సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

గంట వ్యవధిలో బాబా తీర్చిన మూడు కోరికలు




నేను ఒక సాయిభక్తురాలిని. 2018లో మా ఎనిమిదినెలల బాబుని తీసుకుని నేను, మావారు, మా అమ్మ శిరిడీ వెళ్ళాము. అదే మొదటిసారి మేము బాబుని బాబా దర్శనానికి తీసుకుని వెళ్లడం. బాబా దర్శనం చేసుకున్న తరువాత నేను మూడు విషయాలు బాబాను అడిగాను. అవి,

1. ఊదీ లేదా ప్రసాదం.
2. నా బిడ్డను జాగ్రత్తగా చూసుకుంటానని ప్రమాణం.
3. మా తలపై చేతులు పెట్టి అశీర్వచనం.

దర్శనానంతరం మేము బయటకు వస్తుండగా ద్వారం వద్దనున్న సెక్యూరిటీ గార్డు మేమేమీ అడక్కుండానే తనంత తానుగా నా చేతిలో బాబా ప్రసాదం ప్యాకెట్ పెట్టాడు. అలా బాబా నా మొదటి కోరికను నెరవేర్చారు. ఎంతో సంతోషంగా బయటకు వచ్చాను. తర్వాత నేను హోటల్ వైపు నడుస్తుండగా ఒక అమ్మాయి ఎదురుపడితే తనకి నేను పదిరూపాయలు ఇచ్చాను. తను ఆ డబ్బులు తీసుకుని, నా చేతిలో ఒక బాబా ఫోటో పెట్టింది. చూస్తే ఆశ్చర్యం! ఆ ఫోటోపై "నేను నా భక్తుల బాగోగులు చూసుకుంటానని వాగ్దానం చేస్తున్నాను" అని వ్రాసి ఉంది. బాబా చూపిన ప్రేమకి నేను ఆశ్చర్యానందాలకు లోనయ్యాను.

ఇక మూడవ కోరిక విషయానికి వస్తే, మేము ద్వారకామాయి ముందు నిల్చుని వుండగా ఎక్కడినుండి వచ్చిందో తెలియదుగాని ఒక  వృద్ధమహిళ నేరుగా నా దగ్గరకు వచ్చింది. అప్పుడు మా బాబు నా చేతుల్లోనే ఉన్నాడు. "నా చేతుల్లోనుండి బాబా ఫోటోని నీ బిడ్డ తీసుకున్నాడు" అంటూ, "నాకు ఏ డబ్బులూ అవసరంలేదు" అని చెప్తూ, తన చేతులు నా తలపైన, బాబు తలపైన పెట్టి ఆశీర్వదించి, ప్రక్కనే ఉన్న నా భర్తనుగాని, మా అమ్మనుగాని పట్టించుకోకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయిన తరువాతగానీ నాకర్థం కాలేదు, నేనడిగినట్లుగా బాబా వచ్చి తమ స్వహస్తాలతో నన్ను, నా బిడ్డని ఆశీర్వదించారని. అది అర్థమయ్యాక నా కళ్ళు ఆనందభాష్పాలతో నిండిపోయాయి. అది చూసి మావాళ్లు ఏమి జరిగిందని అడిగితే, నేను బాబాని అడిగిన మూడు కోరికల గురించి చెప్పాను. అది విని వాళ్ళు కూడా ఆనందంలో మునిగిపోయారు. ఈవిధంగా నేను అడిగిన మూడు కోరికలను బాబా ఒక గంట వ్యవధిలోనే నెరవేర్చారు. ఆ అవధులు లేని ఆనందంతో ఇల్లు చేరుకున్నాము.

శిరిడీ సమాధిమందిరంలో తన భక్తురాలిని సాయిబాబా రక్షించిన లీల.


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

కమల్ అమ్మల అనే 60 ఏళ్ళ బాబా భక్తురాలు ముంబయిలోని మతుంగలో నివసిస్తూ ఉండేది. ఆమె ఒక తమిళియన్. తనకి తమిళం తప్ప వేరే భాష ఏదీ రాదు. 1944వ సంవత్సరంలో ఆమెకున్న ఒక్కగానొక్క కొడుక్కి ఆర్మీలో ఉద్యోగం వచ్చింది. దానితో ఆమె ఆర్మీలో తన బిడ్డకి ఏం జరుగుతుందో ఏమిటోనన్న ఆందోళనలో పడింది. ఆ విషయమై బాబాను శరణుపొందాలని నిశ్చయించుకొని, రైల్వేస్టేషన్‌కి వెళ్లి బుకింగ్ కౌంటర్‌లో శిరిడీకి ఒక టికెట్ ఇవ్వమని అడిగింది. కనీసం ట్రైన్ శిరిడీ వరకు వెళ్ళదన్న సంగతి కూడా ఆమెకు తెలియదు. అయితే బుకింగ్ కౌంటరులో ఉన్న క్లర్క్ బాబా భక్తుడు. అతడు కోపర్గాఁవ్ వరకు టికెట్టు ఇచ్చి, అక్కడ దిగి శిరిడీ వెళ్లాలని ఆమెకు చెప్పాడు. మొత్తానికి ఎలాగో తోటి యాత్రికులతో కలిసి శిరిడీ చేరుకొని, సమాధిమందిరానికి దగ్గరలో ఒక గది తీసుకుంది.

రాత్రి 8 గంటల సమయంలో ఆమె (అప్పట్లో)సమాధి వెనుకవైపు ఉన్న మెట్లకు హద్దుగోడ ఏమీ లేదన్న సంగతి తెలియక ఆ చీకటిలో జారి బావి వద్ద పడిపోయింది. చాలా గాయాలయ్యాయి. ఆమె మోకాలికి, నుదుటికి తగిలిన గాయాలవలన రక్తం కారసాగింది. ఎలాగో మొత్తానికి అతికష్టం మీద అక్కడనుండి బయటకు వచ్చిన తర్వాత మిస్టర్ బాల్‌‌వల్లి అనే అతడు ఎదురుపడ్డాడు. అతనితో తను పడిపోయిన విషయాన్ని, తనకి తగిలిన గాయాల గురించి చెప్పింది. అప్పుడతను, "మిమ్మల్ని నేను డాక్టర్ వద్దకు తీసుకుని పోతాను, పదండమ్మా" అని అన్నాడు. అందుకు ఆమె నిరాకరిస్తూ ఆసక్తికరమైన విషయాన్నిలా చెప్పింది: "నేను పడిపోయినప్పుడు నా ప్రక్కగా ఒక వ్యక్తి నిలుచుని ఉండటం చూశాను. తల పైకెత్తి చూస్తే ఆయన మరెవరో కాదు, సాక్షాత్తూ 'శ్రీసాయిబాబా'యే! ఆయన తన చేతిలో లాంతరు పట్టుకుని నిలబడి ఉన్నారు. ఆయన తమ కోమలమైన హస్తాలతో గాయపడ్డ నా శరీరభాగాలపై మృదువుగా స్పృశిస్తూ, "రేపటికల్లా నీకు నయమైపోతుంది. ఇంకేవిధమైన చికిత్సా అవసరం లేదు" అని అభయమిచ్చారు" అని. తర్వాత ఆమె తన గదికి చేరుకుంది. అంతలా గాయాలైనప్పటికీ ఎటువంటి నొప్పులూ ఆమెను బాధించకపోవడంతో ప్రశాంతంగా నిద్రపోయింది. మధ్యరాత్రిలో అమెకొక కల వచ్చింది. ఆ కలలో బాబా కన్పించి, "నేను నీ బిడ్డని కూడా క్షేమంగా చూసుకుంటాను. నువ్వేమీ తన రక్షణ విషయంలో దిగులుపడాల్సిన అవసరంలేదు" అని అభయమిచ్చారు.

మూలం: saileelas.org (సాయిసుధ, వాల్యూమ్ - 5, జూన్ 1945).

బాబా ప్రణాళికలు ప్రత్యేకమైనవి




నేను ఒక సాయి భక్తురాలిని. బ్లాగులో భక్తుల అనుభవాల ద్వారా "తన పాదాలను ఆశ్రయించిన భక్తులను బాబా ఎలా కంటికి రెప్పలా జాగ్రత్తగా చూసుకుంటారో" అని తెలుసుకుంటూ ఉంటే బాబాపై నాకున్న నమ్మకం ఇంకా ఇంకా రెట్టింపు అవుతూ ఉంది. ముందుగా నా అనుభవాన్ని ఇలా సాయిబంధువులతో పంచుకొనే అవకాశం ఇచ్చినందుకు మీకు నా కృతజ్ఞతలు బాబా! నేనేమైనా తప్పులు వ్రాస్తే నన్ను మన్నించండి. నన్నెప్పుడూ మీ పాదాల చెంత ఒక ధూళి కణంలా ఉండనివ్వండి. ఇప్పటివరకు బాబా నాకు లెక్కలేనన్ని అనుభవాలు ఇచ్చారు. వాటిలో బాబా నా భర్తకి ఉద్యోగం ఎలా ఇప్పించారోనన్న అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను.

మేము 15 సంవత్సరాలు యు.ఎస్.ఏ.లో ఉన్న తర్వాత ఇండియాకి శాశ్వతంగా వచ్చేయాలని నిశ్చయించుకొని ముందుగా యు.ఎస్.ఏ.లో ఉన్న మా ఇంటిని అమ్మి, అక్కడ అంతా సెటిల్ చేసుకొని ఇండియా వచ్చేలా ప్రణాళిక చేసుకున్నాం. ఏదైనా పెద్దనిర్ణయం తీసుకొనే ముందు బాబా ముందు చీటీలు వేసి బాబా సలహా తీసుకోవడం నాకలవాటు. ఈ విషయంలో కూడా బాబా సలహా తీసుకోదలచి మేము బాబా గుడికి వెళ్లి, అక్కడున్న ఒక చిన్న పాపతో ఒక చీటీ తియ్యమని చెప్పాము. తను తీసిన చీటీలో, "ఇల్లు అద్దెకి ఇవ్వండ"ని ఉంది. ఆ సమయంలో బాబా ఎందుకు అలా చెప్పారో మాకు అర్థం కాలేదు. కానీ ఏదేమైనా బాబా మా క్షేమం కోసమే చెప్తారని, అది ఆయన ఆజ్ఞగా భావించి ఇంటిని అమ్మాలన్న మా ఆలోచన విరమించుకున్నాం. బాబా కృపతో మాఇంట్లో అద్దెకి మంచివాళ్ళు చేరారు. తరువాత మేము ఇండియాకి వచ్చేసాం.

