సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

నాకు పూజావిధులతో పనిలేదు.. అపరిమితమైన భక్తి ఉన్నచోటే నా నివాసం....


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

ఆగిపోయావేం? దగ్గరికి రా!

బాబా తన భక్తులపైన కురిపించే ప్రేమ: భక్తులను ఎన్నుకునే పద్దతి; వారిని తన దగ్గరకు లాక్కునే విధానం మహాద్భుతమైనటువంటివి. ఆయన భక్తులను అనుగ్రహించే తీరు ప్రత్యేకమైనది. బాబా తనదైన శైలిలో తన భక్తులను పిచ్చుక కాలికి దారంకట్టి లాగినట్టు తన వద్దకు లాగుతారు.

సాయిభక్తురాలు సుబ్బలక్ష్మిగారు బాబా తనపై చూపిన ప్రేమను, తనను ఎలా తమ వైపుకు తిప్పుకున్నారో తెలియజేసే తన అనుభవాలని ఈ బ్లాగు ద్వారా మనందరితో ఈ విధంగా పంచుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే......

సాయిబంధువులందరికీ సాయిరాం. నాపేరు సుబ్బలక్ష్మి. నేను వైజాగ్ నివాసిని. 2002వ సంవత్సరం వరకు నాకు బాబాతో పరిచయం కేవలం ఫోటోల ద్వారానే. ఆయన గురించి నాకు అంతగా ఏమీ తెలియదు. అలాంటి నన్ను బాబా తనదైన శైలిలో తన వైపుకు లాక్కున్నారు. "నేనే నా భక్తులను ఎన్నుకుంటాను" అని బాబా చెప్పినట్లుగానే ఒక స్వప్నదర్శనంతో నన్ను పూర్తిగా తన వైపుకు తిప్పుకున్నారు. ప్రస్తుతం నా ప్రపంచం, నా లోకం, నా  జీవితం అంతా సాయే అయిపోయారు. ఆయన నామస్మరణ లేకుండా క్షణం కూడా గడపలేకపోతున్నాను. ఏం చేస్తున్నాగాని ఆయన స్మరణే! అంతగా బాబా నా జీవితంలోకి ప్రవేశించారు.

ఒకరోజు ఆ దివ్య మంగళమూర్తి తన దివ్యదర్శనాన్ని నాకు స్వప్నంలో అనుగ్రహించారు. అది శిరిడీ పుణ్యక్షేత్రం. అక్కడంతా భక్తులతో రద్దీగా ఉంది. నేను సమాధిమందిర ద్వారం బయట నిలబడి ఆ మంగళమూర్తిని చూస్తూ ఆనందపారవశ్యంలో ఉన్నాను. ఆయన దర్శనభాగ్యంతోనే మనసులో ఉన్నటువంటి బాధలన్నీ తొలగిపోయిన అనుభూతిని నేను పొందుతున్నాను. భక్తులందరూ సమాధిమందిరం లోపలికి వెళ్లి బాబా దర్శనం చేసుకుని బయటకు వెళ్ళిపోతున్నారు. నేను మాత్రం ద్వారం బయటనుండే ఆయన దర్శనానందాన్ని తనివితీరా ఆస్వాదిస్తున్నాను. అంతలో సింహాసనంపై కూర్చొనివున్న ఆ సాయినాథుడు నావైపు చూస్తూ, "అక్కడే ఆగిపోయావేం? దగ్గరకు రా!" అని పిలిచారు. అత్యంత మధురమైన ఆయన స్వరాన్ని విని పరవశించిపోతూ ఆయనను అలా చూస్తూ ఉన్నాను. మరలా బాబా నన్ను చూస్తూ పిలుస్తున్నారు. "బాబా! నేను స్నానం చేయలేదు. కాబట్టి సమాధిమందిరంలోకి నాకు ప్రవేశం లేదు. అందువలనే బయట నిలబడి నీ దర్శనాన్ని చేసుకుంటున్నాను తండ్రీ!" అని అన్నాను. అందుకు బాబా, "నాకలాంటి నియమాలు ఏమీలేవు. అలాంటి పద్ధతులతో నాకు పని లేదు. నీవు లోపలికి వచ్చి నా దర్శనం చేసుకో!" అన్నారు. బాబా పిలిచారుగా అని ఆనందంతో బాబా దగ్గరకు వెళ్లి ఆయన ముందు చాలా దగ్గరగా నిలబడి బాబా దర్శనం చేసుకున్నాను. అంతలో మెలకువ వచ్చింది. నా కళ్ళనుండి ఆనందభాష్పాలు కారుతున్నాయి. అప్పటి నేనున్న స్థితి గుర్తుకొస్తే ఇప్పటికీ చాలా సంతోషంగా అనిపిస్తుంది. బాబాకు నన్ను దగ్గర చేసిన సుందర ఆనందమయుడి దర్శనమది. అప్పటినుండి నేను బాబా ప్రేమలో మునిగిపోయాను. ఆయనే నాకు తల్లి తండ్రి. తల్లి తన పిల్లలను తన దగ్గరకు తీసుకోవడానికి ఈ స్నానాలు, జపాలు అవసరమవుతాయా? మనం అందరం ఆయన పిల్లలం. అయినా బాబానే చెప్పారుగా, "మా సంప్రదాయమే వేరు", "నాకు పూజావిధులతో పనిలేదు", "నాకు పూజసామాగ్రి గాని, అష్టోపచార, షోడశోపచార పూజలు గాని అవసరం లేదు. అపరిమితమైన భక్తి ఉన్నచోటే నా నివాసం"(అధ్యాయం 13) అని. బాబా నా జీవితంలోకి వచ్చిన ఈ మొదటి అనుభవాన్ని నేను ఎన్నడూ మరువను. ఎందుకంటే అదే బాబాతో నా తొలిపరిచయం.

ఆయనంతట ఆయనే మా ఇంటికి వస్తానంటే ఎందుకు వద్దంటాను..??


సుబ్బలక్ష్మిగారు మరొక అనుభవాన్ని ఇలా తెలియజేస్తున్నారు..

వైజాగ్‌లోని సాయిబాబా గుడిలో అఖండజ్యోతి పెట్టి సచ్చరిత్ర పారాయణ చేసారు. నేను కూడా ఆ కార్యక్రమానికి ఏడువారాలపాటు క్రమంతప్పకుండా వెళ్లి  పారాయణ చేసుకున్నాను. పారాయణ జరిగినన్ని రోజులు నాకు ఒక పండగలాగ, బాబా నాతోనే ఉన్నట్టు అనుభూతి కలిగింది. పారాయణకి నాతోపాటు చాలామంది భక్తులు అక్కడికి వచ్చేవారు. ఆ కార్యక్రమాన్ని నిర్వహించే సాయిబంధువు తన ఇంట్లో ఉన్న సాయిబాబా విగ్రహానికి పూజలు చేస్తూ, బాబా చూపించిన వాళ్లకు బాబా విగ్రహాలను ఇస్తూ ఉండేవాళ్ళు. ఇలా కొంతమందికి ఇవ్వగా ఒక బాబామూర్తి మాత్రం తన దగ్గరే ఉండిపోయింది. ఏం జరిగిందో తెలియదుగానీ మూడునెలల తరువాత ఒకరోజు తను నాకు ఫోన్ చేసి, "బాబా విగ్రహం ఒకటి నా దగ్గర ఉంది. అది నీకు మాత్రమే ఇవ్వాలనిపిస్తుంది. నీకు ఇస్తాను ఇంట్లో పెట్టుకుంటావా? నీకు అభ్యంతరం లేదు కదా!" అని అడిగింది. ఆ క్షణంలో నా సంతోషానికి అవధులు లేవు. బాబా తనంతట తానే మా ఇంటికి వస్తానంటే నేనెందుకు కాదంటాను? నేను బాబామూర్తిని చక్కగా ఇంటికి తీసుకొని వచ్చి నాకు తోచిన విధంగా ఆయనకి సేవ చేసుకుంటున్నాను. బాబా వచ్చారని ఏవేవో భజనలు, సత్సంగాలు చేయట్లేదు. బాబాను మా ఇంట్లో వ్యక్తిగా భావించి, ప్రతిరోజూ నేనేమి తింటే అవి బాబాకి సమర్పించుకుంటూ తింటున్నాను. కేవలం నాకు వీలైనంతలో నాకున్నది ఆయనకు సమర్పించుకుంటూ చాలా సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు మా ఇంటికి పెద్దదిక్కు, యజమాని బాబానే. ఎందుకంటే నాకు తల్లిదండ్రులు లేరు. నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ బాబానే. దగ్గరుండి నన్ను చూసుకోవడం కోసం నా తండ్రి నాకోసం నా ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు. ఇంతకన్నా నాకేం కావాలి? నాకోసం నా క్షేమం  చూసుకోవటానికి బాబా ఉన్నారు. ఈరోజు నాకు ఎవరూ లేరన్న లోటును బాబా తీరుస్తున్నారు. "నా పిల్లలని మంచి పొజిషన్లో ఉంచారు. నా కుటుంబానికి రక్షగా మీరు వచ్చారు. ఇంతకన్నా ఆనందం ఇంకేదీ లేదు బాబా. థాంక్యూ బాబా!".

సర్వం సాయినాథ దివ్య చరణారవిందార్పణమస్తు!

No comments:

Post a Comment

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo