1. కృపతో తొలిసారి శ్రీశైల క్షేత్ర దర్శనం చేయించిన బాబా
2. ఊదీతో రెండురోజుల్లో నెలరోజుల బాధను తీసేసిన బాబా
కృపతో తొలిసారి శ్రీశైల క్షేత్ర దర్శనం చేయించిన బాబా
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి. ముందుగా సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు పి.సి.శేఖర్. నేను ఏడు సంవత్సరాలుగా సాయిభక్తుడిని. నా మనసులో ఎప్పటినుండో శ్రీశైల క్షేత్రాన్ని దర్శించాలని ఉన్నప్పటికీ దర్శించలేకపోయాను. చివరికి బాబా దయవల్ల 2021, నవంబర్ 29న శ్రీశైలం వెళ్లేందుకు నాకు అవకాశం వచ్చింది. ఆరోజు నేను, నా భార్య, అత్తమ్మ శ్రీశైలం వెళ్లేందుకు ప్రయాణమవుతుండగా సరిగ్గా అప్పుడే ఒక సాయిబాబా వాట్సప్ గ్రూపులో 12 జ్యోతిర్లింగాల గురించిన మెసేజ్ వచ్చింది. ఆ 12 జ్యోతిర్లింగాలలో రెండవది మన రాష్ట్రంలోని కర్నూలు జిల్లా, శ్రీశైలంలో ఉంది. సమయానికి ఆ మెసేజ్ సాయే పంపారని నాకనిపించి సంతోషించాను. నేను ఎప్పుడు ఏ ఊరికి వెళ్ళినా వస్తూ, పోతున్న వాహనాలపై సాయి ఫోటో దర్శనమిస్తే బాగుండు అని మనసులో అనుకుంటాను. అదే విషయం సాయిని ప్రార్థిస్తాను. ఆయన ప్రేమతో ఏదో ఒక వాహనంపై నాకు దర్శనమిస్తూ ఉంటారు. ఈసారి కూడా అలాగే అనుకున్నాను. మేము నరసారావుపేట నుండి బయలుదేరితే అక్కడే రెండు కార్లపై దర్శనమిచ్చారు బాబా. ఆపై వినుకొండ వద్ద ఒక కారుపై, త్రిపురాంతకం వద్ద ఒక కారుపై, డోర్నాల వద్ద మరో కారుపై దర్శనమిచ్చారు బాబా. అంటే మొత్తం 5సార్లు. దాన్నిబట్టి పంచేంద్రియాలు, పంచప్రాణాలు, మనస్సు, బుద్ధి, అహంకారం సాయికి సమర్పించాలని నాకు అర్థమైంది.
డోర్నాల దగ్గర మేము వెళ్తున్న బస్సు లంచ్ కోసం ఒక హోటల్ దగ్గర ఆగింది. కాసేపటికి మధ్యాహ్నం గం.1:23 నిమిషాలకు ముందే బస్సు స్టార్టు చేయబోతే, బస్సులో ఏదో సమస్య వచ్చి బస్సు కదల్లేదు. ప్రయాణికులంతా కలిసి కొంతదూరం నెట్టిన మీదటే బస్సు స్టార్టు అయ్యింది. అప్పుడు సమయం గం.1:32 నిమిషాలు అయింది. అది సాయి మహిమ అని, ఆయన నేను అనుసరించే సమయంలోనే బస్సు స్టార్టు అయ్యేలా చేశారని సంతోషపడ్డాను. ఇక్కడ నేను అనుసరించే సమయమేంటని మీకనిపించవచ్చు. కాబట్టి దాని గురించి చెప్తాను. నా లక్కీ నెంబర్ 23. అందుచేత నేనెప్పుడూ ఏ ముఖ్యమైన పనినైనా గంటలోని మొదటి 23 నిమిషాలలో ప్రారంభించను. అంటే ఉదాహరణకు ఏ పనినైనా 8:00-8:23 మధ్యలో చేయక 8:23-9:00 మధ్యలో చేస్తాను. ఇది ప్రతీ గంటకు వర్తిస్తుంది.
ఇకపోతే బస్సు శ్రీశైలం చేరుకున్నాక సాధారణంగా వెళ్ళే మార్గంలో కాకుండా సాక్షి గణపతి గుడి మీదుగా వెళ్ళింది. ముందెన్నడూ అలా వెళ్ళేది కాదట! బాబా మమ్మల్ని ముందు గణపతి భగవానుని వద్దకు పంపారని మేము సంతోషించాము. శ్రీశైలంలో 5కార్లపై, 4బస్సులపై బాబా దర్శనం ఇచ్చారు. తద్వారా నవవిధ భక్తులను అనుసరించాలని నాకు అర్థమైంది. బాబా దయవల్ల శ్రీశైల దర్శనం బాగా జరిగింది. దర్శనానంతరం 'సాయిబాబా, శివుడు ఒకరే' అనే టైటిల్‍తో ఒక సాయి భక్తుని అనుభవానికి సంబంధించిన యూట్యూబ్ లింక్ వచ్చింది. అది చూడగానే చాలా సంతోషంగా అనిపించింది. ఇంకా ఆ వీడియోలో విభూతి అనగానే టెంపుల్ దగ్గర నేను చదివిన విభూది సందేశాన్ని సాయి గుర్తు చేస్తున్నారేమోనని నాకు అనిపించింది. ఇకపోతే నేను మనసులో ఎక్కువగా భగవన్నామస్మరణ చేస్తూ ఉంటాను. అందుకు తగినట్లు మరుసటిరోజు నా మొబైల్‍కి కింది మెసేజ్ వచ్చింది.
నామస్మరణ - బాబా సందేశం: "నామం పాపాలనే పర్వతాలను పగలగొట్టుతుంది. నామం శరీర బంధనాలను విడగొట్టుతుంది. నామం కోటి చెడు వాసనలను సమూలంగా పెరికి వేస్తుంది. నామం కాలుని మెడను విరిచేస్తుంది. నామం జననమరణ చక్రాన్ని తప్పిస్తుంది. ప్రయత్నపూర్వకంగా నామాన్ని స్మరిస్తే మంచిది. అప్రయత్నంగా నామజపం చేసినా చెడు కలుగదు. తెలియకుండా నోటితో ఉచ్చరించినా నామ ప్రభావం ప్రకటమౌతుంది. అంతఃకరణాన్ని పరిశుద్ధపరచడానికి నామం కంటే సులభమైన మరో సాధనం లేదు. నామం జిహ్వకు భూషణం. నామం పరమార్థాన్ని పోషిస్తుంది. నామజపానికి స్నానం చేయాల్సిన అవసరం లేదు. అట్లే నామానికి విధి విధానాలేవీ లేవు. నామ సంకీర్తనలో సకల పాపాలు నశించిపోతాయి. నామం ఎల్లప్పుడూ పావనమైనది. అనవరతం నా నామాన్ని స్మరించేవారు తీరానికి చేరుకుంటారు. ఇతరసాధనలేవీ అవసరం లేకుండానే మోక్షం హస్తగతమవుతుంది. నా నామాన్ని ఎల్లప్పుడూ జపించేవారి పాపాలు క్షాళనమవుతాయి. మెల్లగా లోలోపల నా నామాన్ని జపించేవారు ఉత్తమ గుణ సంపన్నులకంటే ఉత్తములు".
నవంబరు 30న శ్రీశైలం నుండి మాచర్లకు తిరుగు ప్రయాణమయ్యాము. దారిలో డోర్నాల వద్ద టీ, టిఫిన్ కోసం బస్సు ఆపారు. అప్పుడు సరిగ్గా 4:23 నిమిషాలైంది. నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇలా మనసుకు తగట్టు అనుభవాలనిస్తూ రోజురోజుకి ఆయనపై నా భక్తిని మరింతగా పెంపొందిస్తున్నారు సాయి. "ధన్యవాదాలు బాబా. ఎల్లప్పుడూ మమ్మల్ని ఇలాగే అనుగ్రహించండి బాబా. అందరూ మీ సచ్చరిత్ర చదివి మీ అనుగ్రహానికి పాత్రులవ్వాలని కోరుకుంటున్నాను".
ఊదీతో రెండురోజుల్లో నెలరోజుల బాధను తీసేసిన బాబా
ఓం శ్రీ సాయినాథాయ నమః!!! సాయి బంధువులందరికీ నా నమస్కారాలు. నా పేరు యశోద. 2021, అక్టోబర్ - నవంబర్ ప్రాంతంలో నెలరోజులపాటు నా ఎడమ అరచేయిలో దురదగా ఉంటూ చర్మం పొరలు పొరలుగా ఊడిపోతుండేది. అందుకుగాను నేను హెూమియో మందులు వాడాను. కానీ తగ్గలేదు. చివరికి నేను బాబాతో నా బాధ చెప్పుకుని, నా చేతికి ఊదీ రాసాను. ఇంకా, "నా భాద తగ్గేలా అనుగ్రహించమ"ని బాబాతో చెప్పుకున్నాను. ఇక చూడండి అద్భుతం! రెండురోజుల్లో దురద తగ్గి, చర్మం ఊడిపోవడం కూడా తగ్గింది. పిలిచినంతనే పలికే దైవం మన చెంత ఉండగా మనకెందుకు భయం? "ధన్యవాదాలు బాబా. ఇలాగే ఎప్పుడూ మా చెంతనే ఉండి మమ్మల్ని, మా పిల్లల్ని కాపాడు తండ్రి సాయినాథా".
శరణం శరణం సాయినాథా!!!