యు.ఎస్.ఏ. సిటిజన్స్ ఐన మేము ఇండియాలో మా జీవితం బాగుంటుందన్న ఉద్దేశ్యంతో ఇండియాకి వచ్చాము. కానీ ఇక్కడికి వచ్చాక నా భర్తకి యు.ఎస్.ఏ.లో పనిచేసిన అనుభవంతో ఇక్కడ ఉద్యోగం దొరకడం చాలా కష్టమయ్యింది. 20 సంవత్సరాల అనుభవం ఉన్నప్పటికీ ఎంతగా ప్రయత్నించినా కనీసం ఇంటర్వ్యూకి పిలుపు కూడా వచ్చేది కాదు. యు.ఎస్.ఏ.లో తనకి నైపుణ్యమున్న సాఫ్ట్‌‌వేర్ ఏదీ ఇండియాలో వాడుకలో లేదు. అందువలన తన నైపుణ్యం మెరుగు పరుచుకునేందుకు మావారు కొత్త కోర్స్‌‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. 9 నెలలపాటు కోర్స్ నేర్చుకుంటూ ఇంకోపక్క ఉద్యోగ ప్రయత్నాలు తీవ్రంగా చేసారు. అయినా ఉద్యోగం మాత్రం అందని ద్రాక్షలాగానే ఉండేది మా వారికి. ఉద్యోగం లేకపోయినా యు.ఎస్.ఏ. నుండి మాకు వచ్చే ఇంటి అద్దె డబ్బులు మా నెలవారీ ఖర్చులకి సరిపోవడమే కాకుండా కొద్ది మొత్తం ఆదా కూడా చేసుకోగలిగే వాళ్ళం. నిజంగా ఇది బాబా దయే. బాబా మా ఇంటిని అద్దెకు ఇవ్వమని చెప్పినందువల్లే మేము అటువంటి పరిస్థితులలో కూడా కష్టపడకుండా సంతోషంగా ఉండగలిగాం.

2 సంవత్సరాల తరువాత కోర్స్ పూర్తైన వెంటనే మరలా మావారు ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈసారి ఇంటర్వ్యూకి కాల్స్ వస్తున్నా, కోర్స్‌‌కి సంబంధించిన సర్టిఫికేట్ అడిగేవాళ్ళు. అందువలన సమస్య అలానే ఉండేది. 2 నెలల తరువాత సర్టిఫికేట్ రావడంతో ఇంటర్వ్యూలకి వెళ్ళేవారు. 4 నెలల తరువాత మేము కలలో కూడా ఊహించని విధంగా మేము ఉండే చోటుకి దగ్గరలో మంచి కంపెనీలో మావారికి ఉద్యోగం దొరికింది. తన భక్తులకోసం బాబా వేసే ప్రణాళికలు చాలా ప్రత్యేకమైనవి. అవి మన ప్రణాళికలకు పూర్తి భిన్నంగా ఉంటాయి. కొత్త కోర్స్ నేర్చుకొనేలా పరిస్థితులు కల్పించి మావారి నైపుణ్యానికి ఇంకా మెరుగులు దిద్ది, తద్వారా తనని మంచి సంస్థలో, మంచి స్థాయిలో ఉండేలా చేసారు బాబా. అది మేము కలలో కూడా ఉహించనిది. శ్రద్ధ, సబూరీ అని బాబా మనకు నేర్పిన నియమాలు విజయం వైపు మనల్ని చేరుస్తాయి. కొన్నిసార్లు మన విశ్వాసాన్ని, సహనాన్ని పరీక్షించడానికి కూడా బాబా ఎన్నో కష్టతరమైన పరిస్థితులు కల్పిస్తారు. తద్వారా మనల్ని ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుతారు.

"బాబా! మీకు సదా నా కృతజ్ఞతలు. ఈరోజు నేను ఏదైతే అనుభవిస్తున్నానో అది నీవు నాకు కానుకగా ఇచ్చిందే. నీ భక్తులందరినీ ఇలానే జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళని సరైన మార్గంలో నడిపించండి బాబా!"

హఠాత్తుగా స్టీరింగ్ తిప్పి పెద్ద ప్రమాదం నుండి కాపాడిన బాబా


నా పేరు సౌమ్య. మాది విజయవాడ. నేను మహాపారాయణ గ్రూపు MP - 136లో సభ్యురాలిని. 17 సంవత్సరాలుగా బాబా నా జీవితంలో భాగమైపోయారు.‌ ‌ఆయనతో నాకు విడదీయలేని బంధం ఏర్పడింది. రకరకాల మార్గాలలో బాబా నన్ను  నడిపిస్తున్నారు. ఉదాహరణకి- కలలు, మాటల ద్వారా, ప్రశ్నలు-జవాబులు వెబ్‌సైటు(http://www.yoursaibaba.com/) మొదలైన వాటి ద్వారా. హెచ్చరికలు లేదా కొన్ని సూచనల ద్వారా నన్ను ఎన్నో ప్రమాదాల నుండి బాబా రక్షించారు. అంతేకాకుండా, జీవితంలో ఎన్నో పరిస్థితులను జాగ్రత్తగా ఎదుర్కొని, వివిధ దశలలో విజయం సాధించేలా చేసారు.

నేను ఉద్యోగంలో చేరిన తరువాత ఇదివరకటిలాగా పారాయణ చేయలేకపోతున్నానని బాధలో ఉన్నప్పుడు బాబా నా మొర ఆలకించారు. ఒకరోజు మా ఆంటీ గీతావెంకట్ నాకు మహాపారాయణ గురించి వివరిస్తూ, "నీవు చాలా సంతోషిస్తావని తెలిసే నిన్ను అడగకుండానే నీ పేరు మహాపారాయణ గ్రూపులో నమోదు చేయించేందుకు నేహా ధన్‌పాల్ గారికి ఇచ్చాను" అని మెసేజ్ చేసారు. బాబా నా ప్రార్థనను మన్నించి, మహాపారాయణ ద్వారా నా పారాయణ కొనసాగించేలా ఆశీర్వదించారని చాలా సంతోషపడ్డాను. అలాగే నేహగారు చిన్న వయస్సులోనే చదువుకొంటూ ఎంత బిజీగా ఉన్నా, తాను చేస్తున్న అద్భుతమైన బాబా సేవ గురించి కూడా ఆంటీ చెప్పారు. ఇవన్నీ విన్న నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఎవరైతే మహాపారాయణలో ఉన్నారో నిజంగా వారు అదృష్టవంతులు. ఎందుకంటే, బాబానే వారిని మహాపారాయణ కోసం ఎన్నుకొన్నారు అని నా భావం.

ఇక నా అనుభవానికి వస్తే, 2018 మే 13వ తేదీ అర్థరాత్రి నేను, మా అమ్మ, మా ఆంటీ ముగ్గురం కలిసి విజయవాడ నుంచి అహోబిలం ఒక ప్రెవేటు వాహనంలో బయలుదేరాము. మనస్సు ఏదో చెడు జరగబోతుందని హెచ్చరిక చేస్తోంది. కానీ మా ప్రయాణాన్ని కొనసాగించాము. మేము ఉదయం 3, 4 గంటల మధ్య గిద్దలూరు, బెస్తవారిపేట ఘాట్ రోడ్డులో ఉన్నాము. ఆ సమయంలో డ్రైవర్ నిద్రమత్తులో తూలుతూ బండిపై నియంత్రణ లేకుండా నడుపుతున్నాడు. బండి ఆపి కాసేపు విశ్రాంతి తీసుకోమని ఎన్నిసార్లు చెప్పినా అతను పట్టించుకోకుండా బండి నడుపుతూనే ఉన్నాడు. మేము ముగ్గురం వెనకాల సీటులో నిద్రలో ఉన్నప్పుడు ఒకసారి మా కారు లారీని ఢీ కొట్టబోతుండగా జరగబోయే ప్రమాదం నుంచి బాబాయే మమ్మల్ని కాపాడారు. తరువాత తెల్లవారుఝామున గం.3:30 నిమిషాల సమయంలో డ్రైవర్ పూర్తిగా నియంత్రణ కోల్పోయాడు. దానితో బండి అదుపు తప్పి రోడ్డు ప్రక్కన ఉన్న రాతికట్టడం పైకి దూసుకుపోయింది. మరుక్షణంలో లోయలోకి పడిపోయే స్థితి! ప్రమాదపు అంచులో ఉన్నాము. ఆ కుదుపుకి నేను వెనుక సీటు నుంచి జారి ముందుకు పడిపోయాను. మేమంతా గట్టిగా అరవసాగాము. డ్రైవర్ కూడా ఈ హఠాత్ పరిణామానికి స్పందించలేని స్థితిలో ఉన్నాడు. కానీ బాబా మా అరుపులు విన్నారు. హఠాత్తుగా స్టీరింగ్ దానంతట అదే తిరిగి బండి నియంత్రణలోకి వచ్చి కారు రోడ్డు మీదకు వచ్చింది. ఆ స్టీరింగ్ తిప్పింది బాబానే. ఆయన కాక ఇంకెవరికి సాధ్యమది!? మా నలుగురిని చిన్న గాయాలతో ప్రమాదం నుండి బయటపడేసారు. ఆ క్షణాన ఆయన మమ్మల్ని కాపాడకుంటే ఈరోజు మేము లేము. సాయిమాత తప్పితే ఎవరు మమ్మల్ని ఆ చావుకోరల నుంచి తప్పించగలరు? ఒక్కసారి పిలిస్తే తన బిడ్డలను కాపాడటానికి పరిగెత్తుకొని వస్తారు బాబా. అంత అద్భుతమైనటువంటింది ఆయన ప్రేమ. మమ్మల్ని కాపాడినందుకు ఇవే మా కృతజ్ఞతలు బాబా!

శ్యామకర్ణ....


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

సాయికి సంబంధించిన మధురక్షణాలు - చదివి క్షణక్షణం స్మరించుకుంటూ ఉండండి. ఆ కాలంలో మీరు ద్వారకామాయిలో ఉన్నట్లుగా ఊహించుకుని ఇప్పుడు చెప్పబోయే దృశ్యాన్ని కూడా కనులారా తిలకించండి. మనమంతా బాబాకు చెందినవారమని భావించుకోండి.




మనం ద్వారకామాయిలోనికి ప్రవేశించగానే (రాయిపై వున్న) బాబా పటానికి ప్రక్కనే కుడివైపున బాబా గుఱ్ఱం శ్యామకర్ణ విగ్రహం కనపడుతుంది. బాబా అనుగ్రహం పొందిన ఈ గుఱ్ఱం బాబాకి ప్రీతిపాత్రమైనది. దానికి బాబా అంటే ఎంతో యిష్టం. అలాగే బాబా కూడా దానిని ఎంతో ప్రేమతో చూసుకునేవారు.

వాయిసతారా గ్రామంలో సత్కార్(కసమ్) అనే అతడు ఉండేవాడు. అతడు గుఱ్ఱాల వ్యాపారి. అతని వద్దనున్న ఒక అశ్వానికి ఎంతోకాలంగా సంతానం లేదు. 1912వ సంవత్సరంలో అతడు తన గుఱ్ఱాన్ని తీసుకుని శిరిడీ వచ్చి బాబాను దర్శించాడు. అతడు బాబాతో, “బాబా! ఈ గుఱ్ఱానికి సంతానాన్ని అనుగ్రహించండి” అని అడిగాడు. అప్పుడు బాబా అతనితో, “నీ గొడ్డు గుఱ్ఱానికి సంతానం కలిగితే నాకిస్తావా?” అని అన్నారు. దానికతడు, “మీ అనుగ్రహంవల్ల దానికి సంతానం కలిగితే, దానికి పుట్టిన మొదటి సంతానాన్ని మీకు బహుమతిగా సమర్పించుకుంటాన”ని విన్నవించుకున్నాడు. అప్పుడు శ్రీ సాయిమహరాజ్ ఆ గుఱ్ఱాన్ని ఆశీర్వదిస్తూ దాని నుదుటిపై ఊదీ రాసి, మరికొంత ఊదీ నీటిలో కలిపి దానితో త్రాగించారు. బాబా అనుగ్రహంతో సంవత్సరంలో ఆ గుఱ్ఱానికి సంతానం కలిగింది. మూడవనెలలో కసమ్ తను చేసిన వాగ్దానం ప్రకారం దానికి పుట్టిన మొదటి సంతానాన్ని శిరిడీ తీసుకునివచ్చి బాబాకు సమర్పించుకున్నాడు. దాని శరీరం గోధుమరంగులో ఉండి, చెవులు నల్లగా ఉండేవి. దాని చెవులు నల్లగా ఉన్న కారణంతో బాబా దానికి ‘శ్యామకర్ణ’ అని నామకరణం చేశారు. దీనిని ‘శ్యామసుందర్’ అని కూడా బాబా పిలిచేవారు. ఈ శ్యామకర్ణ లోగడ షామా నడిపిన పాఠశాల, ప్రస్తుతం ధునికి ఉపయోగించే సమిధలు ఉంచబడుతున్న గదిలో ఉండేది.



బాబా శ్యామకర్ణ సంరక్షణ బాధ్యతను శిరిడీ నివాసియైన నానాసాహెబ్ ఖగ్‌జీవాలే(కొన్ని ఆర్టికల్స్‌లో 'తుకారాం' గా చెప్పబడి ఉంది)కి అప్పగించి, “దీనిని బిడ్డలా జాగ్రత్తగా చూసుకో!” అని చెప్పారు. అతను దానికి తర్ఫీదు ఇస్తుండేవాడు. బాబాకు నమస్కారం చేయడం కూడా నేర్పించాడు.

ఒకసారి తుకారాం ఎంత బ్రతిమాలినా అది పచ్చగడ్డి మేయకుండా మొండికేసింది. దాంతో అతడు దాని వీపుపై కొట్టాడు. మసీదులో ఉన్న బాబా వెంటనే అతన్ని  పిలిపించి, "నా వీపు మీద  ఎందుకు కొట్టావ్?” అని అడిగారు. అందుకతడు, “బాబా! నేను మిమ్మల్ని కొట్టడమేమిటి?” అన్నాడు. అప్పుడు బాబా కఫ్నీని పైకెత్తి తమ వీపుమీద వున్న దెబ్బల గుర్తులను చూపించి, “ఆ శ్యామసుందర్‌ని కొడితే నన్ను కొట్టినట్లే” అని చెప్పారు. తుకారాం తన తప్పుకు ఖిన్నుడై బాబాను క్షమాపణ వేడుకున్నాడు. అప్పటినుండి భక్తులందరూ శ్యామకర్ణను ప్రేమతో చూడసాగారు.

సంతానంలేని ఔరంగాబాద్‌కర్ అనే భక్తునికి సాయి అనుగ్రహంతో సంతానం కలుగగా, అతడందుకు కృతజ్ఞతగా బాబాకు రూ.500/-లు దక్షిణ సమర్పించుకున్నాడు. బాబా ఆ డబ్బుతో శ్యామకర్ణకు శాల నిర్మింపచేశారు.

ఆరతి సమయానికి ముందే శ్యామకర్ణ ద్వారకామాయి సభామండపంలోకి వచ్చి (ప్రస్తుతం తాబేలుబొమ్మ ఉన్నచోట, మొదట్లో ఆ స్థలంలోనే బాబా కూర్చునే రాయి ఉండేది.) నిలుచునేది. ఆరతి జరుగుతున్నంతసేపు ఆరతిపాటకు అనుగుణంగా లయబద్ధంగా శిరస్సునూపుతూ, తన కాళ్ళకు కట్టిన గజ్జెలతో శబ్దం చేస్తూ వేడుకగా నాట్యం చేస్తూ ఉండేది. భక్తులు దానికి ఇరువైపులా నిలబడి ఆరతి పాడేవారు. చాలా అరుదుగా, ఆరతి సమయంలో శ్యామకర్ణ కదలకుండా నిశ్శబ్దంగా నిలబడివుండేది. ఆ సమయంలో మౌనంగా దేనినో ఉచ్ఛరిస్తున్నట్లుగా విచిత్రంగా దాని పెదవులు కదులుతూ ఉండేవి. ఆరతి పూర్తికాగానే అది తన ముందుకాళ్ళను ద్వారకామాయి మెట్లపై ఉంచి వంగి బాబాకు నమస్కారం చేసేది. బాబా ముందుగా దాని నుదుటిమీద ఊదీ వ్రాసి ఆశీర్వదించేవారు. తరువాత మిగిలిన భక్తులందరికీ ఊదీ ప్రసాదం ఇచ్చేవారు.

చావడి ఉత్సవానికి కూడా శ్యామకర్ణను పూసల దండలతోను, కాళ్ళకు గజ్జెలతోను, తోకకి అందమైన గుడ్డ కట్టి సుందరంగా అలంకరించేవారు. శ్యామకర్ణ ఉత్సవానికి ముందుగా నాట్యం చేస్తున్నట్లుగా భంగిమలు చేస్తూ చావడి వరకు వెళ్ళేది. బాబా చావడిలోకి  ప్రవేశించగానే అది ఆరుబయట బాబావైపుకు తిరిగి ఆరతి అయ్యేవరకు నిలబడివుండేది. ఆరతి కాగానే చావడి ముందున్న ఒక రాతిపై తన కాళ్ళను ఉంచి బాబాకు నమస్కరించేది. ఆ దృశ్యం నిజంగా ఎంతో చూడదగిన దృశ్యం.

బాబా మహాసమాధి అనంతరం శ్యామకర్ణ ప్రతిరోజూ సమాధిమందిరానికి వెళ్లి, కనులవెంట కన్నీరు కారుస్తూ మౌనంగా కొంతసేపు నిలబడేది. అయినప్పటికీ అది ప్రతిరోజూ ఆరతికి వస్తూ చావడి ఉత్సవాలలో కూడా పాల్గొంటూ ఉండేది.

బాబాకు ప్రియమైన ఈ అశ్వం 1945లో మరణించింది. లెండీబాగ్‌లో దత్తాత్రేయుని విగ్రహానికి వెనుక శ్యామకర్ణ భౌతికదేహానికి సమాధి నిర్మించారు. ద్వారకామాయిలో ఉన్న శ్యామకర్ణ విగ్రహాన్ని శిరిడీవాసి శ్రీబాలాసాహెబ్ షుల్ ల్తే సమర్పించారు. శ్రీకె.ఎం. అనబడే అప్పాసాహెబ్ వార్తక్ అనే ఆయన బొంబాయి మరియు యితర ప్రాంతాలలోని పెద్ద పెద్ద కంపెనీలకు ఆడిటర్. ఆయన శ్రీసాయిబాబాకి ప్రీతిపాత్రమయిన శ్యామకర్ణ ఇత్తడి విగ్రహాన్ని సాయి సంస్థాన్ వారికి బహూకరించారు. దానిని లెండీబాగ్‌లో బావి ప్రక్కన అందమైన తిన్నెమీద ప్రతిష్ఠించారు. ఆ సుందరమైన విగ్రహం బొంబాయికి చెందిన ప్రఖ్యాత శిల్పి శ్రీకామత్ గారి కళాసృష్టి. గుఱ్ఱం విగ్రహం, దానికి నిర్మించిన తిన్నె కలిపి అయిన ఖర్చు రూ.2,000/-. ఈ ఖర్చునంతా శ్రీ వార్తక్ భరించారు”. 

జంతుజన్మ ఎత్తిన ఈ శ్యామకర్ణ ఎంతోమంది సాయిభక్తులయిన మానవులకు దక్కని అదృష్టాన్ని పొందింది.

కేవలం కష్టాలలో మాత్రమే నన్ను గుర్తుచేసుకోకుండా, సంతోషంలో కూడా నన్ను తలుచుకో ...


నా పేరు స్నేహ అగర్వాల్. నేను పూణే నివాసిని. మేము 2018, డిసెంబర్ నెల, సెలవుదినాల్లో సరదాగా గడపటానికి బ్యాంకాక్ వెళ్ళాము. అక్కడ స్విమ్మింగ్ పూల్‌లో నేను, నా కూతురు సెల్ఫీ తీసుకుంటూ ఉండగా నా మొబైల్ నా కూతురి చేతినుండి జారి స్విమ్మింగ్ పూల్‌లో పడిపోయింది. నేను వెంటనే దానిని బయటకు తీసి తుడిచి శుభ్రంచేసి, ఫోన్ నుండి కాల్ చేసాను. అయితే వాల్యూమ్ బటన్, బ్యాక్ బటన్ పనిచేయడం లేదు. సరేనని మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టాను. అక్కడ దానిని రిపేరు చేయించే అవకాశం లేకపోవడంతో నేను మొబైల్‌ను హెయిర్ డ్రైయర్‌తో ఆరబెట్టి మళ్లీ స్విచ్ ఆన్ చేయడానికి ప్రయత్నించాను కానీ, అది సరిగా పనిచేయలేదు. ఇక మొబైల్‌ను ఒక వస్త్రంలో చుట్టి నా బ్యాగ్‌లో ఉంచాను. తరువాత మేము ఓడలో భోజనం కోసం వెళ్తూ ఎస్కలేటర్ ఎక్కేటప్పుడు మా బ్యాగ్ నుండి ఊదీ ప్యాకెట్ క్రింద పడింది. వెంటనే నా భర్త ఆ ప్యాకెట్ తీసి బ్యాగ్‌లో పెట్టారు. అది చూసిన వెంటనే సాయిబాబా నాకేదో సూచిస్తున్నారని అనిపించింది. మేము డిన్నర్ పూర్తి చేసుకొని సుమారు 10 గంటల సమయంలో హోటల్‌కి వెళ్తూ నేను, "బాబా! హోటల్‌కి వెళ్లిన తర్వాత నేను నా మొబైల్‌కి మీ పవిత్ర ఊదీ రాస్తాను, దానితో నా మొబైల్ పనిచేస్తే నా అనుభవాన్ని వెంటనే బ్లాగ్ ద్వారా సాయిబంధువులతో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. అలానే నేను హోటల్‌కి వచ్చిన వెంటనే మొబైల్‌కి ఊదీ వ్రాసి స్విచ్ ఆన్ చేశాను. అద్భుతం! నా ఫోన్ మునుపటిలానే పనిచేస్తూ ఉంది. ఆనందంతో నేను బిగ్గరగా అరిచి ఎగిరి గంతేసాను. నిజంగా నాకిది చాలా అద్భుతమైన అనుభవం. ఎందుకంటే, స్విమ్మింగ్ పూల్‌లో పడిన తరువాత నార్మల్‌గా పనిచేయడమన్నది సాధారణ విషయమేమి కాదు.

13వ అధ్యాయంలో బాబా, "భక్తులు వారి సంతోషకరమైన సమయాలలో తమ దేవుడిని, గురువుని మరచిపోతారు, కేవలం కష్టాలలో మాత్రమే గుర్తుచేసుకుంటార"ని చెప్తారు కదా! అలాగే నాకీ సంఘటన ద్వారా "సంతోషకరమైన సెలవుదినాలలో సైతం తనని మర్చిపోవద్ద"ని బాబా  తెలియజేసారు. అంతేకాదు! 'తన బిడ్డలకి ఎప్పుడూ అండగా ఉంటాన'ని కూడా ఈ అనుభవం ద్వారా బాబా నిర్ధారించారు.

బాబాను స్వయంగా చూసిన అద్భుత అనుభవమిది


నేను సాయి భక్తుడిని. సాయి అంతటా ఉన్నారని, తన బిడ్డలను సదా కాపాడుతుంటారని నా నమ్మకం. నేనిప్పుడు చెప్పబోయే సంఘటన 2017లో నేను నా కుటుంబాన్ని తీసుకుని శ్రీసోమేశ్వర టెంపుల్‌కు వెళ్తున్నపుడు జరిగింది. ఈ టెంపుల్ యు.ఎస్.ఏలో నార్త్‌కరోలినాలోని పశ్చిమభాగంలో వున్న బ్లూరిడ్జ్ పర్వతప్రాంతాలలో ఉంది. దీన్ని 'పశ్చిమ మౌంట్ కైలాష్‌‌'గా కూడా పిలుస్తారు. ఇక్కడి ఆరాధ్యదేవత - శివుడు. ఇక్కడి వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఆధ్యాత్మికత తొణికిసలాడుతూ ఉంటుంది. ఇక్కడకు వెళ్లాలంటే అటవీప్రాంతంగుండా చాలాదూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది.

ఒక వారాంతంలో నేను నా కుటుంబంతోపాటు శ్రీసోమేశ్వర టెంపుల్‌కు బయలుదేరాను. అక్కడికి వెళ్లే మార్గం అంతగా తెలియనప్పటికీ GPS(The Global Positioning System: ఏమాత్రం తెలియని క్రొత్తప్రాంతంగుండా ప్రయాణిస్తున్నప్పుడు గమ్యాన్ని చేరుకోవడంలో GPS ఎంతగానో సహకరిస్తుంది.)ని ఆధారంగా చేసుకొని ప్రయాణం చేస్తూ ఉన్నాము. కొంతసేపటికి దట్టమైన అటవీప్రాంతంలోకి చేరుకున్నాక దారి తప్పిపోయాము. ఎలా గమ్యం చేరుకోవాలో తెలియనిస్థితిలో అనుకోకుండా మా కారు  మంచు, నీరు కలిసిన ఒక లోతైన బురదలో దిగబడిపోయింది. ఎంతగా ప్రయత్నించినా ఆ బురదనుండి బయటకు రాలేదు. ఎవరినైనా సహాయం అడుగుదామన్నా అక్కడంతా నిర్మానుష్యంగా ఉంది. కనీసం అత్యవసర హెల్ప్‌‌లైన్‌కి గాని, నా భీమాసంస్థకు గాని కాల్ చేద్దామంటే నెట్‌వర్క్ కూడా లేదు. ఏమి చేయాలో అర్ధంకాని నిస్సహాయస్థితిలో ఆర్తిగా బాబాను ప్రార్థించాము. మరుక్షణంలో, ఎక్కడినుండి వచ్చాడోగాని ప్రత్యక్షమైనట్లు మూడు కుక్కలతోపాటు ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన మా కారు దగ్గరకి వచ్చి, "మీరు కారులో కూర్చోండి. నేను కారు తోస్తాను" అని చెప్పారు. తరువాత ఆయన కేవలం కారు తాకారు.. అంతే! కారు బురదలోనుండి బయటకు వచ్చింది. నేను కారు దిగి ఆయనకు కృతజ్ఞతలు చెప్పి, "మేము మౌంట్ సోమ టెంపుల్ దర్శనం కోసం వెళ్తున్నాము. కానీ ఈ అడవిలో దారి తప్పిపోయాం. అక్కడికి ఎలా చేరుకోవాలో మీరు చెప్పగలరా?" అని అడిగాను. ఆయన ఒక త్రోవవైపు చూపిస్తూ, "ఆ మార్గంగుండా వెళ్ళండి. నేరుగా మౌంట్ సోమ టెంపుల్ ద్వారం దగ్గరకు చేరుకుంటారు" అని చెప్పారు. తరువాత మేము ఆయన చూపిన మార్గంలో వెళ్లి మౌంట్ సోమ టెంపుల్ చేరుకొని సోమేశ్వరుని దర్శనం చేసుకున్నాము. ఆ నిర్మానుష్యమైన అడవిలో బాబాను ప్రార్థించగానే మూడు కుక్కలతో వచ్చి మాకు సహాయాన్ని అందించిన ఆ వ్యక్తి(దత్తావతారి) ఖచ్చితంగా బాబాయే అని నా నమ్మకం. బాబాను స్వయంగా చూసిన అద్భుత అనుభవమది. "బాబా! ఆజన్మాంతం మరిచిపోలేని అనుభవాన్ని ఇచ్చారు. చాలా చాలా కృతజ్ఞతలు".





సమయగతి ఎఱుగని సమ్యమీంద్రుని 'సమయనియమాలు'! - శ్రీసాయిబాబా దినచర్య - ఐదవ భాగం


మధ్యాహ్నం రెండున్నరకు మళ్ళీ ఒకసారి లెండీబాగుకు వెళ్ళివచ్చేవారు. లెండీ నుండి వచ్చిన తరువాత మరొకసారి సాయిదర్బారు వుండేది. అదయ్యాక సాయంత్రం బాబా మసీదు ముంగిట్లో అటూ, ఇటూ పచార్లు చేస్తుండేవారు. ఆ సమయంలోనే మసీదు ప్రహరీగోడనానుకుని ఆ వీధిలో అటూ ఇటూ పోయేవారితో సావకాశంగా మాట్లాడేవారు. ఒక్కోసారి తమకు మాత్రమే అర్థమయ్యే పరిభాషలో మాట్లాడుతుండేవారు. “పదిపాములు వెళ్ళిపోయాయి, ఇంకా చాలా వస్తాయి”; “ఇక్కడ జనం చీమల్లా గుమికూడతారు”; “వణి (వ్యాపారస్థులు) తేలీ (నూనెవర్తకులు), నన్ను చాలా ఇబ్బందిపెట్టారు. నేనీ మసీదులో ఎక్కువ కాలం వుండను. నేనిక్కడనుండి వెళ్ళిపోతాను” అనేవారు. ఒక్కొక్కసారి మసీదు విడిచి నిజంగానే బయలుదేరేసేవారు. బాబా బయలుదేరుతున్నారన్న విషయం చెవినపడిన వెంటనే తాత్యా ఒక్క పరుగున బాబా వద్దకు వచ్చి “మిమ్మల్ని ఇబ్బంది పెట్టినవాళ్ళను నేను దండిస్తాను. నేను మిమ్మల్ని శిరిడీ వదిలి వెళ్ళనివ్వను. ఈ రోజు వద్దు బాబా, మరోరోజు వెళదాము” అంటూ బుజ్జగించేవాడు. బాబా ఒక్కోసారి ఎందుకలా చేసేవారో ఆయనకే ఎరుక. తాత్యా సముదాయించిన తరువాత, బాబా మరలా యధాస్థానంలో కూర్చుని ఏమీ జరగనట్లే భక్తులతో మాట్లాడేవారు. మసీదు ప్రహరీ గోడనానుకుని వారు నిలుచున్నచోట యిపుడు చిన్న పాదుకలు ప్రతిష్ఠించి ఉన్నారు. గోడపై మోచేయి ఆనించుకొనే చోట కూడా పాదుకలు ప్రతిష్ఠింపబడివున్నాయి. ఆ స్థానంలో నిలబడి బాబా ఒక్కొక్కసారి సూర్యోదయాన్ని గమనిస్తుండేవారట.


సాయంత్రాలు తరచుగా మసీదుకు పక్కనున్న వీధిలో అటూఇటూ నడిచేవారు. అపుడు ఆ వీధిలో జనం బారులు తీరి నిలుచునేవారు. బాబా వారందరితో కుశల సమాచారాలు మాట్లాడుతూ మెల్లగా నడిచేవారు.

ఆరు ఆరున్నర మధ్య బాబాకు సంధ్యారతి ఇచ్చేవారు. ఆరతి తరువాత జరిగే సాయిదర్బారులో మళ్ళీ భక్తులంతా బాబా దగ్గర చేరి వారి కష్టసుఖాలు చెప్పుకుని ఆశీర్వాదాలు పొందేవారు.

బాబా, భక్తులను దక్షిణ అడిగి తీసుకునేవారు. సుమారు రాత్రి ఎనిమిదిగంటల సమయంలో బాబా దక్షిణరూపంలో ఆరోజు వచ్చిన డబ్బునంతా పంచేసేవారు. బాబా జీవితపర్యంతం ఆ దానయజ్ఞం కొనసాగింది. ప్రతిరోజూ బాబా ఒక్కొక్క భక్తుడికి ఒక్కొక్క నిర్ణీతమొత్తం చొప్పున కొందరు భక్తులకు పైకం ఇచ్చేవారు. భక్తులు దీన్ని బత్యం అనేవారు. బడేబాబాకు 55 రూ/-, తాత్యాకు 35 రూ/-, జంతేముసల్మానుకు 7 రూ/-, బయ్యాజీపాటిల్ కోతేకు 4 రూ/-, భాగోజీకి 4 రూ/-, రామచంద్రపాటిలుకు 4 రూ/- ఇచ్చేవారు. బాబా వద్దనుండి ప్రతిరోజూ డబ్బు తీసుకునేవారిలో రామచంద్రపాటిల్ తాను తీసుకున్న 4 రూపాయలకు బదులు నాలుగు కలకండ పలుకులను బాబాకు సమర్పించేవాడు. నూతన వధూవరులు తమ ఆశీస్సుల కోసం వచ్చినపుడు బాబా వారికి చెరొక రూపాయి ఇచ్చేవారు. రామనవమి లాంటి ఉత్సవాలు జరిగినపుడు దాదాకేల్కరుకు, బడేబాబాకు రెండుకట్టల రూపాయినోట్లు యిచ్చి పంచమనేవారు. బాబాకు వచ్చే నైవేద్యం మీద ఆధారపడి ఎందరో ఫకీర్లు, బైరాగులు జీవించేవారు. వారికి ఒక్కొక్కరికి బాబా రోజూ 25 పైసలు ఇచ్చేవారు. సాయంత్రం హరిదాసులు, పౌరాణికులు, వివిధ కళాకారులు, సర్కస్ వాళ్ళు తమతమ కళలను బాబా ముందు ప్రదర్శించేవారు. బాబా వారికి ఒక్కొక్కరికి రెండు రూపాయలు ఇచ్చేవారు.

ఇదంతా అయిన తరువాత ప్రతిరోజూ రాత్రి తాత్యా రొట్టెలు, పాలు నైవేద్యంగా తెచ్చేవాడు. బాబా అందులోనుంచి కొంత స్వల్పంగా తీసుకున్నాక, తక్కినది ప్రసాదంగా అందరికీ పంచేవారు. ఆ సమయంలో ప్రతిరోజూ బాబా తాత్యాకు 35 రూ/- ఇచ్చేవారు. అది బాబా మసీదులోనే నిదురించే రోజైతే అందరూ బాబా వద్ద ఊదీ తీసుకుని ఇళ్ళకు వెళ్ళిపోయేవారు. మహల్సాపతి, తాత్యాలను తప్ప మరెవ్వరినీ రాత్రిళ్ళు మసీదులో నిద్రించటానికి బాబా అనుమతించేవారు కాదు.

ఒకనాడు శిరిడీలో కుంభవృష్టి కురిసింది. శిధిలావస్థలోనున్న మసీదు పరిస్థితిని గమనించి అతి చేరువలోనున్న చావడిలో ఆ రాత్రి తలదాచుకోమని భక్తులు ప్రార్థించారు, ఒత్తిడిచేశారు. మసీదు నుండి కదిలేందుకు బాబా ససేమిరా అంగీకరించలేదు. అప్పుడు నారాయణతేలి అనే ఒక భక్తుడు చొరవ తీసుకుని శ్రీసాయి వద్దని కేకలేస్తున్నా లక్ష్యపెట్టకుండా, ఆయనను భుజాలపై మోసుకుని వెళ్ళాడు. అలా ఒకరాత్రి చావడిలో గడిచింది. ఆనాటినుండి మిగిలిన జీవితపర్యంతం రోజుమార్చిరోజు చావడిలో నిద్రించారు బాబా.

బాబా చావడిలో కుడిభాగంలో పడుకునేవారు. ఇప్పుడు ఆ భాగాన్ని రైలింగుతో వేరుచేసి వున్నారు. ఎడమవైపు భాగంలో మరికొందరు భక్తులు పడుకునేవారు. బాబా చావడిలో నిద్రించేరోజు గొప్పగా చావడిఉత్సవం జరిగేది. రాధాకృష్ణమాయి, అబ్దుల్ మసీదునుండి చావడి వరకు గల రోడ్డును చిమ్మేవారు. దుమ్ము పైకిలేవకుండా నీళ్ళుచల్లేవారు. రంగురంగుల ముగ్గులుపెట్టేవారు. దారిపొడవునా బాబా నడిచేందుకు గుడ్డపరిచేవారు. తరువాత తాత్యా బాబా వద్దకు వచ్చి చావడికి బయలుదేరటానికి సిద్ధంగావుండమని చెప్పేవాడు. కానీ బాబా కదిలేవారు కాదు. తాత్యా అప్పుడు చంకలో చేయివేసి లేవదీసేవాడు. బాబా బయలుదేరగానే ఒక జలతారు శాలువాను ఆయన భుజాలపై వేసేవాడు. బాబాకు ఎడమవైపు తాత్యా, కుడివైపున మహల్సాపతి నిలుచుని బాబాను మసీదునుంచి చావడివైపుకి నడిపించేవారు. చావడికి వెళ్లేముందు, బాబా కుడికాలిపాదంతో ధునిలోని కట్టెలు సవరించి, కుడిచేత్తో అక్కడున్న దీపాన్ని ఆర్పి బయలుదేరేవారు. బాబా ఎడమచేతిని తాత్యా, కుడిచేతిని మహల్సాపతి పట్టుకుని బాబాను మసీదునుండి చావడికి నడిపించి తీసుకెళ్ళేవారు.

బాబా మసీదుమెట్లు దిగేందుకు సిద్ధమవుతున్న తరుణంలో పిలాజీగురవే షహనాయి వాయించేవాడు. భక్తులు భజనచేసేవారు. ఉత్సవానికి ముందు చక్కగా అలంకరించబడిన శ్యామకర్ణ, సాయిపాదుకలున్న పల్లకీ కదిలేవి. రకరకాల దీపాలంకరణలతో కన్నులపండువగా సాగేదా ఉత్సవం. ఒకవంక సంగీతవాయిద్యాల హోరు, మరొకవంక భజన, ‘సాయినాథ్ మహరాజ్ కీ జై!’ అన్న జయజయ ధ్వానాలు మిన్నుముట్టేవి. మధ్యమధ్య భక్తులు బాబాపై పువ్వులు, గులాల్ చల్లేవారు. బాబా ప్రసన్నంగా అడుగులో అడుగులేస్తున్నట్లు మెల్లగా కదులుతూ ముందుకుసాగేవారు. బాబాకు అందంగా అలంకరించిన గొడుగును జోగ్ పట్టేవాడు. బాబా మసీదు చివరకు వచ్చింతరువాత మారుతి ఆలయం వైపుకు తిరిగి కొన్ని భంగిమలు చేసేవారు.
బాబా రాకను స్వాగతిస్తూ చావడిని అద్దాలు, దీపతోరణాలతో అలంకరించి సిద్ధంగా ఉంచేవారు. బాబా చావడి చేరగానే తాత్యా ముందు లోపలికి వెళ్ళి బాబాకు ఆసనం, ఆనుకోవటానికి చెక్క అమర్చి, బాబాను దానిమీద కూర్చోబెట్టి ఆయనకు ఒక అందమైన కోటు తొడిగేవాడు. నానాసాహెబ్ నిమోన్కర్ గిర్రున తిరిగే ఛత్రం పట్టేవాడు. బాబా ద్వారానికెదురుగా ఆసీనులయాక జోగ్ వెండిపళ్ళెంలో బాబా పాదాలు కడిగి, గంధం రాసి తాంబూలం సమర్పించేవాడు. భక్తులు బాబాకు పాదనమస్కారాలు చేసుకునేవారు. అంతలో షామా చిలిం తయారుచేసి బాబాకు అందించేవాడు. తరువాత అది భక్తులందరకూ చేరేది. కోండ్యా కిళ్ళీలను సిద్ధంచేసి బాబాకిచ్చేవాడు. బాబా కొన్ని తాము వేసుకుని, మిగిలినవి భక్తులపై విసిరేవారు. తరువాత శేజారతి జరిగేది. శేజారతి అయ్యాక భక్తులంతా ఇళ్ళకు వెళ్ళేందుకు శలవు తీసుకుంటూండగా బాబా అందరినీ పంపించి తాత్యాతో మాత్రం “వెళితే వెళ్ళావు కానీ, మధ్యమధ్యలో వచ్చి నన్ను గమనించి పోతూండు” అని చెప్పి సెలవిచ్చిపంపేవారు. తాత్యా అలాగేనని చెప్పి వెళ్ళేవాడు.

జగద్రక్షకుడైన శ్రీసాయి లోకధర్మాన్ననుసరించి పవళిస్తున్నట్లు అలా కనులు మూసుకున్నా, వారి కనుదోయినుంచి కరుణాదృక్కులు మనపై సదా ప్రసరిస్తూనేవుంటాయి! ఆయన తన బిడ్డలమైన మనందరినీ చల్లగా గమనించుకుంటూ, కాపాడుకుంటూనే వుంటారు!

సమాప్తం.....
 మూలం: సాయిపథం ప్రధమ సంపుటం

 


ముందు భాగం కోసం
బాబా పాదుకలు తాకండి.

 

1

2

3

4

5

నిర్ధిష్టమైన భాగం కోసం పైన నెంబర్లను తాకితే, ఆ నెంబరుకి సంబంధించిన భాగం ఓపెన్ అవుతుంది.


సమయగతి ఎఱుగని సమ్యమీంద్రుని 'సమయనియమాలు'! - శ్రీసాయిబాబా దినచర్య - నాల్గవ భాగం


కాలాతీతుని దినచర్య

బాబా లెండీనుంచి మసీదు తిరిగి వచ్చేసరికి ఉదయం పదిగంటలయ్యేది. అప్పటినుండి పదకొండున్నర వరకు సాయిదర్బారు జరిగేది. అపుడు బాబా వద్దకు వెళ్ళే భక్తులు కొందరు తమ బాధలు చెప్పుకునేవారు. కొందరు సలహాలు అడిగేవారు. మరికొందరు తమ కోర్కెలు తీర్చమని ప్రార్థించేవారు. వీళ్ళందరితో పాటు గాయకులు, నర్తకులు, గారడీవాళ్ళు వచ్చి తమ విద్యలు ప్రదర్శించి బాబా యిచ్చే బహుమానం పుచ్చుకుని వెళ్ళేవారు. సామాన్యంగా, వారికి బాబా రెండు రూపాయలు ఇచ్చేవారు. కొందరు బాబాకు నైవేద్యాలు సమర్పించుకునేవారు. సాధారణంగా, బాబా వాటిని తమ చేత్తో తాకి, తిరిగి వారికే ఇచ్చేసేవారు. లేదా, ప్రసాదంగా అక్కడున్న భక్తులందరికీ పంచమనేవారు. చాలా అరుదుగా మాత్రమే ఆ పళ్ళాలనుంచి కొద్దిగా తీసుకుని నోటిలో వేసుకునేవారు. ఎవరి పళ్ళెంలోంచి బాబా స్వీకరించారో వారు ఎంతో ఉప్పొంగిపోయేవారు. మామిడిపళ్ళ కాలంలో బాబా ప్రతిరోజూ ఒక పండుని తీసుకుని దానిని కొద్దిగా రుచిచూసి మిగిలినవారికి పంచేవారు. ఒక్కోసారి స్వయంగా ఆయనే పండ్లుకొని అందరికీ పంచమనేవారు. బాబా తమకు నైవేద్యంగా తెచ్చిన మధురపదార్థాలను పిల్లలకు ఎక్కువగా పెట్టేవారు. తన దగ్గరకు ఎప్పుడూవచ్చే పిల్లలకైతే ఒకవేళ వారప్పుడు లేకున్నా, వారికోసమని తినుబండారాలను తీసి పక్కన పెట్టేవారు. పిల్లలంటే బాబాకు ఎంతోప్రీతి. వారితో ప్రేమగా లాలిస్తూ మాట్లాడేవారు. ఎవరైనా పిల్లలను అదిలించటం, కొట్టటం ఆయన సహించేవారు కాదు.
పిల్లలంటే అలా మక్కువచూపే బాబా పెద్దవారితోనుండేటపుడు ఎక్కువగా మితభాషిగానే వుండేవారు. నవ్వినా చిరునవ్వేకానీ, పెద్దగా నవ్వేవారుకాదు. ప్రసన్నంగా వున్నపుడు మాత్రం చిన్నచిన్న కథలు చెప్పేవారు. ఆ సమయానికి అక్కడున్న భక్తబృందంలో ఎవరికో ఒకరికది మొత్తం తమ జీవితకథ అని తెలుసుకొని అబ్బురపడేవారు. ఒక్కోసారి వాటిలోనే మందలింపులూ వుండేవి. ఆ పరిభాష దానికి సంబంధించినవారికి మాత్రమే అర్ధమయ్యేది. మిగిలినవారు అవి ఎవరికో సంబంధించిన కథో లేక పూర్వజన్మవృత్తాంతమో అనుకునేవారు. ఒక్కోసారి బాబా చెప్పిన కథలు విన్న భక్తులందరూ వాటిని పూర్తిగా మర్చిపోయేవారు. అందరూ కలిసి గుర్తుచేసుకుందామన్నా గుర్తుకువచ్చేవికావు. అది చాలా వింతగా అనిపించేది.

ఇక పదకొండున్నరకి మసీదు ముందున్న గంటను వాయించేవారు. అది ఆరతికి వేళయిందన్న దానికి సంకేతం. ఆ ఘంటానాదం విని యెక్కడున్నవారూ ఆరతికి హాజరయ్యేందుకు వడివడిగా మసీదుకు చేరేవారు. పన్నెండుగంటలకు ఆరతి మొదలయ్యేది. బాబానపుడు గంధపుష్పాదులతో పూజించేవారు. స్త్రీలు బాబాకు ముందు మసీదులో నిల్చునేవారు. పురుషులంతా మసీదు బయటనున్న ఖాళీజాగాలో నిలబడేవారు.

ఆరతివేళలలో బాబాలో కనబడే దివ్యతేజస్సు, వర్ఛస్సు, అలౌకికసౌందర్యం చూచేందుకు రెండుకనులూ చాలేవి కావని ఆ ఆరతుల మహత్తర దృశ్యాలను చూసిన ఆనాటి భక్తులు తమ డైరీలలో పొందుపరచుకొన్నారంటే (ఉదా.. శ్రీఖాపర్డే డైరీ) అవెంత మనోహరంగా ఉండేవో మనమూహించుకోవచ్చు!

మధ్యాహ్నఆరతి అయ్యాక బాబా అందరికీ ఊదీ ఇచ్చి ఆశీర్వదించి ఇళ్ళకు పంపేవారు. భక్తులను ప్రేమగా పలకరించి భోంచేసి రమ్మని చెప్పేవారు. ఆ తరువాత తాను తెచ్చిన భిక్షాన్నానికి కొంత నైవేద్యాలను కలిపి పది పన్నెండుమంది భక్తులతో కలిసి భోజనం చేసేవారు. బాబాకు ఎడంవైపు తాత్యాపాటిల్, రామచంద్రపాటిల్, బయ్యాజీపాటిల్ కూర్చునేవారు. కుడివైపున మాలేగాంఫకీర్ (బడేబాబా), షామా, బూటీ, కాకాసాహెబ్ దీక్షిత్ కూర్చునేవారు. తాత్యా, రామచంద్రపాటిల్, బయ్యాజీపాటిల్ ఒక కంచంలోనూ, బాబా, మాలేగాంఫకీర్ లు కలిసి మరోకంచంలోనూ భోంచేసేవారు. బాబా తమ మధ్యాహ్నభోజనం ఎప్పుడూ ఒంటరిగా చేసేవారుకాదు. బడేబాబా లేకుండా భోజనానికి కూర్చునేవారు కారు. భోజనానికి కూర్చున్న తర్వాత మసీదు ముందు పరదాలు దించేవారు. పరదాలు వేసిన తరువాత మసీదు లోపలికి ఎవ్వరూ వెళ్ళేవారు కాదు. భక్తులు కాళ్ళు చేతులు కడుక్కుని బాబాకు ఇరువైపులా వరుసగా భోజనానికి కూర్చోగానే, బాబాకు నైవేద్యంగా సమర్పించుకొన్న పదార్థాలన్నింటినీ కలిపి బాబా ముందుంచేవారు. బాబా దాన్ని ముందు దైవానికి నివేదించి, కొంతభాగాన్ని ప్రసాదంగా మసీదు బయటవున్న వారికి పంచమని పంపేవారు. మిగిలినదానిలో ఒకభాగం పాలు, ఒకభాగం పంచదార, ఒకభాగం రొట్టె ఒకగిన్నెలో వేసి బాగా పిసికి దానిని అందరికీ పంచేవారు. తరువాత మసీదులో భోజనానికి కూర్చున్నవారందరికీ నిమోన్కర్, షామా వడ్డన చేసేవారు. ఎవరికైనా వారికిష్టమైన పదార్ధం వుంటే బాబా దాన్ని వారికెక్కువ వడ్డించమనేవారు. షామాకు ఎక్కువగా పాయసం వడ్డించమనేవారు. యం. డబ్ల్యు. ప్రధాన్ మసీదులో భోజనకార్యక్రమం గురించి ఇలా చెప్పారు: “బాబాతో మసీదులో నేను భోజనం చేసేవాడిని. బాబా తమ స్వహస్తాలతో మా పళ్ళాలనిండుగా ఆహారాన్నుంచేవారు. దానిలో కొంతభాగాన్ని ఇంటికి పంపేవాడిని. అదే ఇంటిల్లిపాదికీ సరిపోయేది. బాబా భోజనం చివరిలో అందరికీ ఒక పండు ఇచ్చేవారు. మా అబ్బాయి బాబుకు వండిన పదార్ధాలంటే ఇష్టంలేదని గమనించి వాడికి భోజనం బదులుగా పండ్లను ఇచ్చేవారు.”

ఒక్కోసారి బాబా భక్తులకు స్వయంగా వంటచేసి విందుచేసేవారు. ఆయన దగ్గర యాభై మరియు వందమందికి వండడానికి సరిపడే రెండు పాత్రలుండేవి. వంట చేయాలనుకున్న రోజు అంగడికి వెళ్ళి కావలసిన సరుకులన్నీ తెచ్చుకోవడం, పొయ్యివెలిగించి ఎసరుపెట్టటం, దినుసులు నూరడంలాంటి పనులన్నీ ఆయనే స్వయంగా చేసుకునేవారు (బాబా ఉపయోగించిన ఆ పొయ్యిని మనమీనాటికీ మసీదులో చూడవచ్చు). చక్కెరపొంగలి, పరమాన్నం లేదా మాంసపుపలావు వండేవారు. ఉడుకుతున్న గుండిగలో గరిటె బదులు చేత్తోనే బాగా కలిపేవారు. కానీ, ఆశ్చర్యంగా ఆయన చేయి ఏమాత్రం కాలేదికాదు. పులుసు కాచి, గోధుమరొట్టెలు వేసేవారు. అంబలికాచి మజ్జిగ కలిపిచ్చేవారు. లేదా, గోధుమలు తానే విసరి ఆ పిండితో పెద్ద పెద్ద చపాతీలు చేసి ధునిపై కాల్చేవారు. పొరలు పొరలు వుండే అంత పెద్ద చపాతీ ఎవరికైనా ఒక్కటి తింటేనే కడుపునిండిపోయేది. మాంసాహారాన్ని వండుతుంటే శాఖాహారులను అటు రానిచ్చేవారుకాదు. వంట పూర్తవగానే మౌల్వీచేత నివేదన చేయించి అందులో మొదట కొంత మహల్సాపతికి, కొంత తాత్యా యింటికి పంపి ఆ తరువాత అందరికీ పంచేవారు. 1910 తర్వాత భక్తులరాక ఎక్కువై, నైవేద్యాలు కూడా ఎక్కువవటంతో బాబా వంట చేయటం ఆపేసారు. భక్తులు బాబాకు సమర్పించే నైవేద్యాలతో సుమారు 150-200 మంది భోజనం చేసేవారు.
బాబా ఉపయోగించిన పొయ్యి

అందరి భోజనమూ అయిన తరువాత, సగుణమేరునాయక్ ఆ ప్రదేశమంతా శుభ్రం చేసేవాడు. బాబా తన స్థానంలో ఆశీనులవగానే అతనే తాంబూలము, నీళ్ళగ్లాసుతో పాటు రెండు రూపాయలు దక్షిణ సమర్పించుకునేవాడు.

భోజన కార్యక్రమమయ్యాక మసీదులో ఎవరూ వుండేవారు కాదు. అందరినీ ఇళ్ళకు పంపించి బాబా ఒక్కరే ఒంటిగంట నుంచి రెండున్నరదాకా ఏకాంతంగా వుండేవారు. బాబా ఒక ఇటుకరాయిని ఎప్పుడూ తనతో వుంచుకుని ఎంతో అపురూపంగా చూసుకునేవారు. అది తన గురుప్రసాదమని చెప్పేవారు. కూర్చున్నప్పుడు, తన కుడిచేతిని ఆ రాయిమీద పెట్టుకునేవారు. బాబా పగలు నిద్రించేవారు కాదు. కూర్చున్నప్పుడు గోడకు ఆనుకునేవారు కాదు. ఆ సమయంలో ఎవరికీ కనిపించని విధంగా ఒంటరిగా కూర్చుని ఒక చిన్న పాతగుడ్డసంచిని బయటకు తీసేవారు. అందులో అరిగిపోయిన పాత నాణాలుండేవి. పావలాలు, అర్థలు, అణాలు, పైసలు ఇలా వుండే ఆ నాణాలను బాబా చేత్తో బాగా రుద్దుతూ, “ఇది నానాది, ఇది కాకాది, ఇది సోమ్యాది, ఇది దామ్యాది” అని అంటూ వుండేవారు. అప్పుడు పొరపాటున ఎవరివైనా అడుగులచప్పుడు వినిపించినట్లనిపిస్తే, చప్పున వాటిని సంచీలో వేసి దాచేసేవారు. ఆ కాసులేమిటో, ఎందుకలా బాబా వాటిని అరగదీస్తుండేవారో ఎవరికీ తెలియదు. బాబా ఎన్నడూ వాటి గురించి ఎవ్వరికీ చెప్పలేదు. అప్పుడపుడు ఆ ఏకాంత సమయంలోనే తన పాత కఫ్నీకి చిరుగులుంటే వాటిని నేర్పుగా కుట్టుకుంటుండేవారు.

 మూలం: సాయిపథం ప్రధమ సంపుటం

 


ముందు భాగం కోసం
బాబా పాదుకలు తాకండి.

 


నిర్ధిష్టమైన భాగం కోసం పైన నెంబర్లను తాకితే, ఆ నెంబరుకి సంబంధించిన భాగం ఓపెన్ అవుతుంది.

 


తరువాయి భాగం కోసం
బాబా పాదాలు తాకండి.

 

శ్రీసాయి సచ్చరిత్రము - 50వ అధ్యాయం ఆడియో


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి






వాయిస్: జీవని

సమయగతి ఎఱుగని సమ్యమీంద్రుని 'సమయనియమాలు'! - శ్రీసాయిబాబా దినచర్య - మూడవ భాగం


బాబా అప్పుడప్పుడు మలబద్ధకం, జీర్ణకోశవ్యాధులతో బాధపడేవారు. వాటి నివారణకు గాను సోనాముఖి ఆకును మరికొన్ని మూలికలను కలిపి కషాయం తయారుచేసేవారు. తాము కషాయం తీసుకునేటప్పుడు ఆ కషాయాన్ని పక్కనున్న భక్తులకీ ఇచ్చేవారు! కండ్లకలక లాంటివి వచ్చినప్పుడు మిరియాలను ముద్దగా నూరి, దానిని కండ్లలో వుంచుకునేవారు. ఇక ఆయనెక్కువగా బాధపడింది ఉబ్బసంతో. ఉబ్బసం మరీ ఎక్కువైనప్పుడు ఆయన పడుతున్న బాధను చూడలేక సన్నిహితభక్తులు కంటతడి పెట్టుకునేవారు. అలాంటి సందర్భంలోనే ఒకసారి, ఆయన్ని చూసి పురందరే పెద్దగా ఏడుస్తుంటే, “భావూ, ఏమైందని నాకిపుడు? తగ్గిపోతుందిలే, ఊరుకో!” అని బాబాయే అతన్ని ఓదార్చవలసివచ్చింది. అంత అనారోగ్యంలో కూడా బాబా తన భిక్షాటనను మానేవారే కాదు. ఆయన నడవలేని స్థితిలో వుంటే ఒక్కోసారి భక్తులే ఆయనను నడిపిస్తూ భిక్షకు తీసుకెళ్ళేవారు! అలా బాబా ఒకసారి తీవ్ర అస్వస్థతకు గురైనప్పుడు ఒక భక్తుడు బాబాకు ఒక చక్రాలకుర్చీని సమర్పించాడు (ఇప్పటికీ ఆ కుర్చీని చావడిలో చూడవచ్చు). బాబా దాన్నొకసారి తాకి పక్కన పెట్టేశారే కానీ, ఎన్నడూ ఆ కుర్చీని ఉపయోగించలేదు.
బాబా అనారోగ్యంగా వున్నపుడు ఆయన ప్రతినిధులుగా భిక్షకు వెళ్లిన భాగ్యాన్ని పొందిన భక్తులలో శ్రీ మాధవరావు దేశ్ పాండే (షామా), శ్రీ బాలక్ రామ్, శ్రీ వామన్ రావ్ పటేల్ (శ్రీ సాయి శరణానంద), ప్రొఫెసర్ జి.జి.నార్కే మొదలైనవారున్నారు.

శ్రీసాయిశరణానంద తమ స్మృతులలో ఇలా రాసుకున్నారు: “ఒకసారి బాలక్ రామ్ ఊర్లో లేనందువల్ల, బాబా కోసం మధ్యాహ్నంపూట భిక్ష చేసే అవకాశం నాకు చాలారోజులు లభించింది. నేను శ్రీజోగ్ ఇంటినుండి భిక్షను, మరొకరి ఇంటినుండి పాలను తెచ్చేవాడిని”. శ్రీసాయిశరణానందకు లభించిన అవకాశం చూసిన నార్కే తనకు ఆ సేవ లభిస్తే బాగుండునని మనసులో తలిచాడు. ఒకరోజు దుస్తులు మార్చుకునే వ్యవధిలేక సూటు-బూటు-హేటులతో మసీదు చేరిన నార్కేనుద్దేశించి బాబా, “ఈరోజు ఇతను భిక్షకు వెళతాడు” అని అన్నారు. ఆనందంతో అతను అప్పటికప్పుడు, ఆ దుస్తులతోనే భిక్షకు వెళ్ళివచ్చాడు. అలా బాబా కొరకు భిక్షచేసే అరుదైన అవకాశం నార్కేకు నాలుగునెలలపాటు లభించింది.

భిక్షకు వెళ్ళేటప్పుడు బాబా భుజాన ఒక జోలె, చేతిలో ఒక రేకుడబ్బా తీసుకువెళ్ళేవారు. అన్నము, రొట్టె, కూరలు మొదలైన ఘనపదార్థాలు జోలెలోనూ, పులుసు, పాలు, మజ్జిగ వంటి ద్రవపదార్థాలను రేకుడబ్బాలోనూ పోయించుకొనేవారు. ఆయనెన్నడూ రుచుల కోసం చూడలేదు. తన భక్తులకూ “రుచులకు పోవద్దు!” అని చెప్పేవారు.

బాబా భిక్షకు వెళ్ళేమార్గం ఎప్పుడూ ఒకేతీరుగా వుండేది. మసీదు నుండి చావడి దాటిన తరువాత ఎదురెదురుగా వుండే సఖారాం షెల్కే, వామన్ రావ్ గోండ్కర్‌‌ల ఇళ్ళ దగ్గర మొదట భిక్షనడిగేవారు. తరువాత కొద్దిదూరంలో, పక్కపక్కన వుండే బయ్యాజీ పాటిల్ మరియు తాత్యాకోతే పాటిల్ (బయజాబాయి) ఇళ్ళదగ్గర భిక్ష తీసుకుని చివరగా నందూరాం ఇంటికి వెళ్ళేవారు. బయ్యాజీపాటిల్ ఇంటినుంచి వచ్చేదారిలో అప్పట్లో ఒక చిన్నగుట్ట వుండేది. భిక్ష తీసుకుని వస్తూ బాబా అక్కడ నిలబడి వీధిలో కుక్కలకూ, కాకులకూ ఆహారాన్ని పెట్టేవారు. ఇప్పుడు ఆ స్థలంలో బాబా పాదుకలను ప్రతిష్ఠించి వున్నారు. భిక్షాటన నుంచి మసీదుకి రాగానే, కొంత పదార్ధాన్ని ముందు ధునికి సమర్పించేవారు. తరువాత మసీదులో ఒకమూలవుండే కొలంబా (మూకుడు)లో మిగిలిన పదార్ధాలన్నింటినీ వేసేవారు. దానికి పైన మూత వుండేదికాదు. కుక్కలు, పిల్లులు, చీమలు, ఈగలు వంటి ప్రాణులకు అది సిద్ధాన్నం. ఎవరైనా సరే అందులోంచి ఆహారాన్ని యధేచ్ఛగా తీసుకోవచ్చు. వేటినీ తరమటంగానీ, ఎవరినీ వారించటం కానీ జరిగేదికాదు. మసీదు శుభ్రం చేసే స్త్రీ స్వతంత్రంగా దానిలో నుంచి రోజూ ఏడెనిమిది రొట్టెలదాకా తీసుకెళ్ళేది.

బాబా ప్రతిరోజు ఉదయం ఎనిమిదిన్నర తొమ్మిదిన్నర మధ్య లెండీకి వెళ్ళివచ్చేవారు. లెండీకి వెళ్ళేటప్పుడు మాత్రమే బాబా పాదరక్షలు ధరించేవారు, అదికూడా ప్రతిసారీ కాదు. ముందు మసీదు బయటకు వచ్చి, కొద్దిసేపు అక్కడ గోడకు ఆనుకుని నిలబడేవారు. తర్వాత మారుతి ఆలయం ఎదురుగా నిలుచుని తీక్షణమైన వీక్షణాలతో ఏవో సంజ్ఞలు చేసేవారు. తర్వాత గురుస్థానం దగ్గర అన్నివీధుల కూడలిలో నిలుచుని కొద్దిసేపు ఎవరికో ఏదో చెబుతున్నట్లు సైగలు చేసి, ముందుకు కదిలేవారు. వాడాలో వున్న భక్తులు, కొత్తగా దర్శనార్థం వచ్చినవారూ బాబాను అక్కడ దర్శించుకునేవారు. వారంతా బాబా రాకకై ఎదురుచూస్తూ ఆ ప్రదేశంలో బారులు తీరి నిలుచుని వుండేవారు. బాబా వారిని ఆప్యాయంగా పేరుపేరునా పలుకరిస్తూ, చిరునవ్వుతో మెల్లగా నడిచేవారు. ఆ తర్వాత ఎడమవైపుకి తిరిగి కానిఫ్ నాథ్ మందిరం దిశగా నడిచేవారు(పోస్టాఫీసు ఎదురుగా కానిఫ్ నాథ్ మందిరం వుంది). కొంతదూరం ముందుకు వెళ్ళి కుడివైపుకి తిరిగి లెండీలో ప్రవేశించేవారు. అలా లెండీకి చేరిన బాబా అక్కడ తమ నిత్యకృత్యాలు తీర్చుకునేవారు. లెండీలో యిపుడు వేప, రావి చెట్లు వున్నచోటే చిన్నగుంటలో ఓ దీపం (నందదీపం) వుండేది. దానిచుట్టూ గోనెపట్టాలతో తెరలు కట్టబడి వుండేవి. బాబా కొద్దిసేపు అక్కడ కూర్చునేవారు. బాబా అక్కడ కూర్చున్నపుడు దానికి వీపుతిప్పి కూర్చునేవారు. దానివంక చూసేవారు కాదు. అబ్దుల్ బాబా ఆ ప్రదేశమంతా శుభ్రంగా చిమ్మటం, దీపాలలో నూనె పోయటం వంటి పనులు చేస్తుండేవాడు. బాబా రాగానే అతనక్కడ రెండుకుండలతో నీరు తెచ్చిపెట్టేవాడు. బాబా ఆ కుండలలోని నీటిని అన్ని దిక్కులకు చల్లుతూ ఏవో సైగలు చేసేవారు. అప్పుడు వేరెవ్వరూ అక్కడ వుండటానికి బాబా అంగీకరించేవారు కాదు. అబ్దుల్ బాబా కూడా ఆ సమయంలో దూరంగానే ఉండేవాడు. లెండీదాకా బాబాతో వచ్చిన భక్తులు కూడా, లెండీ బయటే బాబాకోసం ఎదురుచూస్తూ నిలుచునేవారు. అక్కడున్న వేప, రావి మొక్కలను బాబానే స్వయంగా నాటారు. అందులో ఒక మొక్క మొదట బలహీనంగా వుండి సరిగా ఎదగకుండా వుంటే బాబా రోజూ దాన్ని అటు ఇటూ వూపి వంచేవారు. బాబా అమృత హస్తస్పర్శతో బలం పుంజుకుని కొద్దిరోజుల్లోనే ఏపుగా పెరిగిందది. అక్కడలా కొద్దిసేపు గడిపిన తర్వాత లెండీనుంచి మసీదుకు మళ్ళీ వెళ్ళినదారినే తిరిగివచ్చేవారు. ఈ రాకపోకల దారిని ఆయన ఒక్కరోజున కూడా మార్చలేదు. నియమానికి ఎంతో ప్రాముఖ్యతనిచ్చే బాబా ఏ ఒక్క పనైనా, అది చిన్నదేకావచ్చు పెద్దదేకావచ్చు, నియమం తప్పటానికి ఒప్పుకునేవారు కాదు. బాబా సన్నిధికి అసంఖ్యాకంగా భక్తులు రావడం మొదలైన తర్వాత, బాబా లెండీయాత్ర చిన్నతరహా ఉత్సవంలాగా జరగసాగింది. బాబా లెండీ వెళ్ళడానికి మసీదు బయటకు రాగానే, ఆయన వెనుక నడుస్తూ, భాగోజి ఛత్రాన్ని పట్టేవాడు. నాణ్యమైన కుట్టుపని, అల్లికలు, కుచ్చులతో ఆ ఛత్రం చూడముచ్చటగా వుండేది. ఇక బాబాకు కుడి ఎడమలుగా నానాసాహెబ్ నిమోన్‌‌కర్, బూటీలు నడిచేవారు. వీరందరూ కలిసి లెండీకి నడుస్తున్న ఒరిజినల్ ఫోటో మనకు లభ్యమవుతుంది.

మూలం: సాయిపథం ప్రధమ సంపుటం

 


ముందు భాగం కోసం
బాబా పాదుకలు తాకండి.

 


నిర్ధిష్టమైన భాగం కోసం పైన నెంబర్లను తాకితే, ఆ నెంబరుకి సంబంధించిన భాగం ఓపెన్ అవుతుంది.

 


తరువాయి భాగం కోసం
బాబా పాదాలు తాకండి.

 


శ్రీసాయి సచ్చరిత్రము - 49వ అధ్యాయం ఆడియో


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి






వాయిస్: జీవని

సమయగతి ఎఱుగని సమ్యమీంద్రుని 'సమయనియమాలు'! - శ్రీసాయిబాబా దినచర్య - రెండవ భాగం


సరిక్రొత్త సాయి అంబరం-‘పేదసాధు’లకానాడు సంబరం!

బాబా ఏడెనిమిది రోజులకొకసారి స్నానం చేసేవారు. అరుదుగా ఐదారువారాలపాటు కూడా స్నానం మాటే ఎత్తేవారు కాదు. స్నానం గురించి ఏ భక్తుడైనా ప్రశ్నిస్తే, “ఇప్పుడేగా గంగాస్నానం చేసి వచ్చింది. మళ్ళీ స్నానం ఎందుకు?” అనేవారు. సంకల్పమాత్రాన తమ కాలిగోటినుండి పవిత్రజలాలను ప్రవహింపజేయగల పరమపావనునికి స్నానంతో పనేముంటుంది? రోజూ స్నానం చేయకపోయినా, ఆయన ఎంతో పరిశుభ్రంగా కనిపించేవారు. స్నానానంతరం బాబా ఆకుపచ్చని లుంగీ కట్టుకుని, విడిచిన కఫ్నీని నీటిలో పిండి ధునిపై ఆరబెట్టి వేసుకునేవారు. స్నానం చేసే ఆ సమయంలో తప్ప ఆయనెపుడూ కఫ్నీ లేకుండా వుండేవారుకాదు. బాబా ఎప్పుడూ ముతక కారికం గుడ్డతో కుట్టిన కఫ్నీలనే ధరించేవారు. ఆ కఫ్నీకూడా బాగా చిరుగులుపడి మరీ పాతదైతే, భక్తుల బలవంతంపై కొత్త కఫ్నీని ధరించేవారు. ఆయన వంటినున్న పాతచిరుగుల కఫ్నీని ఎలాగైనా మార్పించాలని తాత్యా ఆయన దగ్గర చేరి ఏదో మాట్లాడుతున్నట్లు నటిస్తూ, “బాబా ఏమిటిది, కఫ్నీ బాగా చిరిగిపోయినట్లున్నదే!” అంటూ ఆ చిరుగులలో వేలుపెట్టి, వాటినింకా పెద్దవిచేసి, ఇక కుట్టుకునేందుకు కూడా వీలు లేకుండా చేసేవాడు. ఆపై, “కఫ్నీ బాగా చిరిగిపోయింది. ఏమైనా సరే కఫ్నీ మార్చాల్సిందే!” అని పట్టుపట్టేవాడు. బాబాకింక తప్పేది కాదు. కఫ్నీ మార్చదలుచుకున్నపుడు కాశీనాథ్ షింపీ అనే బట్టల వ్యాపారిని పిలిచి, “కాశీనాథ్, కఫ్నీ లావ్!” అని పురమాయించేవారు. కఫ్నీ తెచ్చిన ‘కాశీనాథ్’కు దాని ఖరీదు కంటే ఎంతో ఎక్కువ డబ్బులిచ్చేవారు. కొత్త కఫ్నీ వేసుకుని పాతదానిని ధునిలో పడేసేవారు. సామాన్యంగా బాబా తాము కఫ్నీ మార్చినప్పుడు అప్పుడక్కడున్న పేదఫకీర్లకు, సాధువులకు కూడా క్రొత్త కఫ్నీలను పంచేవారు. అలా బాబా తమ కఫ్నీ మార్చిన దినం ఆ పేదసాధువులకు ఒక పండుగే! 1914లో ఒకసారలాగే బాబా క్రొత్త కఫ్నీలను పంచుతుండగా, అక్కడున్న నార్కే అను భక్తుడు తనకూ ఒక కఫ్నీ ఇస్తే బాగుండుననుకొన్నాడు. అతని మనసులో ఆ ఆలోచన మెదలగానే, బాబా నార్కే వైపు తిరిగి, అతని తలపై మెల్లగా తడుతూ, “ఊహు! నీకు కఫ్నీ ఇచ్చేందుకు ఆ పైనున్న ఫకీరు అంగీకరించటంలేదు. నేనేం చేసేది?” అని అన్నారు. అప్పుడప్పుడు బాలానాయీ అనే మంగలిని పిలిపించి నున్నగా గుండు చేయించుకునేవారు, మీసాలను కోసుగా కత్తిరించుకునేవారు. అతనికి బాబా నుంచి బాగా ప్రతిఫలం దక్కేది.

భక్తభారభృతుడు భిక్షకేగిన ‘భంగి’!

ఉదయం ఎనిమిదిగంటల ప్రాంతంలో బాబా భిక్షకు బయలుదేరేవారు. గణపతి కోతే పాటిల్ (బయజాబాయి), అప్పాజీ పాటిల్, సఖారాం షెల్కే, వామన్ గోండ్కర్, నందూరాం మార్వాడీల ఇళ్ళు, సకలలోకాలకు జీవప్రదాత అయిన సాయినాథునికి భిక్షనిచ్చే భాగ్యానికి నోచుకున్న పుణ్యలోగిళ్ళు! బాబా ఒక్కో ఇంటిదగ్గర నిలుచుని ఒక్కోరకంగా పిలిచేవారు. “ఆబాదే ఆబాద్, అల్లా భలాకరేగా!” అని ముందు ఆ ఇంటి ఇల్లాలిని దీవించేవారు. “బయజా మా! జెవన్ దే! రోటీ లావ్!” (అన్నం పెట్టు, రొట్టె తే!) అని బయజాబాయి ఇంటివద్ద అడిగేవారు. అప్పాజీ పాటిల్, వామన్ గోండ్కర్‌‌ల ఇళ్ళముందు వాళ్ళ పేర్లు పిలుస్తూ, “భాక్రీ దే” (రొట్టె ఇవ్వు!) అనేవారు. సఖారాం ఇంటిదగ్గర ‘ఇత్లాయీ బాయీ, రోటీ లావ్!’, అని కేకవేసి భిక్ష అడిగేవారు. ఐదిళ్ళలో చివరగా నందూరాం మార్వాడీ ఇంటికి వెళ్ళేవారు. “నందూరాం, భాక్రీ దే!” అనో, లేకపోతే అతని భార్య రాధాబాయిని ఉద్దేశించి, “బోపిడీబాయి, భాక్రీ దే!” అనో అరిచేవారు. మరాఠీలో “బోపిడీ” అంటే నత్తి అని అర్థం. ఆమె కొద్దిగా నత్తిగా మాట్లాడేదని బాబా ఆమెనలా పిలిచేవారు. ఆమె భిక్ష తేవటం కనుక కొద్దిగా ఆలస్యమైతే, “ఏమిటంత ఆలస్యం?” అని ఒక్కోసారి కేకలేసేవారు. ఇక అప్పుడప్పుడు పండుగ, సందర్భము ఏమీ లేకుండానే “బోపిడీబాయ్, మీఠాలావ్!” అనేవారు. ఆమె కూడా తనకెన్ని పనులున్నాసరే, బాబా అడిగినవెంటనే ఆయనకిష్టమని పూరన్ పోళీలు (బొబ్బట్లు) చేసి బాబాకు తెచ్చిపెట్టేది. అందులోంచి ఒక ముక్క తమ నోటిలో వేసుకుని, మిగిలినదంతా అక్కడున్న భక్తులకు పంచేసేవారు బాబా. బాబా భిక్షకు వెళ్ళే ఇళ్ళను ఏనాడూ మార్చలేదు; భిక్షకు వెళ్ళే ఇళ్ళ క్రమమూ మార్చలేదు. కానీ భిక్ష చేసే సమయాలకు మాత్రం ఏ నియమాలూ వుండేవికావు. ఒక్కోసారి, ఆయన ఒకేరోజున ఏడెనిమిదిసార్లు కూడా భిక్షకు వెళ్ళిన సందర్భాలున్నాయి. శ్రీబయ్యాజీ అప్పాకోతే పాటిల్ చెప్పిన వివరాల ప్రకారం: “బాబా మొదటి మూడు సంవత్సరాలు రోజుకి ఎనిమిదిసార్లు, తరువాత మూడు సంవత్సరాలు రోజుకి నాలుగుసార్లు, ఆ తరువాత పన్నెండు సంవత్సరాలపాటు రోజూ రెండుసార్లు భిక్షకు వెళ్ళేవారు. చివరి రోజులలో రోజుకి ఒక్కసారి మాత్రమే భిక్షచేసేవారు.”
బయజాబాయి ఇంటికి భిక్షకు వెళ్ళినపుడల్లా, ఆమె బాబాను లోపలకు వచ్చి కూర్చుని తన కళ్ళముందు రెండు ముద్దలన్నా తిని వెళ్ళమని బ్రతిమలాడుకునేది. గడప అవతలే తప్ప, ఏనాడూ ఎవరింటి లోపలికీ వెళ్ళి కూర్చుని భిక్ష స్వీకరించని బాబా, ఆ మాతృమూర్తి ప్రేమతో చేసిన అభ్యర్ధనను కాదనలేక ఎప్పుడైనా అరుదుగా వారి ఇంటి అరుగు మీద కొద్దిసేపు కూర్చునేవారు. వరుసగా వాళ్ళింటికి ఎన్నిసార్లు వెళ్ళినాసరే, ఆ తల్లి ఆయననెన్నడూ ఒట్టిచేతులతో పంపేదికాదు. పరుగున వచ్చి బాబా జోలెలో కనీసం ఇంత ఊరగాయో, అప్పడమో తెచ్చిపెట్టేది. బాబా ఆమెను తన సోదరి అనేవారంటే, మరి ఆమె ఎంతటి అదృష్టవంతురాలో! బాబా మహిమను లోకమింకా గుర్తించని రోజుల్లోనే, ఆయనలోని మహనీయతను గుర్తించి, రోజూ ఆయనకు ఆహారం పెట్టికానీ తాను తినకూడదన్న నియమం పెట్టుకుందంటే బయజాబాయి పూర్వజన్మ సంస్కారమెంతటిదో కదా! గొప్ప గొప్ప చదువులు, వింత వింత నాగరికపోకడలు లేకపోతేనేం? భక్తి మమతలతో నిండిన ఆనాటి శిరిడీ గ్రామంలోని గృహిణుల సంస్కారానికి చేయెత్తి మొక్కవలసిందే!

బాబా శిరిడీచేరిన రెండు సంవత్సరాల తర్వాత (1876 సంవత్సరంలో) అహ్మద్ నగర్ జిల్లా అంతటా పెద్ద కరువు వచ్చింది. ఆ కరువు రోజుల్లో అప్పుడు ధనికులైన నందూరాం, బయజాబాయి ఇళ్ళవద్దకు మాత్రమే బాబా భిక్షకు వెళ్ళేవారు. అప్పుడు ఆయనకు ఒక్కొక్క ఇంటిదగ్గర సగం రొట్టెముక్క లభించేదట!

బాబాను దైవస్వరూపంగా కనుగొన్న భక్తులు ప్రవాహంలా శిరిడీకి రావడం మొదలై, ధనికులైన భక్తులు ఖరీదైన మధురపదార్థాలను నైవేద్యంగా ఆయన ముందు పెడుతున్నా, ఆయన మాత్రం భిక్షాటనతోనే జీవించారు. తమచుట్టూ రోజురోజుకు పెరుగుతున్న ఆడంబరాలపై ఏమాత్రం దృష్టిపెట్టలేదు. లోకానికి ఒక ఫకీరుగా ప్రకటమైన ఆయన, చివరి వరకు ఆ ఫకీరుగానే జీవించారు. తనకోసం వంటచేసుకోవటం కానీ, మరుసటిరోజు కోసం ఏదీ దాచుకోవడంగానీ ఆయనెన్నడూ చేయలేదు. చివరి రోజులలో అనారోగ్యం వల్ల నడవలేని పరిస్థితులలో కూడా, తనకు మారుగా మరెవరినైనా భిక్షాటనకు పంపేవారు.

మూలం: సాయిపథం ప్రధమ సంపుటం

 


ముందు భాగం కోసం
బాబా పాదుకలు తాకండి.

 


నిర్ధిష్టమైన భాగం కోసం పైన నెంబర్లను తాకితే, ఆ నెంబరుకి సంబంధించిన భాగం ఓపెన్ అవుతుంది.

 


తరువాయి భాగం కోసం
బాబా పాదాలు తాకండి.

 


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo