కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 27వ భాగం.
శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.
అనుభవం - 41
ఒకసారి శిరిడీలో ఉండేటప్పుడు "రాత్రి పూట భుజించకూడదు” అనే నియమం పెట్టుకున్నాను. ఆ విధంగానే ఇంట్లో వారికి “రేపటి నుండి రాత్రి పూట భుజించను” అని చెప్పాను. మరుసటి రోజు మధ్యాహ్నం బాబా వద్ద కూర్చొని ఉన్నప్పుడు, బాబా “ఈ రోజు రాత్రి భోజనానికి ఏం చేస్తున్నావు?” అని అడిగారు. "మీరు ఏం చెపితే అది తయారు చేస్తాను” అని చెప్పాను. “ఎప్పటి మాదిరిగానే, అన్నం, రోటీలు చేసుకుని తిను” అని అన్నారు. “బాబా, తయారు చేసి మీకు నైవేద్యంగా తీసుకురమ్మంటారా” అని అడిగాను. అందుకు బాబా “అక్కడే నైవేద్యం పెట్టి నీవు తిను” అని చెప్పారు. ఇంట్లో భోజనం చేసేటప్పుడు ఇంట్లో వారు నిన్న తీసుకున్న నిర్ణయం గురించి గుర్తుచేసారు. అప్పుడు నేను “రేపటినుండి రాత్రి పూట భోజనం చేయను” అని చెప్పాను. మరుసటి రోజు మరలా బాబా రాత్రి భోజనం గురించి అడిగారు. అప్పుడు మనసులో “రాత్రి పూట భోజనం మానివేయవద్దని బాబా ఆజ్ఞ!” అని అర్థమైంది. ఆ విధంగానే రాత్రి పూట భోజనం చేయసాగాను. తరువాత బాబా మరలా రాత్రి భోజనాన్ని గురించి అడుగలేదు.
అనుభవం - 42
ముంబాయికి చెందిన ఒక గృహస్థు శ్రీ సద్గురు సాయిబాబా దర్శనానికై శిరిడీకి వెళ్ళారు. కాని బాబా తనవద్ద దక్షిణ వంటివి ఏమీ అడుగకుండా, తాను వెళ్ళేందుకు అనుమతిని ఇచ్చారు. వాడాకు తిరిగి వచ్చిన తరువాత ఆ గృహస్థు మనసులో “బాబా నా వద్ద నుండి దక్షిణ ఏమీ అడుగలేదు” అనే భావన వచ్చి తాను కొంచెం బాధ పడసాగాడు. వెంటనే కొద్ది సేపటికి బాబా ఫలాన, ఫలానా వారిని పిలుచుకొని రమ్మని దగ్గరలో ఉన్న వ్యక్తిని ఆజ్ఞాపించారు. ఆ పిలిచిన వారిలో ఆ గృహస్థు పేరు కూడా ఉండటంతో ఆ గృహస్తు మరలా ద్వారకామాయిలోకి వెళ్ళారు. అప్పుడు బాబా వారి వద్ద నుండి దక్షిణ స్వీకరించారు. దాంతో ఆ గృహస్థు మనసులోనున్న కొలత తీరిపోయింది.
అనుభవం - 43
అంజన్‌వేల్‌కు చెందిన మధురదాస్ తరచుగా బాబా దర్శనానికి వచ్చేవారు. తాను సగుణ్ అనే పేరు కలిగిన భోజనశాలను నిర్వహించే వ్యక్తి దగ్గర బసచేసేవారు. ఒకసారి తాను మరియు సగుణ్ మాట్లాడుతూ కూర్చొన్నప్పుడు వీళ్ళ గురించి, వాళ్ళ గురించి లేని పోని మాటలన్నీ దొర్లాయి. ఆ తరువాత మధుర దాస్ బాబా వద్దకు వెళ్చాడు. తాను నమస్కారం చేసుకుని కూర్చొన్న తరువాత “సగుణ్ ఏమంటున్నాడు?” అని అడిగారు. దాంతో మధురదాస్‌కు విషయం అర్థమై మనసులో ఎంతో సిగ్గుపడ్డాడు. “సగుణ్‌తో జరిగిన సంభాషణ ఏదయితే ఉందో, అది బాబాకు నచ్చలేదు” అని తాను అర్థం చేసుకున్నాడు. “ఎవరి గురించయినా లేనిపోని మాటలు మాట్లాడటం మంచిది కాదు” అనే బోధను మధురదాస్ పొందాడు.
తరువాయి భాగం రేపు
సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.
🕉 sai Ram
ReplyDelete