1. అండగా ఉండి సమస్యలు పరిష్కరిస్తున్న బాబా2. చిన్న చిన్న విషయాల్లో సైతం జాగ్రత్త వహించే బాబా
అండగా ఉండి సమస్యలు పరిష్కరిస్తున్న బాబా
ఓం సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!!! నా పేరు విజయలక్ష్మి. మాది విశాఖపట్నం. నేను డిగ్రీ చదివేటప్పటి నుండి బాబా భక్తురాలిని. నాకు ఎప్పుడు ఏ కష్టమొచ్చినా నేను బాబానే తలుచుకుంటాను. నా అనుభవాలను పంచుకోవడానికి నాకు ఈమధ్యనే ఈ 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు గురించి తెలిసింది. ఈమధ్యనే మా అబ్బాయి బీటెక్ పూర్తి చేసాడు. తనకి ఇటీవల శ్వాస సంబంధిత సమస్య వచ్చింది. అప్పుడు నేను, "బాబా! నా బిడ్డని ఈ సమస్య నుండి ఎలాగైనా రక్షించండి" అని బాబాను ప్రార్ధించాను. తర్వాత బాబా సూచించిన హాస్పిటలకి బాబుని తీసుకెళ్లి చూపించాను. డాక్టర్ పరీక్షలు చేసి, "రిపోర్టులు అన్నీ బాగానే ఉన్నాయి" అని చెప్పి కొన్ని మందులు వ్రాసి, "ఇవి వాడండి తగ్గిపోతుంది" అని చెప్పారు. అయితే ఆ మందులు వాడుతున్నా కూడా బాబుకి ఆయాసం తగ్గలేదు. నేను చాలా కంగరుపడి, "బాబా! మీరు సూచించిన డాక్టరుకే బాబుని చూపించాను. ఏ సమస్యలేదని మందులు ఇచ్చారు కానీ, బాబుకి తగ్గలేదు. దయచేసి ఎలాగైనా ఆ సమస్య తగ్గేలా చేయండి" అని బాబాను ప్రార్థించాను. ఐదు రోజుల తరువాత మళ్ళీ బాబుని డాక్టరు దగ్గరకి తీసుకెళ్తే, డాక్టరు చూసి, "ఇంకే సమస్య లేదు తగ్గిపోయింది. నాది హామీ" అని చెప్పి మరలా కొన్ని మందులిచ్చి పంపించారు. నాకు ఆ డాక్టరు రూపంలో బాబానే చెప్పినట్టు అనిపించింది. ఆయన దయవల్ల బాబు సమస్య తగ్గింది. కానీ నేను ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకోవడం ఆలస్యం అయింది. అందువలనే కాబోలు బాబుకి అప్పుడప్పుడు ఆ సమస్య వస్తుంది. "దయచేసి బాబుకి పూర్తిగా తగ్గేలా అనుగ్రహించండి బాబా".
2023, జూన్‌లో నాకు, నా భర్తకి చాలా పెద్ద గొడవ జరిగింది. ఆయన నన్ను చాలా మాటలు అన్నారు. ఆ మాటలకి నాకు చనిపోవాలని అనిపించింది. పిల్లలు అడిగితే వాళ్ళని కూడా కొట్టడానికి సిద్ధమయ్యారు. ఆ సమయంలో నాకు ఏం చేయాలో తోచలేదు. ఇంటినుండి వెళ్లిపోదామనుకున్నాను కానీ, వెళ్ళలేకపోయాను. అలాగని ఉండలేకపోయాను. ఆ సమయంలో బాబానే నాకు తోడు అనుకున్నాను. రెండు రోజులు గడిచిన తరువాత మావారే స్వయంగా వచ్చి నాతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. బాబా దయతోనే నా సమస్య పరిష్కారం అయ్యింది. ఇలా అన్ని సమస్యలలో బాబా నాకు అండగా ఉంటున్నారు. "ధన్యవాదాలు బాబా. క్యాంపస్ సెలక్షన్స్లో మా బాబుకి ఉద్యోగం వచ్చినా ఇంకా జాయినింగ్ లెటరు రాలేదు. తొందరలో ఈ సమస్యను పరిష్కరించండి బాబా".
సాయినాథ్ మహారాజ్ కి జై!!!
చిన్న చిన్న విషయాల్లో సైతం జాగ్రత్త వహించే బాబా
సాయిబంధువులకు నమస్కారం. నేను ఒక సాయిభక్తురాలిని. నేను స్కూలు టీచర్ని. 2023, సెప్టెంబర్ 14న నేను స్కూల్లో ఎక్స్ట్రా క్లాస్ తీసుకొని బయల్దేరేటప్పటికి సాయంత్రం 5 గంటలు అయ్యింది. అప్పటికి మిగిలిన స్టాఫ్ అందరూ వెళ్ళిపోయారు. స్కూల్ మెయిన్ రోడ్డు నుండి కొంచెం లోపలికి ఉంటుంది. అందువల్ల ఆటోలు దొరుకుతాయో, లేదో అని బెంగపడుతూ వస్తుంటే నేను రోడ్డు దాటకముందే ఒక ఆటో వెళ్ళిపోయింది. అంతలోనే ఇంకో ఆటో వచ్చింది. అందులో ఒకేఒక్క లేడీ ఉన్నారు. పైగా ఆ ఆటో నేరుగా నేను వెళ్లాల్సిన చోటుకు ముందు ఉండే బస్సు స్టాప్ వరకు వెళుతుంది. 'బాబాయే ఈ ఆటో నాకోసం పంపించారు, అందుకే ముందు ఆటో మిస్ అయింద'ని సంతోషిస్తూ ఆ ఆటో ఎక్కి చాలా తొందరగా ఇంటికి చేరుకున్నాను. ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో సైతం బాబా మనకోసం జాగ్రత్త తీసుకుంటారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!!!

