సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

శ్రీమతి చంద్రాబాయి బోర్కర్


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

శ్రీమతి చంద్రాబాయి బోర్కర్
బాబాను ప్రత్యక్షంగా సేవించుకున్న అంకితభక్తులలో శ్రీమతి చంద్రాబాయి బోర్కర్ ఒకరు. ఆమె మొట్టమొదటిసారి 1898 ప్రాంతంలో బాబాను దర్శించింది. బాబా నీటితో దీపాలు వెలిగించడం, గుడ్డపీలికలతో ఉయ్యాలలా వేలాడే చెక్కబల్లపై పడుకోవటం ప్రత్యక్షంగా చూసినట్లు శ్రీ బి.వి.నరసింహస్వామిగారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పి ఉన్నదామె. బాబా ఆమెను ఆప్యాయంగా "బాయీ" అని పిలిచేవారు. ఆమె తనకు ఏడుజన్మలనుండి సోదరి అని చెప్పారు బాబా. సాయి పన్నునొకదాన్ని తాయెత్తుగా చేసి భద్రపరచుకుందామె. ఆమె భక్తికి ప్రసన్నుడైన బాబా ఆమె నోరు తెరిచి అడగకపోయినా ఆమె మనసులోని కోరిక అనుగ్రహించదలచి ఆమెకు సంతానాన్ని ప్రసాదించారు. ఇక పిల్లలు పుట్టరనుకున్న ఆమెకి దాదాపు 50 ఏళ్ల వయసులో బాబా చెప్పినట్టుగానే ఒక కొడుకు పుట్టాడు. డాక్టర్౹౹పురందరే ఆమె కడుపున ఉన్నది బిడ్డకాదు 'గడ్డ' అనీ, దాన్ని వెంటనే ఆపరేషన్ చేసి తీసేయాలని చెప్పినా, ఆమె బాబా మాటపై విశ్వాసముంచి వైద్యుల మాటలను ఖాతరు చేయలేదు. తొమ్మిది నెలలు నిండిన తర్వాత ఆమెకు సుఖప్రసవమై, తల్లీ బిడ్డ క్షేమంగా ఉండటం చూసి వైద్యులే ఆశ్చర్యపోయారు.

ఆమె శిరిడీలో వున్నా, మరెక్కడ వున్నా "బాబా" అని ఆర్తిగా తలచుకున్న మరుక్షణమే, బాబా ఆమె పిలుపు విని కాపాడేవారు. ఈమె శిరిడీకి వచ్చి బాబాను సేవిస్తున్నందువల్ల, నాస్తికుడైన ఆమె భర్త శ్రీరామచంద్ర బోర్కర్‌‌నూ సాయి ఎన్నోవిధాల కాపాడి కరుణించారు. ఒకసారి అతనికి తీవ్రమైన జ్వరమొచ్చి మూసిన కన్ను తెరవకుండా ప్రమాదస్థితిలో ఉన్నప్పుడు బాబా చంద్రాబాయి కలలో కనిపించి, "భయపడకు, ఊదీ పెట్టు. నీ భర్తకిప్పుడు బాగా చమటపట్టి జ్వరం తగ్గిపోతుంది!" అని చెప్పారు. అలాగే, మరికొద్దిసేపటికే రామచంద్ర బోర్కర్‌‌కు జ్వరమంతా చేత్తో తీసేసినట్టు పూర్తిగా తగ్గిపోయింది.
శ్రీరామచంద్ర బోర్కర్‌‌
1909లో ఈమె భర్త శ్రీరామచంద్ర బోర్కర్ ఇంజనీరుగా పండరిపురంలో పనిచేస్తున్న రోజుల్లో ఈమె శిరిడీలో సాయిసేవలో ఉండేది. ఒకరోజు బాబా ఈమెతో, "అమ్మా, నువ్వు పండరి వెళ్ళు. నేనూ నీ వెనుకే వస్తాను. నాకు ఏ వాహనాలు అక్కర్లేదు" అన్నారు. సరేనని ఈమె తనకు తోడుగా ఇద్దరిని తీసుకుని పండరి వెళ్ళింది. అయితే అక్కడకి వెళ్ళాక, ఆమె భర్త పండరిలో రాజీనామా చేసి బొంబాయి వెళ్లిపోయారని తెలిసింది. ఆమె ఆ విషయం విని నివ్వెరపోయింది. బొంబాయి వెళ్లేందుకు ఆమె దగ్గర డబ్బులు కూడా లేవు. తనతోపాటు ఉన్న ఇద్దరితో కలిసి చేతిలోనున్న  పైకం "కుర్ద్‌వాడి" వరకు చార్జీలకు సరిపోగా అక్కడికి చేరింది. ఆపై ఏంచేయాలో తోచక దిగాలుపడి ఉండగా, ఒక ఫకీరు ఆమె చెంతకు వచ్చి, "దేని గురించి దీర్ఘాలోచన చేస్తున్నావు?" అని  అడిగాడు. శ్రీమతి చంద్రాబాయి సమాధానమివ్వలేదు. "అమ్మా, నీ భర్త ధోండ్ రైల్వేస్టేషనులో ఉన్నాడు, వెంటనే వెళ్ళు" అన్నాడు ఆ ఫకీరు. "నా దగ్గర డబ్బులేదు" అని చెప్పిందామె. అంతట ఆయనే ధోండ్‌‌కు మూడు టికెట్లు ఆమె చేతిలో పెట్టాడు. ఆశ్చర్యపోయిన చంద్రాబాయి వివరాలు అడిగేలోపే ఆ ఫకీరు అక్కడనుండి వడివడిగా వెళ్ళిపోయాడు. ఆమె ధోండ్‌‌కు వెళ్లే రైలెక్కింది. అప్పుడే ధోండ్ స్టేషనులో రామచంద్రబోర్కర్ టీ త్రాగి ఒక బెంచీపై కునుకుపాట్లు పడుతున్నాడు. ఇంతలో ఒక ఫకీరు కనిపించి, "నా తల్లినెందుకిలా నిర్లక్ష్యం చేస్తావు? ఆమె ఇప్పుడు రాబోయే రైల్లో ఇక్కడికి వస్తోంది. ఇంటికి తీసుకెళ్ళు" అని చెప్పాడు. రామచంద్ర బోర్కర్ ఉలిక్కిపడి లేచి చుట్టూ చూస్తే ఎవరూ లేరు. అంతలో రైలు రావడం, అందులోనుంచి చంద్రాబాయి దిగటంతో, రామచంద్ర బోర్కర్ వెళ్లి ఆమెను కలుసుకుని తన క్వార్టర్సుకు తీసుకెళ్లాడు. నాస్తికుడైన అతడు అంతవరకూ తన భార్య పూజించే సాయిబాబా ఫోటోవంక కూడా ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు తనకొక ఫకీరు కనిపించి ఇదంతా చెప్పటంతో,  "ఏదీ, నువ్వు పూజించే సాయిబాబా పటం చూపించు" అని చంద్రాబాయి దగ్గరున్న బాబాపటం చూసాడు. ఆశ్చర్యంతో తనకు కనిపించిందీయనే అని చెప్పాడు. తన గురించి కన్నతండ్రివలె శ్రద్ధ తీసుకుని తనను కాపాడి భర్త చెంతకు చేర్చిన శ్రీ సాయినాథుని కరుణకు మనసారా కృతజ్ఞతలు చెప్పుకుందామె.

ఒకసారి చంద్రబాయి బోర్కర్ 1908లో కోపర్‌గాఁవ్‌‌లో చాతుర్మాస్యం ఉంటున్నపుడు, ఒకరోజు ఆమె దగ్గరకి ఒక ఫకీరొచ్చి తనకు రొట్టెలు, ఉల్లిపచ్చడి పెట్టమని అడిగాడు. "చాతుర్మాస్యంలో ఉల్లి తినము" అని చెప్పి అతన్ని పంపేసిందామె. కానీ, తర్వాత "ఆ ఫకీరు రూపంలో బాబాయే వచ్చారేమో!" అని అనుమానం కలిగి అలా అతన్ని పంపించివేసినందుకు బాధపడింది. ఆ తర్వాతామె శిరిడీకి వెళ్ళినప్పుడు బాబా ఆమెను చూడగానే, "నాకు ఉల్లిపచ్చడి పెట్టలేదుగా, ఎందుకొచ్చావ్?" అని అడిగారు. "అవి మీకు సమర్పించుకునేందుకే వచ్చాను బాబా!" అన్నదామె వెంటనే.

చంద్రబాయి బోర్కర్ ఎంతో సమయస్ఫూర్తి, గుండెదిటవు కల మహిళ. బాబా ఒక గురుపూర్ణిమనాడు ఆమెను వెళ్లి ఖండోబా ఆలయంలో ఉన్న ఉపాసనీబాబాను పూజించి రమ్మన్నారు. ఉపాసనీబాబా ఆ రోజుల్లో ఎవ్వరినీ తన దగ్గరకు రానిచ్చేవారు కాదు. అతని దరిదాపులకు వెళ్లేందుకు అందరూ భయపడేవారు. అయితే చంద్రబాయి మాత్రం నిర్భయంగా పూజాద్రవ్యాలు తీసుకెళ్లి ఉపాసనీని పూజించబోయింది. హఠాత్తుగా ఆమె వచ్చి తన పాదాలకు పూజ చేయబోతుంటే, "ఏమిటిది, ఏం చేస్తున్నావు? నా కాళ్లు పట్టుకుంటావేం? పో ఇక్కడినుంచి!" అని కోపంగా గద్దించాడు ఉపాసనీ. "ఈ రోజు మిమ్మల్ని పూజించమని నాకు బాబా చెప్పారు. బాబా ఆజ్ఞ నాకు శిరోధార్యం. మీరెంత కాదన్నా మిమ్మల్ని పూజించకుండా మాత్రం నేను వెళ్ళేది లేదు" అని, ఉపాసనీ ఎంత వారించబోయినా లక్ష్యపెట్టక చక్కగా పూజ పూర్తిచేసుకునే వెళ్ళిందామె. ఆమెకున్న చిత్తస్థైర్యం, బాబా మాటపై ఆమెకున్న భక్తి, గౌరవాలు అటువంటివి.

చంద్రబాయికి భర్త మరణం గురించి బాబా ముందుగానే కలలో కనిపించి హెచ్చరించారు. "అమ్మా, నీ రాముని తీసుకుపోతాను, నువ్వు అధైర్యపడకు" అని. వ్యాధిగ్రస్తుడైన రామచంద్రబోర్కర్ తాను చాతుర్మాస్యంలో చనిపోకూడదని కోరుకున్నాడు. ఆమె బాబాను ప్రార్థించగా బాబా ఆమె కోరిక మన్నించారు. శ్రీబోర్కర్ 1934లో, చాతుర్మాస్యం అయిన వారంరోజుల తరువాత, పూర్తి బాబా స్మరణతో మరణించాడు. అతడేనాడూ శిరిడీ రాకపోయినా, తనను నమ్మి సేవించకపోయినా, చంద్రాబాయి భక్తి వలన, ఆమె భర్తకూ అలా సద్గతి ప్రసాదించారు.

రేపటి భాగంలో శ్రీమతి చంద్రాబాయి బోర్కర్ గారి ఇల్లే మందిరమైన లీల.

మూలం: 'సాయిపథం ప్రథమ సంపుటము'

No comments:

Post a Comment

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo