ఈ భాగంలో అనుభవం:
- బాబా ప్రేమ అపారం
నా పేరు చందన. సాయి భక్తులకు నమస్కారాలు. సాయిబాబాయే నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం, సర్వస్వం. నా సాయితండ్రి నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశారు. అందులో నుండి కొన్ని ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. అది 2023వ సంవత్సరం ఆగస్టు నెల. మేము మా ఇంట్లో పెయింటింగ్ పని మొదలుపెట్టాం. రెండో రోజు పెయింటింగ్ పని అవుతుండగా వాష్‌రూమ్‌లో ఏదో దుమ్ము లాంటిది నా ఎడమ కంటికి పైన పడింది. అప్పుడు ఏమీ అనిపించలేదు కానీ, రెండు రోజుల తర్వాత ఎడమ కనుబొమ్మపైన బొబ్బల్లా వచ్చి విపరీతమైన నొప్పితోపాటు జ్వరం, వాంతులు ప్రారంభమయ్యాయి. డాక్టర్ దగ్గరకి వెళ్తే, హెర్పేస్ లేదా షింగ్ల్స్(herpes or shingles) అని చెప్పి చాలా మందులు వ్రాశారు. తర్వాత నాకు ఏ మాత్రం ఓపిక లేక పడుకున్నాను. తర్వాత రోజు మా ఆయన నన్ను, మా ఇద్దరు పిల్లల్ని హైదరాబాదులో ఉన్న మా అమ్మ వాళ్ళింటికి ఫ్లైట్‌లో పంపించారు. అక్కడికి వెళ్ళాక కూడా నాకు తగ్గలేదు. ఐదవ రోజుకి బొబ్బలు ఎక్కువై ఎడమ కన్ను పూర్తిగా వాచి మూసుకొనిపోయింది. మందులు వేసుకుంటే వెంటనే వాంతులు అయిపోవడం, విరోచనాలు కావడం వల్ల నేను అస్సలు తట్టుకోలేకపోయాను, ప్రాణం ఉంటుందా అన్నంతగా నీరసించిపోయాను. అప్పుడు నేను బాబాను, "నేను ఈ బాధను భరించలేకున్నాను, కాపాడండి బాబా" అని వేడుకున్నాను. బాబా దయచూపారు. మర్నాడు 6వ రోజు ఆయుర్వేదం మరియు హోమియో వైద్యులు అయిన మాకు తెలిసిన ఒక అంకుల్ వచ్చి డ్రాప్స్ వాటివేవో నాలుగు చుక్కలు గ్లాసు నీళ్లలో వేసి నాకు ఇచ్చారు. అంతే! అప్పటివరకు ఉన్న చచ్చేంత నొప్పి కొంచెం కొంచెంగా తగ్గుతూ కేవలం ఒక్క రోజులో పూర్తిగా తగ్గిపోయింది. రెండు రోజుల్లో కన్ను, ముఖము వాపు కూడా తగ్గాయి. అయితే సమస్య అంతటితో తీరిపోలేదు. మా అంకుల్ కన్నుకు సంబంధించి ఒక టాబ్లెట్ తప్పకుండా వేసుకోవాలని చెప్పారు. అయితే ఆ టాబ్లెట్ ధర చాలా ఎక్కువ అయినందున సమయానికి నా దగ్గర డబ్బులు సరిపోక నేను ఆ టాబ్లెట్ కొనలేదు. డాక్టర్ ఇచ్చిన ఇంగ్లీష్ మందులు కూడా పూర్తిగా వాడలేదు. ఆ కారణంగా 15 రోజులు తర్వాత నుండి నా ఎడమ కన్ను కొంచెం మసకమసకగా కనపడటం మొదలైంది. అది రోజురోజుకి ఎక్కువై అంతా మబ్బుగా ఉండేది. ఎదురుగా ఉన్న మా బాబు, మా ఆయనల ముఖాలు సరిగ్గా కనపడలేనంతగా కన్ను పాడయ్యింది. నేను అప్పటినుండి తిరగని ఐ స్పెషలిస్ట్స్, కార్నియా స్పెషలిస్ట్స్ లేరు. అసలు సమస్య ఏంటంటే, నా ఎడమ కంటి కార్నియా మీద మచ్చలు ఏర్పడ్డాయి. అది ఇంకా ముదిరితే పూర్తిగా నా ఎడమ కన్ను కనబడకుండా పోతుంది. నేను రోజూ బాబాని, "సరైన దారి చూపించి నన్ను ఈ కష్టం నుండి బయటపడేయండి" అని ప్రార్థిస్తూ ఉండేదాన్ని. అలా మూడేళ్లు గడిచిపోయి 2026, జూన్ నెల వచ్చింది. నా కన్ను కనపడక నాకు చాలా ఇబ్బందిగానూ, చాలా అంటే చాలా భయంగానూ ఉంటుండేది.
నేను రోజూ ఈ బ్లాగులో ఒక అనుభవం చదువుతాను. అలా 2026, జూలై 10న చదువుతున్నప్పుడు చాలా ఏడ్చి, "బాబా! మీరు నేను చెప్పేది వింటున్నట్లయితే ఈరోజు బ్లాగులో కన్నుకు సంబంధించిన లీల నాకు చూపించండి" అని బాబాను అడిగి యధాలాపంగా బ్లాగులో ఒక పోస్ట్ తెరిచాను. నిజంగా అక్కడ కన్నుకి సంబంధించిన లీలలు ఒకటి కాదు రెండు కనిపించాయి. అవి చూసి నాకు అస్సలు కన్నీళ్లు ఆగలేదు. నా సాయితండ్రి మన వెంటే ఉండి మన మంచి, చెడ్డలు చూస్తారనిపించింది. అలాగే క్వశ్చన్&ఆన్సర్ సైట్లో బాబాని అడిగినప్పుడు, "మూడు సంవత్సరాలుగా నువ్వు పడుతున్న బాధ ఈ శ్రావణమాసంతో పూర్తిగా తొలగిపోతుంది" అని ఇచ్చారు.
తర్వాత ఒకరోజు ఆన్లైన్లో మా ఇంటికి దగ్గరలో కార్నియా స్పెషలిస్ట్ ఉన్నారేమో చూసి, వెళ్లి కలిసాను. ఆవిడ చెక్ చేసి, నా కంటిలో నాలుగు మచ్చలు పెద్దగా ఉన్నాయని నాకు చూపించారు. తర్వాత, "మందులు వ్రాస్తాను. అవి వాడి చూద్దామ"ని చాలా హెవీ డోస్ మందులిచ్చి, "రోజుకు మూడుసార్లు వేసుకోమ"ని అన్నారు. అప్పుడు నేను, "బాబా! నేను శ్రద్ధగా మీ సచ్చరిత్ర ఒక వారం పారాయణ చేస్తాను. మందులు వాడతాను. మీదే భారం సాయి" అని బాబాను ప్రార్థించి రోజూ మందులతోపాటు పాలలో చిటికెడు బాబా ఊదీ వేసి తాగాను. ఆ డాక్టర్ ఇచ్చిన ఐ డ్రాప్స్, ఆయింట్మెంట్, ఇంకా ఇతర మందులు నేను గత మూడు సంవత్సరాలుగా వేరే వేరే డాక్టరులిస్తే వాడుతున్నవే. అవి అప్పుడు ఏ ఫలితం ఇవ్వలేదు. అయినా ఈసారి పూర్తి శ్రద్ధాభక్తులతో, బాబా మీద విశ్వాసంతో ఆ మందుల కోర్సు పూర్తి చేసి చివరిరోజు పారాయణ అయిపోయాక మనసులో బాబాని తలుచుకుంటూ ఐ స్పెషలిస్ట్ దగ్గరకి వెళ్లాను. ఆరోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను. ముందుసారి డాక్టర్ ఎన్నిసార్లు చెక్ చేసినా నాకు కనపడనిది ఈసారి డాక్టర్ చెక్ చేయగానే, నేను ఫాస్ట్ గా ఆపకుండా అన్ని అక్షరాలు చదివేసాను. డాక్టర్ షాక్ అయిపోయి, "చాలా ఆశ్చర్యం. మచ్చలు పోయాయి. కేవలం రెండు ఉన్నాయి. కానీ అవి చాలా లైట్ గా ఉన్నాయి. మీకు స్పష్టంగా కనబడుతుంది" అని అన్నారు. ఇది నిజంగా నిజం. నా బాబా ఇచ్చిన మాట తప్పరు. ఆయన అన్నట్టుగానే శ్రావణమాసంకి వారం ముందు నన్ను ఆ సమస్య నుండి బయటపడేశారు. నాకు ఆ క్షణం బాబాకి ఎన్ని కోట్ల ధన్యవాదాలు చెప్పినా తక్కువే అనిపించింది. నేను ఆయనపట్ల కృతజ్ఞతతో శ్రావణమాసంలో రెండుసార్లు సాయిచరిత్ర పారాయణ చేస్తానని ఆయనకి మాట ఇచ్చాను. "మీ పాదాలకు కోటి కోటి వందనాలు సాయినాథా! ఏమిచ్చి మీ ఋణం తీర్చుకోగలం బాబా. మీకు సర్వస్య శరణాగతి చేస్తూ, మీ నామాన్ని జపిస్తూ, మీ లీలలను స్మరించుకుంటూ ఉంట బాబా".
ఒకసారి మేము మా అమ్మ వాళ్ళింట్లో ఉన్నప్పుడు అమ్మ సాయిబాబా భజన ఇంట్లో పెట్టుకుంది. భజన అయిపోయాక అందరూ ప్రసాదాలు తీసుకుని వెళ్ళిపోయారు. అమ్మ, మా అన్నయ్య, తమ్ముడు సాయిబాబా పాదుకులు గుడిలో ఇవ్వడానికి వెళ్లారు. ఇంట్లో నేను, మా రెండో బాబు ఉన్నాము. వాడికప్పుడు రెండేళ్ల వయసు. నేను అన్నం తినిపిస్తుండగా వాడు హఠాత్తుగా కాలు జారి కింద పడ్డాడు. నేను మామూలుగా పడ్డాడని అనుకున్నాను కానీ, బాబు కదల్లేదు. చూస్తే, కనుగుడ్లు తేలేసాడు. నోటి నుండి మాట లేదు. నాకు గుండె ఆగినంత పనైంది. మా ఇంటిలో అద్దెకున్న వారి సహాయంతో నేను బాబుని ఒక హాస్పిటల్‌కి తీసుకెళ్తే, "ఎమర్జెన్సీ కేసు. పెద్ద హాస్పిటల్‌కి వెళ్ళండి" అని అన్నారు. మేము ఆ హాస్పిటల్ నుండి పెద్ద హాస్పిటల్‌కి వెళ్ళడానికి 25 నిమిషాలు పట్టింది. ఆ సమయంలో నేను పడ్డ బాధ వర్ణనాతీతం. హాస్పిటల్ కొంచెం దూరంలో ఉండగా బాబు హఠాత్తుగా వాంతి చేసుకున్నాడు. నా గుండె ఆగిపోయింది ఆ క్షణం. కానీ ఎక్కడో చిన్న ఆశ, 'నా బాబా ఉన్నారు. ఆయన ఉండగా ఏమి కాద'ని. హాస్పిటల్లోకి వెళ్ళగానే వాళ్ళు సిటీ స్కాన్ చేయాలి అన్నారు. తర్వాత ఏం చేశారో తెలియదుగాని 15 నిమిషాల్లో బాబు ఏడవడం మొదలుపెట్టాడు. ఆ రాత్రంతా బాబుకి పాలు పట్టకూడదన్నారు. కానీ చిన్నపిల్లాడు పాలకోసం చాలా ఏడ్చాడు. నేను వాడిని ఏదోవిధంగా ఓదారుస్తూ ఆ రాత్రంతా బాబా నామాన్ని జపించాను. మరునాడు ఉదయం 7 గంటలకి డాక్టర్ వచ్చి, "మరేం ప్రమాదం లేదు. కింద పడడం వల్ల చిన్న షాక్‌లోకి వెళ్ళాడు, చిన్నపిల్లాడు కాబట్టి. అంతకుమించి ఏ ప్రమాదం లేదు" అన్నారు. ఆ క్షణం ఆ డాక్టర్లో నాకు నా బాబానే కనిపించారు. "ఎన్నెన్ని లీలలు సాయి. ముందు మమ్మల్ని ఏదో ఒక దాంట్లో పడేసి హడలుగొట్టేస్తావు. నీ మీద నమ్మకం ఉందో, లేదో పరీక్షిస్తావు. మళ్లీ నువ్వే ఆ తుఫాను వెలసిపోయేలా చేసి మా మనసుకు శాంతిని కలిగిస్తావు. జగన్నాటక సూత్రధారీ! నీ లీలలు మేము కొలవగలమా? అవి అసంఖ్యాకం, అనంతం. ఈ జన్మంతా నీ సేవలోనే తరిస్తాం సాయి. మేము ఎప్పుడూ మీ పాదాలను, మీ నామాన్ని మరువకుండా ఎల్లప్పుడూ మీ రూపాన్ని మనసున ధ్యానించేలా అనుగ్రహించండి బాబా. థాంక్యూ థాంక్యూ సో మచ్ బాబా". చివరిగా ఒక మాట: 'బాబా ఎవరు పిలిచినా పలుకుతారు, ఆయన అందర్నీ సమానంగా ప్రేమిస్తారు'.
