శిష్యుడి చెవిలో మంత్రాన్ని గుసగుసలాడడంతో గురువు యొక్క కర్తవ్యం ముగుస్తుందని అనుకుంటే అది పొరపాటే. అందుకే సాయిబాబా తరచూ "నేను చెవిలో మంత్రాన్ని ఉచ్ఛరించే గురువును కాదు" అని చెప్పేవారు. వివిధ విషయవాసనలతో, కోరికలతో, ప్రాపంచిక వ్యామోహాలతో సతమతమవుతున్న తమ భక్తులను సంస్కరించి, ఉద్ధరించి సద్గతిని అందజేయడమే బాబా అవతారకార్యం. అందుచేత ఆయన సదా భక్తుల వెంటే వుంటూ తాము చెప్పినట్లు వాళ్ళు నడుచుకుంటున్నారా, లేదా అని గమనిస్తూ, ఒకవేళ భక్తులు అలా నడుచుకోకుండా తప్పుకుపోతుంటే, వారిని సరిదిద్ది సరైన మార్గంలో నడిపించి వారి పురోగతి కోసం ఆరాటపడుతుంటారు. నానాసాహెబ్ విషయానికి వస్తే, అతను తమను కలిసిన ప్రతిసారీ బాబా అతనికొక కొత్త పాఠాన్ని బోధించేవారు. కొన్నిసార్లు అంతటితో ఆగక అతను ఆ బోధను ఆచరణలో పెట్టాడో, లేదో నిశితంగా పరిశీలించేవారు, పలువిధాల పరీక్షించేవారు. ఒకవేళ అతను తాము చెప్పిన బోధను విస్మరించినట్లైతే తర్వాత అతను శిరిడీ వచ్చినప్పుడు బాబా ఉద్దేశపూర్వకంగా అతనిని పట్టించుకునేవారు కాదు. సాధారణంగా 'నానా, నానా' అని పిలుస్తూ తనతో ఎంతో చనువుగా మెలిగే బాబా అలా అసాధారణంగా ప్రవర్తిస్తుంటే అతను తాను చేసిన పని ఏదో బాబాను కలవరపెట్టిందని గ్రహించి తనను క్షమించమని బాబాను వేడుకొనేవాడు. అప్పుడు బాబా, "అరే, ఇలా చేయకు" అని, లేదా "నువ్వు ఇలా ప్రవర్తిస్తే నేనెందుకు నీతో మాట్లాడాలి" అని కొన్నిసార్లు కోపాన్ని నటించేవారు, కొన్నిసార్లు చాలా మధురంగా మాట్లాడుతూ అతనిని మందలించేవారు.
ఒకసారి బాబా, "షడ్రిపులలో(స్వభావరీత్యా మనిషిలో వుండే ఆరు దుర్గుణాలు) దేనిని సులభంగా జయించవచ్చు?" అని నానాని అడిగారు. అతను, "ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడం చాలా కష్టం" అని బదులిచ్చాడు. అప్పుడు బాబా, "అది అసూయ! దానిపై విజయం సాధించడం చాలా సులభం. అసూయ అంటే ఇతరుల పురోగతిని జీర్ణించుకోలేకపోవడమే. అసూయ చెందడం వలన మనకి లాభమూ లేదు, నష్టమూ లేదు. ఒక వ్యక్తి తన సత్కర్మలననుసరించి సంపద, శ్రేయస్సు పొందుతాడు. కాబట్టి, ఎవరైనా అభివృద్ధి చెందారంటే అది వారి సత్కర్మల ఫలితం. దానివలన మనకేమి నష్టం? అందువల్ల, అసూయపడే చెడు గుణాన్ని జయించాలి" అని అన్నారు. అది విన్న నానాసాహెబ్ బాబా ముందు సాష్టాంగపడి, "ఈరోజు నుండి, నేను అసూయ చెందకుండా ఉండటానికి ప్రయత్నిస్తాను" అని చెప్పాడు.
కొన్ని నెలల తర్వాత నానాసాహెబ్ మళ్ళీ శిరిడీ వచ్చి బాబా పాదాల చెంత కూర్చున్నప్పుడు బాబా అతనితో, "నానా, నేను నీకు రెండవ పాఠం బోధిస్తున్నాను" అని, "ఎవరైనా ప్రజాసంక్షేమ విషయంగా నిన్ను సహాయం కోరితే, చేయగలిగినదంతా చేయాలి. సహాయం చేయలేని స్థితిలో ఉన్నా లేదా చేయాలనిపించకపోయినా మర్యాదగా తిరస్కరించాలే తప్ప సహాయం కోరిన వ్యక్తిని అపహాస్యం చేయడంగానీ, అవమానించడంగానీ లేదా అతనికి ఎదురు తిరగడంగానీ చేయకూడదు. నీ ఆధిక్యతను కూడా చూపించకూడదు. చెప్పిన మాటపై నిలబడాలి. ఇది నీకు గుర్తుంటుందా?" అని అన్నారు. అందుకతను, "అలాగే చేస్తాన"ని బాబాకి వాగ్దానం చేశాడు. అప్పుడు బాబా, "దీనిని ఆచరణలో పెట్టడం అంత సులభం కాదు" అని అన్నారు. "అయినప్పటికీ, మీ సలహాకి కట్టుబడి ఉంటాన"ని అతను హామీ ఇచ్చాడు. నిజానికి అప్పటికే నానా వల్ల ఒక తప్పిదానికి అంకురార్పణ జరిగింది. అదే బాబా అతనికి పై సలహా ఇవ్వడానికి ప్రేరకమైంది.
చందోర్కర్ తోడల్లుడు బినీవాలే విషయానికి వస్తే, దత్తుని తప్ప మరేమీ పట్టించుకోని అతను బాబాని పూజించే శిరిడీ విడిచి దత్త దర్శనమయ్యే ప్రదేశానికి వెళ్లాలని ఆరాటపడ్డాడు. అంతలో అకస్మాత్తుగా అతని కళ్లకు బాబా మూడు తలలతో, అంటే దత్తునిగా దర్శనమిచ్చారు. అప్పటినుండి అతను బాబాను దత్తావతారంగా నమ్మి జీవితాంతం సాయిభక్తుడిగా ఉండిపోయాడు.
దానం చేసే విషయంలో బాబా బోధ
మరో సందర్భంలో బాబా, "ఎటువంటి అహంకారం, ఆగ్రహం లేకుండా బిక్ష ఇవ్వు. ఒకవేళ ఇచ్చిన దానితో తృప్తి చెందక ఇంకా కావాలని పట్టుబడితే, శాంతంగా సమాధానమివ్వు. అధికార దర్పాన్ని, ఆగ్రహాన్ని ప్రదర్శించకు" అని నానాకి మరో సూచన ఇచ్చారు. నానా అది చాలా తేలిక అని భావించాడు. తర్వాత కొన్నిరోజులకి అతను కళ్యాణ్‌లో ఉన్న తమ ఇంటికి వెళ్ళాడు. అతను ఎప్పుడు సెలవులున్నా కుటుంబంతో అక్కడ గడిపేవాడు. ఆ సమయంలో ఇంట్లోని ఆడవాళ్లు మధ్యాహ్నం తీరిక సమయంలో వివిధ రకాల పిండి వంటలు తయారు చేస్తుండేవారు. ఒకనాటి మధ్యాహ్నం నానాసాహెబ్ భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటుండగా అతని భార్య భజ్ని (గోధుమ పిండి, బియ్యం పిండి, మసాలా దినుసులు కలిపి తయారు చేసే వంటకం. దీనిని సాధారణంగా మరాఠీలో 'చక్రం' మరియు గుజరాతీలో ‘చక్లి’ అని పిలుస్తారు) తయారు చేయడంలో నిమగ్నమైంది. ఆమె ఆ పనిలో ఉండగా హఠాత్తుగా ద్వారం వద్ద చిరిగిన మాసిన బట్టలతో ఉన్న ఒక బ్రహ్మణ బిచ్చగత్తె నిలబడి ఆహారం పెట్టమని అడిగింది. ఇంటి ముందున్న గేటు దాటి ఇంటి గడప వరకు ఆ బిచ్చగత్తె ఎలా వచ్చిందో ఆమెకి అర్థం కాలేదు. నానా భార్య దయతో ఆ బిచ్చగత్తెకి కొన్ని భజ్నియాలు ఇచ్చింది. ఆ బిచ్చగత్తె వాటితో తృప్తి చెందక ఇంకా కావాలని అడిగింది. నానా భార్య మరిన్ని భజ్నియాలు ఇచ్చింది. అయినా ఆ బిచ్చగత్తె సంతృప్తి చెందలేదు. అలా 1/8, 1/4 1/2, ఒక వంతు, చివరికి రెండు వంతుల ఇచ్చినప్పటికీ ఆ బిచ్చగత్తె సంతృప్తి చెందలేదు. అప్పుడు నానా భార్య, "తయారు చేసిన భజ్నియాలలో సగభాగం నీకిచ్చాను. అయినా నీకు తృప్తి కలగలేదా?" అని అంది. ఆ బిచ్చగత్తె, "అవన్నీ నాకిస్తే నేను వెళ్తాను" అని చెప్పింది. దాంతో నానా భార్య కోపం తెచ్చుకొని, “ఆహారాన్ని ఇతరుల నుండి సేకరించి కడుపు నింపుకునే నువ్వు ఇలా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. నేను ఇంతకంటే ఎక్కువ ఇవ్వను. నీకు ఆహారం కావాలంటే ఇచ్చిన దాన్ని తీసుకొని పో” అని అంది. ఆ బిచ్చగత్తె ఆమె మాట వినలేదు సరికదా అప్పటివరకు ఇచ్చిన వాటిని కూడా తీసుకోలేదు, అక్కడినుండి వెళ్ళలేదు కూడా. నానా భార్యకి ఓపిక నశించి తన భర్తను పిలిచింది. నానాసాహెబ్ వచ్చి విషయాన్ని తెలుసుకొని కాపలాదారుని పిలిచి, “ఆ బిచ్చగత్తె ఇచ్చిన దానితో తృప్తి చెందితే సరే, లేదంటే ఆమెను మెడపట్టి బయటకు నెట్టు” అని ఆదేశించాడు. అప్పుడు ఆ బిచ్చగత్తె, “అయ్యా, మీరు ఇవ్వకూడదనుకుంటే ఇవ్వకండి. కానీ నన్ను బయటకు నెట్టొద్దు, నేనే వెళ్తాను” అని ఒక్క భజ్నియ కూడా తీసుకోకుండా వెళ్ళిపోయింది. తర్వాత నానాసాహెబ్ సెలవులు ముగిసి తిరిగి తన విధులకు హాజరు కావడానికి వెళ్తూ దారిలో బాబాను దర్శించుకోవడానికి శిరిడీ వెళ్ళాడు. బాబా అతన్ని చూస్తూనే తన ముఖాన్ని మరో వైపు తిప్పుకున్నారు, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నానాసాహెబ్ బాబా దగ్గరికి వెళ్లి, ఆయన పాదాల మీద పడి, “ఓ దేవా! నేను ఏమైనా తప్పు చేసుంటే దయచేసి చెప్పండి" అని వేడుకున్నాడు. బాబా, “నేను ఒక విషయాన్ని చెప్పాను, దాన్ని నువ్వు మర్చిపోయావు. నేను చెప్పినట్లు నడుచుకోని వారికి నేను ఏమి చెప్పాలి? అధికంగా భిక్ష కోరిన ఆ బిచ్చగత్తెను మెడపట్టి గెంటమని కాపలాదారుని ఆదేశించావు కదా! ఆమె మీకు ఏదైనా హాని చేసిందా, ఆమెను నెట్టడానికి? ఆమెకు ఇష్టమైతే ఇచ్చింది తీసుకుంటుంది లేకుంటే ఇంటి గుమ్మం ముందు కాసేపు కూర్చుని వెళ్లిపోతుంది. అందువలన మీకేమి నష్టం. ఆమె ఏమైనా మీ సంపదను లేదా గౌరవాన్ని దోచుకుంటుందా? కానీ నువ్వు ఆమె మాటలకు కోపం తెచ్చుకుని ఆమెను ఇంటి నుండి బయటకు నెట్టమని కాపలాదారుని ఆదేశించి నీ అధికారాన్ని ప్రదర్శించావు. నేను నీకు నేర్పించింది ఇదేనా?" అని అన్నారు. నానాకు తన తప్పేంటో అవగతమైంది. నిజమైన దానం అంటే ఏమిటో అర్థమైంది. ఇంకా 'సంరక్షించే దైవమైన బాబా అదృశ్యంగా నన్ను ప్రతిక్షణం గమనిస్తున్నారు. నాకు ఎదురు కాబోయే అరిషడ్వర్గాల ప్రలోభాలను, జరగబోయే చెడును ముందుగానే అంచనా వేస్తున్నారు. నేను వారి సూచనలను అమలు చేయడంలో మరింత జాగ్రత్తగా ఉండాలి' అని గుర్తించి పశ్చాత్తాపంతో, "ఇకపై ఎప్పుడూ ఇలాంటి తప్పు చేయన"ని బాబాకి మాట ఇచ్చాడు. సాయిబాబా శిరిడీలోనే కూర్చొని ఉన్నప్పటికీ తమ భక్తులను ఎక్కడున్నా వాళ్ళని సంస్కరిస్తూ ఉంటారు.
నిజమైన దానం గురించి భగవద్గీత 17వ అధ్యాయం, 20వ శ్లోకంలో క్రింది విధంగా చెప్పబడింది.
దాతవ్యమితి యద్దానం దీయతేఽనుపకారిణే।
దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్త్వికం స్మృతమ్।।
భావం: దానము చేయుట తన కర్తవ్యం అని భావించి, తగిన పాత్రత ఉన్నవారికి, ప్రతిఫలాపేక్ష లేకుండా, సరియైన సమయంలో, సరియైన ప్రదేశంలో దానము చేయుట అనేది సత్త్వగుణ దానము అని చెప్పబడుతుంది.
భిక్షకోసం వచ్చేవారిని ఏవగింపు కలిగించే వ్యక్తిగా, నీచమైన వ్యక్తిగా పరిగణించకూడదు. హిందూ మతం ప్రకారం బిక్ష చేసేవారు దైవంతో సమానం. నారాయణుడే ఆ రూపంలో వచ్చి తనని సేవించుకొనే అవకాశాన్ని మనకి కల్పిస్తున్నాడని భావించాలి. కాబట్టి దానం తగినంత గౌరవంతో చేయాలి.
ముందు భాగం కోసం బాబా పాదుకలు తాకండి. |
నిర్ధిష్టమైన భాగం కోసం పైన నెంబర్లను తాకితే, ఆ నెంబరుకి సంబంధించిన భాగం ఓపెన్ అవుతుంది. |
తరువాయి భాగం కోసం బాబా పాదాలు తాకండి.
|
Om Sai Ram
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Om samara sadguru sainath maharaj ki jai🙏🙏🙏🙏🙏
ReplyDeletesaibaba pl bless my son saimadava to overcome his all problems and pl bless him to stay with us only , not to leave any where sai baba.
ReplyDeleteOmsaisri Sai Jai Jai Sai 🙏🙏🙏🙏
ReplyDeleteఓమ్ సాయి శ్రీ సాయి జై సాయి జయ జయ సాయి
ReplyDelete