సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

బాబా! ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉండండి.... రెండవ భాగం.


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

2. బాబా నాకు శ్రీవారి సేవలో పాల్గొనే అవకాశమే కాకుండా అరగంటపాటు స్వామి దర్శనం అయ్యేలా అనుగ్రహించిన అనుభవం.

నాకు ఎప్పటినుంచో శ్రీవారి సేవ చేసుకోవాలని కోరికగా ఉండేది, కానీ నాకు ఆ అవకాశం వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే నేను ఉద్యోగస్థురాలిని కావడంవల్ల వారంరోజులపాటు సెలవు పొందటం చాలా కష్టమైన పని. మా కజిన్స్ ఎప్పుడు సేవకి వెళ్ళినా, నాకు ఆ భాగ్యం ఎప్పుడు వస్తుందో అని మనసులో దిగులుగా అనిపించేది. "అసలు జీవితంలో ఒక్కసారైనా స్వామి సేవకి వెళ్ళగలుగుతానా?" అని కూడా అనిపించేది. మనం ఇలా దిగులుపడతామేగాని, బాబాకి తన పిల్లల ప్రతి కోరిక తెలుసు. అవి సమంజసమైనవైతే ఆయన నెరవేరుస్తూ ఉంటారు. కాబట్టి బాబా నాకు శ్రీవారి సేవకి అవకాశమివ్వడమే కాకుండా మరపురాని అనుభూతులను కూడా ప్రసాదించారు. ఆ మధుర స్మృతులను ఇప్పటికీ నేను ఆస్వాదిస్తున్నాను.

2017 జూన్‌‌లో మా కజిన్స్ శ్రీవారి సేవకి వెళ్ళడానికి ప్రణాళిక వేసుకున్నారు. నేను 2017 మేలోనే కొత్తగా ఒక కంపెనీలో జాయిన్ అయివుండటంతో వారంరోజులపాటు సెలవు దొరకడం అసాధ్యం. అయితే మా కజిన్స్ ఒక ప్రణాళిక వేసి, శ్రీవారి సేవకి నమోదు చేసుకోవడానికి వారాంతంలో నన్నొకసారి తిరుపతి రమ్మని చెప్పారు. వాళ్ళ ఆలోచన ఏమిటంటే, అన్నిరోజులు నాకు సెలవు దొరకదు కాబట్టి కనీసం ఒక్కరోజు దేవాలయం లోపల నేను సేవ చేసుకుంటే, మిగిలినరోజులు నాకు బదులుగా వేరొకరిని సేవకి ఏర్పాటు చేసుకోవడమన్నమాట. ఆ ప్రణాళిక ప్రకారమే మేము ముందుకిపోవాలని తేదీలు నిర్ణయించుకున్నాం. కానీ నా దురదృష్టమేమిటంటే, అదేవారంలో నేను ట్రైనింగ్‌‌కి వెళ్ళాల్సి వచ్చింది. నాకు చాలా బాధగా అనిపించింది. కానీ ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుందని మనసులోనే అనుకొని బాబాని ప్రార్థించి, సమస్యను బాబా చేతిలో ‌‌పెట్టి ప్రశాంతంగా ఉన్నాను. ఆరోజు రాగానే ముందుగా అనుకున్నట్టుగానే శనివారంనాడు తిరుపతి వెళ్ళి సేవకి నమోదు చేసుకొని, ఆదివారంనాడు సేవ కూడా చేసుకొని, ఆ రాత్రికే బస్సులో బెంగళూరుకి తిరిగి వచ్చేసాను.

ఆశ్చర్యాలలోకే ఆశ్చర్యం! నేను ఆఫీసుకి వెళ్ళగానే ట్రైనింగ్ రద్దయిందని తెలిసింది. ట్రైనింగ్ ఇవ్వవలసినతనికి డయేరియా రావడంతో ట్రైనింగ్ రద్దయింది. ఆనందభాష్పాలతో నా కళ్ళు నిండిపోగా బాబాకి కృతజ్ఞతలు తెలుపుకున్నాను. మా కజిన్స్ ఏర్పాటుచేసిన సేవ అవకాశాన్ని వదులుకోవడం ఇష్టంలేక ధైర్యంచేసి మా మేనేజర్‌‌ని ఒకవారంపాటు సెలవు కావాలని అడిగేసాను. ఆమె కూడా రెండో ఆలోచన లేకుండా వెంటనే నా సెలవు ఆమోదించారు. వెంటనే నేను ఇంటికి వెళ్లి అన్నీ సర్దుకొని తిరుపతికి ప్రయాణమయ్యాను. సోమవారం మాత్రం మా కజిన్స్ నేను లేకపోయినా ఎలాగో మేనేజ్ చేసారు. అలా బాబా నాకు 5 రోజులు సేవ చేసుకునే భాగ్యం కల్పించారు. నా సంతోషాన్ని వర్ణించడానికి నా దగ్గర మాటల్లేవు. శుక్రవారంనాడు గుడి లోపలి ప్రాంగణంలో మమ్మల్ని సేవకి నియమించారు. మా కజిన్స్‌‌లో ఒకరు మా టీం లీడర్. తనని మందిరం లోపల 7వ ద్వారం దగ్గర నియమించారు. మిగతా అందర్నీ ఒక్కొక్కచోట నియమించారు. నన్ను దర్శనానంతరం భక్తులకి ప్రసాదం ఇచ్చే చోట వేసారు. మందిరప్రాంగణంలో సేవ చేయడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. అక్కడ పనిచేసే ఉద్యోగులు చాలా మంచివారు. అన్నిరకాల ప్రసాదాలను నాకు తినడానికిచ్చేవారు. మళ్ళీ మళ్ళీ ఈ అవకాశం రాదని బలవంతంగా నాచేత తినిపించేవారు. మా డ్యూటీ పూర్తైన తరువాత స్వామి దర్శనానికి అనుమంతించారు. మేము గుడి లోపల మధ్య క్యూలైన్‌గుండా వెళ్లి 7వ ద్వారం వద్ద స్వామి దర్శనం చేసుకొని ఆనందంతో ముందుకి వెళ్తున్న సమయంలో, హఠాత్తుగా మా కజిన్ నన్ను తన స్థానంలోకి లాగి, మిగతా భక్తులను తోసుకుంటూ తను కూడా వెలుపలకి వెళ్ళిపోయింది. అలా మరో అరగంటపాటు భక్తులను ముందుకి తోస్తూ తృప్తిగా స్వామి దర్శనం చేసుకునే అవకాశం దక్కింది. ఈ అనుభవాన్ని వ్రాస్తుంటే నా కన్నులు ఆనందభాష్పాలతో నిండిపోతున్నాయి. ”గోవిందా గోవిందా” అని స్మరిస్తూ స్వామిని చూస్తున్నంతసేపు నా కళ్ళనుండి కన్నీరు ఆగలేదు. ఆ తర్వాతరోజు చివరిరోజు కావడంతో ఆరోజు కూడా మమ్మల్ని స్వామి దర్శనానికి అనుమతించారు. నాకిప్పటికీ నమ్మకం కలగడంలేదు అంతసేపు నేను స్వామి దర్శనం చేసుకున్నానంటే. బాబా నా కోరికని తీర్చి అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతినిచ్చారు.

నిజానికి ఈ సేవకి వెళ్ళకముందు నేను చాలా క్రుంగిపోయి ఉన్నాను. సాధారణంగా నేను చాలా ధైర్యస్తురాలిని, ఎప్పుడూ ఎవరిముందూ బయటపడి ఏడవను. అలాంటిది ఒకరోజు ఆఫీసులో నాకు తెలీకుండానే ఏడ్చేసాను. జీవితంలో కొందరిని కోల్పోయి తీవ్రవేదనలో ఉండగా, అదేసమయంలో నన్ను ఇంకొకరు తీవ్రంగా బాధించారు. నాకేమి జరుగుతుందో నాకే తెలియనంత బాధల్లో ఉన్నాను. సరిగ్గా ఆ సమయంలోనే బాబా ఈ సేవలో పాల్గొనే అవకాశం నాకు కల్పించి ఆ బాధలనుండి విముక్తి కలిగించారు. తిరుపతి సేవనుంచి రాగానే నాలో చాలా ఊహించని మార్పు వచ్చి, మునుపటివలే నార్మల్‌‌గా ఉండగలిగాను. ఆ పరిస్థితులనుండి బయటపడే మనోధైర్యాన్ని బాబా ఇచ్చారు. బాబా మార్గాలు అనూహ్యాలు. సరైన సమయంలో బాబా నా కోరిక తీర్చారు. "బాబా! ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉండి ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే శక్తినివ్వండి".

ఈ ట్రిప్ తర్వాత బాబా నాకు మరో తిరుపతి ట్రిప్ ఏర్పాటుచేసి అద్భుతమైన దర్శనం కలిగేలా చేసారు. ఆ అనుభవాన్ని ఇంకోసారి మీ ముందుంచుతాను.

2 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo