సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 43వ భాగం.


కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 43వ భాగం.

శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.

అనుభవం - 72

కెప్టెన్ వి.జి. హాటే , బికనేర్ గారి అనుభవాలు

శ్రీ హాటే సాహెబ్ బాబాకు గొప్పభక్తుడు. ఆయన శిరిడీలో కొన్ని రోజులు ఉన్నారు. ఆయన గ్వాలియర్లో ఉన్నప్పుడు, ఆయన వద్దకు సాళూరాం అనే పేరు కలిగిన ఒక మరాఠా గృహస్థు కలవడానికి వచ్చాడు. “తన కుమారుడు ఇంట్లో నుండి తప్పిపోయాడని, అందువలన తనకు, తన భార్యకు చాలా దుఃఖం కలుగుతోందని” చెప్పాడు. శ్రీ హాటేకు బాబాపై పూర్ణశ్రద్ధాభక్తులు ఉండటం వలన, శ్రీహటే తనతో “నీవు శిరిడీ వెళ్ళి బాబా దర్శనం చేసుకో! నీ కుమారుడు తప్పక దొరుకుతాడు” అని చెప్పాడు. అప్పుడు ఆ గృహస్థు వెంటనే “పిల్లవాడి కబురు అందగానే, వెంటనే శిరిడికి మీ దర్శనానికి వస్తాము” అని మొక్కుకున్నాడు. కొన్ని రోజులకు మెసపుటోనియా నుండి పిల్లవాడు వ్రాసిన ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరంలో “నేను ఎవరికీ చెప్పకుండా యుద్ధంలో  పాల్గొనడానికి వచ్చానని, ఇప్పుడు తిరిగి వస్తున్నానని” వ్రాసి ఉంది. ఈ వార్తను ఆ గృహస్థు శ్రీహాటేకు చెప్పగానే “అయితే మీరు వెంటనే బాబా దర్శనానికి వెళ్ళండి" అని శ్రీ హాటే చెప్పారు. కానీ ఆ గృహస్థు అలా చేయకుండా మొదట కుటుంబ సహితంగా , పిల్లావానిని కలవడానికి వెళ్ళాడు. కుమారుడు తిరిగి వచ్చాడు. కానీ ఆ అబ్బాయికి జ్వరం తరచుగా వస్తూ ఎంతో బలహీనుడయ్యాడు. కుమారుని ఆ పరిస్థితిలో చూసి సాళూరాం తనను తీసుకొని మరలా గ్వాలియర్ వచ్చాడు. శ్రీ హాటే వద్దకు మందుల కోసమై  వెళ్ళాడు. అప్పుడు శ్రీహాటే తనతో “నీవు దారి తప్పావు, మొదట నీవు బాబా దర్శనం చేసుకోలేదు. నీ కుమారుని బాబా చరణాల వద్దకు తీసుకు వెళ్ళావంటే తప్పక స్వస్థుడవుతాడు” అని చెప్పాడు. వెంటనే శ్రీ సాళూరాం శిరిడీ వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. శ్రీహాటే వద్దనుండి పరిచయ ఉత్తరం అడిగాడు. అప్పుడు శ్రీహాటే “ఉత్తరం అవసరం లేదు, నేను ఒక వస్తువునిస్తాను. ఆ వస్తువుని బాబాకు సమర్పించు” అని చెప్పి పెట్టెలో నుండి ఒక రూపాయి నాణాన్ని తీసి సాళూరాంకు ఇచ్చాడు. బాబా చేతికి ఆ రూపాయినిచ్చి, మరలా ప్రసాదరూపంగా తీసుకోవాలనేది కెప్టెన్ హాటే గారి ఉద్దేశ్యం. కారణం అది చాలా దుర్లభమైన ప్రసాదం! సాళూరాం శిరిడీకి వెళ్ళాడు. బాబా దర్శనం చేసుకున్న తరువాత ఆ రూపాయిని బాబా చేతిలో పెట్టారు. బాబా ఆ రూపాయిని తిరిగిచ్చి “ఎవరిది వారికిచ్చేయ్” అని చెప్పారు. ఆ విధంగా బాబా, శ్రీ హాటే గారు మనసులో కోరుకున్నట్లుగానే ఆ రూపాయిని తిరిగి ఇచ్చేసారు. సాళూరాం తిరిగి గ్వాలియర్ కు వచ్చేసాడు. సాళూరాం హాటేను కలిసి “సాయి దర్శనం అయింది. పిల్లవాడు ఆరోగ్యంగా ఉన్నాడు” అని ఆనందంగా చెపుతూ, బాబా “మీ రూపాయిని మీకు తిరిగి ఇచ్చేసారు” అని చెప్పాడు. దాంతో శ్రీ హాటే యొక్క ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తాను వెంటనే లేచి బాబా ప్రసాదరూపమైన రూపాయిని చేతిలోకి తీసుకున్నాడు. కానీ వెంటనే బాబా హస్త స్పర్శ పొందిన రూపాయి అదికాదు అని తనకు స్పూర్తి కలిగింది. వెంటనే ఆ రూపాయిని తిరిగి ఇచ్చేసి, తీసుకువెళ్ళమని చెప్పారు. శ్రీ సాళూరాం మనసులో  ఆశ్చర్యపోయాడు. ఆ రూపాయిని తిరిగి తీసుకు వెళ్ళాడు. మరలా మరుసటిరోజు వేరే రూపాయిని తీసుకువచ్చాడు. ఆ రూపాయి చేతిలో పడగానే శ్రీహాటేకు బాబా హస్తస్పర్శ అనుభవమైంది. “తన భార్య యొక్క పొరపాటు వలన రూపాయి మారిపోయింది” అని సాళూరాం చెప్పాడు.

తరువాయి భాగం రేపు

సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.

No comments:

Post a Comment

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo