కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 47వ భాగం.
శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.
అనుభవం - 84
సుమారు ఆరు సంవత్సరాల క్రితం నానాసాహెబ్ చందోర్కర్ గారి కుమారుని వివాహం గ్వాలియర్లో జరిగింది. ఆ వివాహసందర్భంగా నేను అక్కడకు వెళ్ళి నేను వివాహం ముందురోజు అక్కడికి చేరుకున్నాను. నేను అక్కడికి వెళ్ళాక శ్రీ చందోర్కర్ నాతో "మనం రేపు ఉదయం శ్రీ చింతామణ్ రావు వైద్య యొక్క గురువును ఆహ్వానించడానికి వెళదాం” అని చెప్పారు. ఆ విధంగానే మరుసటి రోజు ఉదయం నానాసాహెబ్, మాధవరావు దేశపాండే మరియు నేను కలిసి బయలుదేరాము. మొదట రైలులో వెళ్లి తరువాత ఎద్దుల బండిలో దాదాపు 5 మైళ్ళు ప్రయాణించాల్సి ఉంటుందని నానాసాహెబ్ కు తెలిసిన విషయం. స్టేషనులో దిగగానే ఒకే టాంగా ఉంది. ఆ టాంగాను మాట్లాడుకుని మేము అందులో కూర్చొన్నాము. ఎక్కడికి వెళ్ళాలి అని టాంగావాడు అడిగితే మేము విషయం చెప్పాము. “అంతదూరం నా గుఱ్ఱం రాలేదు, మీరు కిందకు దిగండి” అని ఆ టాంగావాడు చెప్పాడు. చేసేదిలేక మేము టాంగా నుండి క్రిందకు దిగాము. స్టేషను నుండి మేము వెళ్ళవలసిన దూరం 5 మైళ్ళు కాక 5 క్రోసులు అయ్యుండి, అందులోను ఏడు మైళ్ళ దారి అధ్వాన్నంగా ఉంటుందని తెలిసింది. ఇంకో టాంగా కోసం ఎంత ప్రయత్నించినా దొరకలేదు. అప్పుడు నేను నానాసాహెబ్తో “మనం తిరిగి వెళదాం, కారణం వివాహం ఈ రోజే కదా” అని చెప్పాను. “ఆయనను ఆహ్వానించమని బాబా ఆజ్ఞ. కనుక ఆయనను ఆహ్వానించకుండా నేను తిరిగి రాను. నేను లేకపోతే వివాహం ఏమీ ఆగిపోదు” అని నానాసాహెబ్ అన్నారు. అంతలో టాంగా దొరకడం వలన మేము బయలుదేరాము. దారి అధ్వాన్నంగా ఉండి గుఱ్ఱం వేగంగా వెళ్ళడానికి వీలుకాలేదు. చివరకు గమ్యస్థానం చేరాము. గురువుగారి దర్శనం అయింది. ఆయన ఊదీని తెప్పించి మా అందరికీ పంచి “ఇది హరిహరాదుల ఊదీ” అని మాతో చెప్పారు. తరువాత ఆయన మాకు సెలవు ఇచ్చారు. తిరిగి వచ్చేటప్పుడు దారి తప్పాము. ఇక రైలు దొరకడం అసాధ్యం అని మాకు అనిపించింది. కాని బాబా కృప వలన మాకు రైలు దొరికింది. అంటే పెళ్ళికి ముందే మేము గ్వాలియర్ కు చేరుకున్నాము.
అనుభవం - 85
శనివారం 28వ తారీఖు ఆఫీసుకు వెళ్ళేటప్పుడు నాకు బాగా జ్వరం వచ్చింది. - నేను మనసులో బాబాను “ఒకవేళ జ్వరం పెరిగేటట్లయితే నన్ను శిరిడికి పిలిపించండి" అని ప్రార్థించాను. ఆఫీసుకు వెళ్ళగానే శిరిడీ నుండి వచ్చిన ఉత్తరం టేబుల్ పైన ఉంది. ఆ ఉత్తరంలో నేను శిరిడీ రావడానికి బాబా అనుమతి ఉంది. ఆ రోజంతా జ్వరం ఉంది. కానీ శిరిడీలో మాత్రం జ్వరం లేదు. నేను ఏ రోజయితే వెళ్లానో ఆ రోజు "బాబాకు జ్వరం వచ్చింది. ఆయన నాలుగు రోజులు అస్వస్థులుగా ఉన్నారు". “సుఖ్ దేవునీ భక్తాంసి, త్యాంచే దుఃఖ్ స్వయం సోషీ” (భక్తులకు సుఖం ప్రసాదించడానికి వారి కష్టాలను తాము తీసుకుంటారు).
అనుభవం - 86
నాలుగైదు సంవత్సరాలు నా ఎడమ కాలు విపరీతంగా నొప్పి పుట్టసాగింది. ఒక ఫర్లాంగు నడవడం కూడా నాకు చాలా కష్టంగా అనిపించసాగింది. అటువంటి పరిస్థితిలో నేను శిరిడీలో ఉన్నప్పుడు బాబా నీమ్ గావ్ కు వెళ్ళారని ఎవరో చెప్పారు. వెంటనే అందరితో కలిసి నేను కూడా బయలుదేరాను. అందరం ఎంతో వడివడిగా నడుస్తూ ఒకటిన్నర మైలు వెళ్ళాము. బాబాతో కలిసి మరలా తిరిగి వచ్చాము. మొత్తం కలిసి మూడు మైళ్ళు నడిచాను, కానీ ఏ మాత్రం ఇబ్బంది కలుగలేదు.
అనుభవం - 87
18-11-1918వ రోజు తెల్లవారుఝామున కాకా మహాజనికి దృష్టాంతం వచ్చింది. ఆ దృష్టాంతంలో "నిద్రపోతున్నావా ఈ రోజు నా ముప్పయ్యవరోజు. లేచి ఆ కార్యక్రమం చేయి” అని బాబా చెప్పారు. కాకా నిద్రలేచి, లెక్కించి చూస్తే సరిగ్గా బాబా మహాసమాధి చెంది ఆ రోజుకి ముప్పై రోజులు. కానీ తనకు ఏం చేయాలో ఆలోచన రాలేదు. తరువాత నన్ను భోజనానికి పిలిచాడు. సాయంత్రం ధబోల్కర్ ప్రధాన్, ఠోసర్ వగైరా మండలిని ఆహ్వానించారు. భోజనం తరువాత భజన జరిగింది. రాత్రంతా ఎంతో ఆనందంగా గడచింది.
తరువాయి భాగం రేపు
సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.
సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.
🕉 sai Ram
ReplyDelete