవ్వట్లేదని మేము అలుగుతాం. అందుకు మమ్మల్ని క్షమించండి". 

నా పేరు మౌనిక. మాది నెల్లూరు. నాకు అమ్మవారు, సుబ్రహ్మణ్యస్వామి అంటే చాలా ఇష్టం. సాయి నా జీవితంలోకి వచ్చాక, "సుబ్రహ్మణ్యస్వామి భక్తురాలినైన నేను సాయిని పూజించడం సరైనదేనా?" అని సందేహపడినప్పుడు నా ఫ్రెండ్ సుమ ద్వారా ఎలా నన్ను సమాధానపరిచారు. అప్పటినుండి నేను బాబాని నా గురువుగా భావించాను. ఆ తరువాత తాము, సుబ్రహ్మణ్యస్వామి ఒకటే అని నాకు అర్థమయ్యేలా బాబా, సుబ్రహ్మణ్యస్వామి కలిసి నాకు కలలో దర్శనమిచ్చారు. ఎంత అద్భుతమా కల! కలలో బాబా, సుబ్రహ్మణ్యస్వామి, కృష్ణయ్యలను చూడగలిగాను. "చాలా చాలా కృతజ్ఞతలు సాయీ!".

2019వ సంవత్సరం ప్రారంభంలో నేను అమ్మవారు, సుబ్రహ్మణ్యస్వామి, బాబా ఆశీర్వాదములతో నా కెరీర్‌కి చాలా ఉపయుక్తమైన ఒక పరీక్షలో ఉత్తీర్ణురాలినయ్యాను. దీనికి సంబంధించిన సర్టిఫికెట్ ఏప్రిల్‌లో విడుదల చేసారు. కానీ నాకా విషయం ఒక వారం తరువాత శనివారంనాడు తెలిసింది. ఆరోజు నేను సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి కొన్ని కారణాల వలన వెళ్ళలేకపోయాను. సోమవారంనాడు, సర్టిఫికెట్ గురువారం డౌన్లోడ్ చేసుకుంటే బాగుంటుందని మనసులో అనుకుంటున్నప్పటికీ, ఒక మాములు మనిషిగా సర్టిఫికెట్ చూడాలన్న కుతూహలాన్ని ఆపుకోలేక, "బాబా! నేనీరోజు సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. కానీ మీకు ఏరోజు ఇవ్వాలని అనిపిస్తే ఆరోజే ఇవ్వండి" అని చెప్పుకున్నాను. అలా సోమవారం నుండి బుధవారం వరకు రోజూ నేను నెట్ సెంటర్‌కి వెళ్లాలనుకోవడం, ఏవో కారణాల వలన వెళ్లలేకపోవడం జరిగేది. చివరికి గురువారంనాడు వెళ్లగలిగాను. కానీ, అక్కడ నాకు పెద్ద షాక్! ఏమిటంటే, నేను వివరాలు ఎంటర్ చేస్తుంటే, ఎర్రర్ అని వస్తోంది. ఇక నాకు టెన్షన్ మొదలైపోయింది. ఎన్నిసార్లు ప్రయత్నించినా అదే పరిస్థితి. అక్కడినుండి ఇంటికి వచ్చి లాప్‌టాప్‌లో ప్రయత్నించాను. కానీ ఏ ఉపయోగం లేదు. తరువాత దానికి సంబంధించిన వీడియోలు చూస్తుంటే ఒక మెసేజ్ నా కంటపడింది. అదేమిటంటే, "ఆందోళన చెందనవసరంలేదు. ఇంకా అన్ని సర్టిఫికెట్లు అప్లోడ్ కాలేదు" అని. ఆ మెసేజ్ జస్ట్ ఒక్కరోజు ముందు అంటే బుధవారంనాడు అప్లోడ్ చేసి వున్నారు. అప్పుడు అర్థమయింది బాబా ఎంత మేలు చేసారో! నేను ఆరోజు కాకుండా ముందు ఏరోజు సర్టిఫికెట్ డౌన్లోడ్ చేయటానికి ప్రయత్నించినా ఆ మెసేజ్ నా కంటపడేది కాదు. దాంతో నేనెంత ఆందోళన చెందేదాన్నో ఊహించుకోవడానికి కూడా నాకు ధైర్యం లేదు. ఎందుకంటే, ఆ సర్టిఫికెట్స్ నా కెరీర్‌కి చాలా ఆవశ్యకమైనవి. తరువాత నేను, "దేవా! ఇక మీరు చూసుకోవాలి. నేనేమి చేయలేన"ని భారమంతా బాబా మీద వేసాను.

తరువాత 2019, మే 9న బాబా ఒక మిరాకిల్ చేసారు. ఆరోజు గురువారం. మా అమ్మతోపాటు నేను జ్యూయలరీ షాపుకి వెళ్ళాను. అక్కడ ఉండే అతను(అంకుల్) బాబా భక్తుడు. అతనికి మా కుటుంబంతో చాలా సన్నిహిత సంబంధముంది. నేను బాబా భక్తురాలినని ఆయనకి తెలిసి మేము షాపునుండి తిరిగి వచ్చేటపుడు 'స్తవనమంజరి' పుస్తకం నాకిచ్చి ప్రతీ ఏకాదశి రోజు చదవమని చెప్పారు. "గురువారంనాడు ఆయన నోటితో బాబానే చెప్పిస్తున్నారు, ఇంకేం కావాలి నాకు!?" అని అనుకుంటూ సంతోషంగా ఆ పుస్తకాన్ని తీసుకున్నాను. నా పుట్టినరోజు కానుకగా ఆ పుస్తకరూపంలో బాబానే వచ్చారని నాకు తరువాత అర్థమయింది. ఎందుకంటే, మే 11న నా పుట్టినరోజు. ప్రతీ ప్రత్యేక సందర్భానికి ఒకటి, రెండురోజుల ముందు బాబా ఫోటో లేదా ఆయన ప్రసాదం ఇలా ఏదో ఒకటి నాకు చేరుతాయి. "థాంక్యూ బాబా!"

2019, మే14న ఏకాదశి వచ్చిందని స్తవనమంజరి చదివాను. తరువాత నేను సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసేందుకు ప్రయత్నించాను. నిజానికి నేను ప్రతిరోజూ ప్రయత్నిస్తూనే ఉన్నా ఓపెన్ అయ్యేది కాదు. అయితే ఆరోజు ఎందుకనిపించిందో తెలియదు గాని, పాస్‌వర్డ్ బాబా పేరు కలిసొచ్చేలా మార్పుచేసి ప్రయత్నించాను. అంతే! సాయినామంలో ఉన్న మహిమ మరియు స్తవనమంజరి మహత్యం రెండూ కలిసి నా సర్టిఫికెట్ డౌన్లోడ్ అయ్యేలా చేసాయి. "థాంక్యూ సో మచ్ బాబా! నిజంగా ఎంత సంతోషంగా గడిపానో ఆరోజు! ఒక్క సర్టిఫికెట్ డౌన్లోడ్ అయిందనే కాకుండా స్తవనమంజరి అనే మీ ఆశీస్సులని, మీ నామంలో ఉన్న మహిమను మీరు చూపించినందుకు. మీరు ఎప్పుడూ ఇలాగే నన్ను ముందుండి నడిపించాలని కోరుకుంటున్నాను సాయీ. ఏమైనా తప్పులు చేస్తూంటే నన్ను క్షమించండి!" మన సాయినాథునికి తెలుసు - మనకేది మంచిదో, ఎప్పుడిస్తే మనకి అధిక సంతోషాన్నిస్తుందో.

ప్రేమతో కష్టం లేకుండా చేసి, తమ బ్లాగ్ వర్కుకి ఆటంకం రాకుండా చూసుకున్న బాబా

నా పేరు సాయిసురేష్. 2019, మే 4వ తేదీ మధ్యాహ్నం నేను బాబాకు భోజనం పెట్టిన తరువాత కాసేపు మొబైల్‌లో వాట్సాప్ చూస్తూ కూర్చున్నాను. 10 నిమిషాల తర్వాత భోజనం చేయడానికి లేవబోతుంటే నా భుజాల వెనుకభాగంలో చాలా తీవ్రమైన నొప్పి వచ్చింది. తట్టుకోవడం చాలా కష్టంగా అనిపించి, "ఏమిటి బాబా, ఈ నొప్పి తట్టుకోలేకపోతున్నాను" అని అనుకున్నాను. ఎలాగో ఆ నొప్పిని సహిస్తూ వెళ్లి భోజనానికి కూర్చున్నాను. నాకు ఎదురుగా మా మమ్మీ, మా తమ్ముడు కూర్చున్నారు. భోజనానికి కూర్చోవడమైతే కూర్చున్నాను కానీ ఉండుండి నొప్పి తీవ్రంగా వస్తోంది. నొప్పి వస్తుందని మావాళ్లతో చెప్పలేను. చెప్పానంటే, వాళ్ళిక నన్ను బ్లాగ్ వర్క్ చేసుకోనివ్వరు. అందుకే వాళ్లకు చెప్పకుండా ఉండే ప్రయత్నం చేశాను. కానీ, తీవ్రమైన నొప్పి మూలంగా నా ముఖంలోని కవళికలను వాళ్ళెక్కడ గుర్తుపడతారోనని మనసులో ఒకటే ఆందోళన. మనసులోనే, "బాబా! ప్లీజ్.. నన్ను మీరే కాపాడండి. వాళ్ళు గుర్తుపట్టకుండా ఉండేలా చూడండి. నొప్పి తగ్గిపోయేలా కూడా చూడండి" అని మనసులో చెప్పుకున్నాను. బాబా అనుగ్రహం వలన వాళ్ళు గుర్తుపట్టలేదు. భోజనం పూర్తయ్యాక కూడా నొప్పి అలానే ఉంది. పూజగదిలోకి వెళ్లి బాబా ముందు కూర్చుని, ఆయనను ప్రార్థించి, అక్కడ పడివున్న అగరుబత్తి బూడిదను ఊదీగా భావించి నోట్లో వేసుకున్నాను. తర్వాత కంప్యూటర్ ముందు కూర్చుని నా పని మొదలుపెట్టుకున్నాను. నేను కూర్చునేటప్పటికి నొప్పి అలానే ఉంది. కానీ పనిలో పడ్డాక నొప్పి సంగతే గుర్తులేదు. సంతోషంగా బాబా పనిలో మునిగిపోయాను. మూడున్నరకు కాసేపు పడుకుందామని కంప్యూటర్ ఆఫ్ చేసి లేచేసరికి మళ్లీ నొప్పి తెలిసింది. అయితే నొప్పి చాలావరకు తగ్గింది. కాసేపు నిద్రపోయి 5 గంటలకు లేచి ఇంట్లో పనులు చేసుకున్నాను. ఆ తరువాత చాలాసేపటికి గమనిస్తే నొప్పి ఎప్పుడు పోయిందో కూడా తెలియలేదు. బాబా ఊదీ అంత అమోఘమైనది. విశ్వసించేవారికి అద్భుతాలనే చూపిస్తుంది. ప్రేమతో బాబా నాకు ఏ కష్టమూ లేకుండా చేసి, బ్లాగ్ వర్కుకి ఆటంకం రాకుండా చూసుకున్నారు. "థాంక్యూ సో మచ్ బాబా! సదా బ్లాగ్ వర్కులో ఎంతో సహాయం చేస్తున్నారు". 

4 comments:

  1. OM SAIRAM
    NEENU 14TH MAY 2019 NAA KODUKUNI DHURAM CHESIKUNNANU
    PLEEASE HELP ME SAIRAM

    ReplyDelete
  2. Om Sairam
    2054 days iyepondi sairam
    Naa Koduku duram iepoyi
    Plsease help me sai

    ReplyDelete
  3. Baba me daya valana Kalyan ki marriage ipoindi na health bagu cheyandi pl Rashmi ki pregnancy vachhatatlu chai thandi meku sathakoti vandanalu

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo