సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1036వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా ఎప్పుడూ నాతో ఉన్నారు
2. బాబా మంచే చేస్తారు - మనమెప్పుడూ విశ్వాసాన్ని కోల్పోకూడదు.
3. బాబా కృపతో అమ్మకి ఆరోగ్యం

బాబా ఎప్పుడూ నాతో ఉన్నారు


ముందుగా సాయిభక్తులకు నమస్కారం. నా పేరు ఆదిత్య. నా వయసు 31 సంవత్సరాలు. నేను చిన్నప్పటినుండి బాబాని ప్రార్థిస్తున్నాను. బాబా నాకు ఎన్నో మహిమలు చూపించారు, ప్రతి విషయంలోనూ ముందుండి నన్ను నడిపించారు. ఈ మధ్యకాలంలో నేను ఈ బ్లాగులోని సాయిభక్తుల అనుభవాలు చదివి నేను కూడా నా అనుభవాలను తోటి భక్తులతో పంచుకోవాలని నిశ్చయించుకున్నాను. బాబా ఎప్పుడూ నాతో ఉన్నారనే నా నమ్మకానికి నిదర్శనమైన నా అనుభవాలు కొన్ని ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. "బాబా! నా అనుభవాలు పంచుకోవడంలో కొంచెం ఆలస్యమైనందుకు నన్ను క్షమించండి".


కొన్నిరోజుల క్రితం నేను, నా భార్య మనాలి విహారయాత్రకి వెళ్ళాం. ముందుగా మేము ఢిల్లీ చేరుకుని, అక్కడినుండి మనాలికి బస్సులో వెళ్ళాము. మొత్తం అంతా ఘాట్ రోడ్డు అయినందువల్ల నాకు చాలా భయమేసి, "బాబా! ఎలాగోలా మేము మనాలి చేరుకుని, అక్కడ అన్ని ప్రదేశాలు చూసి తిరిగి క్షేమంగా బస్సులో ఢిల్లీ చేరుకునేలా చూడండి" అని  ప్రార్ధించాను. బాబా దయవల్ల మేము క్షేమంగా మనాలి చేరుకున్నాము. అక్కడ 'సోలంగ్‌' వ్యాలీ అనే ప్రదేశంలో క్యాబ్ వాడు మమ్మల్ని దించి, "సాయంత్రం 5 గంటలకి వస్తాను, అంతవరకు ఇక్కడ అన్నీ చూస్తూ ఉండండి" అని చెప్పి వెళ్ళిపోయాడు. సాయంత్రం 4 గంటలకల్లా మేము ఆ ప్రదేశమంతా చూసేసాము. క్యాబ్ వాడు రావటానికి ఇంకా సమయముంది. ఈలోపు చిన్నగా చినుకులు మొదలయ్యాయి. అసలే ఆ ప్రాంతంలో చలి ఎక్కువ. చినుకులు కూడా తోడయ్యేసరికి నా భార్య చాలా ఇబ్బందిపడింది. వర్షం ఎక్కువైతే ఇంకా ఇబ్బందిపడాల్సి వస్తుందని నేను వెంటనే బాబాని తలుచుకుని, "బాబా! వర్షం పడకుండా చూడండి" అని ప్రార్థించాను. బాబా దయవల్ల క్యాబ్ వచ్చేంతవరకు వర్షం పడలేదు. మేము హోటల్‍కి చేరుకున్న వెంటనే వర్షం మొదలై మరుసటిరోజు వరకు తగ్గలేదు. బాబా మాకోసమే వర్షాన్ని అపారనిపించింది. బాబా నా ప్రార్ధన విన్నారు. నాకు సహాయం చేసారు. మాకు తోడుగా ఉన్నారు. మేము ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంటికి తిరిగి చేరుకున్నాము.


ఈమధ్య నేను మొదటిసారి శబరిమల వెళ్ళినప్పుడు అందరూ "కొండ ఎక్కటం కష్టంగా ఉంటుంద"ని చెప్పారు. అప్పుడు నేను, "బాబా! ఏ ఆటంకాలు లేకుండా అంతా బాగా జరిగేలా చూడండి" అని బాబాను ప్రార్థించాను. బాబా దయవలన ఏ ఆటంకాలు లేకుండా అయ్యప్పస్వామి దర్శనమై తిరిగి ఇంటికి క్షేమంగా వచ్చాను. ఇలా బాబా ప్రతి నిమిషం నాతో ఉంటూ నన్ను ముందుకి నడిపిస్తున్నారు. ఇలా ఎన్నని చెప్పాలి? ఈ జీవితం  అంతా బాబా మహిమలతో నిండి ఉంది. ఇంకొక విషయంలో బాబా చూపించిన మార్గం వల్ల నేను అనుకున్నది జరగబోతోంది. ఆ అనుభవాన్ని ఇంకోసారి వివరంగా తెలియచేస్తాను. బాబా కృపాదృష్టి ఎల్లవేళలా మా మీద, భక్తులందరీ మీద ఉండాలి, ఉంటుందని నా నమ్మకం. చివరిగా ఇలా మీ అందరితో నా అనుభవాలు  పంచుకోగలిగినందుకు బాబాకు, ఈ బ్లాగు సభ్యులకు నా నమస్కారాలు.


బాబా మంచే చేస్తారు - మనమెప్పుడూ విశ్వాసాన్ని కోల్పోకూడదు


నా పేరు అలేఖ్య. నాకు తల్లి, తండ్రి గురువు, దైవం అన్నీ సాయిబాబాయే. మా కుటుంబ యజమాని బాబాయే. మా భారం అంతా ఆయనదే. బాబా దయతో నాకు చాలా అనుభవాలు ప్రసాదించారు. వాటిలో కొన్ని ఈ బ్లాగు ద్వారా ఇదివరకు మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరో రెండు అనుభవాలు పంచుకుంటున్నాను. ఈమధ్య మూడు నెలలపాటు మా నాన్నగారు కొంచెం ఆయాసం, గ్యాస్ సమస్యలతో ఇబ్బందిపడుతున్నా అంతగా పట్టించుకోలేదు. 2021, డిసెంబర్ మూడోవారంలో మాత్రం నాన్న యశోద హాస్పిటల్‍కి చెకప్‍కి వెళ్తే, డాక్టరు హార్ట్ కు సంబంధించిన టెస్టులు వ్రాసారు. అందులో యాంజియోగ్రామ్ కూడా ఉంది. నేను చాలా భయపడి సహాయం కోసం బాబాను ప్రార్థించాను. టెస్టులు చేసిన తరువాత డాక్టర్లు నాన్న గుండెలో బ్లాకులున్నాయని, రెండు స్టెంట్స్ వేయాలని అన్నారు. నేను బాధతో, "ఏమిటి బాబా మాకు ఈ పరీక్షలు?" అని అనుకున్నాను. ఆ సమయంలో బాబా వద్ద నుండి, "మీ కుటుంబ సభ్యులకు ఎలాంటి హాని జరగదు. నేను హామీ ఇస్తున్నాను. ఆందోళన పడవద్దు. అద్భుతాలు జరుగుతాయి" అని మెసేజ్ వచ్చింది. నిజంగానే అద్భుతం జరిగింది. రెండు స్టెంట్లు వేయాలన్న డాక్టర్లు ఒక స్టెంటే వేసి, మందులతో నయమవుతుందని అన్నారు. బాబా దయవలన అంతా మంచే జరిగింది. నా మనసుకి చాలా సంతోషంగా అనిపించి బాబా అనుగ్రహాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకోవాలని అనుకున్నాను. బాబా ఏం చేసినా మంచే చేస్తారు. మనమెప్పుడూ ఆయనపట్ల విశ్వాసాన్ని కోల్పోకూడదు. "బాబా! మీకు అనంత వేల కృతజ్ఞతలు".


ఎప్పుడూ హ్యాపీగా ఆడుకుంటూ చురుకుగా ఉండే మా బాబు ఈమధ్య ఒకరోజు రాత్రి హఠాత్తుగా ఏడవడం మొదలుపెట్టాడు. ఏం చేసినా బాబు ఏడుపు అసలు ఆపలేదు. ఇదివరకు ఎప్పుడూ మా బాబు అలా ఏడ్చింది లేదు. నాకు భయమేసి హాస్పిటల్‍కి తీసుకుని వెళితే, డాక్టరు ముందు కూడా బాబు ఏడుస్తూనే ఉన్నాడు. డాక్టరు బాబుని చూసి కడుపునొప్పి తగ్గడానికి టానిక్, అలాగే చెవినొప్పి తగ్గడానికి మందు వేశారు. అయినా బాబు నిరంతరాయంగా ఏడుస్తుంటే నా ప్రాణం విలవిల లాడింది. అప్పుడు బాబా ఊదీ వేసి సిరప్ ఇచ్చాను. అయినా బాబు ఏడుపు ఆపలేదు. చివరికి నేను, "బాబా! మీ దయతో బాబు ఏడుపు ఆపితే, ఉదయం నా అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. అలా బ్లాగులో పంచుకుంటానని అనుకున్నంతనే బాబా దయవల్ల బాబు ఏడుపు కొంచం అపి నిద్రపోయాడు. అప్పుడు సమయం తెల్లవారు ఝామున 3 గంటలయింది. వెంటనే ఆలస్యం చేయకుండా అప్పటికప్పుడే నా అనుభవం వ్రాసి పంపాను. ఈ అనుభవం ద్వారా బాబా నాకు ఈ బ్లాగు యొక్క ప్రాముఖ్యత ఏమిటో తెలియజేశారు. ఇలా సాయినాథుడు అడుగడుగునా మమ్మల్ని కాపాడుతున్నారు. "బాబా! మీకు అనంతవేల కృతజ్ఞతలు. నిన్నే నమ్ముకున్నాము తండ్రి".


బాబా కృపతో అమ్మకి ఆరోగ్యం


సాయిబంధువులందరికీ నమస్సులు. ఆ సాయినాథుని కృపతో అందరూ బాగుండాలి. అందులో మనమూ ఉండాలి. నాపేరు గంగా భవాని. మాది వైజాగ్. ఇటీవల బాబా ప్రసాదించిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీ అందరితో పంచుకుంటాను. ఈమధ్య మా అమ్మగారి ఆరోగ్యం బాగోలేదు, బాగా సీరియస్ అయ్యింది. నేను సాయిని ప్రార్ధించి, మూడురోజులు వదలకుండా బాబా నామాన్ని జపించాను. బాబా కారుణామయుడు, తప్పక మేలు జరుగుతుందని పూర్తి నమ్మకం ఉంచాను. బాబా దయవలన మూడోరోజుకి అమ్మ ఆరోగ్యం కాస్త మెరుగుపడి ఇప్పుడు బాగుంది. ఈవిధంగా బాబా నన్ను నా కుటుంబాన్ని అడుగడుగునా కాపాడుతున్నారు. నా ఇంటికి రక్షణ ఆయన. బాబా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. "ధన్యవాదాలు బాబా".



సాయిభక్తుల అనుభవమాలిక 1035వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా మీద నాలో భక్తిప్రేమలు మొలకెత్తించిన తొలి అనుభవం
2. వచ్చి, అనుగ్రహించిన బాబా
3. సాయిబాబాకు కృతజ్ఞతతో మా అనుభవం

బాబా మీద నాలో భక్తిప్రేమలు మొలకెత్తించిన తొలి అనుభవం

నేను ఒక సాయిభక్తురాలిని. బాబా నాకు ప్రసాదించిన తొలి అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. ముందుగా సాయిభక్తులకు తమ అనుభవాలను తోటిభక్తులతో పంచుకునే అవకాశాన్నిచ్చిన ఈ బ్లాగ్ నిర్వాహకులకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మాకు మొదట బాబాతో పరిచయమంటూ ఏమీ లేదు. మావారు పనిచేసే స్కూల్లో రాధాకృష్ణగారు అనే హెడ్ మాస్టర్ ఉండేవారు. ఆయన బాబా భక్తుడు. ఒకసారి ఆయన మా ఇంట భోజనానికి వచ్చి తిరిగి వెళ్ళేటప్పుడు నా చేతిలో బాబా పారాయణ పుస్తకం పెట్టి, "ఇది చదువమ్మా, చాలా బాగుంటుంది" అని చెప్పి వెళ్ళిపోయారు. నేను పెద్దగా పూజలు చేసేదాన్ని కూడా కానందున 'ఈ పుస్తకం ఏం చేయాలి?' అని దాన్ని బీరువాలో పెట్టాను. నాలుగురోజుల తరువాత ఆయన మళ్ళీ కలిసి "ఏమ్మా చదివావా?" అని అడిగారు. తెరవనైనా తెరవని పుస్తకాన్ని "కొద్దిగా ఉంది సార్, అయిపోతుంది" అని అబద్దం చెప్పాను. వారం రోజుల తరువాత ఆయన ఇచ్చిన పుస్తకాన్ని చదవకుండానే ఆయనకు తిరిగి ఇచ్చేసాను. ఇది జరిగిన 15 రోజుల తరువాత మావారు ఏదో పత్రికలో చూసి, "ఇది చూడు. భార్యాభర్తలుకాని, తల్లీబిడ్డలుకాని, అన్నదమ్ములుకాని ఎవరైనాసరే ఎవరు సంపాదించుకున్న పుణ్యం వారిది, ఎవరి పాపం వారిది. ఎవరిది వారే అనుభవించాలి. ఒకరి పుణ్యం ఒకరికి రాదు. ఒకరి పాపం ఒకరికి రాదు" అని నాకు చదివి వినిపించారు. అప్పుడు నేను, "మీరు అలాగే అంటారు. పిచ్చిపిచ్చి వ్రాతలు నమ్మాల్సిన అవసరం లేదు. మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు. భర్త చేసిన దాంట్లో భార్యకు కూడా భాగముంటుంది అని కదా! మేము తల్లిదండ్రులను కూడా వదులుకుని మీ దగ్గరకి వచ్చేది ఎందుకు?" అని వాదించి పడుకున్నాను. ఆరోజు బుధవారం. రాత్రి నాకు ఒక కల వచ్చింది. మా ఇంటి దేవుడి రూంలో ఎర్రబట్టలతో ఉన్న బాబా ఫోటో ఉంది. అదే రూపంలో బాబా మా ఇంటి దేవుని గదిలో ఉన్న ఒక స్టూలు మీద కాలు మీద కాలు వేసుకుని కూర్చుని నాకు కలలో దర్శనమిచ్చారు. నేను బాబా పాదాల దగ్గర కూర్చున్నాను. ఒక గంట సేపు బాబాకు, నాకు మధ్య వాదన జరిగింది. చిన్నపిల్లకు చెప్పినట్టుగా బాబా నాకు ఏవో విషయాలు చెప్పారు. ఇది జరిగి దాదాపు 30 ఏళ్ళు అవుతుంది. నాకు చాలావరకు గుర్తులేవు. గుర్తున్నంతవరకు చెప్తున్నాను. 

"తల్లీ! నీకు ఆకలి వేస్తే, నువ్వే భోజనం చేయాలి. నీ భర్త తింటే నీ ఆకలి తీరదుగా. అలాగే నీకు ఒంట్లో బాగోలేకపోతే మందులు నువ్వే తీసుకోవాలి, నీ భర్త కాదు" ఇలా ఎన్నో ఉపమానాలు బాబా నాతో చెప్పారు. కానీ నేను మూర్ఖురాలిని కాబట్టి బాబా చెప్పింది సరైనదని అంగీకరించలేదు.

ఒక అరగంట తరవాత బాబా, "అయితే నీ భర్త పుణ్యం కానీ, పాపం కానీ, నువ్వు స్వీకరిస్తావా?" అని అడిగారు.

అందుకు నేను మొండిగా "స్వీకరిస్తాను" అని అన్నాను.

అప్పుడు బాబా, "అయితే పాపఫలం చేదుగా ఉంటుంది, పుణ్యఫలం తీయగా ఉంటుంది. కాబట్టి పుణ్యఫలాన్ని స్వీకరించు" అని చెప్పి రెండు చిన్న వెండి పళ్ళాలలో పరమాన్నం లాంటిది ఇచ్చి, "ఒకటి నీది, ఒకటి నీ భర్తది" అని చెప్పారు.

నేను వెంటనే నా భర్త పుణ్యఫలం ఉన్న పళ్ళాన్ని స్వీకరించబోయాను. అందుకు బాబా "ముందుగా నీ పుణ్యఫలాన్ని స్వీకరించిన తరువాత నీ భర్తది తీసుకో" అని అన్నారు. 

నేను సరేనని నా పళ్ళెంలోది అంతా తిన్న తరువాత నా భర్త ప్లేటు తీసుకోబోయాను.

అప్పుడు బాబా, "నీ పళ్ళెంలోది పూర్తయిన తరువాత నీ భర్త పళ్ళెం తీసుకో" అన్నారు. 

అప్పుడు నేను నా పళ్ళెంలో గమనిస్తే ఒక మెతుకు మాత్రం ఉంది. ఆ మెతుకు తిన్న తరువాత ఇక అంతే! నాకు తినటానికి ఎంత మాత్రమూ చేత కావట్లేదు. ఎంత ప్రయత్నించినా తినలేకపోయాను.

అప్పుడు బాబా నాతో, "నువ్వు పుణ్యమే స్వీకరించలేకపోతున్నావు. పాపమేమి స్వీకరిస్తావు. కాబట్టి పాపపుణ్యాలు ఎవరివి వారివే. ఇప్పుడైనా నమ్మకం కుదిరిందా?" అని నవ్వి వెళ్ళిపోయారు.

ఈ కల వచ్చిన తరువాత బాబా మీద చిన్నగా నాలో భక్తిప్రేమలు మొదలయ్యాయి.

వచ్చి, అనుగ్రహించిన బాబా

నేను ఒక సాయిభక్తురాలిని. 2021, డిసెంబర్ 15న బాబా నాకు మరో అద్భుతం చూపించారు. నా భర్త PSB (పంజాబ్ సిండికేట్ బ్యాంకు)లో పని చేస్తున్నారు. గత 3 సంవత్సరాలుగా నా భర్తకు పదోన్నతి రాలేదు. ఆ విషయమై మేము, "దయచేసి మాకు సహాయం చేయండి బాబా. మాపై అనుగ్రహం చూపండి" అని బాబాని అడుగుతుండేవాళ్ళము. కానీ ఎందుకో తెలియదుగాని బాబా మేము కోరుకున్నది ఇవ్వలేదు. 2021, డిసెంబర్ 15, బుధవారం నా భర్త పదోన్నతికి సంబంధించిన ఒక అంతర్గత పరీక్షకు హాజరవ్వడానికి వెళ్తూ, 'ఒకవేళ పరీక్షలో విఫలమైతే, ఆర్థికపరంగా కొన్ని ప్రయోజనాలను కోల్పోతాన'ని ఆందోళన చెందారు. అదే జరిగితే కుటుంబపరంగా ఆర్థికసమస్యలను ఎదుర్కోవడం మాకు చాలా కష్టమవుతుంది. కాబట్టి నేను, "నా భర్తకు సహాయం చేయమ"ని నిరంతరాయంగా బాబాను అర్థించసాగాను. మధ్యాహ్నం నేను శుభ్రం చేయడానికని మెయిన్ డోర్ తెరిచాను. మా ఇంటి ద్వారం ముందు నేలపై ఒక మ్యాగజైన్ పడి ఉంది. ఆ పుస్తకం చేతిలోకి తీసుకుని, దాన్ని చూసిన నేను ఆనందం పట్టలేకపోయాను. ఆ పుస్తకం శిరిడీ సాయి సంస్థాన్ వారి సాయిలీలా మ్యాగజైన్(ఫోటో కింద జతపరుస్తున్నాను). 
వాస్తవానికి మేము శిరిడీలో మ్యాగజైన్ కోసం ఏ చందా కట్టలేదు. ఆ మ్యాగజైన్ పై ఉన్న అడ్రస్‌ మాది కాదు, అది వేరే వాళ్ళది. కానీ బాబా నా భర్త పరీక్షకు హాజరైన సమయంలో మా ఇంటికి ఆ రూపంలో చేరుకున్నారు. నిజంగా చెప్పాలంటే నేను అంతకు కాసేపటి క్రితం బాబాను, "నా భర్త నాతో, 'నేను పరీక్షలో ఉత్తీర్ణుడనయ్యాన'ని చెప్పాల"ని అడిగాను. తరువాత సాయిలీల పత్రిక రూపంలో బాబా వచ్చారు. ఆ పత్రికలోని మొదటి కథనం సపత్నేకర్, శేవడే అన్న బాబా భక్తులకు సంబంధించినది. సపత్నేకర్ శేవడేను, "పరీక్షకు సిద్ధమయ్యారా?" అని అడిగితే, "నాకు శిరిడీ సాయి ఆశీస్సులున్నాయి. కాబట్టి ఖచ్చితంగా నేను నా పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తాను" అని శేవడే బలంగా బదులిస్తాడు. అది చదివిన నాకు నా భర్త పరీక్షలో ఉత్తీర్ణులవుతారన్న సమాధానం లభించింది. అదే నిజమైంది! ఒక గంట తర్వాత నా భర్త నాకు ఫోన్ చేసి, "నేను పరీక్షలో ఉత్తీర్ణుడనయ్యాను" అని చెప్పారు. మేము చాలా చాలా సంతోషించి సాయంత్రం బాబా మందిరానికి వెళ్లి బాబా దర్శనం చేసుకున్నాము. "ప్రేమతో మీకు చాలా చాలా ధన్యవాదాలు బాబా".

సాయిబాబాకు కృతజ్ఞతతో మా అనుభవం

ముందుగా అందరికీ బాబా అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాను. నా పేరు పద్మజ. మాకు బాబాతో చాలా అనుభవాలు ఉన్నాయి. నేను ఈరోజు ఒక అనుభవం మీతో పంచుకుంటున్నాను. ఈమధ్య మా అమ్మగారి బాబా ఉంగరం కనిపించలేదు. వాళ్ళు అంతటా వెతికినా ఆ ఉంగరం దొరకలేదు. ఆ తరువాత ఆ విషయం నాతో చెప్పారు. అప్పుడు నేను, "సాయీ! ఉంగరం దొరికితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మొక్కుకున్నాను. తరువాత 2021, డిసెంబర్ 16, ఉదయం మా అమ్మమ్మ బాబాకి దణ్ణం పెట్టుకుని, సాష్టాంగ నమస్కారం చేసుకుంటుండగా దేవుడి మందిరం కిందుగా ఆ ఉంగరం కనిపించింది. వెంటనే నాకు ఆ విషయం చెప్పారు. "చాలా చాలా సంతోషంగా ఉంది సాయీ. నమ్ముకున్న వారిని మీరు ఎన్నడూ నిరాశ పరచరని మాకు తెలుసు సాయీ. కృతజ్ఞతతో వెంటనే నా అనుభవాన్నిలా పంచుకుంటున్నాను. తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి సాయీ".

సాయిభక్తుల అనుభవమాలిక 1034వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా దయతో సుఖమయమైన ప్రయాణం - వచ్చిన పాస్‌పోర్టు
2. బాబాని తలచుకోగానే దొరికిన సర్టిఫికెట్
3. చెడు కలలు రాకుండా అనుగ్రహించిన బాబా

బాబా దయతో సుఖమయమైన ప్రయాణం - వచ్చిన పాస్‌పోర్టు


నేను బాబా భక్తురాలిని. ముందుగా బాబా భక్తులందరికీ నమస్తే. నేను ఈరోజు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను మీతో పంచుకోబోతున్నాను. ఒకరోజు 'మా వదిన కొడుక్కి ఆరోగ్యం బాగాలేదని, అతని పరిస్థితి విషమంగా ఉన్నందువల్ల అతను వెంటిలేటర్ మీద ఉన్నాడ'ని మరో వదిన నాకు ఫోన్ చేసి చెప్పింది. ఈ వార్త విన్న నేను, నా భర్త చాలా కలతచెందాము. కానీ నా భర్త బిజీ షెడ్యూల్ వలన మేము వెంటనే వెళ్లడానికి కుదరలేదు. తీరా వెళదామని ట్రైన్‌ టిక్కెట్ల కోసం చూస్తే, తిరుగు ప్రయాణానికి RAC టిక్కెట్లు ఉండగా వెళ్లేందుకు మాత్రం కొన్నిరోజుల వరకు టిక్కెట్లు అందుబాటులో లేవు. అందువలన మేము కలవరపడి తప్పనిసరై బస్సుకి టిక్కెట్లు బుక్ చేసుకున్నాము. అయితే వాంతుల సమస్య వలన బస్సు ప్రయాణం నాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అయినా వేరే దారిలేక నేను 13 గంటల ప్రయాణం ఎలా చేస్తానని ఆందోళనపడ్డాను. అదలా ఉంటే, దురదృష్టవశాత్తు ప్రయాణమవ్వాల్సినరోజున అజీర్తి కారణంగా వాంతులు, విరోచనాలతో నేను అనారోగ్యం పాలయ్యాను. ఇంక ఆ స్థితిలో ఎలా ప్రయాణం చేస్తానని చాలా కలతచెందాను. మావారికి ఫోన్ చేసి, "మధ్యాహ్నం 2 గంటలలోపు నా పరిస్థితి బాగుంటేనే నేను వస్తాను. లేదంటే నేను రాలేను" అని చెప్పాను. అందుకాయన బాధతోనే సరే అన్నారు. ఆ తర్వాత నేను మందులు వేసుకుని, నిరంతరాయంగా బాబా నామాన్ని జపిస్తూ, ఊదీనీళ్లు తీసుకుంటూ, "బాబా! నేను ఈ పరిస్థితి నుండి సరిగా మధ్యాహ్నం రెండు గంటలకల్లా బయటపడాలి" అని బాబాను ప్రార్థించాను. కాసేపు పడుకుని లేచి మా ప్రయాణం కోసం పెరుగన్నం తయారుచేశాను. కానీ నాకు నీరసంగా, మగతగా ఉంది. ఓ.అర్.ఎస్ లిక్విడ్ తీసుకున్నప్పటికీ నా పరిస్థితి మెరుగుపడినట్లు నాకు అనిపించలేదు. అయినప్పటికీ ప్రయాణానికి నన్ను నేను సన్నద్ధపరుచుకుని కొద్దిగా పెరుగన్నం తిన్నాను. బాబా దయవలన నెమ్మదిగా నా పరిస్థితి మెరుగవడంతో మేము వెళ్లి బస్సు ఎక్కాము. నేను నిరంతరాయంగా బాబాను స్మరిస్తూ, "రైలు ప్రయాణానికి టిక్కెట్లు దొరకని కారణంగా వాంతులు, విరోచనాలతో నా పరిస్థితి బాగాలేకపోయినప్పటికీ బస్సు ఎక్కాను బాబా. నన్ను జాగ్రత్తగా చూసుకోండి బాబా" అని బాబాను ప్రార్థించసాగాను. నేను రాత్రంతా నిద్రపోలేదు. కానీ బాబా దయతో నేను ఏ సమస్యనీ ఎదుర్కోలేదు. ఒకచోట డిన్నర్‍కి బస్సు ఆపినప్పుడు మాత్రమే నేను వాష్‍రూమ్‍కి వెళ్ళొచ్చాను. ఆ తర్వాత 12 గంటల ప్రయాణంలో నాకు వాష్‍రూమ్ అవసరం అస్సలు రాలేదు. ఇదంతా బాబా దయవల్లనే సాధ్యమైంది. తరువాత తిరుగు ప్రయాణంలో RAC టిక్కెట్లు బాబా దయవల్ల కన్ఫర్మ్ కావటంతో హాయిగా పడుకుని వచ్చాము. నిజానికి మా ప్రయాణానికి రెండురోజుల ముందు అటుఇటు తిరగడం వలన నిద్రలేక బాగా నీరసంగా ఉన్నాము. కేవలం బాబా దయవల్ల మేము సౌకర్యవంతంగా ప్రయాణం ముగించుకుని మా గమ్యస్థానానికి చేరుకున్నాము. "థాంక్యూ బాబా". చివరిగా, మా అనుభవాలను పంచుకోవడానికి ఈ వేదికను ఇచ్చిన భయ్యాకు చాలా కృతజ్ఞతలు.


2019, ఆగస్టు 29న మా అమ్మాయి మైనర్ పాస్‌పోర్ట్ ఎక్స్‌పైర్ అయింది. కాబట్టి తనకి పద్దెనిమిది సంవత్సరాలు నిండాక 2019, సెప్టెంబరులో కొత్త పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. కానీ మాకు సరైన చిరునామా లేదు. కారణం మేము నాగపూర్‍కి చెందినవాళ్ళం. మా ఆధార్ కార్డు కూడా నాగపూరుకి చెందినదే. కాబట్టి మేము ముందుగా ఆధార్‍లో చిరునామా మార్పు కోసం దరఖాస్తు చేసి, డ్రైవింగ్ లైసెన్స్‌కి కూడా దరఖాస్తు చేశాము. ఈ రెండు కార్డుల ప్రక్రియ పూర్తయ్యేసరికి దాదాపు 2, 3 నెలలు పట్టింది. ఆ రెండు కార్డులు(ఆ అనుభవాలు ఇదివరకు పంచుకున్నాను) ప్రస్తుత చిరునామాతో రాగా వాటిని అడ్రస్ ధ్రువీకరణ పత్రాలుగా సమర్పించి పాస్‌పోర్టుకి దరఖాస్తు చేద్దామనుకున్నాము. కానీ 2019, డిసెంబరు, 2020, జనవరిలలో మా అమ్మాయికి JEE, మెయిన్స్ ప్రవేశ పరీక్షలు ఉన్నందున పాస్‌పోర్టుకి దరఖాస్తు చేయలేదు. తీరా 2020, మార్చిలో దరఖాస్తు చేయాలనుకుంటే కరోనా మొదలై అంతటా లాక్‍డౌన్ విధించారు. అందుచేత మేము పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేయలేకపోయాము. తరువాత ఈ సంవత్సరం ఎలాగైనా తొందరగా పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేద్దామనుకున్నాము. ఎందుకంటే, కాలేజీలు తెరిచాక మా అమ్మాయి తన చదువుకోసం వేరే ఊరు వెళ్తే పాస్‌పోర్ట్ రావడం కష్టమైపోతుంది. కారణం పాస్‌పోర్ట్ వెరిఫికేషన్‍కి వచ్చినప్పుడు దరఖాస్తు చేసుకున్న మా అమ్మాయి ఇంట్లోనే ఉండాలి. అయితే అంతలోనే మా అమ్మాయి చదివే కాలేజీ నుండి 2021, అక్టోబరు 25 నుండి కాలేజీ మొదలవుతుందని మెయిల్ వచ్చింది. దాంతో మేము అక్టోబరు 19న రెండు, మూడు రోజులల్లో వచ్చేస్తుందని తత్కాల్ పాస్‌పోర్ట్‌కి దరఖాస్తు చేశాము. దురదృష్టవశాత్తు మా అమ్మాయి జ్వరంతో బాధపడుతుండటంతో మేము అక్టోబరు 22కి పాస్‌పోర్ట్ స్లాట్‌ను రీషెడ్యూల్ చేశాము. బాబా దయవల్ల రీషెడ్యూల్డ్ పాస్‌పోర్ట్ స్లాట్ దొరికింది. అంతలో అకస్మాత్తుగా కాలేజీ అక్టోబర్ 26 నుండి తెరవబడుతుందని మాకు తెలిసింది. మేము సహాయం కోసం బాబాను ప్రార్థించి పాస్‌పోర్ట్ ఆఫీసుకి వెళ్ళాము. మా అమ్మాయి అన్ని ఫార్మాలిటీస్ పూర్తిచేసాక పాస్‌పోర్ట్ ఆఫీసువాళ్ళు మరుసటిరోజు పాస్‌పోర్ట్ వస్తుందని చెప్పారు. కానీ మరుసటిరోజు పాస్‌పోర్ట్ మా ఇంటికి రాలేదు. ఆ మరుసటిరోజు కూడా పోస్టల్ పనివేళలు ముగిసినప్పటికీ పాస్‌పోర్ట్ మాకు చేరలేదు. దాంతో మళ్ళీ నేను సహాయం కోసం బాబాను ప్రార్థించాను. ఆ తరువాత మేము సాయంత్రం ప్రత్యక్ష ప్రసారంలో ఆరతి వింటుండగా పోస్ట్‌మ్యాన్ వచ్చి పాస్‌పోర్ట్ డెలివరీ ఇచ్చి, మా అమ్మాయి సంతకం తీసుకున్నాడు. మరుసటిరోజు మేము వెరిఫికేషన్ ఆఫీసర్ కోసం ఎదురుచూసాము. ఎందుకంటే, ఆ మరుసటిరోజే మా అమ్మాయి కాలేజీకి మేము ప్రయాణమవ్వాల్సి ఉంది. బాబా దయవల్ల ఆరోజు సాయంత్రం వెరిఫికేషన్ ఆఫీసర్ వచ్చి సర్టిఫికెట్స్ చూసి, సాక్షి సంతకం అడగకుండానే వెళ్లారు. మాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇది చిన్న సంఘటన కావొచ్చు కానీ మాకు ఇది పెద్ద అద్భుతం. ఎందుకంటే, మేము బదిలీ మీద తిరిగే ఉద్యోగస్థులం. మాకు శాశ్వత చిరునామా అంటూ లేదు. అలాంటిది మేము మా అమ్మాయి పాస్‌పోర్ట్ పొందాము అంటే అది కేవలం బాబా దయే. "ధన్యవాదాలు బాబా. నా అనుభవాన్ని ఆలస్యంగా పంచుకున్నందుకు క్షమించండి".


బాబాని తలచుకోగానే దొరికిన సర్టిఫికెట్


ఓం శ్రీసాయినాథాయ నమః!!! నా పేరు తిలోత్తమ్మ. శ్రీసాయినాథుని దివ్యపాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ సాయిబాబా మాపై చూపిన ప్రేమ, కరుణలను సాటి సాయిభక్తులతో పంచుకుంటున్నాను. ముందుగా సాయిబంధువులకు, 'సాయి మహారాజ్ సన్నిధి' నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారాలు. మావారు ఒకసారి తప్పనిసరై ఒక సర్టిఫికెటును స్కూల్లో ఇవ్వాల్సి వచ్చి దాన్ని ఉంచిన ఫైలులో చూస్తే అది కనిపించలేదు. ఎంత వెతికినా ఆ సర్టిఫికెట్ దొరకలేదు. ఆ తరువాత మా ఇంట్లో దీపం వెలిగించారు. అప్పుడు నేను ఆ సర్టిఫికెట్ దొరకాలని బాబాని వేడుకున్నాను. తరువాత చివరిసారిగా మావారు స్కూలుకి వెళ్ళేటప్పుడు ఆ ఫైలు తెరచిచూశారు. అద్భుతం! ఫైల్ తెరవగానే పైననే  ఆ సర్టిఫికెట్ కనిపించింది. అంతవరకు కనిపించని ఆ సర్టిఫికెట్ బాబాని తలచుకోగానే దొరికింది. "ధన్యవాదాలు బాబా. మాకు వివాహమై కొన్ని సంవత్సరాలవుతున్నా సంతానం కలగలేదు బాబా. కరోనా కారణంగా ట్రీట్మెంట్ ఆపేసిన మేము మీ దయతో మళ్లీ మొదలుపెట్టాము. మాకు సంతానం కలిగేలా అనుగ్రహించండి బాబా. నా కోరిక నెరవేరితే, 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ ద్వారా సాటి సాయిభక్తులతో నా అనుభవాన్ని పంచుకుంటాను. మా మీద దయచూపండి బాబా. మా తమ్ముడి ఉద్యోగం కోసం ఒకరికి డబ్బులిచ్చి మోసపోయాం బాబా. పోలీసు స్టేషన్, కోర్టుల చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కావడం లేదు బాబా. దయతో ఆ డబ్బు మా నాన్నకి అందేలా చేయండి సాయీ. ఆ డబ్బులు మాకు అందితే, ఆ అనుభవాన్ని బ్లాగులోని సాయిభక్తులతో పంచుకుంటాను".


సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!!!


చెడు కలలు రాకుండా అనుగ్రహించిన బాబా


నా పేరు ఉదయకుమారి. మేము విజయవాడలో ఉంటాము. ముందుగా ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారం. సాయి నాకు ప్రసాదించిన అనుభవాన్ని బ్లాగులో పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఈమధ్య మావారి ఆరోగ్యం గురించి చాలా చెడ్డ కలలు వస్తుండేవి. అందువల్ల నాకు చాలా భయంగా ఉంటుండేది. అప్పుడు మా వదిన ద్వారా నాకు ఈ బ్లాగ్ గురించి తెలిసి, "బాబా! నాకు చెడు కలలు రావడం ఆగిపోవాలి" అని బాబాకి దణ్ణం పెట్టుకుని, "అలా జరిగితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను బాబా" అని అనుకున్నాను. బాబా నా కోరిక తీర్చారు. చెడు కలలు రావడం ఆగిపోయింది. అందుకే నా అనుభవాన్ని ఇలా తోటి సాయిబంధువులతో పంచుకున్నాను. "బాబా! నా అనుభవం పంచుకోవడంలో కొంచం ఆలస్యమైనందుకు క్షమించండి. మీ కృప ఎప్పుడూ మా అందరిమీదా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను బాబా. త్వరలో కరోనా పూర్తిగా అంతమై ప్రపంచమంతా శాంతిసౌఖ్యాలతో ఉండేలా అనుగ్రహించండి బాబా".


ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!!!


సాయిభక్తుల అనుభవమాలిక 1033వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబాను గట్టిగా మనసునిండా ప్రార్థించడం వల్ల జరిగిన మహిమ
2. బాబా ఉన్నారు - నిజంగా బాబా ఉన్నారు
3. అనుకున్న కార్యక్రమాన్ని చక్కగా జరిపించిన బాబా

బాబాను గట్టిగా మనసునిండా ప్రార్థించడం వల్ల జరిగిన మహిమ


నేను సాయిభక్తురాలిని. ముందుగా సాయిభక్తులందరికీ నమస్తే. ఈ బ్లాగు నిర్వాహకులకు వినయపూర్వక ధన్యవాదాలు. ప్రతి ఉదయం 'సాయిభక్తుల అనుభవమాలిక' చదవకపోతే ఆరోజు పరిపూర్ణం కాదు. వయసులో పెద్దవారైన మా అమ్మగారు అనారోగ్యాలను జయించి ఆరోగ్యంగా మాతో ఉండేలా దయతో అనుగ్రహించిన బాబాకు శతకోటి పాదాభివందనాలు. నేను మా అమ్మతో, "సచ్చరిత్ర, ఊదీలను నీకు రక్షగా ఉంచి, నిన్ను కాపాడుతున్నది సాయేన"ని చెప్పి, "సాయి నామజపం చేస్తుండమ"ని చెప్పాను. సాయిబాబాని మన హృదయంలో నిరంతరం కొలుస్తూ ఉందాం. ఇక నా అనుభవానికి వస్తే..

 

నేను నా గత అనుభవం ఒకదానిలో మా స్థలానికి సంబంధించిన వివాదంలో కోర్టు తీర్పు మాకు అనుకూలంగా వచ్చేలా బాబా అనుగ్రహించారని మీతో పంచుకున్నాను. అయితే ఆ జడ్జిమెంటుకు సంబంధించిన ఒరిజినల్ డాక్యమెంట్లను కోవిడ్ కారణంగా కోర్టులు నడవకపోవడం వంటి పలురకాల కారణాలతో మా న్యాయవాది మాకు ఇవ్వకుండా వాయిదా వేస్తుండేవారు. చాలాసార్లు ఫోన్ చేసినా, వ్యక్తిగతంగా కలిసినా 2019, ఏప్రిల్ నుండి ఇప్పటి వరకు కోర్టు కాగితాలు మాకు చేరలేదు. నేను నిరంతరం ఆ డాక్యూమెంట్ల కోసం సాయిని అడిగి విసిగిస్తూ ఉండేదాన్ని. ఆ సమస్యకాక నా ఉద్యోగరిత్యా దూరప్రయాణం వంటి ఇతర సమస్యలు నన్ను మానసిక ఒత్తిడికి గురిచేస్తుంటే ఒకరోజు సాయంత్రం నేను బాబాని చూస్తూ, "బాబా! గత రెండున్నర సంవత్సరాలుగా ఒరిజినల్ డాక్యూమెంట్స్ లేకపోవడం వల్ల మేము ఏవిధంగానూ ముందడుగు వేయలేకపోతున్నాం. నేను ఇప్పుడు న్యాయవాదికి ఫోన్ చేస్తాను. ఏదేమైనా మీరు కొంతైనా సానుకూల సమాధానం వచ్చేలా చేయండి బాబా" అని బాబాతో చెప్పుకుని ఫోన్‍కి, నా నుదుటికి బాబా ఊదీ పెట్టుకుని మరికొంత ఊదీ నోట్లో వేసుకుని ఫోన్ చేశాను. బాబాను గట్టిగా మనసునిండా ప్రార్థించడం వల్ల ఎంత విచిత్రం, ఎంత మహిమ జరిగిందో చూడండి. ఎప్పుడూ ఎదో ఒక కారణంతో కాగితాల కోసం విసిగిస్తున్నామని మాట్లాడే న్యాయవాది, "మీ కాగితాలు తీసుకోడానికి సోమవారం రండి, ఇప్పటికే ఆలస్యం అయ్యింది" అని అన్నారు. నేను సంతోషంతో మనసులోనే  సాయినాథుని పాదాలను కన్నీటితో కడిగి ధన్యవాదాలు చెప్పుకున్నాను. తరువాత సోమవారం కోర్టుకి వెళ్తూ నా బ్యాగులో ఊదీ ప్యాకెట్ వేసుకుని మనసులో 'ఓం శ్రీసాయి మార్గబాంధవే నమః' (ఆటంకాలు తొలగించు తండ్రి) అని సాయి జపం చేస్తూ ఓపికగా ఉంటే సాయంత్రం నాలుగు గంటలకు మా ఒరిజినల్ డాకుమెంట్స్ మాకు ఇప్పించారు బాబా. "శతకోటి వందనాలు సాయీ! మా ఇంటి విషయంలో ముందడుగు పడేలా, నీ చల్లనిచూపులు మాపై నిరంతరం వర్షిస్తూ మా పిల్లలు చక్కగా చదువుకుని ఉన్నత స్థితిని పొందేలా, సుఖమయమైన చక్కని జీవితం గడిపేలా ఆశీర్వదించండి సాయి! ఆరోగ్య సమస్యల నుండి కాపాడు సాయినాథా! నా కష్టాలు నీకు తెలుసు, వాటిని పరిష్కరించు బాబా. నాకు దగ్గరలో ఉండే స్కూలుకి బదిలీ అయి, నీ నామజపం మరింతగా చేసుకునే అదృష్టం కలిగించు తండ్రి! శిరిడీ వచ్చే అదృష్టం కలిగించు తండ్రి. అందరినీ కాపాడు తండ్రి. అన్నింటికన్నా ముఖ్యంగా కలలో కూడా మీ స్మరణ, పాదసేవకు మేము దూరం కాకుండా కాపాడు తండ్రి".


బాబా ఉన్నారు - నిజంగా బాబా ఉన్నారు


నా పేరు సాహిత్య. ముందుగా ఈ బ్లాగు నిర్వాహకులకు, సాటి సాయిబంధువులకు నా నమస్కారాలు. "ఆలస్యంగా నా అనుభవాన్ని పంచుకుంటున్నందుకు నన్ను క్షమించండి బాబా". మాకు పాప పుట్టి నెలరోజులు అయ్యింది. తనకి పుట్టుకతోనే హార్ట్ ప్రాబ్లమ్ ఉన్నందున మేము మానసిక ఆందోళనలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో అకస్మాత్తుగా ఒకరోజు పాప ఉన్నట్టుండి బాగా ఏడవడం మొదలుపెట్టింది. ఎంత ఎత్తుకున్నా, పాలు పట్టినా ఏడుపు ఆపలేదు. ఈ నెల రోజుల్లో ఎప్పుడూ తను అలా ఏడవనందున నాకు చాలా చాలా భయమేసి బాబాని ఒక్కటే ప్రార్థించాను: "ప్లీజ్ బాబా, పాప ఏడుపు ఆపాలి. పాప ఏడుపు అపి హాయిగా నిద్రపోతే నా అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని. అప్పుడే మా అమ్మకి 6నెలల బాబు ఉన్న మా వదిన గుర్తొచ్చి, తనకేమైనా చిట్కాలు తెలుసేమోనని తనకి ఫోన్ చేసింది. మా వదిన ఒక మందు చెప్పింది. ఆ మందు కొని తెచ్చి, వెయ్యగానే పాప ఏడుపు ఆపి హాయిగా బజ్జుంది. దాంతో నేను, మా అమ్మ హాయిగా ఊపిరి పీల్చుకున్నాం. ఆ క్షణాన మా ఆనందం మాటల్లో చెప్పలేనిది. అసలే సమస్య ఉన్న పిల్ల, అలా ఏడుస్తుంటే చూసి మేము తట్టుకోలేకపోయాం. సమయానికి బాబానే మా అమ్మకి వదిన గుర్తొచ్చేలా చేసారు. "థ్యాంక్యూ సో మచ్ బాబా. దయచేసి మా పాప మంచి ఆరోగ్యంతో కలకాలం బాగుండేలా దీవించండి బాబా"


నేను గర్భవతిగా ఉన్న రోజుల్లో ఉద్యోగం మానేసి ఇంట్లో(అత్తగారిల్లు) ఉన్నందున మా పనిమనిషి నాకు బాగా దగ్గరై తన విషయాలన్ని నాతో పంచుకోవడం మొదలుపెట్టింది. వాళ్ళ చిన్నకూతురికి పెళ్లయి  4 సంవత్సరాలైనా పిల్లలు లేరు. ఒక ట్రీట్మెంట్ అని కాదు చాలారకాల ట్రీట్మెంట్స్ తీసుకున్న తరువాత కూడా ఏం లాభం లేకపోవడంతో వాళ్ళు ఆశలు వదులుకున్నారట. ఆ విషయం తెలిసి నేను, "బాబా! ఆ అమ్మాయి గర్భవతి అయితే ఆ అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. అద్భుతం ఏంటంటే, ఇప్పుడు ఆమెకి 4వ నెల. 4వ నెల వచ్చేవరకు ఆ విషయం ఆమెక్కూడా తెలియదట. ఆమె గర్భవతి అని మా పనిమనిషి ఎంతో సంతోషంగా నాతో చెప్పినప్పుడు నేను ఏదో తెలియని అవధులు లేని ఆనందానికి లోనయ్యాను. బాబా ఉన్నారు, నిజంగా బాబా ఉన్నారు. కాకపోతే అప్పుడప్పుడు మనల్ని పరీక్షిస్తారు. అయినా చివరికి మనకు ఆనందాన్ని ఇస్తారు. ఇది నిజంగా నిజం. "అన్నిటికీ థాంక్యూ సో మచ్ బాబా. మా తప్పులన్నింటికీ క్షమాపణ వేడుకుంటున్నాను బాబా, ముఖ్యంగా నా మొక్కులు తీర్చుకోకపోయినందుకు. త్వరలోనే తీర్చుకుంటాం బాబా. ప్లీజ్ క్షమించండి. మళ్లీ మళ్లీ ఆ తప్పులు చెయ్యను బాబా. మీ మీద భక్తివిశ్వాసాలు పెంపొందేలా మమ్మల్ని అనుగ్రహించి సన్మార్గంలో మమ్ము నడిపించండి బాబా". బాబా దయవల్ల త్వరలో నా పాపకి నయమై, తను ఆరోగ్యంగా ఉందన్న శుభవార్తతో మళ్లీ మీ ముందుకు రావాలని ఆశిస్తున్నాను. 


ఓం శ్రీ సచ్చిదానంద సమర్ధ సద్గురు సాయినాథాయ నమః!!!


అనుకున్న కార్యక్రమాన్ని చక్కగా జరిపించిన బాబా


'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగును ప్రసాదించిన 'సాయి మహారాజ్'కు, బ్లాగును నిర్వహిస్తున్న బృందానికి నా హృదయపూర్వక నమస్కారాలు. నాపేరు రాధారాణి. మాది గుంటూరు జిల్లా, మల్లిఖార్జునపేట. మేము బాబా భక్తులం. మా ఇంటి దగ్గర బాబా గుడి ఉంది. మేము బాబా సేవలో నిమగ్నమై ఉంటాము. మాకు ఏ ఆపద వచ్చినా బాబా మాకు అన్యాయం చేయరనే ధైర్యంతో ఉంటాము. 2004వ సంవత్సరం నుండి బాబా ఎన్నో విధాలుగా మమ్మల్ని కాపాడుతూ ఉన్నారు. మేము 2021, అక్టోబరు 27న 'పంచ నాగేంద్రస్వామి' విగ్రహ ప్రతిష్ట చేయుటకు సంకల్పించుకోగా హఠాత్తుగా అక్టోబరు 15న మా నాన్నగారికి జ్వరం వచ్చి చాలా నీరసించిపోయారు. నేను, 'ఏమిటి ఇట్లా జరుగుతుంది?' అని అనుకుని, "బాబా! ఈ ఆపదను తొలగించండి తండ్రి. నా అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి'లో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. బాబా నా మొర ఆలకించారు. ఆయన కృపవలన 27వ తేదీన మేము అనుకున్న కార్యక్రమం చక్కగా జరిగింది. మన సాయినాథ్ మహారాజ్ కి శతకోటి వందనాలు.



సాయిభక్తుల అనుభవమాలిక 1032వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. శ్రీసాయి అనుగ్రహం
2. మానసిక ప్రశాంతతనిచ్చిన బాబా
3. కోరుకున్నట్లు సమస్యను పరిష్కరించిన బాబా

శ్రీసాయి అనుగ్రహం


సాయిబంధువులకు, 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వాహకులకు నా నమస్కారాలు. నాపేరు దీప్తి. మాది హైదరాబాద్. నేనిప్పుడు బాబా ప్రసాదించిన కొన్ని అనుభవాలను మీతో పంచుకుంటాను. మా పెద్దమ్మాయి 10వ తరగతి 'ICSE'లో పూర్తి చేసింది. తర్వాత మేము తనని ఇంటర్ మొదటి సంవత్సరం ఒక కాలేజీలో జాయిన్ చేసాము. 2021, సెప్టెంబర్ వరకు ఆన్లైన్ క్లాసులు మంచి లెక్చరర్స్ చక్కగా బోధించారు. సెప్టెంబర్ 1 నుంచి ఆఫ్ లైన్ క్లాసులు మొదలయ్యాయి. అక్టోబరు వరకు కాలేజీకి వెళ్ళిన మా అమ్మాయి, "ఇక నేను కాలేజీకి వెళ్లను, మళ్ళీ పాత స్కూలుకే వెళ్తాను. అక్కడే 11వ స్టాండర్డ్ చదువుతాను" అని ఏడవడం మొదలుపెట్టింది. దాంతో పాత స్కూలు హెడ్మాస్టర్‍ని కలిసి మాట్లాడదామని నేను, మావారు, మాపాప ముగ్గురం కలిసి స్కూలుకి వెళ్ళాము. వెళ్ళే దారిలో అంతా నేను సాయి నామజపం చేస్తూ వెళ్ళాను. ఆ స్కూలువాళ్ళు మొదట, "ఇప్పటికే నాలుగు నెలలు గడిచిపోయాయి, పరీక్షలు కూడా అయ్యాయి. కాబట్టి సీటు ఇవ్వలేము" అన్నారు. కాని కొంతసేపటికి మళ్లీ వాళ్లే, "ఫోన్ చేస్తాము, ఇప్పుడు మీరు వెళ్ళండి" అని చెప్పి పంపారు. మేము ఇంటికి వచ్చిన తర్వాత, "సోమవారం రండి" అని ఫోన్ చేసారు. సరేనని, నేను మా ఇద్దరమ్మాయిలతో కలిసి సోమవారం స్కూలుకు వెళ్తే, కొంత ఫీజు తగ్గించి డబ్బులు కట్టమన్నారు. అదే స్కూల్లో మా అమ్మాయి ఐదేళ్లు చదివినప్పటికీ ఫీజులో కన్సెషన్ ఇవ్వడం ఇదే మొదటిసారి. ఇదంతా ఆ సాయితండ్రి దయ. ఇక మా అమ్మాయి బాధ్యత అంతా ఆ సాయితండ్రికే అప్పగించాను.


నేను మూడు సంవత్సరాల క్రితం కెనరా బ్యాంకులో లాకరు తీసుకున్నాను. అప్పుడు నా దగర ఉన్న డబ్బులకు, బంగారంకు సరిపడా చిన్న లాకరు తీసుకున్నాను. ఆ తర్వాత బాబాతండ్రి దయవలన కొత్త ఇంటికోసం బ్యాంకులో పెట్టిన బంగారం తాకట్టు నుండి విడిపించాము. అప్పుడు మీడియం సైజ్ లాకర్ కావాలని బ్యాంకు ఎంప్లాయ్‍ని అడిగితే, అతను నన్ను మేనేజర్ వద్దకు తీసుకుని వెళ్ళి, మాట్లాడి చాలా తక్కువ డిపాజిట్‍కే లాకరు ఇప్పించాడు. అయితే బ్యాంకులో ఒక మేడమ్, డబ్బు మొత్తం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాము, ఇంట్రెస్ట్ కూడా ఇవ్వమని అన్నారు. అప్పుడు మళ్ళీ మేనేజర్ వచ్చి, అలా కాదని ఫిక్స్డ్ డిపాజిట్ చేయకుండా సేవింగ్స్ అకౌంటులోనే ఉంచేటట్లు చేసారు. అది కూడా ఆ సాయినాథుని దయే. ఎందుకంటే, అదే కెనరా బ్యాంకువాళ్ళు మా ఎదురింటి వాళ్ళు లాకర్ తీసుకుంటామని అడిగినప్పుడు రెండు లక్షల రూపాయలు డిపాజిట్ చేయమన్నారు.


నేను 2021, ఆగస్టు నెల చివరిలో నా పదవ తరగతి స్నేహితుని ఇంటి గృహప్రవేశానికి వెళ్ళాను. ఒక్క రోజులో వెళ్ళి, రావచ్చు అని అక్కడినుండి ఇంకో ఇద్దరు స్నేహితురాళ్ళతో కలిసి తిరుపతి వెళదాం, అందుకోసమై మెల్లగా ఇంట్లోవాళ్ళ అనుమతి కూడా తీసుకుందామని అనుకున్నాను. కాని మా స్నేహితుడు దసరా తరువాత వెళదామని చెప్పి విమాన టికెట్లు, దర్శనం టికెట్లు బుక్ చేసాడు. బాబా దయవలన ఒక్కరోజులోనే తిరుపతి, తిరుచానూరు, గుడిమల్లం, శ్రీకాళహస్తి దర్శనం చేసుకుని వచ్చేసాము. మేము వెళ్ళే ముందు, తిరిగి వచ్చిన తర్వాత ఆ ప్రాంతమంతా భారీ వర్షాలు. ఆ సాయితండ్రి దయవలన మాకు దర్శనాలన్నీ బాగా జరిగాయి.


నేను తిరుపతి ప్రమాణమనుకోగానే అక్టోబర్ 7న శిరిడీలో దర్శనాలు మొదలయ్యాయి. వెంటనే శిరిడీ వెళతానని అడిగితే, మా ఇంట్లోవాళ్లు ఏమంటారోనని భయపడి ఆ సాయితండ్రినే, "మీ దర్శనం చేసుకుని రెండు సంవత్సరాలైంది. ఎలాగైనా శిరిడీ వచ్చేలా అనుగ్రహించండి బాబా" అని ప్రార్థించాను. ఆ సాయితండ్రి దయవలన తమ్ముడు వరసైన గోపాల్ అనే అతను ఫోన్ చేసి, "మా ఆవిడ శిరిడీ వెళదాం అంటుంది. అందరం కలిసి వెళదాం" అన్నాడు. నేను ఆనందంగా సరేనన్నాను. ఆ తర్వాత మా అమ్మ కూడా వస్తానంటే అందరికీ టికెట్లు బుక్ చేద్దామనుకున్నాము. ముందు నవంబరు 24న  వెళ్ళి 27కి తిరిగి వద్దామనుకున్న ప్రయాణం కాస్త డిసెంబరు 3కి వాయిదా పడి, దర్శనం టికెట్లు ఆన్లైన్‍లో బుక్ చేసుకుని శిరిడీ వెళ్ళాము. బాబా దయవలన శనివారంనాడు ఒక గంటలో మాకు దర్శనం అయ్యింది. ఆ తర్వాత శనిశింగణాపూర్ వెళ్ళొచ్చాము. ఆదివారంనాడు బాబా దర్శనం చేసుకున్న తరువాత రహతా, సాకోరి, పంచముఖ గణపతి ఆలయాన్ని దర్శించాము. అక్కడినుండి వచ్చాక మధ్యాహ్నం 3 గంటలకి నేను మళ్ళీ బాబా దర్శనానికి వెళ్ళాను. ఆ సమయంలో విపరీతంగా రద్దీ ఉండటంతో నాకు చాలా భయమేసి క్యూలైన్‍లోనే సచ్చరిత్ర చదువుతూ ఆ సాయితండ్రిని ప్రార్థించాను. ఆయన దయవల్ల ప్రశాంతంగా దర్శనమై రెండు గంటల తర్వాత సాయంత్రం 5 గంటలప్పుడు బయటికి వచ్చి రూమ్‍కి వెళ్ళాను. తరువాత 6 గంటలకి తిరుగు ప్రయాణమై నాగర్‍సోల్‍కి బయలుదేరాము. టాక్సి డ్రైవరు ఏదో పని ఉండి యావలాలో పది నిమిషాలు ఆగితే, అక్కడున్న పురాతన 'శ్రీకృష్ణ దేవాలయం', 'హనుమాన్ మందిరం' దర్శించుకున్నాము. తరువాత రైల్వేస్టేషన్‍కు వెళ్ళి మరుసటిరోజుకి హైదరాబాద్ చేరుకున్నాము. అందరినీ ఆ సాయినాథుడు కాపాడాలని కోరుకుంటూ... సెలవు.


మానసిక ప్రశాంతతనిచ్చిన బాబా


నాపేరు ఉష. నేను బాబా ప్రసాదించిన మరో అనుభవాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. మూడు, నాలుగు నెలల క్రిందట కోవిడ్ కారణంగా నేను ఇండియాలోని నా స్నేహితులు, కుటుంబసభ్యుల ద్వారా చెడు వార్తలు విన్న మూలాన నా మనస్సు పూర్తిగా నా నియంత్రణను కోల్పోయింది. నేను ఆ విచారకరమైన వార్తలను అస్సలు తీసుకోలేక మానసికంగా చాలా కృంగిపోయి ఒంటరితనాన్ని అనుభవించాను. ప్రతికూలమైన అనేక ఆలోచనలతో నా జీవితంలో ఏమి జరుగుతుందోనని ప్రతిక్షణమూ చాలా భయపడుతూ ఎంతమాత్రమూ నేను ఆ ఆలోచనల నుండి బయటకు రాలేకపోయాను. చివరికి ప్రతిరోజూ సాయిసచ్చరిత్ర చదవడం ప్రారంభించి సానుకూల వాతావరణాన్ని, మానసిక ప్రశాంతతను ప్రసాదించమని బాబాను ప్రార్థించసాగాను. నేను ఎప్పుడూ చదివే ఫేస్‌బుక్ పేజీలోని బాబా సందేశాలు నాకు సానుకూల అనుభూతినివ్వగా నేను నెమ్మదిగా కోలుకున్నాను. బాబా ఆశీస్సులతో నేను ఇప్పుడు చాలా బాగున్నాను. "ధన్యవాదాలు బాబా".


కోరుకున్నట్లు సమస్యను పరిష్కరించిన బాబా


సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వహిస్తున్న వారికి నా ధన్యవాదాలు. నేను ఒక సాయిభక్తుడిని. ఈ రోజు నేను బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవం మీతో పంచుకోవాలనుకుంటున్నాను. 2021, నవంబర్ 20వ తేదీన ఆఫీసులో నాకు ఒక పెద్ద సమస్య వచ్చింది. నేను అదేరోజు నా సమస్య గురించి బాబాతో చెప్పుకుని, "బాబా! 25వ తేదీ నాటికి నా సమస్యను తొలగించు తండ్రి" అని చెప్పుకున్నాను. ఆయన దయతో 26వ తేదీకి నా సమస్య తొలగిపోయింది. "ధన్యవాదాలు బాబా. మీ దయవలన నేను 27సంవత్సరాల సర్వీసు పూర్తి చేసాను. ఇంకా 7 సంవత్సరాల 6 నెలల సర్వీసును కూడా మీ దయతో సంతోషదాయకంగా పూర్తి చేసుకోవాలని, ఇంకా మీ కరుణాకటాక్షాలు మా కుటుంబం మీద సదా ఉండాల"ని వేడుకుంటున్నాను. చివరిగా మరోసారి ఈ బ్లాగు నిర్వాహకులకు నా ధన్యవాదాలు.


శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!!!

సద్గురు సాంబశివ మహరాజ్ కి జై!!!




సాయిభక్తుల అనుభవమాలిక 1031వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. శ్రీసాయి అనుగ్రహ వీచికలు
2. ఆపద రక్షకుడు శ్రీ సాయిబాబా
3. దిక్కుతోచని స్థితిలో మార్గదర్శకుడైన బాబా

శ్రీసాయి అనుగ్రహ వీచికలు


ఈ బ్లాగు నిర్వాహకులకు మరియు ప్రతిరోజూ బ్లాగు చదువుతున్న వారికి నా నమస్కారాలు. నేను ఒక సాయిభక్తురాలిని. మాకు రెండు సంవత్సరాల నాలుగు నెలల వయసున్న బాబు ఉన్నాడు. తనకి ఈమధ్య జలుబు, దగ్గు బాగా ఎక్కువగా వచ్చాయి. రాత్రుళ్ళు కూడా దగ్గు ఎక్కువగా ఉండటం వల్ల బాబు నిద్రపోవడానికి చాలా సమస్య అయ్యేది. నిద్రలేమి కారణంగా బాబు ఒళ్ళు జ్వరం వచ్చినట్లు వెచ్చగా ఉంటుండేది. అప్పుడు నేను, "బాబా! బాబుకి జలుబు, దగ్గు తగ్గితే, బ్లాగులో పంచుకుంటాను" అని చెప్పుకున్నాను. బాబా దయవల్ల కొన్నిరోజుల్లో బాబుకి తగ్గింది. "థాంక్యూ బాబా".


ఇటీవల నేను కొన్ని వ్యక్తిగత సమస్యల వల్ల హాస్పిటల్‍కి వెళ్ళాను. మొదటిరోజు నన్ను పర్యవేక్షణలో ఉంచి మందులిచ్ఛారు. రెండోరోజు ఉదయం బ్లడ్ టెస్టు చేసి అంతా సాధారణంగా ఉంది, సాయంత్రం ఇంటికి వెళ్ళొచ్చు అన్నారు. కానీ ఆరోజు సాయంత్రం నేను ఇంటికి వెళ్తాను అనుకునే సమయానికి మరలా చెక్ చేసి 'రిపోర్టును బట్టి లివర్‍కి చాలా సమస్య ఉంది. పరిస్థితి విషమంగా ఉంద'ని చెప్పి ఆ రాత్రి పర్యవేక్షణలో ఉంచి, మరుసటిరోజు ఏ విషయమూ చెప్తామన్నారు. నాకు చాలా భయమేసి ఏడ్చేసి, "బాబా! రేపు ఉదయం బ్లడ్ రిపోర్ట్స్ లో అంతా సాధారణంగా ఉన్నట్లు వస్తే బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా దయవల్ల ఉదయం రిపోర్టులో సమస్య ఏమీ లేదు, అంతా సాధారణంగా ఉందని వచ్చింది. దాంతో నన్ను డిశ్చార్జ్ చేశారు. బాబా దయతో పెద్ద ప్రమాదం నుండి నన్ను బయటపడేసారు. "థాంక్యూ బాబా. థాంక్యూ వెరీ మచ్".


నేను ఇటీవల ఒకసారి ఇల్లు శుభ్రపరుస్తున్నప్పుడు టేబుల్ జరుపుతుంటే ఆ టేబుల్ మొత్తం కదిలిపోయింది. మావారు తిడతారని నాకు భయమేసి, 'బాబా దయవల్ల ఏ సమస్యా లేకుండా ఉంటే బ్లాగులో పంచుకుంటాను' అని అనుకున్నాను. బాబా దయవల్ల ఎలాంటి సమస్యా కాలేదు. టేబుల్ మునపటిలాగే ఉపయుక్తంగా ఉంది. "థాంక్యూ బాబా".


2021, డిసెంబర్ 10న నా భర్త తనకి జ్వరంగా మరియు ఒళ్లునొప్పులుగా ఉందని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అలా ఉంటే చాలా భయమేస్తుంది. అందుచేత నేను, "బాబా! నా భర్తకి ఎలాంటి సమస్యా లేకుండా నయమైతే బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా దయవల్ల నా భర్తకి త్వరగా ఆరోగ్యం చేకూరింది. "థాంక్యూ బాబా. థాంక్యూ వెరీ మచ్".


ఆపద రక్షకుడు శ్రీ సాయిబాబా


అందరికీ నమస్తే. నా పేరు మహేష్. నేను ఇంతకుముందు కొన్ని అనుభవాలను పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవాన్ని పంచుకుంటున్నాను. ఈమధ్య మా పొలం రిజిస్ట్రేషన్ కోసంగా ఒక గురువారం స్లాట్ బుక్ చేసుకున్నాము. బాబా దయవల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్ చాలా సులభంగా పూర్తయింది. ఇకపోతే ఇటీవల 5 నెలల వయసున్న మా అన్న కూతురుకి జ్వరం వచ్చింది. బ్లడ్ టెస్టు చేస్తే అన్ని నార్మల్‍గానే ఉన్నాయి కానీ, జ్వరం మూడురోజులైనా తగ్గలేదు. జ్వరం కారణంగా పాప సరిగా పాలు కూడా తాగేది కాదు. అప్పుడు మళ్ళీ పెద్ద హాస్పిటల్‍కి తీసుకెళ్లి బ్లడ్ టెస్ట్ చేస్తే, ప్లేట్లెట్స్ విపరీతంగా తగ్గాయని తెలిసింది. డాక్టరు డెంగ్యూ జ్వరమని, వెంటనే హైదరాబాదులోని పెద్ద హాస్పిటల్లో అడ్మిట్ చెయ్యమన్నారు. దాంతో మేము త్వరగా పాపను తీసుకుని వెళ్లి హైదరాబాదులోని హాస్పిటల్లో అడ్మిట్ చేసాము. అక్కడి డాక్టరు చిన్నపాప కాబట్టి ప్లేట్లెట్స్ పెరగటానికి 5 నుండి 15 రోజులు సమయం పట్టొచ్చు అన్నారు. కానీ అంత చిన్నపాప ట్రీట్మెంట్ ఎలా తట్టుకుంటుందోనని మేము భయంతో చాలా ఏడ్చాము. ఆరోజు రాత్రి నుండి ఉదయం వరకు పాపని ఐ.సి.యులో ఉంచి, ఆపై జనరల్ వార్డులో పెట్టి చికిత్స చేశారు. నేను బాబాను, "పాపని రక్షించి, క్షేమంగా ఇంటికి చేర్చినట్లైతే, ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని ఆర్తిగా వేడుకున్నాను. ఇంకా చిన్న సాయిబాబా ఫోటో పాప బెడ్ దగ్గర పెట్టి తరచూ బాబా ఊదీ పాప నుదుటన పెడుతుండేవాళ్ళం. బాబా చేసిన అద్భుతం వల్ల కేవలం రెండురోజుల్లో పాప ప్లేట్లెట్స్ చాలావరకు పెరిగాయి. ఇంత చిన్నపాపకి ఇంత త్వరగా ప్లేట్లెట్స్ ఇంతలా ఎలా పెరిగాయని డాక్టర్లే ఆశ్చర్యపోయారు. పాపని అడ్మిట్ చేసిన సమయంలో ప్లేట్లెట్లు పెరగడానికే 5 నుండి 15 రోజులు సమయం పడుతుందని డాక్టర్లు అన్నప్పటికీ కేవలం రెండురోజుల్లో పాపని డిశ్చార్జ్ చేయించి బాబా మహాద్భుతం చూపించారు. ఈవిధంగా బాబా మా అన్నయ్య కూతురుని డెంగ్యూ జ్వరం నుండి ఆపద రక్షకుడై ఆదుకుని ఆరోగ్యాన్ని ప్రసాదించారు. "చాలా చాలా ధన్యవాదాలు సాయినాథా. ఇలాగే ఎల్లవేళలా మా కుటుంబసభ్యుల్ని చల్లగా కాపాడండి బాబా. నా జీవితం సక్రమంగా నడిచేట్టు అనుగ్రహించండి బాబా".


దిక్కుతోచని స్థితిలో మార్గదర్శకుడైన బాబా


నా పేరు అనిల్. మా నాన్నగారు చనిపోయినప్పటి నుండి నేను సాయిబాబానే నా గురువుగా, తండ్రిగా బావిస్తూ మా అమ్మను చూసుకుంటున్నాను. నేను శ్రీశైలంలోని ఒక సామాజిక వర్గానికి చెందిన సత్రంలో అకౌంటెంటుగా విధులు నిర్వహిస్తున్నాను. ఈమధ్య ఒకరోజు నేను అనుకోకుండా అధికార్లకు ఎదురు తిరిగి మాట్లాడాల్సి వచ్చింది. నేను చేసింది సామాజిక వర్గపరంగా తప్పుకాకపోయినప్పటికి వృత్తిపరంగా తప్పు. దాంతో అప్పటిదాకా ఏ తప్పు చేయని నన్ను సారీ చెప్పమని నాపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే నిక్కచ్చిగా, నిజాయితీగా వ్యవహరించే నేను ఆ విషయంలో రాజీపడలేక సారీ చెప్పాల్సి వస్తే, నా ఉద్యోగం వదిలేసి వెళ్లిపోవాలనుకున్నాను. అదలా ఉంటే, నేను వివాదంలో చిక్కుకునేసరికి నా క్రిందస్థాయి ఉద్యోగి 'నన్ను పరిష్కరించమంటావా?' అంటూ నా సమస్యను అవకాశంగా తీసుకోవాలని చూశారు. ఏదేమైనా నేను బాబానే నమ్ముకుని బయటకి ధైర్యంగా ఉన్నా, లోలోపల మాత్రం మధనపడుతూ "బాబా! నేను అలా మాట్లాడాల్సి వచ్చిన సమయంలో నా భావోద్రేకాలని పరిగణలోకి తీసుకుని నాకు సహకరించండి బాబా" అని బాబాను వేడుకుని, "మీరు ఏ పరిష్కారం చూపితే, అది చేస్తాను" అని మన బ్లాగ్ ఓపెన్ చేసి చూశాను. అందులో 'తెల్లని మిఠాయిలు బాబా సన్నిధిలో పంచు. నీ సమస్య తీరిపోవును' అని వచ్చింది. అంతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా తెల్లని మిఠాయిలు(పాలకోవా) కొని, బాబా మందిరానికి వెళ్ళి బాబా ముందు పెట్టి పంపిణీ చేశాను. ఆ తరువాత రోజు మా సంస్థ ప్రెసిడెంట్ వచ్చి నా తరుపున వకాల్తా పుచ్చుకుని నామీద ఎవరైతే ఆరోపణలు గుప్పిస్తున్నారో, ఎవరైతే నన్ను సారీ చెప్పమన్నారో వారితో గట్టిగా వాదించి, నా అంతరంగాన్ని  స్పష్టంగా తెలియపరచి వారిదే తప్పు అని తిప్పికొట్టి సమాధానమిచ్చారు. అంతటితో వివాదం సద్దుమణిగింది. అలా నేను క్షమాపణ చెప్పకుండానే ఉద్యోగంలో కొనసాగేలా చేసారు బాబా. ఆయన దయవల్ల నేను ఇప్పుడు ప్రశాంతంగా ఉద్యోగం చేసుకుంటున్నాను.


చివరిగా ఒక మాట: "బాబా 'తెల్లని మిఠాయిలు పంచమ'ని చెప్పడం నా సమస్యకు పరిష్కారం కాదు. ఆయన ఆవిధంగా నా బాధ తీరిపోతుందనే ధైర్యాన్ని ఇచ్చారు".


శ్రీ సమర్ధ సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!!!



సాయిభక్తుల అనుభవమాలిక 1030వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. విషయమేదైనా బాబా చెవిన వేస్తే విజయం సిద్ధిస్తుంది
2. నమ్ముకున్న బాబా నిరాశపరచకుండా నా కోరిక తీర్చారు
3. ఏ ఇబ్బందీ లేకుండా విదేశం నుండి రప్పించిన బాబా

విషయమేదైనా బాబా చెవిన వేస్తే విజయం సిద్ధిస్తుంది


నా పేరు అనిత. నేను సాయితో నాకున్న మరికొన్ని అనుభవాలను ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. ఈమధ్య ఒకసారి మా పెద్ద అబ్బాయి తన పర్స్ ఎక్కడో పొగొట్టుకున్నాడు. అందులో డబ్బులతోపాటు బస్ పాస్ కూడా ఉంది. నేను, "బాబా! అ పర్స్ దొరికేటట్లు చేయండి స్వామి" అని బాబాను వేడుకున్నాను. ఆయన దయవల్ల మూడురోజుల తరువాత పర్సు కాలేజీలో దొరికింది. "చాలా చాలా దన్యవాదాలు బాబా".


అలాగే నాకు గుండెనొప్పిగా ఉంటే డాక్టరు దగ్గరకు వెళ్ళి చూపించుకున్నాను. డాక్టరు చెక్ చేసి, "ఏమీ లేదు, అది గ్యాస్ నొప్పి" అని చెప్పి మాత్రలు ఇచ్చారు. అయితే ఆ మాత్రలు  వేసుకుంటుంటే నాకు గుండె అంతా పట్టేసినట్లుగా ఉండి చచ్చిపోతానేమోనని నా మనసుకి అనిపించేది. అప్పుడు భయంతో, "అమ్మో.. నాకు ఏమైనా అయితే ఎలా బాబా? నా పిల్లలు చిన్నవాళ్ళు బాబా" అని బాబాను వేడుకుని, నా బాబా నాకు అన్యాయం చేయరని గొప్ప నమ్మకంతో ఉండసాగేదాన్ని. ఇంకా నేను ఒకవేళ చనిపోయేటట్లైతే నా బాబా నాకు దర్శనం ఇస్తారు. ఆ తర్వాతే నాకు ఏదైనా సంభవిస్తుంది అని అనుకునేదాన్ని. అప్పుడు సాయి అనుభవాలలో "నీ భక్తి ఫలిస్తుంది. నీకోసం నేను విమానం పంపి, దానిలో నిన్ను కూర్చండబెట్టి తీసుకుని వెళ్తాను. నీవు నిశ్చింతగా ఉండు!" అనే సాయి వచనం చదివి నా గుండె చెరువైపోయింది. నా బాబా పిలిస్తే పలికే తండ్రి. ఈ జన్మకు ఇంతకన్నా ఏం కావాలి అనిపించింది.


ఇంకొక అనుభవం ఏమిటి అంటే, "మా అబ్బాయికి 10వ తరగతిలో ఫస్టు క్లాసు వస్తే, నేను సాయిసచ్చరిత్ర పుస్తకాలు పంచుతాను" అని బాబాకి మొక్కుకున్నాను. బాబా దయవల్ల మా అబ్బాయికి 10/10 మార్కులు వచ్చాయి. అయితే నేను నా మ్రొక్కు మరచిపోయాను. దాన్ని బాబా మా ఎదురింటి ఫ్రెండ్ ద్వారా గుర్తు చేయించారు. కానీ ఆ పుస్తకాలు శిరిడీలోనే దొరుకుతాయి, ఇంకా ఎక్కడా దొరుకవు అని తెలిసింది. అప్పుడు నేను, "ఇప్పుడు ఎలా?  ఏమి చేయను బాబా?" అని బాబాను తలుచుకుని అన్ని సాయి మందిరాలలో అడిగి చూసాను. అన్నిచోట్లా పుస్తకాలు లేవు అని అన్నారు. తరువాత సచ్చరిత్ర పుస్తకాలు ఫ్లిప్ కార్ట్ లో ఉన్నాయి అని నాకు తెలిసింది. కానీ అందులో పుస్తకం అసలు ధర 75/- రూపాయలు అయితే 195/- రూపాయలకు అమ్ముతున్నారు. దాంతో ఇప్పుడు ఏంచేద్దాం అని అనుకున్నాను. బాబా దయవల్ల ఆ రాత్రి చూస్తే, ఫ్లిప్ కార్ట్ లో ఒక పుస్తకం 129/- అని, అదనంగా ఏ ఛార్జీలు లేవని ఆఫర్ పెట్టారు. వెంటనే నేను 6 పుస్తకాలు ఆర్డరు పెట్టి, "బాబా! సచ్చరిత్ర ఎవరి దగ్గర లేదో, వాళ్ళకే ఈ పుస్తకాలు అందాలి" అని అనుకున్నాను. నేను కోరుకున్నట్లే బాబా అనుగ్రహించారు. పుస్తకాలు కావాల్సిన వాళ్ళను మా ఇంటికే పంపి, పుస్తకాలను వాళ్లకి పంపిణీ చేసేలా బాబా అనుగ్రహించారు. నా తండ్రికి నేను నా జీవితాంతం ఋణపడి ఉంటాను. ఏ విషయాన్నైనా ముందుగా మనం బాబా చెవిలో వేస్తే ఆ పని యందు మనకు విజయం సిద్ధిస్తుంది.


సమర్ధ సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్  కీ జై!!!


నమ్ముకున్న బాబా నిరాశపరచకుండా నా కోరిక తీర్చారు


నేను సాయిభక్తురాలిని. 2021, డిసెంబర్ నెల మొదటివారంలో బాబా ప్రసాదించిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. కోవిడ్ సమయంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా మా అబ్బాయి వివాహం బాబా జరిపించారని నేను ఇదివరకు పంచుకున్నాను. తరువాత నేను బాబాను, "వాళ్ళ సంసార జీవితం మంచిగా సాగేలా చూసి త్వరలో మాకు మనవడిని ప్రసాదించమ"ని వేడుకున్నాను. తరువాత మా కోడలి నోట 'ఎప్పుడెప్పుడు ఆ శుభవార్త వింటానా?' అని ఎదురు చూసాను. బాబా దయవల్ల పెళ్ళైన నెల రోజులకే మా కోడలు శుభవార్త చెప్పింది. నేను నమ్ముకున్న బాబా, నా తల్లితండ్రి తమ బిడ్డనైన నన్ను నిరాశపరచకుండా నా కోరిక తీర్చారు. ఈ కోరికతోపాటు నేను సాయిని ఇంకో కోరిక కోరాను. కానీ అది నెరవేరడానికి ఇంకా సమయం పడుతుంది. అందుకే ముందుగా నాకు సంతోషాన్నిచ్చిన ఈ అనుభవాన్ని మీతో పంచుకున్నాను. "చాలు సాయి. మమ్మల్ని మీ కృపా దృష్టితో చల్లగా చూడు తండ్రి. ధన్యవాదాలు సాయి". 


ఒకరోజు నేను మా పెద్దబాబు దగ్గర ఉన్నాను. నేను ఊర్లో ఉన్నా, పెద్దబాబు దగ్గర ఉన్నా మా చిన్నబాబు వీలు చూసుకుని నన్ను కలవడానికి వస్తాడు. ఆరోజు ఉదయం కూడా ఆఫీసు పని చూసుకుని దారిలో నన్ను కలుస్తానని చెపితే, నేను సరేనన్నాను. తరువాత ఉదయం 11, 12 గంటల సమయంలో నేను చిన్నబాబుకి ఫోన్ చేసి, "ఎక్కడ ఉన్నావు?" అని అడిగితే, "అమ్మా! ఇక్కడే ఉన్నాను, కాసేపట్లో వస్తాను. కానీ నాకు పైల్స్ సమస్య ఉన్నట్లు అనిపిస్తుంది. సరిగా కూర్చోలేకపోతున్నాను" అని చెప్పాడు. వాడు ఎంతో ఇబ్బంది ఉంటేనేగాని నాతో చెప్పి నన్ను ఇబ్బంది పెట్టడు. అలాంటిది అలా చెప్తుంటే నాకు చాలా భయమేసి, "బాబా! మీ దయతో బాబు తనకి తగ్గిందని చెప్పితే, నేను బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. తరువాత చిన్నబాబు తనకు తెలిసిన ఒక ఫ్రెండ్‍తో తన సమస్య గురించి చెపితే, అతను "నాకు కూడా అలా అయ్యింది. నాకు తెలిసిన డాక్టరు ఉన్నారు" అని చెప్పి ఆ డాక్టరు చేత మందులు ఇప్పించాడు. తరువాత నేను 2021, డిసెంబర్ 10న మా బాబుని "తగ్గిందా?" అని అడిగితే, "తగ్గిందమ్మా, మందులు అవసరం లేదు" అని చెప్పాడు. అంతా బాబా దయ. "ధన్యవాదాలు బాబా. నాకు అన్నీ మీరే సాయి. చిన్నబాబు విషయంలో నాకు ఒక కోరిక ఉంది. దాన్ని మీరే నెరవేర్చాలి సాయి".


ఏ ఇబ్బందీ లేకుండా విదేశం నుండి రప్పించిన బాబా


ఓం శ్రీసాయినాథాయ నమః!!! ముందుగా నా తండ్రైన సాయినాథుని పాదపద్మములకి నమస్కారములు. ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి ధన్యవాదాలు. నా పేరు యశోదమ్మ. మాది అనంతపురం. బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. మా అమ్మాయి, అల్లుడు, మనువడు స్వీడన్‍లో ఉంటుండేవారు. వాళ్ళు ఈమధ్య ఇండియాకు తిరిగి రావాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులలో ప్రభుత్వం ఏ నిమిషంలో విదేశాల నుండి వచ్చేవారిని ఆపేస్తుందోనని చాలా భయపడుతుండేవాళ్ళం. నేను బాబాను ప్రార్థించి, "మా అమ్మాయివాళ్ళు ఏ ఇబ్బందీ లేకుండా ఇండియా వచ్చేస్తే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని మొక్కుకున్నాను. బాబా దయవలన ఎటువంటి ఆటంకాలు లేకుండా మా అమ్మాయివాళ్ళు 2021, డిసెంబర్ 8వ తేదిన ఇండియా వచ్చేసారు. ఆ సాయినాథుడు మా మీద చూపిన దయకు కోటికోటి ప్రణామాలు అర్పిస్తున్నాను. ఆయన దయ ఎప్పటికీ మా మీద, అందరి మీద ఇలాగే ఉండాలని బాబాను ప్రార్ధిస్తున్నాను.



సాయిభక్తుల అనుభవమాలిక 1029వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా తన భక్తులను బాధపడనీయరు
2. సాయితండ్రిని నమ్ముకుంటే, ఎదైనా సుసాధ్యం చేస్తారనడానికి దొరికిన నిదర్శనం
3. దయతో జ్వరం తగ్గించిన బాబా

బాబా తన భక్తులను బాధపడనీయరు


సాయిబంధువులందరికీ నమస్కారం. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న వారికి ధన్యవాదాలు. ఈ మధ్య మేము మా చుట్టాల పెళ్లికి వెళ్ళాము. ఆ పెళ్లి నుండి ఇంటికి వచ్చాక మా తమ్ముడు మామూలుగా తన ఆఫీసు వర్క్ చేసుకున్నాడు. మరుసటిరోజు ఉదయం తమ్ముడు చూసుకుంటే, తన గోల్డ్ చైన్ కనిపించలేదు. ఇక తనకి టెన్షన్ మొదలై చైన్ కోసం అంతటా వెతకడం మొదలుపెట్టాడు. కానీ చైన్ దొరకలేదు. అప్పుడు నాకు కాల్ చేసి, విషయం చెప్పాడు. నేను తనతో, "దొరుకుతుందిలే బాధపడకు" అని చెప్పాను. తర్వాత నేను, 'శ్రీసాయి సూక్ష్మాయ నమః' అని అనుకుని, "తండ్రీ, చైన్ దొరికితే నా అనుభవం సాయిభక్తులతో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. అరగంట తర్వాత మా తమ్ముడు నాకు కాల్ చేసి, "చైన్ దొరికింది" అని చెప్పి ఊపిరిపీల్చుకున్నాడు. అసలు వియమేమిటంటే, చైన్ లెట్రిన్‍లో దొరికింది. నిజానికి అంతకుముందు వాష్ రూం అంతటా వెతికారుకానీ, చైన్ దొరకలేదు. చివరికి లెట్రిన్ కుండిలో చూస్తే అందులో కనపడింది. ఇది సాక్షాత్తు బాబా లీల. ఆయన నిజంగా మిరాకిల్ చేసారు. అలాగే మేము పెళ్లి నుండి వచ్చాక, "బాబా! మేము పెళ్లికి వెళ్ళొచ్చాము. మాకు ఎటువంటి ఆరోగ్య సమస్య రాకుండా చూడండి" అని వేడుకున్నాము. బాబా దయవల్ల మాకు ఎటువంటి జ్వరాలు రాలేదు. బాబా తన భక్తులను బాధపడనీయరు. "బాబా! శతకోటి నమస్కారాలు తండ్రి సాయినాథా".


మరొక చిన్న అనుభవం: మా చిన్నబాబు ఒకరోజు స్కూలు నుంచి జ్వరంతో వచ్చాడు. చూస్తే, 102.5 డిగ్రీల జ్వరం ఉంది. మాకు చాలా భయమేసి, "కరోనా కాకూడదు తండ్రి. అది మామూలు జ్వరమే అయుండాలి" అని బాబాతో చెప్పుకున్నాను. బాబా దయవల్ల రెండు రోజులకి టెంపరేచర్ నార్మల్ అయింది. "థాంక్యూ బాబా. నేను అనుభవిస్తున్న ఒక ఆరోగ్యసమస్య నుంచి నన్ను తొందరగా బయటపడేయండి. అలాగే మా అమ్మ ఆరోగ్య సమస్యను కూడా తీర్చు తండ్రి సాయినాథా".


సర్వం శ్రీసాయినాథార్పణమస్తు!!!

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!!!


సాయితండ్రిని నమ్ముకుంటే, ఎదైనా సుసాధ్యం చేస్తారనడానికి దొరికిన నిదర్శనం


సాయికుటుంబీలకు నా నమస్కారాలు. ముందుగా బాబా మనకి ప్రసాదించిన అనుభవాలను తోటి భక్తులతో పంచుకునే అవకాశం కల్పిస్తున్న 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వాహకులకు నా ధన్యవాదాలు. నా పేరు కిషోర్. నేను ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసరుగా పని చేస్తున్నాను. మా పైఅధికారులు మమ్మల్ని రీసెర్చ్ ఆర్టికల్స్ పబ్లిష్ చేయాలని, లేనియెడల జీతంలో కొంచెం కోత విధిస్తామని ఒత్తిడి ప్రారంభించారు. నా క్యాడరులో ఉన్నవాళ్ళు సంవత్సరంలో కనీసం రెండు ఆర్టికల్స్ ప్రచురించాలి. నిజానికి రీసెర్చ్ ఆర్టికల్స్ ప్రచురించడం కష్టంతో కూడుకున్న పని అయినప్పటికీ ఆ సాయినాథుని కృపవలన గత నాలుగు సంవత్సరాలుగా నేను వాటిని పబ్లిష్ చేస్తూ వచ్చాను. ఈ సంవత్సరంలో కూడా జూలై నాటికి నేను రెండు రీసెర్చ్ ఆర్టికల్స్ పబ్లిష్ చేసాను. అదృష్టం కొద్దీ 2021, ఆగస్టు 3న మరొక (మూడవ) ఆర్టికల్‍ని ఒక జర్నల్ వారు (సైంటిఫిక్ పత్రికవారు) ప్రచురిస్తామని ఆమోదం తెలిపారు. నాకు ఒక పక్క ఆనందం, మరోపక్క బాధ కలిగాయి. ఎందుకంటే, ఈ సంవత్సరానికి లక్ష్యం అయిన రెండు ఆర్టికల్స్ ని పబ్లిష్ చేయడం పూర్తి చేసాను. మూడవది కూడా ఈ సంవత్సరంలోనే రావడం వల్ల నాకు ఉపయోగం లేదు. అందుకని నేను బాబాను, "2021, ఆగస్టు 3న ప్రచురణకు ఆమోదం పొందిన ఆర్టికల్‍ని 2022, జనవరిలో పబ్లిష్ అయ్యేలా అంటే 5 నెలలు ఆగి ప్రచురింపబడేలా అనుగ్రహించండి బాబా. అలా జరిగితే నాకు వచ్చే సంవత్సరంలో శ్రమ తగ్గుతుంద"ని దీనంగా బాబాను వేడుకున్నాను. తరువాత సాయి నామస్మరణ చేస్తూ ఉండేవాడిని. మనసులో మాత్రం నా ఆర్టికల్ పబ్లిష్ అయిపోతుందేమోనని ఒకటే ఉత్కంఠగా ఉండేది. కనీసం 5-6సార్లు సంబంధిత జర్నల్ వెబ్సైటు చూడని రోజు ఉండేదికాదు. అలా నేను పడ్డ ఆందోళన మాటల్లో చెప్పలేనిది. అలా నెలలు గడుస్తు వస్తుండగా 2021, డిసెంబర్ 3న నా రీసెర్చ్ ఆర్టికల్‍ని 2022, జనవరిలో పబ్లిష్ చేస్తామని వెబ్సైట్లో పెట్టారు. అది చూసిన నా ఆనందానికి మాటలు లేవు. సాయితండ్రిని నమ్ముకుంటే, ఎదైనా సుసాధ్యం చేస్తారని నమ్మడానికి మరో నిదర్శనం నాకు లభించింది. "ధన్యవాదాలు బాబా. ఇలాగే ప్రతీ ఒక్కరి కష్టాలను తీర్చండి తండ్రి".


దయతో జ్వరం తగ్గించిన బాబా


శ్రీసాయి దివ్య పాదపద్మములకు నా శతకోటి వందనాలు. ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి దన్యవాదాలు. నాపేరు అర్చన. 2021, నవంబరు 28న నా భర్తకు చాలా విపరీతంగా జ్వరం వచ్చింది. ఆ సమయంలో నేను, మా పాప మా అమ్మ వాళ్ళింట్లో ఉన్నాము. మొదట మావారు మేము కంగారు పడతామని తనకు జ్వరమన్న విషయం మాకు చెప్పలేదు. నేను ఆ రాత్రి కాల్ చేస్తే మావారు, "లైటుగా జ్వరం ఉంది, మందులు వేసుకున్నాను" అని మాత్రం చెప్పారు. అప్పుడు నేను బాబాకి నమస్కరించుకుని కొద్దిగా ఊదీ నా నోటిలో వేసుకున్నాను. మరుసటిరోజు నేను కాల్ చేస్తే, తనకి నార్మల్‍గా ఉందని మావారు చెప్పారు. కానీ రాత్రయితే ఆయనకి తీవ్రంగా జ్వరం వచ్చి వివరితంగా కలవరించేవారు. ఇక్కడ నాకు చాలా భయమేసి బాబాను చాలా ఆర్తిగా ప్రార్ధించి, "మావారికి జ్వరం తగ్గితే, బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకు మాట ఇచ్చాను. డిసెంబరు 5న జ్వరం పూర్తిగా తగ్గి మావారు నార్మల్ అయ్యారు. అంతా బాబా దయ. "ధన్యవాదాలు బాబా. నాకు రావలసిన డబ్బులు త్వరగా వచ్చేలా చూడు స్వామి. మీ మీద పూర్తి నమ్మకం, విశ్వాసంతో ఉన్నాను".



సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo