సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 2122వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • బాబా దయతో క్షేత్ర దర్శనాలు

ఓం శ్రీసాయినాథాయ నమః. సాయికి, సాయిబంధువులకు నా నమస్కారాలు. నా పేరు రమాదేవి. మా బాబుకి 4, 5 సంవత్సరాల నుండి కాళ్ళ దగ్గర, తలలో ఇన్ఫెక్షన్, దురద ఉన్నాయి. మందులు వాడటం , షాంపూలు మార్చడం చేసినప్పటికీ బాబు 2 ఏళ్ళు చాలా ఇబ్బందిపడ్డాడు. అప్పుడు బాబాని, దత్తస్వామిని వేడుకుంటూ ఊదీ రాస్తూ ఉంటే 3, 4 నెలల్లో కాళ్ళ దగ్గర కొద్దిగా తగ్గింది. కానీ, తలలో మాత్రం అలాగే ఉండింది. దురద వలన బాబు చికాకు పడుతుండేవాడు. 2 సంవత్సరాల, 5 నెలల కిందట 2024లో ఎవరో మావారికి, "బాబుకి నాగదోషం ఉండి ఉంటుంది. సుబ్రమణ్యస్వామికి అభిషేకం చేయడం మంచిది" అని చెప్పారు. మావారు సరేనని, మాకు దగ్గరలో ఉన్న గుడిలో కొన్నిరోజులు  అభిషేకం చేయడానికి డబ్బులు కట్టారు. తరువాత ఒకసారి "కుక్కే సుబ్రమణ్యస్వామి ఆలయానికి వెళ్ళి, అభిషేకం చేయించండి" అని పంతులు చెప్పారు. మేము అలాగే వెళదామని అనుకున్నాము. అప్పటికి స్వామి దయ, బాబా దయతో కాళ్ళ చుట్టూ తగ్గిపోయింది, తలలో కొద్దిగా ఉంది. కానీ 2 సంవత్సరాలు గడిచిపోయినా మేము కుక్కే సుబ్రమణ్యస్వామి ఆలయంకి వెళ్లలేకపోయాం. ఈ సంవత్సరం తప్పకుండా వెళ్ళాలని 2026, ఆగస్టు 15, 16 సెలవు దినాల్లో వెళ్ళడానికి ప్లాన్ చేశాం. ఆగస్టు 15న నేను, "కారు ప్రయాణం. అంతా సవ్యంగా జరగాలి. మాతోపాటు ఉండి జాగ్రత్తగా తీసుకెళ్లి, మళ్ళీ ఇంటికి క్షేమంగా చేర్చు బాబా" అని బాబాను వేడుకుని బయలుదేరాను. ఆరోజు మధ్యాహ్నం ప్రయాణంలో ఉండగా మావారికి జ్వరం వచ్చింది. ఇంకా 7, 8 గంటల ప్రయాణం ఉంది. మావారు జ్వరంతోనే కారు నడిపారు. రాత్రి 9 గంటల సమయంలో పెద్ద వర్షం మొదలైంది. మొత్తం 40, 50 కిలోమీటర్ల ఘాట్ రోడ్డు ప్రయాణం. నాకు భయమేసి దారిపొడవునా బాబా నామజపం చేశాను. బాబా, సుబ్రమణ్యస్వామి దయతో జాగ్రత్తగా కుక్కే చేరుకున్నాం. ఏ క్షేత్రానికి వెళ్ళనా ముందు మాకు బాబా దర్శనం అవుతుంది. కానీ అక్కడ మాకు బాబా కనపడలేదు. అందువల్ల నేను మా పిల్లలతో, "బాబా ఇంకా కనపడలేదు" అని దిగులుగా చెప్పాను. వెంటనే ఒక బస్సు మీద బాబా ఉన్నారని మా బాబు చూపెట్టాడు. నాకు చాలా సంతోషంగా అనిపించింది. నిజానికి ప్రయాణం తొందర్లో నేను చూసుకోలేదు గాని, ఆరోజు ఆగస్టు 15న నా అనుభవాలు ఈ బ్లాగులో ప్రచురితమయ్యాయి. ఇంకా ఆ రోజంతా బాబా చాలాసార్లు కనిపించారు కూడా. బాబా మన వెంటే ఉంటారు, మనకే తొందరపాటు ఎక్కువ. మరుసటిరోజు మావారికి జ్వరం బాగా ఎక్కువైంది. దర్శనం, అభిషేకం ఎలా జరుగుతాయో అని టెన్షన్ పడ్డాను. కానీ బాబా దయతో మావారి ఫ్రెండ్ అక్కడి స్థానిక వ్యక్తిని మాకు సహాయంగా పంపించారు. ఆ వ్యక్తి దగ్గర ఉండి అంతా చూసుకున్నారు. నాకు అతను నా బాబానే  అనిపించింది. "కృతజ్ఞతలు బాబా. మీ దయని ఏమని వర్ణించను?".

దర్శనానంతరం మావారు టాబ్లెట్లు వేసుకొని పడుకుంటే, జ్వరం కొద్దిగా తగ్గింది. దాంతో మావారు, "నాకు బాగానే ఉంది. దగ్గరలో ధర్మస్థల మంజునాథ ఆలయం ఉంది, వెళదాం" అని అన్నారు. సరేనని బయలుదేరాము. సాయంత్రం 5.30 సమయంలో అక్కడికి చేరుకున్నాం. దర్శనం చేసుకొని, అన్నప్రసాదం తీసుకుని రాత్రి 8 గంటలకి బయటకి వచ్చాం. అక్కడికి దగ్గరలో ఏమైనా క్షేత్రాలు ఉన్నాయా అని చూస్తే, 2 గంటల ప్రయాణ దూరంలో శృంగేరి శారద పీఠం ఉంది. 'సరే, ఇంతదూరం వచ్చాం. సరస్వతి ఆలయం కదా! వెళ్ళి, రాత్రికి అక్కడ రూమ్ తీసుకొని మరుసటిరోజు దర్శనం చేసుకుందాం' అని అనుకున్నాం. కానీ ఒక 20 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసేసరికి మాకు అర్థం అయింది, 'అది ఎంత ప్రమాదకరమైన మార్గమో!' అని. మొత్తమంతా ఘాట్ రోడ్, లోతైన లోయలు, చుట్టూ దట్టమైన అడవి. రాత్రి 9 గంటల సమయం. మా కారు.ఒకటే రోడ్ మీద ఉంది. వేరే ఏ వాహనాలు రావడం లేదు. ముందుకి వెళ్ళడం తప్ప వేరే మార్గం లేదు. ఇంకా 70 కిలోమీటర్ల ప్రయాణం. 'ఇక్కడ ఏమన్నా అయితే ఏంటి పరిస్థితి? అడవి జంతువులు, దొంగలు' అని ఏవేవో ప్రతికూల ఆలోచనలతో చాలా భయవేసింది. అయినా 'మన బాబా ఉన్నారు కదా!' అని ధైర్యం చెప్పుకొని, "క్షేమంగా శృంగేరి చేరుకోవాలి" అని బాబాను వేడుకొని నామజపం మొదలుపెట్టాం. నేను, మా పాప గంటన్నరసేపు దత్తనామం, సాయినామం, రామనామం ఇలా ఏ నామం నోట్లోకి వస్తే ఆ నామజపాలు నిర్విరామంగా చేసాము. మధ్యలో శృంగేరికి 13 కిలోమీటర్ల ముందు చెక్ పోస్ట్ వాళ్ళు, "నిషేదిత ప్రాంతం, పాస్ లేకుండా రాకూడదు" అని కాసేపు మమ్మల్ని ఆపేశారు. నేను సహాయం కోసం మళ్ళీ బాబానే వేడుకున్నాను. బాబా దయవల్ల 10 నిమిషాల తర్వాత కొన్ని డబ్బులు తీసుకొని వదిలేశారు. రాత్రి 11 గంటలకు బాబా దయవల్ల శృంగేరి క్షేమంగా చేరుకున్నాం. ఆ రాత్రి అక్కడే ఉండి మరుసటిరోజు దర్శనం, తర్వాత మా ఇద్దరు పిల్లలతో సరస్వతి పూజ చేయించాం. మావారు నీరసం వలన ఓపిక లేక కొంత చికాకు పడినప్పటికీ బాబా దయతో అంత సవ్యంగా జరిగింది. ఆగస్టు 18వ తేదీ ఉదయం ఇంటికి క్షేమంగా చేరుకున్నాం. ముందుగా అనుకోకపోయినప్పటికీ ధర్మస్థల, శృంగేరి దర్శనం బాబా ఇప్పించారు. 'ఏ దైవ దర్శనం మనకి లభించినా అది బాబా దయనే కదా!' అని సాయిబాబు గారి అనుభవంలో చదివానని అనుకుంటున్నాను. ఆ మాట అక్షర సత్యం.

ఇంటికి వచ్చిన వెంటనే హాస్టల్‌కి వెళ్లిన మా పాప తన బ్యాగులో చూసుకుంటే, తన మ్యాథ్స్ నోట్ బుక్ కనిపించలేదు. ఇంట్లో మరిచిపోయానేమో చూసి చెప్పమని మాకు ఫోన్ చేసింది. అయితే ఆ బుక్ ఇంట్లో లేదు. ఆ విషయం చెపితే, 2 నెలల వర్క్ అంత అందులోనే ఉందని చాలా బాధపడింది పాప. నేను తనతో, "బాబాకి చెప్పుకొని 'ఓం శ్రీసాయి సూక్ష్మయ నమః' అని జపం చేయమ"ని చెప్పాను. నేను కూడా బుక్ దొరకాలని వేడుకొని నామజపం చేశాను. బాబా దయతో బుక్ హాస్టల్‌లోనే వేరే అమ్మాయి దగ్గర దొరికింది. "శతకోటి ధన్యవాదాలు బాబా. పాప ఎక్కువగా టెన్షన్ పడుతుంది. తనకి తోడుగా ఉండి మంచిగా చదివేలా చూడు తండ్రి".

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo