కాలాతీతుని దినచర్య
బాబా లెండీనుంచి మసీదు తిరిగి వచ్చేసరికి ఉదయం పదిగంటలయ్యేది. అప్పటినుండి పదకొండున్నర వరకు సాయిదర్బారు జరిగేది. అపుడు బాబా వద్దకు వెళ్ళే భక్తులు కొందరు తమ బాధలు చెప్పుకునేవారు. కొందరు సలహాలు అడిగేవారు. మరికొందరు తమ కోర్కెలు తీర్చమని ప్రార్థించేవారు. వీళ్ళందరితో పాటు గాయకులు, నర్తకులు, గారడీవాళ్ళు వచ్చి తమ విద్యలు ప్రదర్శించి బాబా యిచ్చే బహుమానం పుచ్చుకుని వెళ్ళేవారు. సామాన్యంగా, వారికి బాబా రెండు రూపాయలు ఇచ్చేవారు. కొందరు బాబాకు నైవేద్యాలు సమర్పించుకునేవారు. సాధారణంగా, బాబా వాటిని తమ చేత్తో తాకి, తిరిగి వారికే ఇచ్చేసేవారు. లేదా, ప్రసాదంగా అక్కడున్న భక్తులందరికీ పంచమనేవారు. చాలా అరుదుగా మాత్రమే ఆ పళ్ళాలనుంచి కొద్దిగా తీసుకుని నోటిలో వేసుకునేవారు. ఎవరి పళ్ళెంలోంచి బాబా స్వీకరించారో వారు ఎంతో ఉప్పొంగిపోయేవారు. మామిడిపళ్ళ కాలంలో బాబా ప్రతిరోజూ ఒక పండుని తీసుకుని దానిని కొద్దిగా రుచిచూసి మిగిలినవారికి పంచేవారు. ఒక్కోసారి స్వయంగా ఆయనే పండ్లుకొని అందరికీ పంచమనేవారు. బాబా తమకు నైవేద్యంగా తెచ్చిన మధురపదార్థాలను పిల్లలకు ఎక్కువగా పెట్టేవారు. తన దగ్గరకు ఎప్పుడూవచ్చే పిల్లలకైతే ఒకవేళ వారప్పుడు లేకున్నా, వారికోసమని తినుబండారాలను తీసి పక్కన పెట్టేవారు. పిల్లలంటే బాబాకు ఎంతోప్రీతి. వారితో ప్రేమగా లాలిస్తూ మాట్లాడేవారు. ఎవరైనా పిల్లలను అదిలించటం, కొట్టటం ఆయన సహించేవారు కాదు.పిల్లలంటే అలా మక్కువచూపే బాబా పెద్దవారితోనుండేటపుడు ఎక్కువగా మితభాషిగానే వుండేవారు. నవ్వినా చిరునవ్వేకానీ, పెద్దగా నవ్వేవారుకాదు. ప్రసన్నంగా వున్నపుడు మాత్రం చిన్నచిన్న కథలు చెప్పేవారు. ఆ సమయానికి అక్కడున్న భక్తబృందంలో ఎవరికో ఒకరికది మొత్తం తమ జీవితకథ అని తెలుసుకొని అబ్బురపడేవారు. ఒక్కోసారి వాటిలోనే మందలింపులూ వుండేవి. ఆ పరిభాష దానికి సంబంధించినవారికి మాత్రమే అర్ధమయ్యేది. మిగిలినవారు అవి ఎవరికో సంబంధించిన కథో లేక పూర్వజన్మవృత్తాంతమో అనుకునేవారు. ఒక్కోసారి బాబా చెప్పిన కథలు విన్న భక్తులందరూ వాటిని పూర్తిగా మర్చిపోయేవారు. అందరూ కలిసి గుర్తుచేసుకుందామన్నా గుర్తుకువచ్చేవికావు. అది చాలా వింతగా అనిపించేది.
ఇక పదకొండున్నరకి మసీదు ముందున్న గంటను వాయించేవారు. అది ఆరతికి వేళయిందన్న దానికి సంకేతం. ఆ ఘంటానాదం విని యెక్కడున్నవారూ ఆరతికి హాజరయ్యేందుకు వడివడిగా మసీదుకు చేరేవారు. పన్నెండుగంటలకు ఆరతి మొదలయ్యేది. బాబానపుడు గంధపుష్పాదులతో పూజించేవారు. స్త్రీలు బాబాకు ముందు మసీదులో నిల్చునేవారు. పురుషులంతా మసీదు బయటనున్న ఖాళీజాగాలో నిలబడేవారు.
ఆరతివేళలలో బాబాలో కనబడే దివ్యతేజస్సు, వర్ఛస్సు, అలౌకికసౌందర్యం చూచేందుకు రెండుకనులూ చాలేవి కావని ఆ ఆరతుల మహత్తర దృశ్యాలను చూసిన ఆనాటి భక్తులు తమ డైరీలలో పొందుపరచుకొన్నారంటే (ఉదా.. శ్రీఖాపర్డే డైరీ) అవెంత మనోహరంగా ఉండేవో మనమూహించుకోవచ్చు!
మధ్యాహ్నఆరతి అయ్యాక బాబా అందరికీ ఊదీ ఇచ్చి ఆశీర్వదించి ఇళ్ళకు పంపేవారు. భక్తులను ప్రేమగా పలకరించి భోంచేసి రమ్మని చెప్పేవారు. ఆ తరువాత తాను తెచ్చిన భిక్షాన్నానికి కొంత నైవేద్యాలను కలిపి పది పన్నెండుమంది భక్తులతో కలిసి భోజనం చేసేవారు. బాబాకు ఎడంవైపు తాత్యాపాటిల్, రామచంద్రపాటిల్, బయ్యాజీపాటిల్ కూర్చునేవారు. కుడివైపున మాలేగాంఫకీర్ (బడేబాబా), షామా, బూటీ, కాకాసాహెబ్ దీక్షిత్ కూర్చునేవారు. తాత్యా, రామచంద్రపాటిల్, బయ్యాజీపాటిల్ ఒక కంచంలోనూ, బాబా, మాలేగాంఫకీర్ లు కలిసి మరోకంచంలోనూ భోంచేసేవారు. బాబా తమ మధ్యాహ్నభోజనం ఎప్పుడూ ఒంటరిగా చేసేవారుకాదు. బడేబాబా లేకుండా భోజనానికి కూర్చునేవారు కారు. భోజనానికి కూర్చున్న తర్వాత మసీదు ముందు పరదాలు దించేవారు. పరదాలు వేసిన తరువాత మసీదు లోపలికి ఎవ్వరూ వెళ్ళేవారు కాదు. భక్తులు కాళ్ళు చేతులు కడుక్కుని బాబాకు ఇరువైపులా వరుసగా భోజనానికి కూర్చోగానే, బాబాకు నైవేద్యంగా సమర్పించుకొన్న పదార్థాలన్నింటినీ కలిపి బాబా ముందుంచేవారు. బాబా దాన్ని ముందు దైవానికి నివేదించి, కొంతభాగాన్ని ప్రసాదంగా మసీదు బయటవున్న వారికి పంచమని పంపేవారు. మిగిలినదానిలో ఒకభాగం పాలు, ఒకభాగం పంచదార, ఒకభాగం రొట్టె ఒకగిన్నెలో వేసి బాగా పిసికి దానిని అందరికీ పంచేవారు. తరువాత మసీదులో భోజనానికి కూర్చున్నవారందరికీ నిమోన్కర్, షామా వడ్డన చేసేవారు. ఎవరికైనా వారికిష్టమైన పదార్ధం వుంటే బాబా దాన్ని వారికెక్కువ వడ్డించమనేవారు. షామాకు ఎక్కువగా పాయసం వడ్డించమనేవారు. యం. డబ్ల్యు. ప్రధాన్ మసీదులో భోజనకార్యక్రమం గురించి ఇలా చెప్పారు: “బాబాతో మసీదులో నేను భోజనం చేసేవాడిని. బాబా తమ స్వహస్తాలతో మా పళ్ళాలనిండుగా ఆహారాన్నుంచేవారు. దానిలో కొంతభాగాన్ని ఇంటికి పంపేవాడిని. అదే ఇంటిల్లిపాదికీ సరిపోయేది. బాబా భోజనం చివరిలో అందరికీ ఒక పండు ఇచ్చేవారు. మా అబ్బాయి బాబుకు వండిన పదార్ధాలంటే ఇష్టంలేదని గమనించి వాడికి భోజనం బదులుగా పండ్లను ఇచ్చేవారు.”
ఒక్కోసారి బాబా భక్తులకు స్వయంగా వంటచేసి విందుచేసేవారు. ఆయన దగ్గర యాభై మరియు వందమందికి వండడానికి సరిపడే రెండు పాత్రలుండేవి. వంట చేయాలనుకున్న రోజు అంగడికి వెళ్ళి కావలసిన సరుకులన్నీ తెచ్చుకోవడం, పొయ్యివెలిగించి ఎసరుపెట్టటం, దినుసులు నూరడంలాంటి పనులన్నీ ఆయనే స్వయంగా చేసుకునేవారు (బాబా ఉపయోగించిన ఆ పొయ్యిని మనమీనాటికీ మసీదులో చూడవచ్చు). చక్కెరపొంగలి, పరమాన్నం లేదా మాంసపుపలావు వండేవారు. ఉడుకుతున్న గుండిగలో గరిటె బదులు చేత్తోనే బాగా కలిపేవారు. కానీ, ఆశ్చర్యంగా ఆయన చేయి ఏమాత్రం కాలేదికాదు. పులుసు కాచి, గోధుమరొట్టెలు వేసేవారు. అంబలికాచి మజ్జిగ కలిపిచ్చేవారు. లేదా, గోధుమలు తానే విసరి ఆ పిండితో పెద్ద పెద్ద చపాతీలు చేసి ధునిపై కాల్చేవారు. పొరలు పొరలు వుండే అంత పెద్ద చపాతీ ఎవరికైనా ఒక్కటి తింటేనే కడుపునిండిపోయేది. మాంసాహారాన్ని వండుతుంటే శాఖాహారులను అటు రానిచ్చేవారుకాదు. వంట పూర్తవగానే మౌల్వీచేత నివేదన చేయించి అందులో మొదట కొంత మహల్సాపతికి, కొంత తాత్యా యింటికి పంపి ఆ తరువాత అందరికీ పంచేవారు. 1910 తర్వాత భక్తులరాక ఎక్కువై, నైవేద్యాలు కూడా ఎక్కువవటంతో బాబా వంట చేయటం ఆపేసారు. భక్తులు బాబాకు సమర్పించే నైవేద్యాలతో సుమారు 150-200 మంది భోజనం చేసేవారు.
బాబా ఉపయోగించిన పొయ్యి |
భోజన కార్యక్రమమయ్యాక మసీదులో ఎవరూ వుండేవారు కాదు. అందరినీ ఇళ్ళకు పంపించి బాబా ఒక్కరే ఒంటిగంట నుంచి రెండున్నరదాకా ఏకాంతంగా వుండేవారు. బాబా ఒక ఇటుకరాయిని ఎప్పుడూ తనతో వుంచుకుని ఎంతో అపురూపంగా చూసుకునేవారు. అది తన గురుప్రసాదమని చెప్పేవారు. కూర్చున్నప్పుడు, తన కుడిచేతిని ఆ రాయిమీద పెట్టుకునేవారు. బాబా పగలు నిద్రించేవారు కాదు. కూర్చున్నప్పుడు గోడకు ఆనుకునేవారు కాదు. ఆ సమయంలో ఎవరికీ కనిపించని విధంగా ఒంటరిగా కూర్చుని ఒక చిన్న పాతగుడ్డసంచిని బయటకు తీసేవారు. అందులో అరిగిపోయిన పాత నాణాలుండేవి. పావలాలు, అర్థలు, అణాలు, పైసలు ఇలా వుండే ఆ నాణాలను బాబా చేత్తో బాగా రుద్దుతూ, “ఇది నానాది, ఇది కాకాది, ఇది సోమ్యాది, ఇది దామ్యాది” అని అంటూ వుండేవారు. అప్పుడు పొరపాటున ఎవరివైనా అడుగులచప్పుడు వినిపించినట్లనిపిస్తే, చప్పున వాటిని సంచీలో వేసి దాచేసేవారు. ఆ కాసులేమిటో, ఎందుకలా బాబా వాటిని అరగదీస్తుండేవారో ఎవరికీ తెలియదు. బాబా ఎన్నడూ వాటి గురించి ఎవ్వరికీ చెప్పలేదు. అప్పుడపుడు ఆ ఏకాంత సమయంలోనే తన పాత కఫ్నీకి చిరుగులుంటే వాటిని నేర్పుగా కుట్టుకుంటుండేవారు.
మూలం: సాయిపథం ప్రధమ సంపుటం
🕉 sai Ram
ReplyDelete🌺🌼🙏Om Sri Sairam 🙏🌼🌺
ReplyDeleteSai Eswara Neeve maaku divam, neeve maa swargam 🙏🙏🙏
ReplyDelete