సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 90వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:
  1. ఊదీ లీల
  2. శిరిడీలో నేను పొందిన అనుభూతులు

ఊదీ లీల

యు.కె. నుండి ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

సాయిబంధువులందరికీ సాయిరామ్! హృదయపూర్వకంగా మనం ప్రార్థిస్తే, బాబా ఎప్పుడూ అండగా నిలుస్తారని అందరికీ తెలుసు. ఆయన చాలా చమత్కారి. ఆయన తన బిడ్డల కోసం ఏదైనా చేస్తారు. ఇక నా అనుభవానికి వస్తే...

ఒకసారి మా రెండునెలల బాబుకి టీకా మందు వేయించాము. దానివలన తనకెంతో నొప్పిగా ఉంటుందని నేను తనకి పారాసెటమాల్ ఇచ్చాను. కానీ తరువాత కూడా వాడు ఆగకుండా ఏడుస్తూనే ఉన్నాడు. నర్సుని అడిగితే, "నొప్పి కొన్ని రోజులు ఉంటుంద"ని చెప్పింది. కానీ నేను తనని ఆ స్థితిలో చూసి స్థిమితంగా ఉండలేక, "బాబా! దయచేసి నా బిడ్డకి నొప్పి తగ్గేలా చేయండి" అని అభ్యర్థించాను. తరువాత ఊదీ తీసుకుని నా బిడ్డ రెండు కాళ్ళకు నొప్పి ఉన్న చోట రాసి, "బాబా! నొప్పి కొన్ని రోజులు ఉంటుందని నర్సు చెప్పింది కానీ, నేను నా బిడ్డ నొప్పి చూడలేకపోతున్నాను. దయచేసి రేపటికి తన నొప్పి తగ్గిపోయేలా చేయండి" అని ప్రార్థించాను. ఊదీ ఎంత అద్భుతం చేస్తుందో మన అందరికీ తెలుసు! నేను ఊదీ రాసిన తరువాత నా బిడ్డ హాయిగా నిద్రపోయాడు. మరుసటిరోజు ఉదయాన లేచాక చాలా ఉత్సాహంగా ఆడుకున్నాడు. ఏమీ ఆశించని బాబా ప్రేమకు మనసారా కృతజ్ఞతలు చెప్పుకున్నాను. "ఐ లవ్ యు బాబా! ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉండి సరైన మార్గంలో నడిపించండి. మీ ప్రేమ లేని మా జీవితాలు శూన్యం".

జై సాయిరామ్! సబ్ కా మాలిక్ ఏక్!

source: https://www.shirdisaibabaexperiences.org/2019/06/shirdi-sai-baba-miracles-part-2377.html

శిరిడీలో నేను పొందిన అనుభూతులు

యూరోప్ నుండి ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాల్ని ఇలా పంచుకున్నారు:

నేనిప్పుడు నా శిరిడీ ప్రయాణానికి సంబంధించిన అనుభూతులను మీతో పంచుకుంటాను. వాటిని మీతో పంచుకోవడం ద్వారా బాబా పట్ల నాకున్న ప్రేమను, గౌరవాన్ని వ్యక్తపరుస్తున్నట్లుగా భావిస్తున్నాను.

నేను ఇటీవలే ఇండియా వెళ్లి శిరిడీ దర్శనం చేసుకుని యూరోప్ తిరిగి వచ్చాను. ఇక్కడకు వచ్చిన తరువాత కూడా 15 రోజుల పాటు శిరిడీలో ఉన్న అనుభూతే నన్ను పరవశింపజేసింది. మధురమైన ఆ శిరిడీ యాత్ర గురించి నేనిప్పుడు మీతో పంచుకుంటాను. నేను ఇండియా వెళ్లేముందు, "బాబా! నేను నా అత్యంత సన్నిహిత స్నేహితునితో మీ దర్శనానికి రాగలిగినట్లైతే నా అనుభవాన్ని తోటి సాయిబంధువులతో పంచుకుంటాను" అని చెప్పుకున్నాను. కానీ ఎందుకో ఈసారి నేను శిరిడీ వెళ్లగలుగుతానా లేదా, బాబా నా ప్రార్థనలను స్వీకరిస్తారా లేదా అని భయపడ్డాను. నేను పరిపూర్ణమైన వ్యక్తిని కానని నాకు తెలుసు. కానీ, బాబా పట్ల నా భావనలు పవిత్రమైనవి. నేను మూడు వారాల కోసం ఇండియా వెళ్ళాను. చివరి నాలుగు రోజుల్లో నేను గుజరాత్ రోడ్డు, సాపూతారా అడవులు, నాశిక్ రోడ్డు, శిరిడీ, బొంబాయి, సిద్ధివినాయక్ ప్రాంతాలలో ఉన్నాను. ఆ క్షణాలను నేనెంతో ఆశీర్వాదసూచకంగా అనుభూతి చెందాను. ఎందుకంటే ఆ నాలుగు రోజులు నేను ఆశించినట్లు గడిచాయి. నేను బాబా హృదయంతో అనుసంధానింపబడివున్న ఒక ప్రత్యేక వ్యక్తితో గుజరాత్ నుండి శిరిడీకి కారులో ప్రయాణించాను. ప్రశాంతము, సంతోషకరము అయిన 20 గంటల రోడ్డు ప్రయాణం తరువాత మేము శిరిడీ చేరుకున్నాము. అప్పటికే రాత్రి అయ్యింది. ఆ రాత్రి బాబా ఇంటి(శిరిడీ)లో నిదురించే భాగ్యం నాకు దక్కింది.

ఆరోజు బాబాకు ప్రత్యేకమైన గురువారం. శిరిడీ జనసందోహంతో చాలా రద్దీగా ఉంది. కొన్నిసార్లు మనకి అలవాటైన చోట, అలవాటైన మనుషుల మధ్య ఉన్నప్పటికీ అభద్రతాభావంతో దిగులుగా ఉంటుంది. కానీ అంతమంది అపరిచితుల మధ్య ఉన్నప్పటికీ బాబా ఇంటిలో ఉన్నానన్న భద్రతాభావంతో నాకెంతో ప్రశాంతంగా, ఆనందంగా అనిపించింది. మేము ఉదయం 9.30 నుండి దర్శనానికి లైనులో ఉన్నాము. మేము ఆరతి సమయానికల్లా బయటకు నెట్టివేయబడతామేమో అని ఆందోళనపడ్డాను. కానీ బాబా కృప, మేము మధ్యాహ్న ఆరతి సమయానికి సమాధిమందిరంలో ఉన్నాము. నేను ఆన్లైన్‌లో ఆరతి చూసిన ప్రతిసారీ "కనీసం ఒక్కసారైనా ఆరతి సమయానికి సమాధిమందిరంలో బాబా ముందు నేను ఉండగలగాలి" అని అనుకునేదాన్ని. "ఆ అవకాశం నాకు దక్కితే నా జీవితంలోని బాధాకరమైన క్షణాలన్నీ మర్చిపోగలన"ని కూడా నేను నా కుటుంబసభ్యులతో చెప్పేదాన్ని. ఆ కోరికను ఇప్పుడు బాబా నెరవేర్చారు. ఆ ప్రశాంతమైన మధురక్షణాలను అనుభవించిన నేను ఎంతో అదృష్టవంతురాలినని సగర్వంగా చెప్పగలను.

ఆ రోజు జరిగే పల్లకి ఉత్సవంలో పాల్గొనే అవకాశం కూడా నాకు దక్కింది. పల్లకి ఉత్సవం చూడటానికి సాయంత్రం నుండి రాత్రి 10 వరకు నడిరోడ్డు మీద కూర్చున్నాను. కానీ అది రోడ్డు అన్న భావన నాకు లేదు. నా వరకు అది ఎంతో సుందరమైన ప్రదేశంగా అనిపించింది. బాబా పల్లకి చూడటం కోసం రాత్రంతా అక్కడ కూర్చుని ఉండొచ్చు అనిపించింది. నేను పల్లకిని చాలా దూరంనుండే చూసాను, కానీ బాబా నాకు చాలా దగ్గరగా ఉన్న అనుభూతి పొందాను.

ముఖదర్శనం వద్దనుండి బాబా దర్శనం చేసుకోవడానికి కూడా రెండుసార్లు వెళ్ళాను. ఒకసారి మా అమ్మతో, ఇంకోసారి నా ప్రత్యేకమైన వ్యక్తితో. నేను పొందిన అద్వితీయమైన అనుభవాల గురించి ఎన్నో చెప్పాలని ఉంది, కానీ చెప్పలేకపోతున్నాను. ఒక్కటి మాత్రం చెప్పగలను, నా జీవితంలో నేను అనుభవించిన అతిమధురమైన క్షణాలవి. బాబా వద్ద నాకు తృప్తిగా ఏడవాలని ఉండేది, కానీ ఈసారి కన్నీళ్లు లేవు. అంతా సంతోషమే, మనసునిండా ప్రశాంతతే. ఒకరోజు మొత్తం ఉదయం నుండి రాత్రి వరకు మేము శిరిడీలోనే ఉన్నాము. రాత్రి 12 తరువాత మళ్ళీ శిరిడీ నుండి తిరుగు ప్రయాణమయ్యాము. "బాబా! మాకు సరైన మార్గాన్ని చూపండి. మేము ఏవైనా తప్పులు చేసి ఉంటే క్షమించండి. మేము మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాము". ఇంకో విషయం - సిద్ధివినాయక మందిరంలో గణపతి పూలమాలతో నన్ను ఆశీర్వదించారు. "ఐ లవ్ యు గణపతి బప్పా అండ్ బాబా".

sourcehttps://www.shirdisaibabaexperiences.org/2019/05/shirdi-sai-baba-miracles-part-2374.html

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo