సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

శ్రీనానాసాహెబ్ చందోర్కర్ - ఆరవభాగం



పద్మాలయ అడవుల్లో నానా ఆకలి తీర్చిన బాబా

తూర్పు ఖాందేశ్‌లోని పచోర నుండి పది, పన్నెండు మైళ్ళ దూరంలో ఎరండోల్ సమీపంలో పద్మాలయ అనే సుందర ప్రదేశం ఉంది. అక్కడ కొండ మీద గోవింద్‌బువా అనే గణపతి భక్తుడు తన ఇష్టదైవమైన గణపతికి ఒక అందమైన ఆలయం నిర్మించాడు. మహాగణపతి క్షేత్రాలలో అది ఒకటి. గోవింద్‌బువా ఒక బ్రాహ్మణ సత్పురుషుడు. అతను రోజుకి కేవలం 18 కప్పులు టీ మాత్రమే స్వీకరించేవాడు. ఆ విధంగా అతను ఒక రకమైన తపశ్చర్య గావించి ఆత్మానుభూతి పొందాడని ప్రజలు అనుకునేవారు. ఆలయం నుంచి ఒకటిన్నర మైళ్ళ దూరంలో గోవింద్‌బువా మఠం ఉండేది. అతను అక్కడినుండి ప్రతిరోజూ తెల్లవారుజామునే ఆలయానికి వచ్చి గణపతి ఆరాధనలో నిమగ్నమయ్యేవాడు. సమీప ప్రాంతాలతోపాటు సుదూర ప్రాంతాల నుండి గణపతి దర్శనార్థం వచ్చే భక్తులకోసం గోవింద్‌బువా మధ్యాహ్నం, రాత్రి భోజన ఏర్పాట్లు చేసి రాత్రి 9, 10 గంటల సమయంలో ఆలయం మూసేసి తిరిగి తన మఠానికి వెళ్తుండేవాడు.

నానాసాహెబ్ చందోర్కర్‌ పచోర సమీపంలోని జామ్నేర్ తాలూకాకి మామలతదారుగా ఉన్న రోజులలో(1902-1905) అతనికి ఆ గణపతి మందిరాన్ని, గోవింద్‌బువాను దర్శించాలని తీవ్రమైన కోరిక కలిగింది. అతను తన కోరికను తన స్నేహితులతో చెప్పి వెళ్ళడానికి ఒకరోజు నిర్ణయించాడు. అలాగే పచోర రైల్వేస్టేషన్ నుండి పద్మాలయ వెళ్ళడానికి అవసరమైన రవాణా సౌకర్యం ఏర్పాటు కోసం పచోర తాలూకాలోని తన సహోద్యోగికి సమాచారం అందించాడు. ఆ తర్వాత వాళ్ళు ముందుగా అనుకున్న రోజున నానాసాహెబ్ తన స్నేహితులతో కలిసి సమయానికి బయలుదేరినప్పటికీ రైల్వేస్టేషన్‌కి చేరుకోవడానికి ఆలస్యమవ్వడంతో వాళ్ళు ఎక్కాల్సిన రైలు తప్పిపోయింది. అందువల్ల వాళ్ళు తదుపరి వచ్చిన రైలు ఎక్కారు. దాంతో మధ్యాహ్నానికి పచోర చేరుకోవాల్సిన వాళ్ళు సాయంత్రం పొద్దుపోయాక చేరుకున్నారు. అప్పటికే వాళ్ళు ముందుగా ఏర్పాటు చేసుకున్న టాంగావాడు ఎదురుచూసి చూసి చందోర్కర్, అతని సహచరులు వచ్చేటట్లు లేరని వెళ్ళిపోయాడు. అందువల్ల వాళ్ళకి నడిచి వెళ్లడం తప్ప వేరే ప్రత్యామ్నాయం ఏమీ కనిపించలేదు. అయితే నానాసాహెబ్‌కి 10, 12 మైళ్ళ దూరం నడిచే అలవాటు లేదు. అయినప్పటికీ నానా వెనుక అడుగు వేయలేదు, ఏదేమైనా ఆలయాన్ని దర్శించాల్సిందేనని అనుకున్నాడు. అయితే అడవి గుండా ప్రయాణించాల్సి ఉంది. అందువల్ల ఒక మార్గదర్శిని వెంటబెట్టుకొని బాబా నామాన్ని జపిస్తూ నానా తన సహచరులతో నడక మొదలుపెట్టాడు. అది చీకటి రాత్రి, పైగా ఎత్తుపల్లాలతో మార్గం అత్యంత అధ్వానంగా ఉంది. అందువల్ల నానా ఆపసోపాలు పడుతూ నడవడానికి చాలా ఇబ్బందిపడ్డాడు. అయినప్పటికీ బాబాపై ఎంతో విశ్వాసమున్న అతను కేవలం బాబా గురించే ఆలోచిస్తూ, ఆయన కృపతో నడక సాగించగలిగాడు. సగం దూరం వెళ్లేసరికి రాత్రి 9 గంటలైంది. మరికొంత దూరం అంటే 6-7 మైళ్ళ దూరం నడిచాక నానాసాహెబ్ బాగా అలసటతో ఇంకా ముందుకెళ్లే శక్తిలేక అక్కడ ఆగాడు. అతని సహచరులు కూడా ఆగారు. వాళ్లలో ఎవరూ ఉదయం నుంచి ఏమీ తినలేదు. ఆహార పదార్థాలు కూడా తమతో తెచ్చుకోలేదు. అందుచేత అందరినీ ఆకలి బాధిస్తుంది. మాములుగా రాత్రి 9, 10 గంటలకి ఆలయం మూసేసి పూజారి గోవింద్‌బువా తన మఠానికి వెళ్ళిపోతారు, ఇంకా అక్కడెవరూ ఉండరు. ఆ విషయం నానాకు తెలుసు కాబట్టి తమకు గణపతి దర్శనమవ్వదని, తినడానికి కూడా ఏమీ లభించదని అతను సహజంగానే బాబాని తలుచుకొని, "బాబా! నాకు అత్యాశ లేదు. నేను మిమ్మల్ని అతిగా ఏమీ అడగడం లేదు. మేము నడక సాగించి అక్కడికి చేరుకున్నాక మాకు ఆ సమయంలో భోజనం దొరకడం అసాధ్యమని నాకు తెలుసు. కాబట్టి మీరు మా పదిమంది ఆకలి తీరడానికి ఒక పెద్ద పాత్ర నిండా టీ అందించగలిగితే మేము చాలా సంతృప్తి చెందుతాము. ఈ రాత్రి ఎలాగోలా గడిచిపోతుంది" అని మనస్ఫూర్తిగా ప్రార్థించాడు. తరువాత అతను, అతని సహచరులు ముందుకు సాగారు. మధ్యమధ్యలో విశ్రాంతి తీసుకుంటూ రాత్రి 11 గంటల ప్రాంతంలో వాళ్ళు ఆలయ దరిదాపుల్లోకి చేరుకున్నారు. అప్పటికి ఆలయం మూసి ఉండటానికి బదులు తెరిచే ఉండటం చూసి వాళ్లంతా ఆనందించారు. అంతలో ఆలయ పూజారి గోవింద్‌బువా దూరంగా వస్తున్న నానా బృందాన్ని చూసి, "నానా వస్తున్నాడా?" అని అరిచాడు. అత్యంత సాన్నిహిత్యం ఉన్నప్పటికీ ఒక పూజారి మామలతదారుని అతని ముద్దుపేరుతో పిలవడమన్నది అమర్యాదకరమైన విషయం. అలాంటిది గోవింద్‌బువా 'నానా' అని ఏకవచనంతో సంబోధించినప్పటికీ నానాకి, అతని సహచరులకు కోపం రాలేదు. పైగా "నానా వస్తున్నాడా?" అన్న మాట వింటూనే వాళ్ళు సంతోషించి గోవింద్‌బువాను సమీపించి, "అవును, ఇంతకీ నానా వస్తున్నాడని మీకు ఎలా తెలుసు?" అని అడిగారు. అందుకు గోవింద్‌బువా, "కొంతసేపటి క్రితం 'నా నానా, మరికొంతమంది చాలాదూరం నుండి కాలినడకన ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళు పూర్తిగా అలసిపోయి ఆకలిదప్పులతో అలమటిస్తున్నారు. వాళ్ళకోసం ఒక పెద్ద పాత్ర నిండా టీ తయారుచేసి ఉంచు' అని సాయిబాబా సందేశం(ఆకాశవాణి) అందింది. ఇదిగో మీ అందరికోసం వేడివేడి టీ సిద్ధంగా ఉంది" అని చెప్పి ఒక కప్పు టీ నానాకి ఇచ్చాడు. నానా, అతని సహచరులు అందరూ తృప్తిగా టీ తాగిన తర్వాత కూడా కొంత టీ ఇంకా మిగిలింది. బాబా తమ భక్తులపట్ల చూపుతున్న శ్రద్ధను, ప్రేమను అందరూ ప్రశంసిస్తూ నానా, అతని సహచరులు ఆ రాత్రికి గుడి వద్ద విశ్రమించగా గోవింద్‌బువా తన మఠానికి వెళ్ళిపోయాడు. మర్నాడు నానా, అతని సహచరులు అన్నప్రసాదం స్వీకరించి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ సంఘటన బాబా పర్యవేక్షణ తమ ప్రియ భక్తుల భద్రత, సౌలభ్యం మరియు ఆరోగ్యం చూసుకోవడంలో కేవలం కొండలపైనే కాకుండా అడవుల్లో కూడా ఉందని మరోసారి ఋజువు చేసింది.


వనే రణే శత్రు జలాగ్ని మధ్యే

మహార్ణవే పర్వతమస్తకే వా।

సుప్తం ప్రమత్తం విషమ స్థితం వా

రక్షంతి పుణ్యాని పురాకృతాని॥


ఈ భర్తృహరి నీతి శతకం 'మనిషి అరణ్యాలలో ఉన్నా, యుద్ధభూమిలో ఉన్నా, శత్రువుల మధ్య ఉన్నా, నడి సముద్రంలో ఉన్నా, అగ్ని మధ్య ఉన్నా, పర్వత శిఖరంపై ఉన్నా, నిద్రిస్తున్నా, ఆందోళనగా ఉన్నా, అస్థిరంగా ఉన్నా అతని పూర్వ పుణ్యమే అతనిని రక్షిస్తుంది' అని తెలుపుతుంది. అయితే పూర్వపుణ్యం గురించి ఎటువంటి అనుభవం లేని మనకు అది ఒక అస్పష్టమైన విషయం. కొండపైన, దట్టమైన అడవుల్లో నానాని రక్షించింది అస్పష్టమైన అతని పూర్వ పుణ్యం కాదు, బాబా అన్నది యదార్థం.

ఆపదలో బాబా రక్షణ

బాబా రక్షణ కేవలం తమ భక్తులపట్ల మాత్రమే కాదు, ఆ భక్తులకు అక్కర ఉన్న ప్రతి ఒక్కరిపట్ల కూడా ఉంటుంది. 1902 నుండి 1905 వరకు నానాసాహెబ్ చందోర్కర్ ఖాందేశ్ ప్రాంతంలోని జామ్నేర్ తాలూకాకు మామలతదారుగా పనిచేసాడు. 1904లో అతని పెద్ద కుమార్తె మైనతాయి భర్త ప్లేగు వ్యాధితో పూణేలో మరణించాడు. ఆ సమయంలో ఆమెకు కేవలం 17 సంవత్సరాలు, పైగా గర్భవతి. డాక్టర్లు ఆమెకు 1905 తొలి నెలల్లో ప్రసవమవుతుందని చెప్పారు. నానాసాహెబ్ పూణే వెళ్లి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆమెను కాన్పుకోసం జామ్నేర్‌కు తీసుకొచ్చాడు. అతను ఆమె ఆరోగ్యం, భావి జీవితం గురించి చాలా కలత చెందుతుండేవాడు. రోజులు గడుస్తూ ఆమెకు నెలలు నిండి ప్రసవ సమయం ఆసన్నమైంది. ఆమె సున్నితమైన పరిస్థితి దృష్ట్యా కాన్పు చాలా ప్రమాదకరమని అందరూ భయపడ్డారు. వాళ్ళు భయపడినట్లే మొదటి కాన్పు అయినందున ఊహించని విధంగా సమస్యలు తలెత్తాయి. వైద్యులు, నర్సులు తమ వంతు ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళ ప్రయత్నాలు ఫలించలేదు. పాపం నానా మాత్రం ఏమి చేయగలడు? సమయానికి బాబా ఊదీ కూడా ఇంట్లో లేదు. అయినప్పటికీ టెలిగ్రామ్ ద్వారా సమాచారం బాబాకి పంపాల్సిన అవసరం లేదని నానా తలచాడు. ఎందుకంటే, బాబాకు సర్వమూ తెలుసునని అతనికి తెలుసు. అందుచేత అతను ఉన్న చోటనే ఉండి చేయగలిగినది చేయాలని భగవంతుని అనుగ్రహం కోసం పురోహితుని పిలిపించి కష్టనివారణ హోమం, నవచండీ హవనం, సప్తశతి పఠనం మొదలైన వైదిక కర్మకాండలు ప్రారంభించాడు. కానీ మైనతాయి బిడ్డను ప్రసవించలేదు. పైగా చాలా గంటలపాటు నొప్పులతో తీవ్రవేదనను అనుభవిస్తున్నందువల్ల ఆమె ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో నానాసాహెబ్ తన సాధారణ అలవాటు ప్రకారం బాబాని స్మరిస్తూ తన కూతురికోసం తీవ్రంగా ప్రార్థించనారంభించాడు. అలా ప్రార్థిస్తున్నప్పుడు అతని మనసులో, ‘బాబా హారతి, ఊదీ లభించినట్లైతే మృత్యుదేవత స్వయంగా వచ్చినా, ఒట్టి చేతులతో తిరిగి వెళ్లాల్సిందే!' అని ఒక ఆలోచన వచ్చింది. 

జామ్నేర్‌లోని పరిస్థితులు శిరిడీలో ఎవరికీ తెలియవు. కానీ సాయిబాబా సర్వజ్ఞులు, సర్వవ్యాపకులు. జగత్తులో వారికి తెలియనిదేదీ లేదు. భక్తులతో ఏకాత్మత కలిగి ఉండటం వలన నానా అవస్థ తెలుసుకున్న సాయి సమర్థుల హృదయం ద్రవించింది. వెంటనే నానాకు అతను కోరుకున్న ఊదీ, ఆరతి పాట పంపించాలని వారికి అనిపించింది. అప్పటికే అంటే నానా మనసులో, ‘నాకు బాబా హారతి, ఊదీ లభించినట్లైతే మృత్యుదేవత స్వయంగా వచ్చినా, ఒట్టి చేతులతో తిరిగి వెళ్లాల్సిందే!' అన్న ఆలోచన మెదిలిన అదే సమయంలో శిరిడీలో ఉన్న రామ్‌గీర్ బువాకు అకస్మాత్తుగా ఖాందేష్‌లో ఉన్న తన స్వగ్రామానికి వెళ్లాలన్న కోరిక కలిగింది. బాబా శరీరధారులుగా ఉన్నప్పుడు ముందుగా వారి పాదాలపై పడి, వారి అనుమతి తీసుకోకుండా ఎవరైనా ఏకార్యం కోసమైనా వెళ్లేవారు కాదు. వారి సంపూర్ణ అనుమతి, ఆశీర్వాదం, ఊదీ ప్రసాదం లేకపోతే ఏ కార్యమైనా నిర్విఘ్నంగా జరగదని అందరి దృఢ విశ్వాసం. అందుచేత రామ్‌గీర్ బువా బాబా వద్దకు వెళ్లి, వారి అనుమతిని అర్థించాలని అనుకున్నాడు. సరిగ్గా అప్పుడే బాబా అతనికి కబురుపెట్టారు. అతను వెంటనే మసీదుకు వెళ్ళి బాబా పాదాలకు వందనం చేసి, "బాబా! ఖాందేశ్‌లోని మా ఊరికి వెళ్ళొస్తాను. ఊదీని, మీ ఆశీర్వాదాన్ని ప్రసాదించి బయలుదేరటానికి ఈ దాసునికి అనుమతివ్వండి" అని అన్నాడు. బాబా అతనికి తమ అనుమతినిస్తూ, “సరే, నువ్వు సంతోషంగా ఊరికి వెళ్లు. కానీ దారిలో జామ్నేర్‌ వెళ్లి, నానా ఇంటి వద్ద ఆగి కాస్త విశ్రాంతి తీసుకో. వారి సమాచారాలు తెలుసుకొని నువ్వు ముందుకు సాగిపో" అని చెప్పి, మాధవరావు దేశ్‌పాండేతో "షామా! మాధవ్ అడ్కర్ వ్రాసిన ఆరతి గీతాన్ని(ఆరతి సాయిబాబా) ఒక కాగితంపై వ్రాసి ఈ బాపుగీర్‌కివ్వు" అని అన్నారు(బాబా రామ్‌గీర్ బువాను బాపుగీర్ అని పిలిచేవారు). ఆ తరువాత రామ్‌గీర్‌‌కి ఊదీ ఇచ్చి, మరికొంత ఊదీ పొట్లం కట్టి అతని చేతికిచ్చి, "ఈ ఊదీని, ఆరతి గీతాన్ని తీసుకుని వెళ్లి నానాకు ఇవ్వు. వారి క్షేమాన్ని, కుశల సమాచారాన్ని తెలుసుకొని మీ ఊరికి వెళ్ళు" అని చెప్పారు. అప్పుడు రామ్‌గీర్ బాబాతో, "బాబా! అలాగే వెళ్తాను. కానీ నా వద్ద రెండు రూపాయలు మాత్రమే ఉన్నాయి. కోపర్గాఁవ్ నుండి జలగావ్‌ వరకు ప్రయాణానికి రూ.1.14 అణాల ఖర్చవుతుంది. మిగిలిన రెండు అణాలతో జలగావ్‌ నుండి 30 మైళ్ళ దూరంలో ఉన్న జామ్నేర్‌‌కి ఎలా వెళ్ళాలి?" అని అన్నాడు. బాబా అతనితో, "బాపుగీర్, దాని గురించి చింతించక నువ్వు నిశ్చింతగా వెళ్ళు. అన్నీ సమకూరుతాయి" అని అన్నారు. బాబా ఆజ్ఞానుసారం అతను వారి వద్ద సెలవు తీసుకొని ప్రయాణమయ్యాడు. అతను జలగావ్‌లో రైలు దిగేసరికి రాత్రి గం.2.45 నిముషాలైంది. అక్కడ రైల్వే అధికారులు ప్లేగు ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణికుల్ని నిర్బంధించి ప్రభుత్వ నిబంధనలను అమలు చేయాలని ప్రయాణికులను ఇబ్బందిపెడుతున్నారు. వాళ్ళనుండి తప్పించుకొని జామ్నేర్‌ వెళ్లే దారి కనిపించక రామ్‌గీర్ సందిగ్ధంలో పడ్డాడు. అకస్మాత్తుగా అతనికి, 'శిరిడీ నుండి వచ్చిన బాపుగీర్ ఎవరు?' అని బిగ్గరగా అరుస్తున్న ఒక బంట్రోతు అరుపు వినిపించింది. వెంటనే రామ్‌గీర్ అతని దగ్గరకి వెళ్లి, "నేను రామ్‌గీర్ బువాను. బాబా నన్ను బాపుగీర్ అని పిలుస్తారు. నేను శిరిడీ నుండి వచ్చాను" అని చెప్పాడు. అప్పుడు ఆ బంట్రోతు, "మిమ్మల్ని తీసుకుని రమ్మని నా యజమాని నానాసాహెబ్ ఒక టాంగా, గుర్రం ఇచ్చి నన్ను పంపారు. వారు మీకోసం ఆతృతగా ఎదురు చూస్తుంటారు. త్వరగా వచ్చి టాంగాలో కూర్చోండి, పోదాం!" అని చెప్పాడు. రామ్‌గీర్‌కు చాలా ఆనందం కలిగింది. 'నానాకు శిరిడీ నుండి కబురు చేరుంటుంది, అందుచేతనే టాంగా పంపారు. పెద్ద కష్టం తప్పింది' అని అనుకుంటూ వెళ్లి టాంగాలో కూర్చున్నాడు. కొంత దూరం ప్రయాణించాక మార్గ మద్యమంలో తెల్లవారుజామున బంట్రోతు భాగుర్ అనే చోట గుర్రానికి కాసేపు విశ్రాంతినివ్వడం కోసం ఒక వాగు పక్కన టాంగాను ఆపాడు. తర్వాత అతను వెళ్లి వాగులోని నీళ్లు తెచ్చి బాపుగీర్‌కి మామడిపళ్ళు, పేడాలు, బెల్లం అప్పాలు ఇచ్చాడు. అయితే రామ్‌గీర్ బంట్రోతు వేసుకున్న వస్త్రాలు, అతని మీసాలు, గడ్డం చూసి అతను ముస్లిం అయి ఉంటాడని, అతని చేతితో ఇచ్చిన ఆహారం ఎలా తినాలని ఆందోళన చెందాడు. అతని ఇబ్బందిని గుర్తించిన బంట్రోతు వెంటనే తానొక క్షత్రియపుత్రుణ్ణి, రాజపుట్ జాతివాన్ని అని చెప్పాడు. దాంతో అతని సందేహం తీరి ఇద్దరూ పలహారాన్ని పంచుకొని తిన్నారు. తర్వాత వాళ్ళు తమ ప్రయాణాన్ని సాగించి తెల్లవారే సమయానికి జామ్నేర్‌ చేరుకున్నారు. బంట్రోతు నానా ఇంటికి సమీపంలో టాంగా నిలిపి "అదే యజమాని ఇల్లు. మీరు వెళ్లొచ్చు" అని అన్నాడు. రామ్‌గీర్ టాంగా దిగి లఘుశంకకి వెళ్లి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ గుర్రంగాని, టాంగాగాని, చివరికి బంట్రోతుగాని లేకపోవడంతో అతను ఆశ్చర్యపోయాడు. ఏ అడ్డులేక స్పష్టంగా కనిపిస్తున్న రహదారిలో బంట్రోతుతో సహా అవన్నీ ఎలా అదృశ్యమయ్యాయో అతనికి అర్థం కాలేదు. ఏదైతే ఏమి, ఎదురుగా నానా ఇల్లు ఉండటంతో అతను అక్కడికి వెళ్ళాడు. అక్కడ నానా, అతని భార్య ఉన్నారు. వాళ్ళు గుర్రం, టాంగా శబ్దం విని ‘ఎవరొచ్చారా?’ అని ఆత్రంగా చూస్తున్నారు. రామ్‌గీర్, "బాబా ఈ ఊదీ మీకోసం పంపారు" అని చెప్తూ ఊదీ, ఆరతి పాటను నానా చేతికి ఇచ్చాడు. వాటిని చూస్తూనే క్లిష్ట పరిస్థితుల నడుమనున్నా నానా మనసుకి చాలా ఊరట కలిగింది. వెంటనే తన భార్యకి ఊదీ ఇచ్చి, నీటిలో కలిపి మైనతాయి చేత తాగించమని చెప్పి, తాను స్వయంగా ఆరతి పాడడం మొదలుపెట్టాడు. క్షణం గడిచిందో లేదో బిడ్డ ఏడుపు వినిపించింది. అంటే ఊదీ నీళ్లు మైనతాయికి ఇచ్చిన మరుక్షణంలో నొప్పులు తగ్గుముఖం పట్టి ఎటువంటి కష్టం లేకుండా ఆమెకు సుఖప్రసవమై పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

రామ్‌గీర్ విషయమంతా తెలుసుకొని చాలా ఆశ్చర్యపోయాడు. తరువాత "నన్ను తీసుకురావడానికి మీరు పంపిన టాంగావాడు కనిపించడం లేదు, అతనెక్కడ?" అని నానాను అడిగాడు. అది విని నానా అయోమయంగా, "నేను ఎవరినీ పంపలేదు. మీరు వస్తున్నట్లు ఇక్కడ ఎవరికీ తెలీదు. అలాంటప్పుడు మిమ్మల్ని తీసుకురావడానికి ఒకరిని పంపే ప్రశ్న ఎక్కడిది?" అని అన్నాడు. అప్పుడు రామ్‌గీర్ బంట్రోత్ తనని బాబా పిలిచినట్లే బాపుగీర్ అని పిలచాడని గుర్తు చేసుకొని జరిగిందంతా వివరంగా నానాతో చెప్పాడు. అది విన్న నానాసాహెబ్ చలించిపోయాడు. అతని కళ్ళ నుండి ఆనందాశ్రువులు ధారాపాతమయ్యాయి. రామ్‌గీర్ కూడా "బాపుగీర్, నువ్వు నిశ్చింతగా వెళ్ళు. అన్నీ సమకూరుతాయి" అన్న బాబా మాటలలోని పరమార్థాన్ని గ్రహించి బాబా వాత్సల్యానికి ఆనందపారవశ్యం చెందాడు. 

నానా కుటుంబ సంక్షేమం పట్ల బాబా ఎంతగా ఆసక్తి కనబరుస్తున్నారో, కష్టతరమైన ప్రసవ సమయంలో సరైన వైద్య సహాయం అందని పరిస్థితుల్లో జామ్నేర్ వంటి సుదూర ప్రాంతంలో ఆయన తమ అద్భుత శక్తులను ఎలా ఉపయోగించారో ఈ లీల తెలియజేస్తుంది. చందోర్కర్‌కు ఏమీ తెలియకుండానే టాంగా, గుర్రం, తమ భక్తునికి ఫలహారాన్ని అందించింది బాబా అసాధారణ శక్తులే. ఆ విధంగా కేవలం చందోర్కర్ ప్రాణాలనే కాకుండా అతనితో సంబంధం ఉన్న లేదా అతనిపై ఆధారపడిన వారి ప్రాణాలను కూడా బాబా తమ మానవాతీత శక్తులన్నింటినీ ఉపయోగించి కాపాడుతుండేవారు.

ఇకపోతే మైనతాయికి పుట్టిన బిడ్డ దురదృష్టవశాత్తు ఎక్కువకాలం జీవించలేదు. కొద్ది నెలల్లోనే మరణించాడు. కుటుంబమంతా విషాదఛాయలు అలుముకున్నాయి. ఒకరోజు దాసగణు మైనతాయిని ఓదార్చి, వెండి బాబా పాదుకలను ఆమెకిచ్చాడు. ఆమె రోజూ ఆ పాదుకలను పూజిస్తూ ఎంతో ఓదార్పు పొందింది. ఆమె 1936లో బి.వి.నరసింహస్వామితో యిలా చెప్పింది: “1904లో నాకు 17సంవత్సరాలున్నప్పుడు నా భర్త ప్లేగు వ్యాధితో పూనాలో మరణించారు. మా అమ్మ సమయానికి రావడంతో ఆమెకు చివరి చూపైనా దక్కింది. నా భర్త మరణించేటప్పటికి నేను గర్భవతిని. 1905లో నేను జామ్నేరులో ఉన్నప్పుడు నాకు ప్రసవ వేదన మొదలైంది. కానీ ప్రసవం క్లిష్టమయ్యింది. అప్పుడు గోసావితో బాబా ఊదీ పంపి, నాకు సుఖప్రసవమయ్యేట్టు చేశారు. నేను ప్రసవ వేదనలో ఉండడం వల్ల నాకు ఈ విషయాలేమీ తెలియవు. నేను నాకు 12-13 సంవత్సరాల వయస్సున్నప్పుడు(1899-1900)లో మా కుటుంబసభ్యులతో కలిసి శిరిడీ వెళ్ళి బాబాను మొదటిసారి దర్శించాను. ఆ తర్వాత తరచూ శిరిడీ వెళ్ళేదానిని. 1918 తర్వాత వెళ్ళలేదు. నేను మొదట 1900లో సాయిబాబాను దర్శించినప్పుడు వారు నెరసిన జుట్టుతో యాభై సంవత్సరాల వయస్సున్న వారిలా కనిపించారు. కానీ వారు 1918లో ‘ఇన్‌ఫ్లూయంజా’ అను వ్యాధి దేశమంతటా వ్యాపించియున్న సమయంలో మహాసమాధి చెందే వరకు ఇంచుమించు అలాగే కనిపించేవారు. మేము బాబా వద్దకు వెళ్లిన తొలి రోజుల్లో ఒకసారి మేము చావడిలో బస చేసాము. మా నాన్న తప్ప మిగిలినవారమంతా శిరిడీ నుండి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నప్పుడు బాబా మావద్ద కొచ్చి భిక్ష అడిగి, "వెళ్ళవద్దు" అని అన్నారు. ఆ సమయంలో బాబా కళ్ళు రత్నాల వలె మెరిసాయి. మేము మా ప్రయాణాన్ని మానుకొని దారిలో పిల్లలు తినడానికని తీసుకువెళ్తున్న తినుబండారాలను బాబాకు ఇచ్చాము”.

మైనతాయికి పుట్టిన బిడ్డ మరణించిన తర్వాత కొన్నిరోజులకి నానా చందోర్కర్ కుటుంబంతో సహా శిరిడీ వెళ్లి బాబా ముందు మౌనంగా కూర్చున్నాడు. బాబా సాధారణంగా నానాను చూడగానే పలకరించేవారు. అతను కూడా సంతోషంగా కబుర్లు చెప్పేవాడు. అక్కడంతా ఉల్లాసంగా ఉండేది. కానీ ఆరోజు మాత్రం అక్కడ నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. కొన్ని నిమిషాల తర్వాత బాబానే ఆ నిశ్శబ్దాన్ని ఛేదించారు. 

బాబా: "నువ్వెందుకు చింతాగ్రస్తుడవై మౌనంగా ఉన్నావు?".

నానా: "బాబా, మీకు అంతా తెలుసు. మేము మీ సంరక్షణలో ఉండగా ఈ దుర్ఘటనలు జరిగాయి. అల్లుడు మరణించాడు. పసిబిడ్డ కూడా మరణించింది".

బాబా: “నువ్వు బిడ్డకోసం, అల్లుడుకోసం నా దగ్గరకు వచ్చి వుంటే పొరపాటు పడినట్టే. ఈ విషయంగా నా దగ్గరకి రానవసరం లేదు. ఇవన్నీ(బిడ్డ పుట్టడం, బంధువులు మరణించడం వంటివి) నా ఆధీనంలో లేవు. అవి పూర్వకర్మ కనుగుణంగా జరుగుతుంటాయి. ఈ జగత్తును సృష్టించిన ఆ పరమేశ్వరుడు కూడా వాటిని మార్చలేడు. భగవంతుడు ఆ సూర్యుడినిగానీ, చంద్రునిగానీ, వారి నిర్ణీత ప్రదేశాలకు రెండు గజాల అవతల నుంచి ఉదయించమని శాసించగలడనుకుంటున్నావా? లేదు, ఆయన శాసించలేడు, శాసించడు కూడా. అలా జరిగితే అంతా తారుమారై గందరగోళం అయిపోతుంది”.

నానా: "అలా అయితే బాబా, మీరు ఒకరికి కొడుకు పుడతాడని ఎలా చెప్తున్నారు. మీరు చెపితే, వారికి కొడుకు పుడతాడు. మరొకరికి ఉద్యోగం వస్తుందని చెబుతారు. వారికి ఉద్యోగమొస్తుంది. ఇవన్నీ మీరు చేసే చమత్కారాలు కావా?".

బాబా: "లేదు నానా. నేను ఏ చమత్కారాలు చేయను. మీకు గ్రామాలలో జ్యోతిష్కుల ఉన్నారు. వారు ఏదో గుణించి చూసి, ఓ నాలుగైదు రోజులు ముందుగా భవిష్యత్తు గురించి చెబుతారు. వాటిలో కొన్ని జరుగుతాయి. నేను ఇంకా కొంచెం దూరం ముందుగా చూస్తాను. నేను చెప్పింది జరుగుతుంది. అంతే! నాది కూడా ఒక విధమైన జ్యోతిషంలాగా కనబడవచ్చు! అయితే దీని ఆంతర్యం మీరు గ్రహించలేరు. మీకు భవిష్యత్తు తెలియదు కనుక, అది నేను చెప్తే నేనేదో చమత్కారాలు చేస్తున్నానని అనుకుంటారు. ఈ సంఘటనలన్నీ నా అద్భుత శక్తికి నిదర్శనాలని తలచి నాపట్ల భక్తి, గౌరవాలను చూపుతారు. నేను మీరు చూపే భక్తి గౌరవాలను ఆ భగవంతునికే సమర్పించి, మీరు నిజంగా అనుగ్రహింపబడేలా చూస్తాను".

ఆవిధంగా బాబా సంబంధబంధవ్యాల పట్ల అతనికున్న మొహాన్ని బలహీనపరిచారు.

తరువాయి భాగం త్వరలో..


source: లైఫ్ ఆఫ్ సాయిబాబా(రచన: శ్రీబి.వి.నరసింహస్వామి)
 సాయిలీల మ్యాగజైన్స్  - 1986 మరియు 2009.
సాయిబాబా(రచన: శ్రీసాయి శరణానంద)

బాబాస్ వాణి, బాబాస్ అనురాగ్(రచన: విన్నీ చిట్లురి).


 

 


ముందు భాగం కోసం
బాబా పాదుకలు తాకండి.




 

నిర్ధిష్టమైన భాగం కోసం పైన నెంబర్లను తాకితే, ఆ నెంబరుకి సంబంధించిన భాగం ఓపెన్ అవుతుంది.

 


తరువాయి భాగం కోసం
బాబా పాదాలు తాకండి.

 


4 comments:

  1. ఓం సాయిరామ్

    ReplyDelete
  2. Omsaisri Sai Jai Jai Sai 🙏🙏🙏🙏 kapadu Tandri 🙏🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  3. ఓం శ్రీ సాయి రామ్ మిమ్మల్ని ‌ నమ్మితే జీవితం ధన్యం అవుతుంది.మీరు మిమ్మల్ని కాపాడుతారు.

    ReplyDelete
  4. మీరు మమ్మల్ని కాపాడుతారు

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo