సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

నాస్తికుడిని గొప్పభక్తునిగా మలిచిన శ్రీసాయి.


 శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

"1974 వరకు నేను నాస్తికుణ్ణి. కానీ హఠాత్తుగా ఆ సంవత్సరం డిసెంబర్ నెలలో మొత్తం మారిపోయింది" అని అంటారు నాగపూర్ నివాసి ఎస్.డి.మహాజన్. అతను నాగపూర్ స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసులో పని చేస్తుండేవాడు. ఒకసారి కంప్యూటర్ కోర్సు ట్రైనింగ్ కోసం అతనిని భోసారికి పంపారు. అతని కోర్సు పూర్తి అయిన తరువాత మహరాష్ట్ర సందర్శించడానికి రెండురోజులు సెలవు మంజూరు చేసారు. తిరుగు ప్రయాణానికి టికెట్ రిజర్వు చేసుకున్న తరువాత ఒక స్నేహితుడు కలిసి మహాజన్‌ను శిరిడీ వెళ్ళమని ప్రాధేయపడ్డాడు. శిరిడీ వెళ్ళకుండా ఉండటానికి ఎన్నో కారణాలు చెప్పి తప్పించుకోజూశాడు మహాజన్. అంతలో అతని ప్రక్కనే ఒక వృద్ధుడు నిల్చొని, "అతను శిరిడీ వెళ్ళమని అంతలా బతిమాలుతుంటే ఎందుకు నిరాకరిస్తున్నావు?" అని అన్నాడు. మహాజన్ అతనివైపు కోపంగా చూస్తూ, "వ్యక్తిగతమైన విషయాలలో మాట్లాడటానికి మీకేం అధికారం ఉంది?" అని ఇంగ్లీషులో కోప్పడ్డాడు. మహాజన్ కోపంగా అతనివంక చూస్తున్నప్పటికీ అతను చిరుమందహాసం చేస్తూ మహాజన్ భుజాల మీద చేతులు వేసి, "నీవు తప్పక శిరిడీ వెళ్తావు" అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ వృద్ధుడు మహాజన్ భుజాల మీద చేతులు వెయ్యగానే నమ్మశక్యంకాని మార్పు అతనిలో కలిగి వెంటనే శిరిడీ వెళ్ళటానికి అంగీకరించాడు.

మహాజన్ టికెట్‌ని అతని స్నేహితుడు తీసుకొని, బదులుగా అతని శిరిడీ ప్రయాణం కోసం పాస్ ఇచ్చాడు. అలా చెయ్యడం నేరమని తెలిసినా లెక్కచెయ్యలేదు. మహాజన్ శిరిడీ బస్సు ఎక్కాడు. అతని స్నేహితుడేమో నాగపూర్‌కి తిరిగి వెళ్లాడు. మహాజన్‌కు శిరిడీ గురించి ఏమీ తెలియదు. కాని శిరిడీలో దిగిన వెంటనే, ఇదివరకు మాట్లాడిన వృద్ధుడు మహాజన్ ముందు నిలిచి, "మనిద్దరికీ భోజనానికి టికెట్లు తెచ్చాను, అలాగే నీకు వసతి కూడా ఏర్పాటు చేసాను. కాకపోతే వేడినీళ్ళు లేవు, ఇప్పటికి సర్దుకొని శుభ్రపరచుకో, భోజనానికి వెళ్దాము" అని చెప్పాడు. ఆ వృద్ధుడు అన్ని విషయాలూ జాగ్రత్తగా చూసుకున్నాడు. మర్నాడు ఆ వృద్ధుడు మళ్ళీ భోజనానికి తీసుకుని వెళ్ళాడు. కానీ అతని ప్రవర్తన వింతగా ఉంది. ఏదో ఆగకుండా మాట్లాడుతూ అసహజమైన రీతిలో చేతులను కదిలిస్తున్నాడు. తరువాత తన చేతులను, తలను పైకెత్తి, "అతను రక్షింపబడ్డాడు, లేకపోతే అతను అనవసరంగా చనిపోయేవాడు. ఆ టికెట్ నీ పేరుమీద ఉన్నందున నీవు కూడా ప్రమాదానికి గురయ్యేవాడివి" అని అన్నారు. మహాజన్‌కు అతను చెప్పింది ఒక్కటి కూడా అర్థం కాలేదు. భోజనం తరువాత మహాజన్ ఆ వృద్ధుడు చెప్పిన దాని గురించే ఆలోచించాడు. తరువాత అతనికి తెలిసింది ఏమిటంటే, తన మిత్రుడు ప్రయాణం చేసిన బస్సు భయంకరమైన ప్రమాదానికి గురయ్యిందని, అందులో చాలామంది చనిపోయారని. మహాజన్ తన మిత్రుడు క్షేమంగా ఉన్నాడా? లేడా? అని దిగులుపడసాగాడు. తరువాత విచారించగా, అతని మిత్రుడు క్షేమంగా ఉన్నాడని, ఎందుకంటే అతను ప్రయాణాన్ని మధ్యలో ఆపేసాడని, అదికూడా ఆ వృద్ధుడు 'అతడు అనవసరంగా చనిపోయేవాడ'ని చెప్పిన సమయంలోనే జరిగిందని తెలిసింది. ఆ క్షణం అతనికి అర్థం అయ్యింది, ఆ వృద్ధుడు బాబా అని, బాబానే తన మిత్రుడి ప్రాణాన్ని కాపాడారని. మహాజన్ పెద్ద నేరం నుంచి బయటపడ్డాడు. ఎందుకంటే, మహాజన్ టికెట్‌తో అతని స్నేహితుడు ప్రయాణంచేసాడు. బాబా ప్రతి చిన్న విషయంపై శ్రద్ధ వహించి చక్కటి ప్రణాళికతో అతని మొత్తం ప్రయాణాన్ని మలిచారు. అంతటితో ఆ నాస్తికుడు గొప్పభక్తునిగా మారాడు.

సోర్స్: శ్రీసాయి సాగర్ మ్యాగజైన్ జులై - ఆగష్టు 2006.


No comments:

Post a Comment

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo