సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి, సాయి, అంతటా సాయి


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

చెన్నై నుండి సాయిభక్తురాలు అర్చన తన అనుభావన్నిలా తెలియజేస్తున్నారు.

ఒక వారం సెలవులు రావడంతో నేను శిరిడీ వెళ్ళాలని అనుకున్నాను. కానీ ఇంటిలో అందరూ తిరుపతి వెళదామని ప్లాన్ చేసారు. నేను బాబాతో, "బాబా! 'తిరుపతిలో ఉన్నది కూడా నేనే' అని మా వాళ్ళకి చెప్పి, అందరూ శిరిడీకి వచ్చేలా చేయండి" అని చెప్పుకున్నాను. కానీ బాబా వేరేవిధంగా ప్రణాళికను సిద్ధం చేసారు. నేను తిరుపతికి వెళ్లి, బాబానే అక్కడ కూడా ఉన్నారని నేను గ్రహించాలని బాబా కోరుకున్నారు.

ప్రణాళిక ప్రకారం మేము మంగళవారం తిరుపతికి బయలుదేరాలి. కానీ, అలా జరగలేదు. మా కజిన్ ఒకరు అకస్మాత్తుగా వేరే దగ్గరకు వెళ్ళాల్సి వచ్చింది. కాబట్టి, ఇక మా తిరుపతి ప్రయాణం రద్దయినట్లే అనుకున్నాము. కానీ అకస్మాత్తుగా అతను బుధవారం తిరిగి వచ్చి, భోజన సమయంలో మమ్మల్ని పిలిచి, మరుసటిరోజు ఉగాది కనుక తిరుపతిలో చాలా రద్దీగా ఉంటుంది, అందువలన ఈరోజే మనం దర్శనం చేసుకోవడం మంచిదని చెప్పి, అదేరోజు సాయంత్రం 7 గంటలకు దర్శనానికి ఏర్పాటు చేస్తానని చెప్పాడు. కాబట్టి మేము వెంటనే చెన్నై నుండి బయలుదేరాము.

దీనికి ముందు 5 నెలల క్రితం నాకు వచ్చిన ఒక కల గురించి మీకు చెప్తాను. ఆ కలలో నేను బాబా గుడి కోసం అన్వేషిస్తూ, పురాతనమైన ఒక పెద్ద ఆలయంలోకి ప్రవేశించాను. అక్కడ నేను నిద్రిస్తున్న భంగిమలో ఉన్న శివుడి రూపాన్ని చూశాను.  నేను ఆయన ఛాతీ వరకు మాత్రమే చూసాను. ఆయన ఛాతీ వరకు నీలి రంగులో ఉండి, ముఖం మీద చిరునవ్వు ఉంది. నేను శివుడిని చూస్తూ, నాతోపాటు ఉన్న వ్యక్తికీ చెప్పాను. నేను శివుడిని చాలా ఇష్టపడ్డాను. మరుసటిరోజు నా మనస్సులో ఆ కల ప్రాముఖ్యత ఏమిటా అని ఆలోచించాను. తరువాత శివుడు నిద్రిస్తున్నట్లుగా ఉన్న దేవాలయం ఏదైనా ఉందా అని తెలుసుకోవడానికి ప్రయత్నించాను. అలా నా ప్రయత్నంలో, "అవును , అటువంటి ఆలయం ఉంది" అని కనుగొన్నాను. చెన్నై నుండి తిరుపతికి వెళ్ళే మార్గంలో చెన్నై నుండి 59 కిలోమీటర్ల దూరంలో సురుతపల్లి అనే ఊరు ఉన్నది. అక్కడ నిద్రిస్తున్న భంగిమలో శివుడు ఉంటారు. అక్కడి శివుడిని 'పల్లి కొండీశ్వరార్' అని పిలుస్తారు. నేను ఆ ఆలయం చిత్రాల కోసం శోధించి, చాలా ఫోటోలను సంపాదించాను. ఫోటో క్రింద మీకోసం జతపరుస్తున్నాను. అందులో ఒకటి ఆ ఆలయ గోపురానికి సంబంధించినది. ఆ గోపురంపై ఉన్న శివుడి ఆకారం, ఆయన మోముపై చిరునవ్వు సరిగ్గా నేను నా కలలో చూసినట్లుగానే అదే నీలం రంగు, అదే నవ్వు ఉన్నాయి. దానితో నేను సంతోషించాను, కాని ఆ కల యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోలేకపోయాను. సరే .. ఇదంతా 5 నెలల క్రితం జరిగింది. నేను దాదాపుగా మర్చిపోయాను.

ఇప్పుడు మేమంతా ఆ రోజు తిరుపతికి ప్రయాణం ప్రారంభించినప్పుడు నాకు ఆ కల గుర్తుకు వచ్చి, నేను కనురెప్పలు వాల్చకుండా  పల్లికొండీశ్వర్ కోసం గమనిస్తూ ఉన్నాను. ప్రయాణం చేస్తున్నంతసేపు ఆ ప్రదేశం కోసం ఒక్కక్షణం కూడా నిదురపోకుండా గమనించాను. కానీ ఫలితం లేదు. మా ప్రయాణంలో అలాంటి ప్రదేశం ఎక్కడా తగలలేదు.

మేము తిరుపతికి చేరుకున్నాము. కొండలు ఎక్కక ముందే కొండ పాదాల వద్ద నేను ఒక అందమైన బాబా మందిరాన్ని చూశాను. శుభసూచనలా అనిపించింది. మేము ముందుకు వెళ్తునప్పుడు నాకు కలిగిన మొదటి అనుభూతి ఏమిటంటే, అక్కడి రోడ్లు, దుకాణాలు వంటివి అన్నీ చూస్తుంటే అంతా షిర్డీలానే అనిపించింది. తరువాత రెండవ అనుభూతి ఏమిటంటే, నేను ఎటువైపు చూసినా, ఏ దుకాణం చూసినా వాటి అన్నిటిపై బాబా ఫోటోలు ఉన్నాయి. ఇదంతా నా దృష్టికి స్పష్టంగా ఉంది. ఏ వైపు చూసినా నేను నా బాబానే చూస్తున్నాను. తరువాత, మేము ఉండవలసిన చోటు కోసం విచారణ చేస్తూ ఉంటే అక్కడ కూడా ప్రతి వాహనంపైనా బాబానే కనిపిస్తున్నారు. అలా ఆయన మాకు దర్శకత్వం వహిస్తున్నట్లు ఉంది. ఆయన చిత్రాన్ని కలిగి ఉన్న ఒక వాహనం దాదాపు మాకు దారి చూపింది.

ఆరోజు రాత్రి దర్శనం కోసం మేము ప్రయత్నం చేశాము, కానీ ఆ ఏర్పాటు చేస్తున్న వ్యక్తి ఆ రాత్రి అది సాధ్యం కాదని, కాబట్టి మరునాడు ఉదయం 7 గంటలకు దర్శనం ఏర్పాటు చేసాడు. మేము డిన్నర్ చేయడానికి వెళ్ళాము. మళ్ళీ అక్కడ కూడా అన్నివైపులా బాబాను చూసాను. అదే సమయంలో, "నువ్వు ఎంత అదృష్టవంతురాలివి! రేపు బాబాని విష్ణు రూపంలో చూస్తావు" అని నా ఫ్రెండ్ నుండి నాకు మెసేజ్ వచ్చింది. "ఓ! అవును. రేపు గురువారం, ఇదంతా మీ క్రీడ మాత్రమే బాబా. మీరే గురువారం దర్శనం అయ్యేలా ఏర్పాటు చేశారు" అనుకున్నాను.

మరుసటిరోజు గురువారం తెల్లవారుఝామున, నేను బాబాతో సాధారణంగా ప్రతి గురువారం గడిపిన సమయాన్ని గుర్తు చేసుకున్నాను. తెల్లవారుఝాము నుండి దాదాపు రాత్రి 10 గంటల వరకు (9-5 ఆఫీసు టైమింగ్ ను తప్పించి) నేను బాబాతోనే నా సమయాన్ని గడుపుతాను. "కానీ, నేను ఈరోజు మిమ్మల్ని మిస్ అవుతున్నాను బాబా!" అని ఫీల్ అయ్యాను.
మేము దర్శనం కోసం ఆలయానికి వెళ్ళాము. మేము ఒక గంట వేచి ఉండాల్సి వచ్చింది. నాకు  నిద్రమత్తుగా ఉంది. నేను ఆ కుర్చీలలో కూర్చుని, నా హృదయంలోనే  "సాయిరామ్ సాయిరామ్" అని జపం చేసుకుంటూ చాలా సౌకర్యవంతంగా మగత నిద్రపోయాను. తలుపులు తెరచినప్పుడు నేను నిద్రలేచి, మేము అందరం దర్శనానికి వెళ్ళాము. నేను నడిచి వెళ్తూ ఉంటే, షిరిడీలో సమాధి మందిరం లోపల నడుస్తున్నట్లుగా అనుభూతి కలుగుతూ ఉంది. అలా వెళ్తున్నప్పుడు నవ్వుతూ ఉన్న బాబా వారి పెద్ద చిత్రపటం కనిపించింది. మేము పవిత్రమైన గర్భగుడి లోపలకి ప్రవేశించాము. నేను చుట్టుప్రక్కల చాలా ప్రశాంతతను చవిచూశాను.

ఇది నా మొట్టమొదటి తిరుమల సందర్శన, నాకు అంతగా ఏమీ తెలియదు. కానీ నేను తిరుమల అతి సంపన్నమైన ఆలయం అని, అక్కడ స్వామికి ఆభరణాలు మరియు పువ్వులతో అలంకరణ అద్భుతంగా చేస్తారని విన్నాను. నేను స్వామి వారి ఫోటోలను చూసాను కూడా. నేను లోపల దేవుడిని చూసి ఆశ్చర్యపోయాను. ఒంటిమీద కేవలం తెల్లని ధోతి తప్ప మరేమీ లేకుండా ఉన్న స్వామిని నేను చూశాను. చాలా ప్రశాంతంగా ఉన్నారు. నేను షిర్డీలో సాయిబాబాని చూస్తున్నట్లుగానే నాకు అనిపించింది.

మాకు దర్శనానికి దేవునికి చాలా దగ్గరగా వెళ్లడానికి అనుమతించారు.  నేను చాలా ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవించాను. స్వామి చిరునవ్వు చిందిస్తున్నట్లుగా ఉన్నారు. నా సాయి దర్శనం తో నేను చాలా సంతృప్తి చెందాను. తరువాత అందరం బయటకు వచ్చాము. మొదట్లో షిర్డీ మాత్రమే వెళ్ళాలి, నేను ఇంకెక్కడికీ రాలేనన్న కారణంగా మా అమ్మ నన్ను, 'ఇప్పుడు సంతోషమేనా?' అని అడిగింది. "ఈ ప్లేస్ కూడా ఖచ్చితంగా షిర్డీ లాగానే ఉంది అమ్మా! నేను చాలా సంతోషంగా ఉన్నాను" అని ఆమెకు చెప్పాను. మేము మా గది ఖాళీ చేసి బయటకు వచ్చేసరికి, అక్కడ గేటు వద్ద బాబా చిత్రం ఉన్న మరొక వాహనం ఉంది. ఆయన మమ్మల్ని చూసినట్లుగా ఉన్నారు. ఆయన లీలలు అక్కడితో ముగిసిపోలేదు. మేము కొండపై నుండి క్రిందికి వెళ్ళినప్పుడు మళ్ళీ కారులో నుండి అందమైన దేవాలయాన్ని చూశాము. అక్కడ దేవాలయంలో ఇతర దేవతలకి బదులు నేను బాబానే చూసాను. చివరగా మేము మధ్యాహ్న భోజనానికి వెళ్లాము. అక్కడ కూడా సుందరమైన ఫోటో రూపంలో మళ్ళీ నవ్వుతూ దర్శనం ఇచ్చారు బాబా. నాకు అలసటగా ఉండటంతో ప్రయాణ సమయంలో నిద్రపోవాలని నిర్ణయించుకున్నాను. అప్పుడు నేను బాబాతో, "నాకు ఆ కలలో శివుని దర్శనం ఇచ్చినది మీరే అయితే గనక మీరే నేన్ను అక్కడికి తీసుకొని వెళ్ళాలి. నాకై నేను అక్కడికి వెళ్ళడం అసాధ్యం. సురతపల్లి ఎక్కడ ఉందో కూడా ఖచ్చితంగా తెలియదు. ఒకవేళ కలలో చూసిన సురతపల్లి మీదుగా తీసుకొని వెళ్ళమని నేను మా నాన్న, కజిన్ లతో చెప్పినా, వారు నాకేమైనా పిచ్చేమో అనుకుంటున్నారు" అని చెప్పుకున్నాను.

నేను వెహికల్ ఎక్కిన తరువాత బాగా నిద్రపోయాను. మా బంధువు చెన్నై నుండి వచ్చిన అదే దారి గుండా వెళ్దామని మా నాన్నగారికి జాగ్రత్తగా దారి చెప్తూ ఉన్నారు. ఆయన చూపుతున్న రోడ్డు చెన్నై వెళ్ళడానికి ప్రజలు ఎక్కువగా ఉపయోగించే అత్యంత దగ్గర మార్గం. నాకు చాలా బాగా నిద్రపట్టింది. చాలాసేపటి తరువాత నాకు మెలకువ వచ్చింది. ఆ సమయంలో మా అమ్మ రోడ్డు ప్రక్కన ఉన్న నేమ్ బోర్డు చూసి, 'సురుతపల్లి' అని చదవడం వినిపించింది. నేను అది విని ఆశ్చర్యంగా లేచి కిటికీ గుండా బయటకు చూస్తున్నాను. "ఆలయం గ్రామం లోపల ఎక్కడ ఉందో, అక్కడికి ఎలా వెళ్ళాలో కూడా తెలియదు" అని నేను మనసులో అనుకుంటూ ఉండగానే కుడివైపున ఒక పెద్ద ఆలయాన్ని చూశాను. ఆలయం పేరు చదవడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ అంతలోనే నేను ఉహించని విధంగా నేను కలలో చూసిన నిద్రపోతున్న భంగిమలో ఉన్న శివుడిని గోపురం మీద చూసాను. నా ఆశ్చర్యానికి, ఆనందానికి అవధులు లేవు. వెంటనే నేను కారుని ఆపమని మా నాన్నకి చెప్పాను. కారు ఆగిన తరువాత నేను ఏమి చూసానో మీరు ఉహించాగలరా? ఆ గోడపై ఉన్న చాలా పోస్టర్ల మధ్య అందమైన నా ప్రియమైన బాబా చిత్రాన్ని చూసాను. నేను ఆశ్చర్యపోయాను. బాబా నా మొర విని మమ్మల్ని అక్కడికి తీసుకువచ్చారని నేను అర్ధం చేసుకున్నాను.

నేను కారు నుండి బయటకు వచ్చి వేచి ఉండలేకపోయాను. వెంటనే పరుగున నాకు కలలో కనపడిన శివుడి రూపం ఉన్న గోపురం క్రిందకి వెళ్లి నిలబడ్డాను. అప్పుడు మధ్యాహ్నం 3 గంటలు అయ్యింది. ఆలయం తెరిచే ఉంది కానీ గర్భగుడి మూసివేయబడింది. కానీ నేను ఆ పవిత్ర స్థలంలో అడుగుపెట్టి శివుడు నిద్రపోతున్న భంగిమను చూశాను. అది చాలు, నేను చాలా సంతోషించాను. మేము ఆలయం చుట్టూ చూశాం. కలలో నన్ను దీవించిన అదే పుణ్యక్షేత్రంలో మోకాళ్ళ మీద వంగి నమస్కరించుకున్నాను. ఆలయంలో కొంతసేపు కూర్చుని సంతోషంగా తిరిగి బయలుదేరాము. మేము మా ప్రయాణం మొదలుపెట్టిన ఒక నిమిషం తరువాత వెనక్కి తిరిగి చూస్తే పెద్ద బాబా చిత్రం కనిపించింది. ఆ మారుమూల గ్రామంలో అంతపెద్ద బాబా ఫోటో కనిపించడం ఒక అద్భుతమే కదా!! నేను చాలా సంతోషించాను. బాబాకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. నేను కేవలం నా కళ్ళు మూసుకొని కూర్చున్నాను, బాబా నా విశ్వాసాన్ని బలపర్చడానికి నేను ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి తీసుకుని వెళ్లారు!! ఎంత అద్భుతమో కదా ఇది.

మేము చెన్నైకి చేరుకున్నాము. కానీ మా నాన్న, మా కజిన్ మాత్రం "అనుకున్న దారి తప్పి ఆ మార్గంలోకి ఎలా వెళ్ళామా?" అని ఆశ్చర్యపోయారు. వారు దారి తప్పకుండా చాలా జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఎక్కడ, ఎలా దారితప్పారో వారికే అర్ధం కాలేదు. చివరకు మా కజిన్, "ఆ దేవాలయాన్ని నువ్వు సందర్శించాలని దేవుడు కోరుకున్నాడేమో?" అని అన్నాడు. ఆ రోజు నేను చాలా సంతోషించాను.

సాయిరాం.

2 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo