నా పేరు ధాన్యశ్రీ. మాది కొండపల్లి. నేను 8వ తరగతి చదువుతున్నప్పుడు చదువు విషయంలో అశ్రద్ధగా ఉంటుంటే, శ్రద్ధగా చదవాలంటూ స్వయంగా బాబా వచ్చి చెప్పిన అనుభవాన్ని ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. మా అమ్మ సాయిభక్తురాలు. ఎప్పుడూ 'బాబా!...బాబా!' అంటూ బాబానే తలచుకుంటూ ఆయనకి పూజలు చేస్తూ ఉంటుంది. 2018, డిసెంబర్ నెల రెండో వారంలో ఒకరోజు అమ్మ నేను బాగా చదువుకోవట్లేదని, చదువులో వెనుకబడ్డానని చాలా బాధపడి నన్ను తిట్టింది. తరువాత బాబా ముందు కూర్చుని చాలాసేపు ఏడ్చింది. అమ్మని అలా చూసి నాక్కూడా బాధేసి నేను కూడా ఏడ్చేసాను.
ఆ మరుసటిరోజు మా ఇంటికి ఒక ముసలివ్యక్తి వచ్చాడు. ఆయన చిరిగిన పాతబట్టలు ధరించి, గడ్డంతో చూడటానికి అచ్చం బాబా వేషంలోనే ఉన్నారు. ఆయన నాతో, "ఎందుకు మీ అమ్మ మాటను వినడం లేదు? అమ్మ చెప్పినట్లు మంచిగా చదువుకో!" అని చెప్పారు. నేను తనవైపు కోపంగా చూసి, "నీకు వచ్చా చదువు?" అని మనసులో అనుకున్నాను. అంతే! తాను తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఇంకా ఏవేవో నాకు తెలియని భాషల్లో మాట్లాడుతూ, "నేను అన్‌ఎడ్యుకేటెడ్ పర్సన్(చదువురానివాడిని) అనుకుంటున్నావా? నేను ఎడ్యుకేటెడ్ పర్సన్‌ని, గుర్తుంచుకో!" అని అన్నారు. నేను ఆశ్చర్యంగా తనని చూస్తుంటే, "బాగా చదువుకో, సరేనా?" అని ఆశీర్వదించి వెళ్ళిపోయారు.
తరువాత అమ్మతో నేను జరిగిన విషయం చెప్తే, "ఆ ముసలివ్యక్తి వేరెవరో కాదు, బాబాయే!" అని అంది. నాకు నోటమాట రాలేదు. ఇంకా అమ్మ "నేను బాధపడ్డ విషయం బాబాకు తెలుసు. నిన్ను తిట్టిన విషయం ఆ బాబాకి, నీకే తెలుసు. మరి, ఆ వచ్చిన వ్యక్తి అన్నీ తెలిసినవానిలా మనిద్దరి మధ్య జరిగిన సంఘటనకు అనుగుణంగా అంత స్పష్టంగా చెప్పారంటే ఆయన బాబా కాక ఇంకెవరవుతారు? నువ్వు బాబాను స్వయంగా చూసావు, చాలా అదృష్టవంతురాలివి" అని అంది. అప్పుడు నేను, "ఇకపై నేను మంచిగా చదువుకుంటాను. నిన్ను, బాబాని ఇద్దరినీ కష్టపెట్టను" అని అమ్మకి మాటిచ్చాను.
🕉 sai Ram
ReplyDelete