సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

దేవ్‌బాబా


ప్రముఖ సాయిభక్తుడు హేమాడ్‌పంత్ మనుమడైన దేవ్‌బాబా అలియాస్ అనంత్ ప్రభు వాల్వేకర్, శ్రీసాయిబాబాల మధ్య ఋణానుబంధం చాలా లోతైనది, అర్థం చేసుకో శక్యం కానిది. ఇతని తండ్రి రాజారామ్ కాకా. అతను విఠలునిపట్ల అంకితభావంతో వార్కరీ సంప్రదాయాన్ని అనుసరిస్తుండేవాడు. అతను సింధుదుర్గా జిల్లాలోని వలవాల్ ప్రాంతానికి చెందినవాడు. అందువల్ల వారిని "వలవాల్కర్"లని పిలిచేవారు. వారు సత్‌కుల్ కుదర్ దేశ్‌కర్ వంశీకులు. ఆ కుటుంబీకులు భక్తి తత్పరులు, ధర్మ పరాయణులు.

1916వ సంవత్సరంలో హేమాడ్‌పంత్ కుమార్తె అయిన కృష్ణాబాయి అలియాస్ సీతాబాయితో రాజారామ్ కాకాకు వివాహమైంది. వివాహానంతరం ఆ దంపతులు బొంబాయిలోని గిర్గాఁవ్‌కు వెళ్లారు. అక్కడ రాజారామ్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలో పనిచేసేవాడు. గిర్గాఁవ్ మారుమూల శివారు ప్రాంతమైనందున వాళ్ళు తరువాత దాదర్‌కు మారారు. తరువాత సీతాబాయి మొదటి కాన్పు కోసం బాంద్రాలోని తన పుట్టింటికి వెళ్ళింది. ఆమె ఆ గర్భధారణ సమయంలో ధనుర్వాతంతో అనారోగ్యానికి గురై చాలా బాధపడింది. కన్నబిడ్డ పడుతున్న అవస్థను దభోల్కర్ చూడలేక చాలా ఆందోళనచెంది శిరిడీకి పరుగుతీశాడు. అతడు తన గురువు, దైవమైన సాయిబాబాను దర్శించి, తన కూతురి పరిస్థితి గురించి వివరించాడు. అప్పుడు బాబా, "సుఖప్రసవం అవుతుంది. ఆమె మగబిడ్డకు జన్మనిస్తుంది" అని అన్నారు. బాబా ఇచ్చిన హామీతో దభోల్కర్ తిరిగి వచ్చి, రోజూ సహాయం కోసం బాబాను ప్రార్థిస్తుండేవాడు. మరోవైపు రాజారామ్ విఠలుని, "సంత్ జ్ఞానేశ్వర్ వంటి బిడ్డని ప్రసాదించమ"ని ప్రార్థిస్తుండేవాడు.

అద్భుత లీల

చివరికి 1918, ఏప్రిల్ 13, చైత్రశుద్ధ విదియనాడు ఆమెకు కాన్పు ఘడియలు సమీపించాయి. రాజారామ్, దభోల్కర్ ఇరువురూ ఆత్రుతగా వెలుపల వేచి ఉన్నారు. కొంతసేపటికి కృత్తికా నక్షత్రం, మొదటిపాదంలో సీతాబాయి బాబా చెప్పినట్లే మగబిడ్డకు జన్మనిచ్చింది. తరువాత దభోల్కర్ తన కుమార్తెను, అప్పుడే జన్మించిన బిడ్డని చూడడానికి గది లోపలికి వెళ్లి నిర్ఘాంతపోయాడు. తన కళ్ళముందు ఉన్న దృశ్యాన్ని చూచి తనని తాను నమ్మలేకపోయాడు. తల్లి బిడ్డను దగ్గరకు తీసుకోకుండా దూరంగా ఆ గదిలో ఒక మూలకు విసిరేసింది. బిడ్డ హాయిగా ఆ మూలాన నిద్రపోతున్నాడు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, బిడ్డ తలభాగం చుట్టూ తేజస్సుతో కూడిన కాంతివలయం ఉంది. కేవలం తలభాగమే కాదు, శరీరం చుట్టూ ప్రకాశవంతంగా ఉంది. తల్లి బిడ్డని తాకేందుకు భయపడింది. ఎంతో ఆవశ్యకమైన తల్లి ప్రేమను, పోషణను బిడ్డకందించడానికి నిరాకరించింది. తన కూతురి వింత ప్రవర్తన దభోల్కర్‌కి చాలా ఆందోళన కలిగించింది. వెంటనే అతను బిడ్డను ఎత్తుకొని ఆలస్యం చేయకుండా శిరిడీకి ప్రయాణమయ్యాడు. శిరిడీ చేరుకున్నాక అతడు నేరుగా ద్వారకామాయికి వెళ్లి, సాయిబాబా పాదాల చెంత బిడ్డని పెట్టాడు. తరువాత అతను బాబాతో తన కూతురి ప్రవర్తన గురించి, జరిగిన సంఘటన గురించి అన్నీ వివరంగా చెప్పాడు. ఇంతలో సాయిబాబా బిడ్డని ఎత్తుకొని తన ఒడిలో పెట్టుకొని మృదువుగా తమ చేతులతో తట్టారు. తర్వాత ఆయన తమ చేతి బొటనవ్రేలును బిడ్డ నోటిలో పెట్టారు. బిడ్డ ఆయన వేలిని చప్పరిస్తుంటే, ఆశ్చర్యంగా ఆయన బొటనవ్రేలునుండి పాలు రాసాగాయి. అత్యంత అద్భుతమైన ఆ దృశ్యం చూసి భక్తులంతా ఆశ్చర్యపోయారు. ఒకప్పుడు బాబా గంగ, యమునా జలాలను తమ పాదాల నుండి ప్రవహింపజేశారు. ఇప్పుడు తమ బొటనవ్రేలుతో చిన్నబిడ్డకు పాలు పట్టారు. బాబా చర్యలు అద్భుతం! అమోఘం!

బాబా అనుగ్రహం దేవ్‌పై ఎప్పుడూ ఉండేది. అతని ప్రాథమిక విద్యాభ్యాసం మరాఠీ భాషలో సాగింది. తరువాత అతను విల్సన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చేరాడు. అయితే అతడు పాఠశాలకు నిత్యం హాజరయ్యేవాడు కాదు. అతడు సమీపంలోవున్న స్వామి సమర్థ మఠానికి వెళ్లి ఎక్కువ సమయం ధ్యానంలో గడిపేవాడు. స్వామి సమర్థ అనుగ్రహం కూడా అతనిపై ఉండేది.

దేవ్‌బాబాకి యుక్తవయస్సు వచ్చాక, కుర్లా మున్సిపల్ కిర్డే కేంద్రంలో శారీరక విద్యాబోధకునిగా చేరాడు. అతడు తన విద్యార్థులను ఎంతగానో ఇష్టపడేవాడు. అందరినీ ప్రేమతో చూసుకునేవాడు. కానీ విద్యార్థులు రెండు కులాలకు చెందినవారు. వాళ్లలో ఒక కులంవారు దేవ్‌బాబా మరో కులం వారిపట్ల అభిమానంతో ఉంటున్నారని భావించేవారు. దాంతో వాళ్ళు వెళ్లి ఇతర టీచర్ల వద్ద దేవ్‌బాబాకి వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. వాళ్లలో ఒక అధ్యాపకుడు అదే అవకాశంగా తీసుకొని దేవ్‌బాబాకు సరైన బుద్ధి చెప్పాలని అనుకున్నాడు. ఈ విషయం గురించి కొందరు శ్రేయోభిలాషులైన ఉపాధ్యాయులు దేవ్‌బాబాతో చెప్పి, కాస్త జాగ్రత్త తీసుకోమని చెప్పారు. దేవ్‌బాబా, "ఓహో అలాగా! కానీ అతను రేపు పాఠశాలకు రాడు" అన్నాడు. అదేరోజు సాయంత్రం ఆ ఉపాధ్యాయుడు ఈతకొట్టడానికి వెళ్లి, నీట మునిగిపోయి చనిపోయాడు. ఈ సంఘటనతో సాయిబాబా తనకు సిద్ధులను ఒసగారని దేవ్‌బాబా గ్రహించాడు. అంతేకాదు, ఆ సంఘటన అతని మనస్సుపై తీవ్రప్రభావాన్ని చూపింది. అతడు ఇకపై ఎవరికోసమో పనిచేస్తూ సమయాన్ని వృధా చేసుకోకుండా తన పూర్తి జీవితాన్ని భగవంతుని సేవ చేయడానికి అంకితం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇక అప్పటినుండి అతడు అనేక తీర్థయాత్రలు చేసి, కొంతకాలం హిమాలయాలలో నివాసమున్నాడు. అక్కడే హఠయోగం నేర్చుకొని ఆధ్యాత్మిక ప్రగతి సాధించాడు.

సచ్చరిత్ర పూర్తిచేసిన దేవ్‌బాబాకు శ్రీసాయిబాబా ఆశీస్సులు

దేవ్‌బాబా తరచూ శ్రీసాయి సచ్చరిత్ర పారాయణ చేయడానికి భివ్‌పురి సాయిమందిరానికి వెళ్తుండేవాడు. ఒకసారి అతను మధ్యాహ్న ఆరతి సమయానికి ముందు సచ్చరిత్ర పారాయణ పూర్తి చేశాడు. ఆ సందర్భంగా ఆరతి తరువాత గొప్ప విందు ఏర్పాటు చేశారు. ఆరోజు అతని పారాయణ పూర్తవుతుందని, విందు ఉందని గ్రామస్తులకు తెలుసు. అందుకే విందులో పాల్గొని సాయి ప్రసాదం స్వీకరించడానికి అందరూ ఆరతి సమయానికి మందిరం వద్ద సమావేశమయ్యారు. మధ్యాహ్నం 12 గంటలు కాగానే ఆరతి ప్రారంభమైంది. భక్తులందరూ భక్తిపారవశ్యంతో ఆరతి పాడుతూ తన్మయులై ఉన్నారు. ఆ సమయంలో దేవ్‌బాబాకు చాలా శక్తివంతమైన ఆధ్యాత్మిక ఉనికి అనుభూతమై కళ్ళు తెరిచి చుట్టూ చూశాడు. గొర్రెల కాపరి వలె కనిపించే ఒక పొడవాటి వ్యక్తి అతని ప్రక్కన నిలబడి ఉన్నాడు. అతను గ్రామస్తులందరికంటే చాలా భిన్నంగా కనిపిస్తున్నాడు. అతనిలో ఏదో తెలియని దైవిక తేజస్సు వ్యక్తమవుతోంది. అంతలో మంత్రపుష్పం పూర్తయింది. అందరూ తమకు ఇవ్వబడిన పువ్వులను బాబాకు అర్పించడానికి ముందుకు వెళ్లారు. ఆ గొర్రెల కాపరి మాత్రం తానున్న చోటనే నిలబడి, నెమ్మదిగా పువ్వులను తన పాదాల మీద వేసుకున్నాడు. దేవ్‌బాబా అది చూసి, ‘తన పారాయణ పూర్తయిన రోజున సాక్షాత్తూ బాబానే ఆరతిలో పాల్గొని తనని ఆశీర్వదించార’ని భావించి, భక్తితో ఆయన ముందు సాష్టాంగపడి నమస్కారం చేశాడు. బాబా మన గొర్రెల కాపరి, మనం ఆయన గొర్రెలం. జీవితమనే పచ్చటి పచ్చికబయళ్ళలో మనల్ని నడిపిస్తూ మన బాగోగులు చూసుకుంటారాయన.

1945వ సంవత్సరంలో అతని తల్లి తీవ్ర అనారోగ్యానికి గురైంది. త్వరలోనే ఆమె మరణించనుందని అతనికి తెలిసి తల్లిని చూడటానికి వచ్చి, చివరిరోజులలో జపం చేస్తూ ఉండమని తన తల్లికి ఒక మంత్రాన్ని చెప్పాడు. తరువాత అతడు శిరిడీ వెళ్లి సమాధిమందిరంలో కూర్చొని శ్రీసాయిసచ్చరిత్ర పారాయణ మొదలుపెట్టాడు. పారాయణ మధ్యలో ఉండగా తన తల్లి పరిస్థితి విషమించిందని టెలిగ్రామ్ వచ్చింది. అతను, 'ఆమెను చూడటానికి వెళ్ళాలా, వద్దా?' అని బాబాను అడిగాడు. బాబా నుండి 'వెళ్ళమ'ని జవాబు వచ్చింది. అయితే, "సమయం చాలా తక్కువగా ఉండి, దూరం ఎక్కువగా ఉన్నప్పుడు, తన తల్లిని సందర్శించమని బాబా ఎందుకు చెప్పారు?" అని అతను ఆలోచనలోపడ్డాడు. మరుక్షణంలో బాబా అతని ముందు నిలబడి ధైర్యాన్నిచ్చారు. సూక్ష్మరూపాన ఆయన తనతోపాటు ఒక గుర్రాన్ని తెచ్చి, అతనిని ఎక్కించుకొని ప్రయాణమయ్యారు. క్షణాలలో వారిద్దరూ దాదరులోని తన ఇంటికి చేరుకున్నారు. అతడు తన తల్లిని చూసి ఆమెతో, "నీకు ప్రశాంతమైన మరణం లభిస్తుంది. సాయిబాబా స్వయంగా నిన్ను గమ్యం చేర్చేందుకు ఇక్కడ ఉన్నారు" అని ధైర్యాన్ని చేకూర్చాడు. తరువాత ఆమె ప్రశాంతమైన మరణాన్ని పొందింది. తరువాత అతడు తిరిగి శిరిడీ వచ్చి తన పారాయణ పూర్తి చేశాడు. అతను తన తల్లి మరణించిందని, ఆ చివరి క్షణాల్లో తాను ఆమె ప్రక్కనే ఉన్నానని చెప్పినప్పుడు భక్తులంతా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే, ఆ సమయంలో అతను ఎక్కడికీ కదలకుండా పారాయణ చేస్తూ ఉండటం వాళ్లంతా చూశారు.

1952లో దేవ్‌బాబా కిషోరీబాయిని వివాహం చేసుకున్నాడు. ఇరువురూ సాయిబాబాని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తూ ఉండేవారు. కొద్దిరోజుల తరువాత ఆ దంపతులు వారి పూర్వీకుల నివాసమైన అంబర్‌నాథ్‌కి వెళ్లి అక్కడే నివాసముండసాగారు. 1967లో మొదటి అంతస్తులో ఒక మందిరము నిర్మించి, సప్తలోహాలతో తయారుచేసిన సాయిబాబా విగ్రహాన్ని స్థాపించి, ప్రాణప్రతిష్ఠ చేశారు.

దేవ్‌బాబా వైపు చాలామంది ఆకర్షింపబడ్డారు. వారందరినీ అతడు తన ఇష్టదైవమైన సాయిబాబా మార్గంలో నడిపించాడు. అతడు ముందుగానే తన బంధువులతో 'తాను సమాధి చెందాక మతపరమైన ఆచారాలు, వేడుకలు నిర్వహించవద్ద'ని చెప్పి, 1994, మే 25, గురువారం, వైశాఖ ఏకాదశిరోజున సమాధి చెందాడు. ప్రస్తుతం దేవ్‌బాబా కుమారుడు డాక్టర్ భానుదాస్ ముంబైలో నివసిస్తూ తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.

సాయిభక్తుల కోసం దేవ్‌బాబా గారి అంబర్‌నాథ్ సాయిమందిరం యొక్క వివరాలను క్రింద ఇస్తున్నాము:


Shri Sai Baba Mandir,
C/o.Shri Sai Seva Sansthan (R)
451/452, Sai Section, Suryodaya Society,
Ambernath East-421 501,
Thane District,
Maharashtra,
India.

సమాప్తం

భివ్‌పురిలోని ప్రప్రథమ సాయిమందిరం గురించి చదవాలనుకునేవారికోసం క్రింద లింక్స్ ఇస్తున్నాను, గమనించగలరు.


Source: Shri Sai Satcharitra, Chapter 4, Dev Babanche Charitra Published on 26th may, 1996 and Baba’s Rinanubandh by Vinny Chitluri. Photo Courtesy: Smt.Shreya Nagaraj, Pune)
రెఫ్: డాక్టర్ సాయినాథ్ గవాంకర్.
source: Baba’s Divine Symphany by Vinny Chitluri.

6 comments:

  1. very very nice vama dev history.baba feed that baby.is very nice leela.it is intersing story

    ReplyDelete
  2. Akilada koti bramhanda nayaka yogiraja parabramha Sri sachidanadha sadguru Sainadha maharaj ki jai🙇🙇🙇🙇🙇

    ReplyDelete
  3. ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete
  4. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤😀🌼🤗🌹😃🌺🥰🌸

    ReplyDelete
  5. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo