1. శ్రీసాయి అనుగ్రహ వీచికలు
2. ఆపద రక్షకుడు శ్రీ సాయిబాబా
3. దిక్కుతోచని స్థితిలో మార్గదర్శకుడైన బాబా
శ్రీసాయి అనుగ్రహ వీచికలు
ప్రతిరోజూ బ్లాగు చదువుతున్న వారికి నా నమస్కారాలు. నేను ఒక సాయిభక్తురాలిని. మాకు రెండు సంవత్సరాల నాలుగు నెలల వయసున్న బాబు ఉన్నాడు. తనకి ఒకసారి జలుబు, దగ్గు బాగా ఎక్కువగా వచ్చాయి. రాత్రుళ్ళు కూడా దగ్గు ఎక్కువగా ఉండటం వల్ల బాబు నిద్రపోవడానికి చాలా సమస్య అయ్యేది. నిద్రలేమి కారణంగా బాబు ఒళ్ళు జ్వరం వచ్చినట్లు వెచ్చగా ఉంటుండేది. అప్పుడు నేను, "బాబా! బాబుకి జలుబు, దగ్గు తగ్గాలి" అని బాబాకి చెప్పుకున్నాను. బాబా దయవల్ల కొన్నిరోజుల్లో బాబుకి తగ్గింది. "థాంక్యూ బాబా".
ఒకసారి నేను కొన్ని వ్యక్తిగత సమస్యల వల్ల హాస్పిటల్‍కి వెళ్ళాను. మొదటిరోజు నన్ను పర్యవేక్షణలో ఉంచి మందులిచ్ఛారు. రెండోరోజు ఉదయం బ్లడ్ టెస్టు చేసి అంతా సాధారణంగా ఉంది, సాయంత్రం ఇంటికి వెళ్ళొచ్చు అన్నారు. కానీ ఆరోజు సాయంత్రం నేను ఇంటికి వెళ్తాను అనుకునే సమయానికి మరలా చెక్ చేసి 'రిపోర్టును బట్టి లివర్కి చాలా సమస్య ఉంది. పరిస్థితి విషమంగా ఉంద'ని చెప్పి ఆ రాత్రి పర్యవేక్షణలో ఉంచి, మరుసటిరోజు ఏ విషయమూ చెప్తామన్నారు. నాకు చాలా భయమేసి ఏడ్చేసి, "బాబా! రేపు ఉదయం బ్లడ్ రిపోర్ట్స్‌లో అంతా సాధారణంగా ఉన్నట్లు రావాలి" అని అనుకున్నాను. బాబా దయవల్ల ఉదయం రిపోర్టులో సమస్య ఏమీ లేదు, అంతా సాధారణంగా ఉందని వచ్చింది. దాంతో నన్ను డిశ్చార్జ్ చేశారు. బాబా దయతో పెద్ద ప్రమాదం నుండి నన్ను బయటపడేసారు. "థాంక్యూ బాబా. థాంక్యూ వెరీ మచ్".
నేను ఇటీవల ఒకసారి ఇల్లు శుభ్రపరుస్తున్నప్పుడు టేబుల్ జరుపుతుంటే ఆ టేబుల్ మొత్తం కదిలిపోయింది. మావారు తిడతారని నాకు భయమేసి, 'బాబా దయవల్ల ఏ సమస్యా లేకుండా ఉండాలి' అని అనుకున్నాను. బాబా దయవల్ల ఎలాంటి సమస్యా కాలేదు. టేబుల్ మునపటిలాగే ఉపయుక్తంగా ఉంది. "థాంక్యూ బాబా".
2021, డిసెంబర్ 10న నా భర్త తనకి జ్వరం, ఒళ్లునొప్పులు ఉన్నాయని అన్నారు. అప్పటి కరోనా పరిస్థితుల్లో అలా ఉంటే చాలా భయమేసేది. అందుచేత నేను, "బాబా! నా భర్తకి ఎలాంటి సమస్యా లేకుండా నయమవ్వాలి" అని అనుకున్నాను. బాబా దయవల్ల నా భర్తకి త్వరగా ఆరోగ్యం చేకూరింది. "థాంక్యూ బాబా. థాంక్యూ వెరీ మచ్".
ఆపద రక్షకుడు శ్రీ సాయిబాబా
అందరికీ నమస్తే. నా పేరు మహేష్. 2021-22లో 5 నెలల వయసున్న మా అన్న కూతురుకి జ్వరం వచ్చింది. బ్లడ్ టెస్టు చేస్తే అన్ని నార్మల్‍గానే ఉన్నాయి కానీ, జ్వరం మూడురోజులైనా తగ్గలేదు. జ్వరం కారణంగా పాప సరిగా పాలు కూడా తాగేది కాదు. అప్పుడు మళ్ళీ పెద్ద హాస్పిటల్‍కి తీసుకెళ్లి బ్లడ్ టెస్ట్ చేస్తే, ప్లేట్లెట్స్ విపరీతంగా తగ్గాయని తెలిసింది. డాక్టరు డెంగ్యూ జ్వరమని, వెంటనే హైదరాబాదులోని పెద్ద హాస్పిటల్లో అడ్మిట్ చెయ్యమన్నారు. దాంతో మేము త్వరగా పాపను తీసుకుని వెళ్లి హైదరాబాదులోని హాస్పిటల్లో అడ్మిట్ చేసాము. అక్కడి డాక్టరు చిన్నపాప కాబట్టి ప్లేట్లెట్స్ పెరగటానికి 5 నుండి 15 రోజులు సమయం పట్టొచ్చు అన్నారు. కానీ అంత చిన్నపాప ట్రీట్మెంట్ ఎలా తట్టుకుంటుందోనని మేము భయంతో చాలా ఏడ్చాము. ఆరోజు రాత్రి నుండి ఉదయం వరకు పాపని ఐ.సి.యులో ఉంచి, ఆపై జనరల్ వార్డులో పెట్టి చికిత్స చేశారు. నేను బాబాను, "పాపని రక్షించి, క్షేమంగా ఇంటికి చేర్చండి" అని ఆర్తిగా వేడుకున్నాను. ఇంకా చిన్న సాయిబాబా ఫోటో పాప బెడ్ దగ్గర పెట్టి తరచూ బాబా ఊదీ పాప నుదుటన పెడుతుండేవాళ్ళం. బాబా చేసిన అద్భుతం వల్ల కేవలం రెండురోజుల్లో పాప ప్లేట్లెట్స్ చాలావరకు పెరిగాయి. ఇంత చిన్నపాపకి ఇంత త్వరగా ప్లేట్లెట్స్ ఇంతలా ఎలా పెరిగాయని డాక్టర్లే ఆశ్చర్యపోయారు. పాపని అడ్మిట్ చేసిన సమయంలో ప్లేట్లెట్లు పెరగడానికే 5 నుండి 15 రోజులు సమయం పడుతుందని డాక్టర్లు అన్నప్పటికీ కేవలం రెండురోజుల్లో పాపని డిశ్చార్జ్ చేయించి బాబా మహాద్భుతం చూపించారు. ఈవిధంగా బాబా మా అన్నయ్య కూతురుని డెంగ్యూ జ్వరం నుండి ఆపద రక్షకుడై ఆదుకుని ఆరోగ్యాన్ని ప్రసాదించారు. "చాలా చాలా ధన్యవాదాలు సాయినాథా. ఇలాగే ఎల్లవేళలా మా కుటుంబసభ్యుల్ని చల్లగా కాపాడండి బాబా. నా జీవితం సక్రమంగా నడిచేట్టు అనుగ్రహించండి బాబా".
దిక్కుతోచని స్థితిలో మార్గదర్శకుడైన బాబా
నా పేరు అనిల్. మా నాన్న చనిపోయినప్పటి నుండి నేను సాయిబాబానే నా గురువుగా, తండ్రిగా బావిస్తూ మా అమ్మను చూసుకుంటున్నాను. నేను శ్రీశైలంలోని ఒక సామాజిక వర్గానికి చెందిన సత్రంలో అకౌంటెంటుగా విధులు నిర్వహిస్తున్నాను. ఒకరోజు నేను అనుకోకుండా అధికార్లకు ఎదురు తిరిగి మాట్లాడాల్సి వచ్చింది. నేను చేసింది సామాజిక వర్గపరంగా తప్పుకాకపోయినప్పటికి వృత్తిపరంగా తప్పు. దాంతో అప్పటిదాకా ఏ తప్పు చేయని నన్ను సారీ చెప్పమని నాపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే నిక్కచ్చిగా, నిజాయితీగా వ్యవహరించే నేను ఆ విషయంలో రాజీపడలేక సారీ చెప్పాల్సి వస్తే, నా ఉద్యోగం వదిలేసి వెళ్లిపోవాలనుకున్నాను. అదలా ఉంటే, నేను వివాదంలో చిక్కుకునేసరికి నా క్రిందస్థాయి ఉద్యోగి 'నన్ను పరిష్కరించమంటావా?' అంటూ నా సమస్యను అవకాశంగా తీసుకోవాలని చూశారు. ఏదేమైనా నేను బాబానే నమ్ముకుని బయటకి ధైర్యంగా ఉన్నా, లోలోపల మాత్రం మధనపడుతూ "బాబా! నేను అలా మాట్లాడాల్సి వచ్చిన సమయంలో నా భావోద్రేకాలని పరిగణలోకి తీసుకుని నాకు సహకరించండి బాబా" అని బాబాను వేడుకుని, "మీరు ఏ పరిష్కారం చూపితే, అది చేస్తాను" అని మన బ్లాగ్ ఓపెన్ చేసి చూశాను. అందులో 'తెల్లని మిఠాయిలు బాబా సన్నిధిలో పంచు. నీ సమస్య తీరిపోవును' అని వచ్చింది. అంతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా తెల్లని మిఠాయిలు(పాలకోవా) కొని, బాబా మందిరానికి వెళ్ళి బాబా ముందు పెట్టి పంపిణీ చేశాను. ఆ తరువాత రోజు మా సంస్థ ప్రెసిడెంట్ వచ్చి నా తరుపున వకాల్తా పుచ్చుకుని నామీద ఎవరైతే ఆరోపణలు గుప్పిస్తున్నారో, ఎవరైతే నన్ను సారీ చెప్పమన్నారో వారితో గట్టిగా వాదించి, నా అంతరంగాన్ని స్పష్టంగా తెలియపరచి వారిదే తప్పు అని తిప్పికొట్టి సమాధానమిచ్చారు. అంతటితో వివాదం సద్దుమణిగింది. అలా నేను క్షమాపణ చెప్పకుండానే ఉద్యోగంలో కొనసాగేలా చేసారు బాబా. ఆయన దయవల్ల నేను ప్రశాంతంగా ఉద్యోగం చేసుకుంటున్నాను.
చివరిగా ఒక మాట: "బాబా 'తెల్లని మిఠాయిలు పంచమ'ని చెప్పడం నా సమస్యకు పరిష్కారం కాదు. ఆయన ఆవిధంగా నా బాధ తీరిపోతుందనే ధైర్యాన్ని ఇచ్చారు".
శ్రీ సమర్ధ సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!!!
