సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 238వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా ఎప్పుడూ తల్లి తాబేలులా తమ దృష్టి మనపై ఉంచుతారు
  2. అందమైన ఇంటిని అనుగ్రహించిన బాబా

బాబా ఎప్పుడూ తల్లి తాబేలులా తమ దృష్టి మనపై ఉంచుతారు

ఓం సాయిరామ్! నా పేరు అర్చన. నేను హైదరాబాదు నివాసిని. ఇదివరకు నేను చాలా అనుభవాలను మీతో పంచుకున్నాను. ఇప్పుడు 2019, నవంబరు 14న బాబా నా మీద కురిపించిన ప్రేమామృతాన్ని మీతో పంచుకుంటాను.

నేను సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని. బాబా దయవల్ల ఇటీవల నాకు ఒక ప్రాజెక్టు వచ్చింది. పని ఎక్కువగా ఉంటున్నప్పటికీ బాబా ఆశీస్సులతో పూర్తిచేయగలుగుతున్నాను. ఒకరోజు మా మేనేజరు, "డిసెంబరు లోపు ఒక కోర్సు పూర్తి చేసి, పరీక్ష వ్రాసి, అందులో పాసవ్వాలి" అని చెప్పారు. ఆ పరీక్షను 2019, నవంబరు 7న షెడ్యూల్ చేశారు. ఆ పరీక్ష వ్రాసేందుకు కొంత సహాయం కావాలి. కానీ సరిగ్గా ఆరోజు వచ్చేసరికి నా ప్రాజెక్టులో ఉన్న అతను సెలవులో ఉన్నాడు. దాంతో ఎలా అనుకుంటూ ఉండగా, ఏదో టెక్నికల్ సమస్య వచ్చి ఆరోజు పరీక్షను రద్దు చేసి నవంబరు 14న షెడ్యూల్ చేశారు. ఇదివరకు ఇలాంటి పరిస్థితులు ఎదురైతే బాగా టెన్షన్ పడేదాన్ని. కానీ బాబా ప్రేమను చవిచూశాక అంతా ఆయనే చూసుకుంటారు అన్న భరోసాతో ఉంటున్నాను. నవంబరు 14న నేను మహాపారాయణ పూర్తిచేసి బాబా గుడికి వెళ్ళాను. అక్కడ బాబా దుస్తులు వేలం వేస్తున్నారు. నాకు ఒక శాలువా తీసుకోవాలని అనిపించింది. ఆ గుడిలో ఎవరో పెట్టిన బాబా విగ్రహాలు చాలా ఉంటాయి. మనము అడిగితే ఉచితంగానే ఇస్తారు. అదివరకు నేను ఒక విగ్రహం తెచ్చుకొని రోజూ ఆఫీసుకి తీసుకెళ్తూ ఉండేదాన్ని. ఆ బాబా విగ్రహం వచ్చాక నా ఉద్యోగంలో చాలా మంచి మార్పులు జరిగాయి. ఆరోజు నేను కాసేపు కూర్చొని సాయిలీలామృతంలోని ఒక అధ్యాయం పారాయణ చేసి, వందరూపాయలు పెట్టి ఒక శాలువా తీసుకున్నాను. తరువాత ఒక బాబా విగ్రహం కూడా తీసుకున్నాను. (నిజానికి కొన్ని రోజుల ముందే ఆ విగ్రహం బాగా నచ్చి, తీసుకుందామని అనుకోని కూడా, 'నా దగ్గర బాబా విగ్రహాలు ఉన్నాయి కదా! మళ్ళీ ఇంకోటి తీసుకోవడం ఎందుకులే' అని ఊరుకున్నాను.) విగ్రహం చేతిలోకి తీసుకొని చూస్తే, ఆశ్చర్యం! రాగి, ఇత్తడి కలిపి తయారు చేయబడిన ఉంగరం ఒకటి బాబా మెడలో ఉంది. ఆ ఉంగరం సరిగ్గా నా వేలికి సరిపోవడంతో నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది. తరువాత కొద్దిసేపట్లో మా చెల్లి వద్దనుండి ఒక బాబా వీడియో వచ్చింది. ఆ వీడియోలో బాబాకి ఊదీతో అభిషేకం చేసినట్లుగా ఉంది. ఇన్ని శుభసంకేతాలతో 'ఏదో మంచి జరుగబోతోంది' అని నాకనిపించింది. తరువాత నేను ఆఫీసుకు వెళ్తుంటే చాలా చోట్ల వివిధరూపాల్లో బాబా దర్శనమిచ్చారు. ఆఫీసుకు వెళ్ళాక నా సహోద్యోగి సహాయంతో నేను పరీక్ష విజయవంతంగా పూర్తిచేశాను.

మరో విషయం, నేను మా 10ఏళ్ల బాబుతో సచ్చరిత్ర పారాయణ చేయించాలని అనుకుంటుండేదాన్ని. అయితే తనకి ఇంగ్లీష్ తప్ప తెలుగు చదవడం రాదు. అందువలన ఇంగ్లీషు సాయిసచ్చరిత్ర దొరికితే బాగుంటుంది అనుకున్నాను. ఆరోజు బాబా గుడిలో ఇంగ్లీషు సాయిసచ్చరిత్ర కనిపించింది. నాకు చాలా సంతోషంగా అనిపించింది. బాబా ప్రేమ ఎప్పుడూ మనపై కురుస్తూనే ఉంటుంది. ఆయన మన ప్రతి అవసరాన్నీ తీరుస్తూనే ఉంటారు. బాబా ఎప్పుడూ తల్లి తాబేలులా తమ దృష్టి నాపై ఉంచి సదా నన్ను కాపాడుతూనే ఉన్నారు. "థాంక్యూ! థాంక్యూ సో మచ్ బాబా!"

అందమైన ఇంటిని అనుగ్రహించిన బాబా 

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు ఇటీవల తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు. 

నేను సాయిభక్తురాలిని. కేవలం బాబా అనుగ్రహంతో మా బడ్జెట్లో, చక్కని లొకేషన్లో, అందమైన ఇల్లు మాకు ఎలా లభించిందో తెలిపే అనుభవం ఇది. సాయిభక్తులు తమకు బాబా ప్రసాదించిన అనుభవాలను పంచుకునేందుకు చక్కని వేదికను అందిస్తున్న బ్లాగ్ నిర్వాహకులకు నా కృతజ్ఞతలు.

గత రెండు సంవత్సరాలుగా మేము స్వంత ఇల్లు కొనుక్కోవాలని ప్రయత్నిస్తున్నాము. కానీ, ప్రతిసారీ ఇంటి ధర మా బడ్జెట్ కంటే  మించడం వల్లనో లేదా ఇల్లు నచ్చకో లేదా పరిసరాలు నచ్చకో ఇల్లు కొనడంలో విఫలమవుతూనే ఉన్నాము. అప్పుడు నేను 'నవ గురువార వ్రతం' ప్రారంభించాను. వ్రతం ఆఖరిరోజున బాబా అనుగ్రహంతో చక్కని ఇల్లు కొన్నాము. ఇక్కడ నేను మీతో ఒక విషయం పంచుకోవాలనుకుంటున్నాను. ఇంటిని కొనుగోలు చేసే ప్రయత్నంలో, మేము ఆ ఇంటి గురించి మాట్లాడటానికి వెళ్ళేముందు నేను, "ప్లీజ్ బాబా! ఈ డీల్ జరిగేటప్పుడు మీరు మాతో ఉండండి" అని బాబాను ప్రార్థించాను. నా జీవితంలోని అన్ని విషయాలూ ఆయన అనుగ్రహంతోనే జరిగాయి. అందుకే ఇప్పుడు కూడా బాబా మాతో ఉండాలని కోరుకున్నాను. మేము ఆ ఇంట్లోకి వెళ్ళగానే ఎదురుగా గోడకు వ్రేలాడుతున్న పెద్ద బాబా ఫోటో కనిపించింది. బాబా మాతోనే ఉన్నారని ఎంతో సంతోషించాను. తర్వాత రిజిస్ట్రేషన్ సమయంలో కూడా బాబాను మాతో ఉండమని ప్రార్థించాను. ఆశ్చర్యకరంగా రిజిస్ట్రేషన్ పేపర్లు తయారుచేస్తున్న వ్యక్తి ఆఫీసు పేరు 'శ్రీసాయి అసోసియేట్స్'. వాళ్ల పూజామందిరంలో సాయిబాబా ఫోటో ఉంది. ఇంటిని కొనుగోలు చేసే ప్రక్రియలో అంతటా బాబా మాతోనే ఉండడం గొప్ప అనుభవం. అంతేకాదు, ఆ ఇల్లు దొరకడం అంత సులభమేమీ కాదు, కానీ బాబా అనుగ్రహం వల్ల చివరికి మేము ఆ ఇంటిని కొనుగోలు చేయగలిగాము. "మాపై ఇంతటి ప్రేమను కురిపిస్తున్నందుకు మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు బాబా! ఎల్లప్పుడూ మీరు మాతో ఉండండి బాబా!". 

1 comment:

  1. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీసాయి ఆరోగ్య క్షేమదాయ నమః'🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo