సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

ఆపరేషన్ చేయించుకోవద్దని సాయిసందేశం.


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

సాయిబంధువులందరికీ సాయిరాం. నా పేరు నిర్మల. బాబా అంటే నాకు చాలా ప్రేమ. ఎంతప్రేమంటే మాటల్లో చెప్పలేను. నేను ఏది చేసినా బాబాకు చెప్పి చేస్తాను. ఎల్లప్పుడూ ఆయనని స్మరిస్తూ ఉంటాను. కొన్నినెలల క్రితం నాకు కడుపులో భరించలేనంత నొప్పిగా ఉండడం వలన డాక్టరు దగ్గరికి వెళ్లి పరీక్షలు చేయించుకుంటే కిడ్నీలో రాళ్లు ఉన్నాయని చెప్పారు. ఆ రాయి కూడా 16 ఎంఎం పరిమాణంలో ఉందని చెప్పారు. రెండునెలల పాటు హాస్పిటళ్ళ చుట్టూ తిరిగాను. వైద్యులు ఆపరేషన్ తప్పనిసరి అని సర్జరీకి ముందు 14 ఇంజక్షన్లు వేసి, రెండురోజుల తర్వాత ఆపరేషన్ చేయాలని చెప్పారు. నా అలవాటు ప్రకారం నాకు వచ్చిన కష్టాన్ని బాబాకి చెప్పుకొని, "బాబా! నన్నీ సమస్య నుండి గట్టెక్కించు! ఆపరేషన్ తప్పదంటున్నారు బాబా, నాకు ఆపరేషన్ అంటే చాలా భయం. నాకు నువ్వే దిక్కు, అంతా మంచి జరిగేలా చూడు బాబా!" అని వేడుకున్నాను.

ఇంక రెండురోజుల్లో ఆపరేషన్ అనగా సచ్చరిత్ర చదువుతూ ఉన్నాను. అందులో బాబా ఎన్నోరకాల వ్యాధుల బారినపడిన తన భక్తులకు తానే వైద్యుడై వైద్యం చేసి వ్యాధులను హరింపచేశాడు. అది కూడా కేవలం తన స్పర్శతో, నోటివాక్కుతో! అలా బాబా వైద్యం చేసిన తీరు చదువుతుంటే మనసును కదిలించి వేసి, మనసులో "బాబా! నాకు కూడా నీవే వైద్యం చేసి నా ఈ భాధను తొలగించవచ్చుగా!? ఆపరేషన్ కాకుండా ఏదైనా వేరొక మార్గంలో నా వ్యాధిని నయం చేయొచ్చుగా!?" అని మనస్ఫూర్తిగా ప్రార్థించాను. మరుసటిరోజు ఉదయం నేను హాస్పిటల్‌కు వెళ్తుంటే, తెల్లటి బట్టలు వేసుకున్న ఒక ముసలివ్యక్తి నా దగ్గరికి వచ్చి, "ఎక్కడికి వెళ్తున్నావ్?" అని అడిగాడు. 'హాస్పిటల్‌కి' అని నేను చెప్పాను. అంతే! అతను, "దిగులుపడకు! ఆపరేషన్ చేయించుకోకు!" అని చెప్పి వేగంగా వెళ్లిపోయాడు. అదేరోజు మధ్యాహ్నం మరో వ్యక్తి వచ్చి, "స్టోన్ పడిపోతుందిలే, దిగులుపడకు!" అని చెప్పి వెళ్ళిపోయాడు. సాయంత్రం ఒక ఆడమనిషి వచ్చి, "అస్సలు ఆపరేషన్ చేయించుకోకు. నీ ఆరోగ్యం మెరుగుపడేలా బాబా చూసుకుంటారు. బాబా మీద భారం వేసి నిశ్చింతగా ఉండు!" అని చెప్పింది. ఇలా ఒకేరోజు నలుగురు అపరిచిత వ్యక్తులు వచ్చి "ఆపరేషన్ చేయించు కోవద్ద"ని చెప్పారు. ఆ వ్యక్తుల ద్వారా బాబా నాకేదో సందేశమిస్తున్నారని కాస్త నిశ్చింతగా అనిపించింది. మరుసటిరోజు ఆపరేషన్ కోసం హాస్పిటల్‌కి వెళ్ళకుండా నేరుగా బాబా గుడికి వెళ్లి, "బాబా! నేను ఆపరేషన్ చేయించుకోను. నా ఆరోగ్యపరిస్థితి మెరుగుపడేలా మీరే చూసుకోండి" అని చెప్పుకున్నాను. ఇంట్లో వాళ్ళు మాత్రం, "ఎలాగూ ఇంజక్షన్లు వేయించుకున్నావు కదా, ఆపరేషన్ చేయించుకుంటే అయిపోతుందిగా" అన్నారు. కానీ, నేను ససేమిరా చేయించుకోనంటే చేయించుకోనన్నాను.

తరవాత బాబా సూచన ప్రకారం ఒక హోమియోపతి వైద్యుని దగ్గరకు వెళ్లి, "నేను బాబా భక్తురాలిని. నాకు కిడ్నీలో రాయి ఉంది. డాక్టరు దగ్గరికి వెళ్తే, ఏవేవో మందులిచ్చి ఆపరేషన్ చేస్తామంటున్నారు. కానీ, బాబా నన్ను ఆపరేషన్ చేయించుకోవద్దని చెబుతున్నారు.  బాబా సూచన ప్రకారం ఆపరేషన్ వద్దనుకుని మీ దగ్గరికి వచ్చాను. ఆ రాయి పడిపోయేలాగా మీరేమైనా చేయగలరా?" అని అడిగాను. ఆ వైద్యుడు నా రిపోర్ట్స్ చూసి, "16 mm రాయి కదా! అంత పెద్ద రాయి పోవడానికి ఆపరేషనే మార్గం. మందుల ద్వారా పోవడం కష్టమే కానీ, పదిరోజులు మందులు వాడి చూద్దాం" అని చెప్పారు. నేను అతనిచ్చిన మందులతో పాటు ఊదీ కూడా తీసుకున్నాను. ఇలా పదిరోజులు వాడిన తర్వాత నా ఆరోగ్యం ఎంతో కుదుటపడినట్లుగా అనిపించింది. అదే విషయం హోమియోపతి వైద్యునితో చెపితే, అతను "ఒకసారి స్కానింగ్ చేయించమ"ని చెప్పారు. ఆశ్చర్యం ఏమిటంటే, స్కానింగులో స్టోన్ లేదని వచ్చింది. నేను అసలు నమ్మలేకపోయాను. 'అదెలా సాధ్యమ'ని మరలా వేరొకచోట స్కానింగ్ చేయించుకున్నాను. అక్కడ కూడా స్టోన్ లేదనే వచ్చింది. ఎంతైనా మనుషులం కదా! అనుమానపడుతూనే ఉంటాం. ఇంకా నాకు నమ్మకం కుదరక నేను మొదట వెళ్లిన డాక్టరు దగ్గరికి వెళ్లి స్కానింగ్ చేయించాను. అక్కడ కూడా స్టోన్ లేదని చెప్పాక నాకు నమ్మకం కలిగింది. ఆ స్టోన్ ఎప్పుడు పడిపోయిందో తెలీనేలేదు. అంతా బాబా లీల. ప్రస్తుతం బాబా దయవల్ల నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. ఆపరేషన్ అంటే చాలా భయపడిపోయి బాబాను ప్రార్థించాను. కరుణతో ఆయన ఆపరేషన్ లేకుండా నన్ను కాపాడారు. "ఈ జన్మంతా మీ పాదపూజ చేసుకుంటూ బ్రతకగలిగితే నాకంతే చాలు. ఈ జన్మకు ఈ వరాన్ని ప్రసాదించు బాబా!" అని వేడుకున్నాను. నేను కోరుకున్నట్లుగానే ఆయన తమ పాదుకలు మాకు వచ్చేలాగా అనుగ్రహించారు. 

"బాబా! ప్రతిరోజు మీ పాదపూజ చేసుకుంటూ, సచ్చరిత్ర చదువుకుంటూ మీ స్మరణలో సంతోషంగా ఉన్నాను. మీ అనుగ్రహం అందరిమీదా సదా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను".

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo