సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 86వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:

  1. అడిగినంతనే కోరిక నెరవేర్చిన సాయి
  2. చాలా పెద్ద ఆపద నుండి బాబా నా బిడ్డను కాపాడారు
  3. బాబా మమ్మల్ని మరువక తిరిగి తమ చెంతకు చేర్చుకున్నారు

అడిగినంతనే కోరిక నెరవేర్చిన సాయి

నా పేరు దేవిశ్రీ. మాది విశాఖపట్టణం. నాకు సాయిబాబా అంటే చాలా నమ్మకం. 2019, జూన్ 25న జరిగిన ఒక అనుభవాన్ని సాయిబంధువులందరితో పంచుకోవాలనుకుంటున్నాను. ఆ ముందురోజు రాత్రి నా డిగ్రీ ఫలితాలు వెలువడ్డాయి. అయితే ఆ రాత్రంతా వెబ్‌సైట్ ఓపెన్ కాలేదు. ఉదయాన లేచి మళ్లీ ప్రయత్నించాను. కానీ ఎన్నిసార్లు ప్రయత్నించినా వెబ్‌సైట్ ఓపెన్ కాలేదు. ఇక నేను బాబాను తలచుకుని, "5 నిమిషాల్లో వెబ్‌సైట్ ఓపెన్ అయితే బ్లాగులో నా అనుభవాన్ని పంచుకుంటాన"ని అనుకున్నాను. అలా అనుకున్న 3 నిమిషాల్లో వెబ్‌సైట్ ఓపెన్ అవడం నాకు చాలా చాలా ఆనందాన్నిచ్చింది. ఈ అనుభవంతో బాబాపట్ల నా నమ్మకం ఇంకా ఎక్కువైంది. "థాంక్యూ వెరీ మచ్ బాబా! మీరు ఎప్పుడూ ఇలాగే మాకు అండగా ఉండాలని నా కోరిక".

ఓం శ్రీ సాయినాథాయ నమః!

చాలా పెద్ద ఆపద నుండి బాబా నా బిడ్డను కాపాడారు

తాడిపత్రిలో వుంటున్న జ్యోతిగారి అబ్బాయిని పెద్ద ప్రమాదం నుండి బాబా కాపాడారు. ఆమె ఆ అనుభవాన్నిలా పంచుకుంటున్నారు: 

మా అబ్బాయి పేరు జయ సాయి. 2019, జూన్ 25 మధ్యాహ్నం తను ఏదో పని ఉండి బండి మీద బయటకు వెళ్ళాడు. ఒక బిల్డింగ్ ముందునుండి వెళ్తుండగా హఠాత్తుగా వెనుకనుండి బండిని ఎవరో తోసినట్టు బండి వేగంగా ముందుకు పోయింది. అసలే భయస్తుడైన వాడు బండి చాలా నిదానంగా నడుపుతాడు. అలాంటిది ఒక్కసారిగా అలా జరిగేసరికి భయంతో కంగారుగా సడెన్ బ్రేక్ వేశాడు. అప్పటికే వేగంలో ఉన్న బండి కొంచెం ముందుకుపోయి ఆగింది. ఆ షాక్ నుండి కోలుకోకముందే కొన్ని అడుగుల దూరంలో ఉన్న ఆ బిల్డింగ్ పైభాగం ఉన్నట్టుండి క్రింద పడిపోయింది. దాంతోపాటే ఒక వ్యక్తి కూడా క్రింద పడిపోయాడు. అతనికి ఎలా ఉందో తెలియదుగానీ ఒక్కక్షణం ఆలస్యమై ఉంటే జరిగేదాన్ని ఊహించలేను. అక్కడ జనం ఎవరూ లేరు. అలాంటిది వెనుకనుండి ఎవరు తోస్తారు? బాబానే బండిని ముందుకు తోసి నా బిడ్డను కాపాడారు. ఎంతటి శ్రద్ధతో ఆయన మనలను కనిపెట్టుకుని ఉంటారో అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. "ఓ సాయీ! మీ కరుణ అపారమైనది. ఇంత ప్రేమను కురిపించే మీకు మేము ఏం చేయగలం? మీరు మాపై చూపే ప్రేమను వర్ణించడానికి మాటలు రావడం లేదు. చాలా చాలా ధన్యవాదాలు బాబా! ప్రమాదానికి గురైన ఆ వ్యక్తిపై కూడా మీ కరుణను చూపండి". అందరికీ బాబా ఆశీస్సులు సదా ఉండాలని కోరుకుంటూ....

బాబా మమ్మల్ని మరువక తిరిగి తమ చెంతకు చేర్చుకున్నారు

సాయిభక్తులందరికీ సాయిరామ్!

నా పేరు మంజుభాషిణి. మేము చెన్నైలో నివసిస్తున్నాము. నాకు జరిగిన ఒక అనుభవాన్ని మీ అందరితో పంచుకోవాలని ఈ బాబా లీల వ్రాస్తున్నాను. పది సంవత్సరాల క్రిందట నాకు సాయిబాబా ఎవరో తెలీదు. ఆయన చేసే లీలలు కూడా తెలీదు. అలాంటి నన్ను తనవైపు ఎలా బాబా లాక్కున్నారో ఈ లీల చదివితే మీకు అర్థం అవుతుంది. పది సంవత్సరాల క్రిందట నేను, మావారు మైలాపూరులో ఉన్న సాయిబాబా మందిరానికి వెళ్ళాము. నేనైతే అక్కడ మంచి పొంగలి ప్రసాదంగా పెడతారని విని, కేవలం పొంగలి కోసమే అక్కడికి వెళ్ళాను. బాబా దర్శనం చేసుకున్నాక పొంగలి తీసుకుని బయటికి వస్తున్నాము. అంతలో ఏదో ఒక అద్వితీయమైన ఆకర్షణ, మరేవో దైవసంబంధమైన తరంగాలు నన్ను తిరిగి మందిరం లోపలికి లాగుతున్నట్లుగా అనిపించి, వెనక్కు వెళ్లి చూసాను. అక్కడ ఒక చిన్న దుకాణం ఉంది. అందులో ఒక చిన్న బాబా విగ్రహంపై నా దృష్టి పడింది. అదెంతో అందంగా, ఆకర్షణీయంగా ఉంది. నా మనసుకెంతో నచ్చి దాని వెల ఎంతని అడిగితే, 20 రూపాయలని చెప్పారు. నేను దాన్ని కొనుగోలు చేద్దామనుకుంటే మావారు "వద్దు" అనేశారు. మనసునిండా దుఃఖంతో ఇంటికి వచ్చాను.

మరుసటిరోజు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న మా అమ్మా వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆశ్చర్యం! నేను ముచ్చటపడిన అదే బాబా విగ్రహం మా అమ్మా వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ పైన ఉంది. నిజానికి అమ్మా వాళ్ళు రాఘవేంద్రస్వామి భక్తులు. వాళ్ళసలు బాబాను పూజించరు. నేను అమ్మతో, "ఈ విగ్రహం నీ దగ్గరకు ఎలా వచ్చింది?" అని అడిగాను. అందుకు అమ్మ చెప్పింది విని ఆశ్చర్యపోయాను. అమ్మ, "నిన్న సాయంత్రం నేను నిమ్మకాయ ఊరగాయ పెట్టడం కోసం నిమ్మకాయలు కొందామని బజారుకు వెళ్ళాను. ఆ దుకాణం వాడు నాకు 20 రూపాయలు ఇవ్వాల్సి ఉంది. నేను, "ఆ డబ్బులకు బదులు నిమ్మకాయలివ్వు" అన్నాను. అందుకు వాడు, "నిమ్మకాయలు కాదు, ఈ బాబా విగ్రహాన్ని తీసుకువెళ్ళి మీ పెద్దమ్మాయికి ఇవ్వు" అన్నాడు. తప్పనిసరై నేను విగ్రహాన్ని తెచ్చి ఇంట్లో పెట్టాను" అని చెప్పింది. నా మనసులో ఇలా అనుకున్నాను: "నిన్న మందిరం దగ్గర నిమ్మకాయల దుకాణం అతను లేడు. నేను, మావారు మాత్రమే ఉన్నాము. మరి ఇతనికి ఈ బాబా విగ్రహం నాకు నచ్చిందని ఎలా తెలిసింది?" అని. ఏదేమైనా ఆనందంతో బాబా విగ్రహాన్ని మా ఇంటికి తీసుకుని వెళ్ళాను. మా పూజగదిలోకి వచ్చిన మొదటి బాబా విగ్రహం అది. ఆరోజునుంచి ప్రతిక్షణం ఒక లీల జరుగుతోంది. మేమంతా బాబా భక్తులమయ్యాము.

మరో ఆసక్తికర విషయం చెప్పనా!? నేను మరాఠీ అమ్మాయిని. మా తాత, అమ్మమ్మా వాళ్ళు ఆ కాలంలో శిరిడీలో ఉండేవాళ్ళు. కాలక్రమంలో బాబాను మేము మర్చిపోయినా, ఆయన మమ్మల్ని మరువక తిరిగి తమ చెంతకు చేర్చుకున్నారు. అది ఆయన దైవత్వం. ఎక్కడా దొరకని, కనీవినీ ఎరుగని అద్భుతమైన దైవం ఆ సాయినాథుడు. మనం ఎంతో అదృష్టవంతులం, ఆయన పాదాల చెంతకు చేరుకున్నాము.
   
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!

సేకరణ: శ్రీమతి టి.వి. మాధవి.

3 comments:

  1. Om Sai ram my experience is i went to Sai baba mandir on guru poornima day.and prayed for grand children.sai blessed. Us with twins boys.that is Leela of sai

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo