1900లో నానాసాహెబ్ చందోర్కర్ తన కుటుంబంతో శిరిడీ వెళ్ళాడు. అప్పటికి మహల్సాపతి మాత్రమే బాబా పాదాలకు, తలకు చందనం పూసి పూజించేవాడు. వారి నుదుటిపై ఎవ్వరూ చందనం పూసేవారు కాదు. కానీ నాలుగు సంవత్సరాల వయస్సున్న నానా చిన్న కుమారుడు బాపూరావు అమాయకంగా మన దేవుళ్ళకు దిద్దినట్లే మొదటిసారి బాబా నొసటిపై చందనం దిద్దాడు. అప్పటినుండి ఇతర భక్తులు కూడా వారి నొసటిపై చందనం పూసేందుకు అనుమతి లభించింది. అంతకుముందు బాబాను ఆ విధంగా పూజించేందుకు అనుమతిగానీ, బాబాకు నిత్యపూజ చేసే పద్ధతిగానీ లేదు. ఇదే బాబా నిత్యపూజకు నాంది అయిందని చెప్పాలి.
మిన్ను విరిగి మీదపడ్డా విడిచిపెట్టని వారితో మాత్రమే స్నేహం చేయాలి
1900వ సంవత్సరంలో ఒకసారి నానాసాహెబ్ చందోర్కర్, వాయి గ్రామస్తుడైన రామదాస్ హరిదాస్ బువా అనే కీర్తనకారుడు, బాపూ నగర్కర్, కన్‌గావ్‌కర్‌లు బాబా దర్శనానికి శిరిడీ వెళ్లారు. వాళ్లలో హరిదాస్ బువాకి మరునాడు హనుమజ్జయంతి శుభసందర్భంగా అహ్మద్‌నగర్‌లో హరికథ పఠనానికి ఆహ్వానం అందింది. అందుచేతనే అతను దారిలో బాబాను దర్శించి నగర్ వెళ్లాలని శిరిడీ వచ్చాడు. చందోర్కర్ కూడా మరుసటిరోజు అహ్మద్‌నగర్‌లో ఉండాల్సి ఉంది. కాబట్టి వాళ్ళు సమయానికి రైలు అందుకోవాలంటే వెంటనే శిరిడీ నుండి బయలుదేరాల్సిన అవసరం ఉంది. అందుచేత వాళ్ళు అనుమతికోసం బాబా వద్దకు వెళ్లారు. బాబా వాళ్లతో, "ముందు మీరు చక్కగా భోజనం చేసి, తరువాత బయలుదేరండి" అని చెప్పారు. నానాకి తన గురువు మీద పరిపూర్ణమైన విశ్వాసం. అందువల్ల కొంత సమయం పట్టినా బాబా చెప్పినట్లు భోజనం చేసే వెళ్ళాలనుకున్నాడు. కన్‌గావ్‌కర్ కూడా అతని వెంట వెళ్లాలని అనుకున్నాడు. కానీ హరిదాస్ తాను ఒప్పుకున్న కీర్తన వల్ల మరుసటిరోజు తనకి రాబోయే ధనాన్ని నష్టపోవడం ఇష్టంలేక బాబా మాటను కాకుండా రైలు బయలుదేరే సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆహారం తీసుకోవడం కంటే రైలు అందుకోవడం ముఖ్యమని తొందరపడి, "స్టేషన్‌కి పోదాం పద! రైలుకు సమయమైంది" అంటూ బాపూ నగర్కర్‌ని కూడా బయలుదేరదీసాడు. చందోర్కర్ అతనితో, "బాబా మాటను గౌరవించండి! అందరం భోజనం చేసి కలిసి వెళ్ళిపోదాం" అని అన్నాడు. అయితే, బువా అతని మాట వినడానికి నిరాకరించాడు. అప్పుడు బాబా చందోర్కర్‌తో, "అతనిని తన ఇష్టానుసారం వెళ్లనివ్వు. కొంతమంది స్వార్ధపరులు తమ స్వప్రయోజనాల కోసం సొంత రక్త సంబంధీకులను కూడా వదులుకోవడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి మిన్ను విరిగి మీద పడ్డా మిమ్మల్ని విడిచిపెట్టని వారితో మాత్రమే స్నేహం చేయాలి" అని అన్నారు. హరిదాస్ బువా, నగర్కర్ భోజనం చేయకుండానే శిరిడీ నుండి బయలుదేరారు. ఛందోర్కర్, కన్‌గావ్‌కర్‌లు మాత్రం శిరిడీలోనే ఆగిపోయి భోజనం చేసి సెలవు తీసుకోవడానికి బాబా వద్దకి వెళ్లారు. అప్పుడు బాబా, "మీరిక బయలుదేరవచ్చు. నా మాటపై విశ్వాసముంచండి. ఊరికే హైరానా పడకండి! బండికి ఇంకా సమయముంది" అని చెప్పి వాళ్ళకి సెలవిచ్చారు. బాబా మాటలను సద్భావంతో ఆలకించి, వారిరువురు సాయి చరణాలకు మోకరిల్లి వారి ఆశీస్సులతో హరిదాస్ బువా, నగర్కర్‌లు వెళ్లిన అరగంట తర్వాత బయలుదేరారు. వీళ్ళు వెళ్ళేసరికి హరిదాస్ బువా, నగర్కర్‌లు తినడానికి ఏమీదొరకక ఆకలితో అలమటిస్తూ బిక్కమొహాలతో స్టేషనులో కూర్చుని వున్నారు. చందోర్కర్‌ని చూచి వాళ్ళు సిగ్గుతో తలవంచుకున్నారు. అప్పుడు చందోర్కర్ వారితో, "ఏమండీ! ఇంకా నగరుకు వెళ్ళలేదే? మీరు వెళ్ళలసిన బండి ఇంకా రాలేదని నాకు తోస్తున్నది" అని అన్నాడు. దానికి నగర్కర్ "ఈరోజు నుండి రైలు వేళలు మారాయి. మారిన వేళలననుసరించి రైలు మూడు గంటలు ఆలస్యంగా వస్తుంది. మాకు కటిక ఉపవాసమే గతైంది. మహాత్ముల మాటను మన్నిస్తే ఫలం దక్కుతుంది. బాబా మాట వినక మాకు తగిన శాస్తి జరిగింది. మీరు మంచి పని చేశారు" అని అన్నాడు. హరిదాస్, 'సాయి వంటి గొప్ప మహాత్ములపై అత్యంత విశ్వాసముంచాలని, వారి మాటలను పక్కన పెట్టి సొంత తెలివితేటలపై ఆధారపడకూడదు’ అని నిస్సందేహంగా తన హరికథలు ద్వారా ఇతరులకు బోధిస్తూ తాను మాత్రం ఆచరించట్లేదని ఒక గుణపాఠం నేర్చుకున్నాడు. తర్వాత కాసేపటికి రైలు వచ్చింది. అందరూ రైలెక్కి నగర్ చేరారు. త్రికాలవేత్త అయిన బాబా వాక్కు ఎన్నటికీ పొల్లుపోదు. వారు అంతర్ జ్ఞానంతో(రితంభర ప్రజ్ఞ) మారిన రైలు వేళలు తెలుసుకొని నానాకు ప్రయోజనం చేకూర్చారు.
మరొక సందర్భంలో నానాసాహెబ్ కుటుంబం నాశిక్‌లో జరిగే పెళ్ళికి హాజరవడానికి శిరిడీ నుండి బయలుదేరింది. అప్పుడు బాబా తమ అనుమతి ఇవ్వకుండా "వెళ్ళవద్దు" అన్నారు. వాళ్ళు 3 గంటల సమయం వేచిన తర్వాత బాబా అనుమతించారు. అప్పుడు వాళ్ళు మన్మాడుకు బయలుదేరారు. అక్కడికి వెళ్ళాక వాళ్ళకి తాము ఎక్కవలసిన రైలు స్టేషనులో పట్టాలు తప్పిందని, దానిని సరిచేయడానికి 3 గంటలు పట్టిందని తెలిసింది. ముందుగా వాళ్ళు అనుకున్నట్లు బయలుదేరి ఉంటే స్టేషనులో మూడు గంటలు వేచి ఉండాల్సి వచ్చేది. బాబాకు సర్వం తెలుసు గనుక వాళ్ళను శిరిడీలోనే ఆపి, ఆ మూడు గంటలు తమ సన్నిధిలో ఉండేలా అనుగ్రహించారు. చివరిగా వారు అనుమతించిన తరువాత వాళ్ళ ప్రయాణం సవ్యంగా సాగిపోయింది.
నానా విద్యాగర్వానికి వేటువేసిన బాబా
సద్గ్రంథాలు చదవడం వలన వివేక వైరాగ్యాలు పెంపొంది, నమ్రత కలిగితే జన్మ సార్థకమవుతుంది. అలాగాక, విద్యాగర్వమేర్పడితే వ్యర్థమే. నానాకు చదువుకున్నాననే విద్యాగర్వం ఉండేది. దాన్ని అతను అంతగా ప్రదర్శించేవాడు కాదు కానీ, అతనికున్న సంస్కృత జ్ఞానం మరియు శంకర భాష్యంతో కూడిన గీతాపఠనం తనని జ్ఞానంలో సాధారణ మానవుల కంటే ఉన్నత స్థానంలో ఉంచాయన్న ఒక అభిప్రాయం మాత్రం ఉండేది. కాబట్టి బాబా ఒక్క దెబ్బతో అతనికి గర్వం ఎంత ప్రమాదకరమైనదో తెలియజేయాలని, అదే సమయంలో శిష్యుని యొక్క విధులను బోధించాలని మరియు బ్రహ్మ సాక్షాత్కారానికి పునాది వేయాలని అనుకున్నారు. 1900-1902 ప్రాంతంలో ఒకరోజు నానా బాబా పాదాలు ఒత్తుతూ తనలో తానే ఏదో గొణుగుకొసాగాడు. అది గమనించి..
బాబా: అరే నానా, ఏమిటి గొణుగుతున్నావు?
నానా: ఏమీ లేదు బాబా, మామూలుగా భగవద్గీత పఠిస్తున్నాను.
బాబా: కొంచం బిగ్గరగా చదువు. మేము కూడా వింటాం,
అప్పుడు నానా గురు-శిష్య సంబంధాన్ని వివరించే ఈక్రింది భగవద్గీత, 4వ అధ్యాయంలోని 34వ శ్లోకం చదివాడు.
తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా।
ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్త్వదర్శినః||
అతను గొణుగుతుంది అదే శ్లోకాన్ని అని బాబాకి ఖచ్చితంగా తెలుసు. అది శిష్యులకు గురువు ఉపదేశం చేయడం గురించి వివరిస్తుంది. బాబా కోరుకున్నది అదే- భగవత్ సాక్షాత్కారానికి లేదా జీవ బ్రహ్మైక్యానికి అడ్డుపడే అహంపై ఆధారపడిన అతని అహంకారాన్ని, గర్వాన్ని తొలగించడం. అందుకే సరైన సమయంలో అతన్ని పట్టుకున్నారు.
బాబా: నానా! నీకు ఆ శ్లోకం అర్థం తెలుసా? తెలిస్తే, దాన్ని నాకు చెప్పు.
నానా: "ఎవరైతే గురు పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి, గురు సేవలో తన జీవితాన్ని గడుపుతాడో, భక్తితో ప్రశ్నించి సమాధానం పొదలనుకుంటాడో అట్టి వానికి జ్ఞాని జ్ఞానాన్ని ప్రబోధిస్తాడు" అని ఆ శ్లోకం యొక్క సామాన్య తాత్పర్యాన్ని చెప్పాడు.
అప్పుడు బాబా, "వచనం, లింగం, విభక్తి, కాలము, లకారము(వృత్తి), ఇతర వ్యాకరణ సంబంధిత విషయాలన్నీ ప్రస్తావిస్తూ పదానికి పదానికి ఖచ్చితమైన అర్థాన్ని చెప్పు" అని అతనిని ఆదేశించారు.
భాషా, సాహిత్యం, మరే ఇతర విద్యా జాడలు లేని బాబాకు సంస్కృత వ్యాకరణంలోని చిక్కులు ఎలా అర్థమవుతాయని నానా ఆశ్చర్యపోయాడు. ఏదైతేనేమి బాబా ఆదేశించినందువల్ల అతను ప్రతీ పదానికి అర్థాన్ని వివరించనుపక్రమించాడు. అప్పుడు బాబా తీవ్రంగా క్రాస్ ఎగ్జామినేషన్(నిలదీసి అడగటం) చేయడం ప్రారంభించారు.
బాబా: సరే, 'త' అంటే ఏమిటి? అది దేనిని సూచిస్తుంది?
నానా: జ్ఞానం.
బాబా: ఏ జ్ఞానం?
నానా: ఆ శ్లోకానికి ముందు ఉన్న శ్లోకాలలో ప్రస్తావించిన జ్ఞానం.
బాబా: ప్రణిపాతం అంటే ఏమిటి?
నానా: దాని అర్థం నమస్కారం, సాష్టాంగ నమస్కారం.
బాబా: 'పాత' అంటే ఏమిటి?
నానా: అదే.
బాబా: 'ప్రణిపాత' మరియు 'పాత' అనే పదాలకు ఒకటే అర్థమైతే, రచయిత(వ్యాస మహర్షి) రెండు అదనపు అనవసరమైన పదాలను ఉపయోగించారా? సరే, పరిప్రశ్న అంటే ఏమిటి?
నానా: ప్రశ్నించడం.
బాబా: ప్రశ్న అంటే ఏమిటి?
నానా: ప్రశ్న అన్నా అదే(ప్రశ్నించడమే).
బాబా: రచయిత మళ్లీ అనవసరంగా రెండు పదాలను జోడించరా?
నానా తేడాను వివరించలేకపోయాడు.
బాబా: సేవ అంటే ఏమిటి?
నానా: కేవలం కాళ్లు ఒత్తడం వంటి సేవ మాత్రమే. నేను చేస్తున్నదే.
బాబా: ఇంకేమీ లేదా?
నానా: నాకు తెలిసినంతవరకు ఇంకేమీ లేదు.
ఆ విధంగా బాబా ఒక్కో పదం మరియు ఒక్కో పద సముదాయం గురించి అడుగుతూ అతన్ని అబ్బురపరుస్తూ "స్వయంగా జ్ఞాని అయిన శ్రీకృష్ణుడు అర్జునుడికి జ్ఞానాన్ని ఇవ్వడానికి బదులుగా ఇతర జ్ఞానులను ఆశ్రయించమని ఎందుకు చెప్తున్నాడు?" అని ఒక సాధారణ ప్రశ్న వేసి మళ్ళీ ఆశ్చర్యపరిచారు. ఆపై, "'అర్జునుడు చైతన్య స్వరూపుడైన ఆత్మ కదా?' అని అడిగారు.
అందుకు నానా అవునని బదులిచ్చాడు.
అప్పుడు బాబా, "అదివరకే జ్ఞాని అయిన వానికి మళ్ళీ జ్ఞానాన్ని ఇవ్వడం ఎలా(ఎందుకు)?" అని అడిగారు.
చందోర్కర్ మూగబోయాడు.
బాబా ఇంకా అనేక ఇతర ప్రశ్నలు వేసిన తర్వాత చివరగా, "అక్షరం తేడాతో ఛందస్సు లేదా శ్లోకానికి నష్టం కలిగించకుండా అదనంగా ఒక అక్షరాన్ని చేర్చి చదవగలవా?" అని అడిగారు.
నానా, "అవును చేయొచ్చు, మనం ఉపదేక్ష్యంతి తే (అ)జ్ఞానం అని చెప్పొచ్చు" అని చెప్పి ఆపై, "కానీ గురువు అజ్ఞానం ప్రసాదించే ప్రతిపాదన శంకర భాష్యంలో లేదు" అని అన్నాడు.
బాబా: అది మంచి అర్థాన్నిస్తే మరేం పర్వాలేదు.
నానాకు గురువు అజ్ఞానాన్ని బోధించడం మంచి అర్థాన్ని ఎలా ఇస్తుందో అర్థం కాలేదు. అతను పూర్తిగా ఓడిపోయి తానొక సంస్కృతం, ఉపనిషత్తులు, ఇంకా సర్వమూ తెలిసిన ఒక దిగ్గజం ముందు ఉన్నానని భావించి బాబానే వివరించమని అడిగాడు.
అప్పుడు బాబా తాము అదివరకు అడిగిన ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలు ఉపనిషత్తుల అసలైన జ్ఞాన సంపదను మరియు పదాలను కొత్త అర్థంలోకి మార్చడంలో తమ చతురతను, సూక్ష్మబుద్ధిని వెల్లడించాయి.
'జ్ఞానం’ అనే పదానికి సంబంధించినంతవరకు బాబా ఉపనిషత్తులను ఉదహరిస్తూ, “జ్ఞానం అనేది మనస్సుకు, వాక్కుకు అతీతమైనది కదా(యతోవాచో నివర్తంతే జ్ఞాన, అవంగ్ మానస గోచారం)?” అని అన్నారు.
నానా 'అవును' అని బదులిచ్చాడు.
అప్పుడు బాబా, “అందువలన గురువు వాచా బోధించేది జ్ఞానం కాదు, జ్ఞానం కానిది అజ్ఞానం" అని అన్నారు.
పూర్తిగా గర్వభంగం జరిగి నానా ఇదంతా దేనికి దారితీస్తుందని ఆశ్చర్యపోయాడు. తర్వాత బాబా ఇలా చెప్పారు.
"ఒక ముల్లుతో మరొ ముళ్ళును తీసి వేసినట్లు వాచా గురువు బోధించేది అజ్ఞానంతో మొదలై శిష్యుని జ్ఞానాన్ని కప్పివేసి ఉన్న అజ్ఞానాన్ని తొలగిస్తుంది, దాని ఫలితం జ్ఞానమే. కాబట్టి గురువు బోధించేది ప్రధానంగా అజ్ఞానం. అది జ్ఞానానికి దారి తీస్తుంది. జ్ఞానం సృష్టించబడదు, అది ఎల్లప్పుడూ ఉంటుంది, వాచా చెప్పేది కాదు. వాచా చెప్పేది కంటి వైద్యుని పరికరం వలె కేవలం శిష్యుని కళ్ళకు కమ్ముకున్న పొరను తొలగిస్తుంది. ఆపై శిస్యుడు తనను తాను శుద్ధ జ్ఞాన స్వరూపంగా దర్శిస్తాడు, గుర్తిస్తాడు”.
ఆపై, "సేవ అంటే సాధారణంగా చేసే శరీర మర్దన కాదు. శరీరం, మనసు, ధనం, ఇంకా సమస్తాన్ని గురువుకు సమర్పించాలి. శరీరం గురువుకు సమర్పించినందువల్ల అది ఆయన ఆస్తి. కాబట్టి గురువుకు సేవ చేస్తున్నానని భావించకూడదు. ‘నాలో ఏ యోగ్యత లేదు. నేను కేవలం మీధైన శరీరాన్ని మీ సేవకు వినియోగిస్తున్నాను’ అని భావించాలి. అదీ 'సేవ' అంటే.
'ప్రణిపాత' అంటే నువ్వుంటూ లేవని, శూన్యమని, గురువే సర్వమనే భావనతో సంపూర్ణ వినయంతో కిందపడే కర్రలా 'సాష్టాంగ దండవత్(నమస్కారం)' చేయడం.
‘పరిప్రశ్న’ అంటే జిజ్ఞాసతో ప్రశ్నించడం, పదేపదే ప్రశ్నించడం, అంటే సంపూర్ణ జ్ఞానోదయం పొందేంతవరకు ప్రశ్నించడం. ఇది పరిప్రశ్న. అంతేగాని గురువును ఇరకాటంలో పెట్టడానికి, ఏదైనా పొరపాటు దొర్లితే ఆయన్ని పట్టుకోవడానికి సరదాగా అడగడం మాత్రం కాదు.
ఆ విధంగా బాబా మొత్తం శ్లోకాన్ని వివరిస్తూ శిష్యుని కర్తవ్యాన్ని నొక్కి చెప్పారు. అది విన్న నానా తనకు గీత సారాంశాన్ని బోధించమని బాబాను ప్రార్థించాడు. బాబా అతనిని, "ప్రతిరోజూ గీతలో కొంత భాగాన్ని చదివి నా దగ్గరకొచ్చి కూర్చో" అని చెప్పారు. శ్వేతాశ్వతరోపనిషత్తు, చివరి శ్లోకంలో ఇలా చెప్పబడింది.
యస్య దేవే పరా భక్తిః యథా దేవే తథా గురౌ,
తస్యైతే కథితా హ్యర్థాః ప్రకాశంతే మహాత్మనః (6.23)
భావం: ఎవరికైతే భగవంతునిపై సంపూర్ణమైన విశ్వాసం వుందో, అంతే సమానమైన విశ్వాసం గురువుపట్ల వుందో వారికి ఉపనిషత్తుల సారమంతా(బ్రహ్మ సాక్షాత్కారం) వారి హృదయంలో ప్రకాశిస్తుంది.
నానాకు బాబాపై పూర్తి విశ్వాసం ఉంది, అతను బాబా ముందు కూర్చుంటే ఒక్కొక్క అధ్యాయం చొప్పున గీత యొక్క సారాంశం అంతా అతని హృదయం మందు ఆవిష్కృతమైంది. గురువు వాచా ఏమీ బోధించకుండా శిష్యుని హృదయంలో ప్రకాశింపజేసే ఈ పద్ధతిని మౌన వ్యాఖ్య లేదా దక్షిణామూర్తి పద్ధతి అని పిలుస్తారు.
పై సంఘటన జరగక ముందు సంవత్సరాలలో బాబాకు, నానాకు మధ్య చర్చ సాధారణ విషయాల గురించే ఉండేది. నానా బాబాకి సంస్కృతంలో గొప్ప ప్రావీణ్యం ఉందని గ్రహించినప్పటినుంచి వాళ్ళ చర్చలు భగవద్గీత, వేదాంతం వంటి ఉన్నత స్థాయికి చేరాయి. నానా తన సందేహాలను బాబా ముందుంచితే, బాబా వాటికి సరళ భాషలో చాలా స్పష్టమైన సహజ వివరణ ఇచ్చేవారు. అది విని అక్కడున్న భక్తులందరూ ఆశ్చర్యపోయేవారు. నానాసాహెబ్ చిన్న కుమారుడు బాపూరావు 1936లో బి.వి.నరసింహస్వామితో ఇలా చెప్పాడు: “మా నాన్న ‘బాబాకు సంస్కృతం తెలుసని, వారు గీతలోని ‘తద్విద్ధి ప్రణిపాతేన...!!’ అనే శ్లోకానికి సరియైన అర్థం బోధించారని, 1900-1902 ప్రాంతంలో బాబా నిగూఢ నీతికథలు, సాంకేతిక పరిభాష ఉపయోగించకుండా సామాన్యంగా పండితులు చెప్పే విధంగా తనకు గీతలోని సంస్కృత శ్లోకాలకు అర్థం చెప్పార’ని చెప్పాడు. 1902వ సంవత్సరం తరువాత నుండి బాబా నిగూఢమైన రీతిలో నీతికథలు, సంజ్ఞలతోనూ మాట్లాడటం ప్రారంభించారు. అదే సంవత్సరం మా నాన్నకు జామ్నేర్‌కు బదిలీ అయింది”.
నానా విద్యాగర్వాన్ని బాబా తొలగించిన మరో మంచి సంఘటన:
నానా వేదాలలో చెప్పబడిన వైశ్వదేవ కర్మను నిత్యం ఆచరిస్తుండేవాడు. అందుకోసం అతను ప్రతిరోజూ భోజనం చేసేముందు అతిథికోసం ఎదురు చూడాల్సి వచ్చేది. అయితే ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాల్లో ఉండే అతనికి కొన్నిసార్లు అతిథులు దొరికేవారు కాదు. ఆ కారణంగా అతనికి చాలా ఇబ్బందిగా ఉండేది. దాంతో అతనొకరోజు, "వేదాలు ఇటువంటి అసంబద్ధమైన కర్మలను ఎందుకు సూచించాయి?" అని అనుకున్నాడు. అదే ఆలోచనతో అతను ఒకరోజు బాబా దర్శనానికి వెళ్ళాడు. అప్పుడు అతనేమీ చెప్పకముందే బాబా తమంతట తాము, "అవునవును, అతిథులొస్తారు. నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి వస్తారని అనుకుంటున్నావు. కానీ వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు వాళ్ళ వైపు చూడవు" అని అన్నారు.
అప్పుడు నానా, "అవును, బాబా. నేను దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ప్రతిరోజూ భగవంతుని పూజించి, తర్వాత కాకబలి సమర్పించి, ఆపై గౌరవాదరములతో అతిథికి అన్నదానం చేయాలని సద్గ్రంధాలలో చెప్పబడింది. నేను ప్రతిరోజూ ఆ విధంగా చేయడానికి ప్రయత్నిస్తాను కానీ కొన్నిసార్లు నేను అతిథి కోసం ఎంతగా ఎదురు చూసినప్పటికీ అతిథులు ఎవరూ రారు. నిజంగా సద్గ్రంథాలు అలా చేయమని సూచిస్తున్నాయా?" అని అడిగాడు.
అందుకు బాబా, "అరే నానా, శాస్త్రాలలో తప్పులేదు. అలాగే మంత్రాలూ తప్పు కాదు. నువ్వు వాటి యొక్క నిజమైన ప్రాముఖ్యతను గుర్తించలేదు. నీ అవగాహనలో లోపం ఉంది. నువ్వు నీ తలపై పనికిరాని వ్యాఖ్యానాన్ని(అభిప్రాయాన్ని) పెట్టుకొని, ఆపై నిలబడి అతిథుల కోసం వేచి చూస్తావు. వాళ్ళు రారు. 'అతిథి' అనే పదం కేవలం 3½ మూరల ఎత్తున్న మనిషిని, బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తిని మాత్రమే సూచిస్తుందా? ‘అతిథి’ అంటే పుట్టుకతో బ్రాహ్మణుడైనవాడు, నీతోపాటు నీ నివాసంలో భోజనానికి కూర్చున్నవాడే కానక్కరలేదు. అతను బ్రాహ్మణుడు కావొచ్చు లేదా ఇతర కులానికి చెందినవాడు కావొచ్చు. అసలు అతిథి మానవుడే అయుండాల్సిన పని లేదు. వేళకు ఆకలితో వచ్చిన ఏ ప్రాణి(జీవి) అయినా - అది మానవుడైనా, పక్షైనా, జంతువైనా, పురుగైనా - అతిథే! ఆహారం కోసం అన్వేషించేవన్నీ అతిథులే. అవి వందల్లో, వేలల్లో వస్తాయి. కానీ నువ్వు బ్రాహ్మణ అతిథి అన్వేషణలో నిజంగా లభించే అతిథులను గుర్తించవు. కాబట్టి, పనికిమాలిన సంకుచిత వ్యాఖ్యానాన్ని వదిలేసి కాకబలికి సమృద్ధిగా అన్నం ఇంటి బయట విడచిరా! వేటినీ పిలవొద్దు! తరమొద్దు! ఆకలితో ఉన్న జీవులు వచ్చి తిని వెళ్తాయి. తినడానికి వచ్చిన ప్రాణి ఏదైనా అది నీ మనసును కలవరపెట్టకూడదు. ఎందుకంటే, వాటన్నింటిలో భగవంతుడున్నాడు. ఇలా చేస్తే, వేదాలలో చెప్పబడిన కర్మ సంపూర్ణమవుతుంది. రోజూ లక్షలాది అతిథులకు భోజనం పెట్టిన పుణ్యం నీకు వస్తుంది".
బాబా ఇచ్చిన సరళమైన వివరణ విని నానాసాహెబ్ పూర్తిగా చలించిపోయాడు. తన సద్గురువు యొక్క అపారమైన జ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. తన అవగాహన వేదాలను అర్థరహితం చేస్తే, బాబా చక్కటి అద్భుత వాఖ్యానాన్ని ఇచ్చారని, వారి వ్యాఖ్యానం వేదాలను ఎంతో అర్థవంతం చేస్తుందని గ్రహించి సవినయంగా వారి పాదాలకు నమస్కరించాడు.
Chaalaa baagundhi ….. Chandhorker ku baba ku madhya jarigina sambhashana ….saccharitra lo leni vishayalu kooda vacchai …. Thank you.
ReplyDeleteYes kotha vishayalu telusayi
DeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, please provide peace and wellness to my father 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, take care of my son 🙏🙏🙏🙏
ReplyDeleteOm sairam
ReplyDeleteSai always be with me
Omsaisri Sai Jai Jai Sai 🙏🙏🙏🙏🙏 kapadu Tandri 🙏🙏🙏🙏🙏🙏
ReplyDeleteOm gurudeva dattatreya sai nathaya namaha🙏
ReplyDelete