సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

"బాబా చూపిన ప్రేమ విలువ - మా నాన్నగారి ఆయుష్షు".


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

సాయిబంధువులందరికీ సాయిరాం. మాది హైదరాబాదు. నేను ఈ బ్లాగులోని బాబా లీలలను నాకు వీలైనప్పుడు చదువుతూ ఉంటాను. పన్నెండు సంవత్సరాల క్రితం నా జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన లీలను ఈ బ్లాగు ద్వారా మీకు తెలియజేయడం చాలా ఆనందంగా ఉంది. బాబా నా కుటుంబంపైన చూపిన ప్రేమను తిరిగి గుర్తుచేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆ ప్రేమ విలువ మా నాన్నగారి ఆయుష్షు.

2006 నవంబర్ 20న జరిగిన లీల ఇది. మా నాన్నగారికి సిగరెట్ త్రాగే అలవాటు ఉండేది. మేము ఎంతగా ప్రయత్నించినా దానిని మాన్పించడంలో విఫలమయ్యాము. హఠాత్తుగా నాన్నగారి ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది. నాన్నని నిమ్స్ హాస్పిటల్‌కి తీసుకుని వెళ్ళాక, ఆయన ఊపిరితిత్తులకి ఇన్ఫెక్షన్ వచ్చి 80% వరకు ఊపిరితిత్తులు మూసుకుపోయాయని, దానిని COPD(Chronic Obstructive Pulmonary Disease) అంటారని తెలిసింది. ఆయన పరిస్థితి చాలా విషమంగా మారింది. ఎంతలా అంటే ఊపిరి తీసుకోవటం కూడా చాలా కష్టమయ్యేంతలా. ఆక్సిజన్ మాస్క్‌తోటే శ్వాస తీసుకుంటున్నారు. వారంరోజులు డాక్టర్స్ పర్యవేక్షణలో హాస్పిటల్‌లో ఉంచారు. ఆ వారంపాటు మేమెంత బాధపడ్డామో మాటల్లో వర్ణించలేను. తర్వాత ట్రీట్మెంట్ కోసం అమెరికానుండి ఒక డాక్టరుని పిలిపించారు. నాన్న ఉన్న ఆ పరిస్థితిలో వెంటిలేటరుపై ఉంచాలని డాక్టర్ చెప్పారు. నేను దానికి అస్సలు ఒప్పుకోలేదు. ఎందుకంటే వెంటిలేటర్ పెట్టిన వ్యక్తికి కృత్రిమంగా శ్వాస అందిస్తారు. దాని నొప్పి భరించలేనంతగా ఉంటుందని నాకు తెలుసు. తెలిసితెలిసి నా కళ్ళముందు నాన్న అంతగా బాధపడడం నాకు ఇష్టంలేదు. కానీ వెంటిలేటర్ పెట్టకపోతే మాములుగా శ్వాస తీసుకునే అవకాశం చాలా తక్కువని కుడా నాకు తెలుసు. నాకు తెలిసిన ఈ విషయాలన్నీ డాక్టరుతో మాట్లాడి, వెంటిలేటర్ కాకుండా వేరే ఏదైనా పద్ధతిలో ట్రీట్మెంట్ చేయమని అభ్యర్ధించాను. కానీ నేను తీసుకున్న నిర్ణయం మా బంధువులకు, డాక్టర్‌‌కి నచ్చలేదు. మరుసటిరోజు అమెరికానుండి వచ్చిన డాక్టర్ నాతో మాట్లాడుతూ, "COPDతో బాధపడుతున్న వాళ్లకి ఒక ఇంజక్షన్ ఉంటుంది, కాకపోతే అది చాలా ఖరీదైనది. అది గనక ఇస్తే మీ నాన్నగారు ముందులాగా శ్వాస తీసుకోగలుగుతారు. లేదంటే తన మీద ఆశ వదులుకోవాల్సిందే. అయితే, ఆ ఇంజక్షన్ తీసుకున్న వ్యక్తి మీద 50% ఛాన్స్ మాత్రమే ఉంటుంది, బాగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి" అని చెప్పారు.

ఇక సమస్య లైఫ్ అండ్ డెత్ సమస్యగా మారిపోయింది. నాన్న పడే బాధను చూడలేక చాలా ధైర్యం చేశాను. ఆ ధైర్యం విలువ నాన్న ప్రాణం అని తెలుసు. అంతా సజావుగా సాగితే నాన్న ప్రాణాలను బహుమతిగా పొందుతాను, అలా కాకుంటే మా జీవితాలలో చీకటిని బహుమతిగా పొందుతాను. అతికష్టంమీద అమ్మని ఒప్పించి డాక్టర్‌‌కి ఇంజెక్షన్ చేయడానికి మా సమ్మతి తెలియజేశాము. అందుకు డాక్టర్, "24 గంటల తర్వాత ట్రీట్మెంట్ చేసి ఇంజక్షన్ వేస్తామ"ని చెప్పారు.

అప్పటికి నేను భగవంతుడిని అస్సలు నమ్మేవాడిని కాదు. కానీ బాబా అంటారుగా - "నా భక్తులను పిచ్చుక కాలికి దారంకట్టి లాగినట్టుగా నావద్దకు లాగుతాను" అని. నా విషయంలో అదే జరిగింది. నాన్నని ఐసియులోకి మార్చారు. ఆ రోజు రాత్రి నాన్నగారి చెల్లెలు అంటే మా మేనత్త హాస్పిటల్‌‌కి వచ్చారు. తను మంచి సాయిభక్తురాలు. తను మా నాన్నగారి పేరుమీద సాయిబాబా గుడిలో అర్చన చేయించి, ధుని చుట్టూ ప్రదక్షిణలు చేసి, ఊదీ తీసుకుని వచ్చి నా కళ్ళముందే నాన్న నుదుటిపైన పెట్టి బాబాను ప్రార్థించింది. తను నాతో, "బాబా మీద పూర్తి నమ్మకముంచు. అంతా బాబా చూసుకుంటారు" అని చెప్పింది. భగవంతుడంటే నమ్మకమే లేని నేను ఆ క్షణంలో మాత్రం తను చెప్పిన మాటను నమ్మి  బాబాపై సంపూర్ణ విశ్వాసం ఉంచాను.

ఇరవై రోజుల ముందునుండి ప్రతిరాత్రి రెండు, మూడు గంటలకోసారి ఆయనకు శ్వాస తీసుకోవడం కష్టమవుతూ ఉండేది. అందువలన ప్రతిరోజూ డాక్టర్స్ నాన్న పక్కనే ఉండి చూసుకునేవారు. ఊదీ ధరించిన రోజు మాత్రం అందుకు భిన్నంగా జరిగింది. ఆయన ఆక్సిజన్ సహాయం లేకుండా సహజంగానే శ్వాస తీసుకున్నారు. 20 రోజులనుండి సరిగా నిద్రలేని కారణంగా ఆ రాత్రి నాకు, మా అమ్మకు ఎంతో మత్తుగా నిద్రపట్టేసింది. ఉదయం వచ్చేసరికి నాన్న ఆక్సిజన్ మాస్క్ పక్కకు తీసేసి ఉంది. అలా చూడటంతో, 'ఆయన ప్రాణాలతోనే ఉన్నారా?' అనే సందేహంతో నాకెంతో భయమేసింది. వెంటనే డాక్టర్‌‌ని పిలిచాము. డాక్టర్ వచ్చి చెక్ చేసి ఆశ్చర్యంగా, "ఊపిరితిత్తుల పనితీరు చాలా మెరుగ్గా ఉంది. రాత్రికి రాత్రి ఏం జరిగింది?" అని అడిగారు. "రాత్రి బాబా ఊదీ పెట్టామ"ని చెప్పాం. ఆ మాట చెప్పాక ఆ అమెరికా డాక్టర్ బాబా గురించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుని, "భగవంతుని అనుగ్రహం మీపై ఉంది, నిజంగా ఇది వైద్యచరిత్రలోనే ఒక అద్భుతం! మరువలేని లీల!" అని చెప్పారు. తరువాత బాబామందిరం నుండి ఊదీ తెప్పించి, తానే  స్వయంగా అందరికీ పంచి, దానిని పెట్టుకోమని చెప్పారు. అంతేకాకుండా, "మేమెంత డాక్టర్లమైనా భగవంతుడి అనుగ్రహం ఉండాలి. మేము చేసేది ఏమీ ఉండదు, అంతా ఆయన నిర్ణయమే" అని అన్నారు. అయితే ఊదీ పెట్టిన రాత్రి ఏం జరిగిందో ఆ బాబాకే తెలియాలి. "నా చర్యలు అగాధాలు" అని ఆయనే చెప్పారు కదా!

ఇంజక్షన్ ఇవ్వకుండానే పేషెంట్ కోలుకొని ప్రమాదంనుండి బయటపడ్డాడన్న వార్త నిమ్స్ హాస్పిటల్ మొత్తం ప్రాకిపోయింది. దానితో అందరూ వచ్చి జరిగింది అడిగి నాన్నని చూసి వెళ్లారు. ఎంతో దిగులుగా హాస్పిటల్‌‌కి వెళ్ళిన మేము బాబా చూపిన కరుణతో ఎంతో సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చాము. అంతా బాబా దయ, తన భక్తులపై ఆయనకి ఉన్న ప్రేమ. అప్పటినుండి నేను బాబాభక్తుడిగా మారిపోయాను. ప్రస్తుతం బాబా నీడలో మా నాన్నగారు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఆయనపై దృఢవిశ్వాసముంచితే మన కోరిక ఏదైనా సరే నెరవేరుతుంది.
థాంక్యూ బాబా!

మరొక లీలతో మరల మీముందు ఉంటాను.

మీ
MD.

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo