ఒకసారి బాబా సద్గురువు యొక్క బాధ్యత గురించి నానాసాహెబ్ చందోర్కర్‌తో ఇలా చెప్పారు, "ఈ రోజుల్లో చాలామంది గురువులుగా మారాలని ఆరాటపడుతున్నారు. కానీ గురువు యొక్క బాధ్యత భారమైనది. గురువు తన శిష్యుడు మోక్షం పొందేవరకు ప్రతి జన్మలో అతనిని అనుసరిస్తూ చివరికి అతన్ని విముక్తుణ్ణి చేయాలి. కేవలం సలహా ఇవ్వడంతో ఎవరూ గురువులు కాలేరు. నేర్చుకున్న దానితో పుష్కలంగా ఉపన్యాసాలు ఇచ్చే వివేకవంతులైన పండితులు చాలామంది ఉన్నారు. అంతమాత్రంతో వాళ్ళు ఆధ్యాత్మిక గురువులుగా మారలేరు. నిజమైన గురువు తన శిష్యుడికి విషయాన్ని బోధించడంతో తృప్తి చెందక, అతడా విషయాన్ని ఎలా ఆచరిస్తున్నాడో జాగ్రత్తగా గమనిస్తుంటాడు. అంతేకాదు, అడుగడుగునా ప్రోత్సహిస్తూ, అవసరమైనప్పుడు సరిదిద్దుతూ, సరైన మార్గంలో నడిపిస్తూ జన్మ జన్మలందు అతని పురోగతిని పర్యవేక్షిస్తాడు" అని. ఈ కారణంగానే సర్వజ్ఞుడైన సాయిబాబా పూర్వజన్మలలో తమతో ఋణానుబంధాన్ని కలిగి ఉన్న వారినందరినీ వివిధ మిషల ద్వారా తమ వైపుకు ఆకర్షించి వారి ఆధ్యాత్మిక పురోగతి విషయంలో శ్రద్ధ వహిస్తున్నారు. ఆయన తమకు శరణాగతి చెంది పూర్తిగా తమపై ఆధారపడే వారి అన్నీ వ్యవహారాల(చిన్న చిన్న విషయాలతో సహా) పట్ల బాధ్యత వహిస్తారని చాలామంది నేటి భక్తులకు కూడా తెలుసు. బాబా యొక్క ఆ శ్రద్ధ, రక్షణ మరియు అన్నీ సమకూర్చడం శరణాగతి చెందడానికి కారణాలు మాత్రమే కాకుండా, శరణాగతి పథంలో కొనసాగడానికి మరియు వారిలో ఐక్యం చెందే దిశగా నడిపించడానికి చాలా ముఖ్యమైన అంశాలు. కాబట్టి బాబా నానాను తమ చెంతకు రప్పించుకొని అతనిపట్ల శ్రద్ధ వహించి ప్రాపంచికంగా అవసరమైన సహాయాన్ని, రక్షణను అందించి తమపట్ల అతనికి విశ్వాసాన్ని స్థిరపరచి తమకు శరణాగతి చెందేలా చేసారు. కానీ కేవలం ప్రాపంచికంగా రక్షణనివ్వడం మాత్రమే సరిపోదు. బాబా పని అతని ఆత్మను రక్షించడం మరియు దాని లక్ష్యాన్ని చేరుకునేలా శిక్షణ ఇవ్వడం. అందువల్ల ప్రాపంచిక విషయాలలో సైతం బాబా జోక్యం, వారి సహాయం చాలా మంచి ఆధ్యాత్మిక ప్రభావాన్ని కలిగి ఉంటాయి. సరే, బాబా ప్రతి చిన్న సందర్భాన్ని ఉపయోగించుకొని నానాకి ఎలా పారమార్థిక ప్రయోజనాన్ని చేకూర్చారో చూద్దాం.
నానాసాహెబ్ చందోర్కర్ చాలా గౌరవప్రదమైన వ్యక్తి. అతనికి పెళ్ళై పిల్లలున్నారు. అతను తన కుటుంబ సంప్రదాయాలను కొనసాగించాల్సిన ఉన్నత స్థానంలో ఉన్నాడు. అతని చదువు, సంస్కారం అతనికి ఆత్మ సంయమనం(ఆత్మ నిగ్రహం), సక్రమ ప్రవర్తన వంటి ఉత్తమ గుణాలు అందించాయి. అతను చాలా చక్కని నడవడి కలిగి ఉండేవాడు. సాధారణంగా చెప్పబడే కామప్రవృత్తి, అసభ్యకరమైన ప్రవర్తన వంటివి లేని వ్యక్తి. అయితే, 'ఎంత గొప్పవారైనా ఎప్పుడో ఒకప్పుడు తప్పు చేయక మానరు' అని ఒక నానుడి. ఒకానొక సందర్భంలో మహల్సాపతి, నానాసాహెబ్, మరికొంతమంది ఇతర భక్తులు మసీదులో బాబా చెంత కూర్చుని ఉన్నారు. ఆ సమయంలో వైజాపూర్‌కి చెందిన ఒక ముస్లిం ధనికుడు తన కుటుంబంతో బాబా దర్శనానికి వచ్చాడు. వాళ్ళు వెంటనే మసీదు మెట్లెక్కి బాబా దర్శనం చేసుకోకుండా కొద్ది దూరంలో నిలబడి, ‘బాబా చెంతనున్న భక్తులు ఎప్పుడు వెళ్ళిపోతారా?’ అని ఎదురు చూడసాగారు. కారణం అతనితో వచ్చిన ఇద్దరు స్త్రీలు బాబా పాదాలపై తమ శిరస్సు ఉంచి నమస్కరించేటప్పుడు తమ బురఖాలు తొలగిస్తే, ఆ సమయంలో తమ ముఖాలను అక్కడున్న హిందువులు చూస్తారని సందేహించారు. వాళ్ల ఇబ్బందిని గ్రహించిన నానా లేచి వెళ్ళిపోబోయాడు. కానీ బాబా అతన్ని వెనక్కి లాగి కూర్చోబెట్టి, "వాళ్ళకి రావాలనుంటే వాళ్ళే వస్తారు. నువ్వు ఇక్కడి నుండి లేచి వెళ్లాల్సిన పని లేదు" అని అన్నారు. దాంతో హిందూ భక్తులు అక్కడ ఉంటుండగానే వాళ్ళు మసీదు మెట్లెక్కి బాబా దర్శనం చేసుకోవాల్సి వచ్చింది. ముందుగా వాళ్ళలో పెద్ద ఆమె తన ముసుగు తొలగించి బాబా దర్శనం చేసుకుంది. అప్పుడు ఏమీ జరగలేదు. తర్వాత చిన్న ఆమె ముసుగు తొలగించి బాబా దర్శనం చేసుకుంది. ఆమె ముఖం చాలా అందంగా వుంది. మెరిసే కనులు, ముఖంలో తేజస్సు, అన్నీ సరైన పాలలో ఉన్న ముఖాకృతి, మొత్తానికి వర్ణింపశక్యంకానీ ఆమె ముఖ సౌందర్యానికి అక్కడున్న అందరూ క్షణకాలం మైమరచిపోయారు. నానాసాహెబ్‌కి తన చూపును ఆమె మీద నుండి మరల్చడానికి చాలా కష్టంగా అనిపించింది. అదే సమయంలో చుట్టూ ఉన్నవారు తనని గమనిస్తారేమోనన్న తత్తరపాటు, అదీకాక బాబా సమక్షంలో ఇలాంటివి తగదని అతను చాలా ఇబ్బందిపడ్డాడు. అయినప్పటికీ అతని కళ్ళు మళ్లీ మళ్లీ ఆ స్త్రీ వైపే మళ్ళసాగాయి. ఇంతలో ఆమె బాబాను దర్శించుకోవడం పూర్తై తిరిగి బురఖా వేసుకుంది. నానా మదిలో, 'ఈ దివ్య సౌందర్యాన్ని చూసే అవకాశం మరోసారి లభిస్తుందా?' అని ఒక ఆలోచన లేచింది. వెంటనే బాబా అతని తొడపై చరిచారు. అతను సిగ్గుతో తలవంచుకున్నాడు. ఆ స్త్రీలు అక్కడ నుంచి వెళ్లిపోయిన తర్వాత బాబా అతనిని, "నేను నిన్ను ఎందుకు కొట్టానో తెలుసా?" అని అడిగారు. నానా తన ఆలోచనలు నీచంగా ఉన్నాయని, మీ సాంగత్యంలో ఉన్నవారికి అటువంటివి తగవని అంగీకరిస్తూ, "మీ పక్కనుండగా నా మనసుని అటువంటి నీచమైన ఆలోచనలు ఎలా కుదిపేశాయి" అని అడిగాడు. దానికి బాబా, "ఎంతైనా నువ్వు మానవుడివి. శరీరం కోరికలతో నిండి ఉంటుంది. ఇంద్రియ విషయాలు సమీపించినప్పుడు అవి చెలరేగుతాయి" అని ఆపై, "రంగురంగుల బాహ్య సౌందర్యంతో కూడిన అందమైన దేవాలయాలెన్ని లేవు? మనం ఆ దేవాలయాలకి వెళ్ళినపుడు బాహ్య సౌందర్యాన్నా, లోనున్న దైవాన్నా ఆరాధిస్తాం? లోనున్న దైవాన్ని చూస్తున్నపుడు ఆలయం యొక్క బాహ్య సౌందర్యాన్ని పట్టించుకుంటామా? దైవం ఆలయాలలో మాత్రమే లేడని గుర్తుంచుకో. ఆయన ప్రతి ప్రాణిలోనూ ఉన్నాడు. కాబట్టి నువ్వు ఒక అందమైన ముఖాన్ని చూసినప్పుడు అది ఒక ఆలయమని, అందంగా ఉన్నా, వికారంగా ఉన్నా లోనున్న జీవాత్మ(విశ్వాత్మ అంశ) భగవంతుని ప్రతిరూపమని గుర్తుంచుకో. ఈ రూపాలు భగవంతుని ఆవిష్కరిస్తాయి. అందాన్ని ఆరాధించడంలో తప్పు లేదు, కానీ ఆ అందాన్ని చూసిన వెంటనే 'ఈ రూపం ఇంత అందంగా ఉంటే, అందులో ఉంటూ దాన్ని సృష్టించిన భగవంతుడు ఇంకెంత అందంగా ఉంటాడు? ఆయన ఎంత గొప్పవాడు?' అన్న ఆలోచన రావాలి. అలా ఆలోచిస్తే ఇకపై నువ్వు బాహ్యమైన ముఖ సౌందర్యానికి మోహపూరితుడవు కావు" అని చెప్పారు. ఇది నానాకిచ్చిన ఉపదేశమే అయిన అతని మనస్సు చాలా స్వచ్ఛమైనది. అతను బాబా మార్గదర్శకత్వంలో స్త్రీ రూపాల పట్ల చాలా గౌరవాన్ని పెంచుకున్నాడు. ఎంతలా అంటే తలుపులు మూసి ఉన్న గదిలో, ఒక అందమైన యువతితో ఏకాంతంగా ఉన్నప్పటికీ స్త్రీపట్ల గౌరవం నిలుపుకొనేంతగా, కనీసం కామంతో కూడిన ఆలోచనలు కూడా లేనంతగా. అందుకు నిదర్శనం ఈక్రింది బన్నుమాయి దర్శన ఉదంతం.
సహజంగానే నానాసాహెబ్ దైవభక్తి గలవాడు. బాబా సాంగత్యంలో అతను మరింత ఎదిగాడు. అతను సాధు, సత్పురుషుల దర్శనం కోసం తపించేవాడు. అహ్మద్‌నగర్ నుండి 50 మైళ్ళ దూరంలో ఉన్న బోడెగావ్ గ్రామంలో బన్నుమాయి అనే 20 ఏళ్ల ముస్లిం యువతి ఉండేది. ఆమె జీవన విధానం మామూలు మనుషుల్లా ఉండేది కాదు. గొప్ప సౌందర్యవతి అయిన ఆమె నిండు యవ్వనంలో స్త్రీలు పాటించాల్సిన కనీస నియమనిబంధనలు పాటించక నగ్నంగా గ్రామం వెలుపల ఉన్న నల్లతుమ్మ, నాగజెముడు, బ్రహ్మజెముడు మొదలైన ముళ్లపొదల్లో సంచరిస్తూ, ఆ ముళ్ళు తన శరీరాన్ని గాయపరుస్తున్నా పట్టించుకోక అక్కడే నివాసం ఉంటుండేది. ఎప్పుడైనా తన తల్లిని చూసేందుకు గ్రామంలోకి వచ్చినా ఎంత తొందరగా గ్రామంలో కనిపించిందో, అంతే వేగంగా కనుమరుగయ్యేది. ఆమె తల్లితో సహా ఎక్కువమంది గ్రామస్థులు ఆమె పిచ్చిదని భావించేవారు. కొంతమంది మాత్రం ఆమె భగవదనుగ్రహం పొందిన అవధూత అని, జ్ఞాని అని గుర్తించారు. నానాసాహెబ్ అహ్మద్‌నగర్ జిల్లా కలెక్టర్ కార్యదర్శిగా ఉన్నప్పుడు ఆమె గురించి విని ఆ మహాసాధ్వి దర్శనం చేసుకోవాలని బలంగా అనుకున్నాడు. అతను శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకొని తన కోరికను, అది నెరవేర్చుకోవడంలో ఉన్న ఇబ్బందులను బాబాకు విన్నవించి, వారి అనుమతి కోరాడు. అప్పుడు బాబా, "నానా! నువ్వు ఇప్పుడెందుకు ఇతరులు దర్శనం కోసం ఆరాటపడుతున్నావు? నీకు సమస్తమూ ఇక్కడ లేవా?" అని అన్నారు. కానీ అతను మొండి పట్టుపట్టాడు. చివరికి, "వెళ్ళు, నీకు ఆమె దర్శనమవుతుంది" అని అన్నారు బాబా.
నానాసాహెబ్ ఎక్కడికి వెళ్లినా అతని సహోద్యోగి ఖిర్విండికర్ ఎల్లప్పుడూ అతనితోపాటు ఉండేవాడు. నానా అతని ద్వారా ఒక గుడారం, కూర్చునేందుకు ఒక పీఠ, చీర, పసుపు - కుంకుమ, మంగళసూత్రం, స్నానానికి అవసరమైన వస్తువులు, ఆహార పదార్థాలు మొదలైనవన్నీ సమకూర్చి, తర్వాత ఇద్దరూ కలిసి బోడెగావ్‌కు ప్రయాణమయ్యారు. వాళ్ళు ముందుగా ఆ గ్రామంలోని గుడికి వెళ్లారు. అక్కడ విచారించగా బన్నుమాయి గ్రామం వెలుపలున్న అడవుల్లో ఉన్నట్లు తెలిసింది. వెంటనే నానాసాహెబ్ అక్కడికి వెళ్లి ఆమెకోసం వెతకడం ప్రారంభించాడు. అతని అన్వేషణ చాలాసేపు కొనసాగింది. అతని శరీరంలో ముళ్ళు గుచ్చుకున్నాయి. కానీ ఆమె ఆచూకీ మాత్రం తెలియలేదు. ఆమె గురించి ఎవరిని అడిగినా ఎవరూ ఏమీ చెప్పలేదు. పైగా కొంతమంది ‘ఒక యువ ఆఫీసరు ఎప్పుడూ నగ్నంగా సంచరించే ఒక స్త్రీ గురించి ఆరా తీస్తున్నాడ’ని అతనిపై ఆగ్రహించారు. నానా నిరుత్సాహపడి నిరాశతో మనసులో బాబాని తలుచుకొని, "నేను ఆమె దర్శనాన్ని పొందనట్లైతే, 'నాకు దర్శనమవుతుంద'ని చెప్పి మీరు నన్ను ఎందుకు మోసం చేశారు. ఏదేమైనా నాకు ఆమె దర్శనం అయ్యేంతవరకు నేను ఇక్కడి నుండి కదలను. మొండిగా ఇక్కడే ఉంటాను" అని ప్రార్థించి కళ్ళు తెరిచేసరికి ఎదురుగా రోడ్డు మీద బన్నుమాయీ నగ్నంగా నిలబడి ఉంది. ఆమెను చూడగానే అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అతను ఎటువంటి కామ ప్రలోభాలకు లోనుకాకుండా భక్తిభావంతో ఆమెకు సాష్టాంగ నమస్కారం చేశాడు. తర్వాత ఆమె శరీరానికి గుచ్చుకుని ఉన్న ముళ్ళను చూసి వాటిని తీయసాగాడు. కానీ ఆమె అదేమీ పట్టించుకోకుండా ఒక్క క్షణంలో లేచి సమీపంలో ఉన్న పొదల్లోకి వెళ్ళి అదృశ్యమైంది. దాంతో నానా మళ్ళీ కష్టంలో పడ్డాడు. ఎందుకంటే, ఆమె తాను ఏర్పాటు చేసిన గూఢారంలో స్నానం చేసి, ఆమెకోసం తెచ్చిన చీర, నగలు ధరించి, తాను పెట్టిన నైవేద్యం స్వీకరించాలన్నది అతని కోరిక. అలాంటిది ఆమె అలా హఠాత్తుగా వెళ్లిపోయేసరికి నానా తన ఆశలన్నీ వదులుకోబోయాడు. కానీ చివరి క్షణంలో తన మనసుని దృఢం చేసుకొని ఖిర్విండికర్‌ని, “ఇక్కడ ఒక గుడారం వేసి ఒక చిన్న గది ఏర్పాటు చేసి, బన్నుమాయి స్నానానికి అవసరమైన సన్నాహాలు చేయమ"ని చెప్పాడు. వెంటనే ఖిర్వాండికర్ పని ప్రారంభించాడు. గుడారం సిద్ధమయ్యాక తాము తెచ్చిన వస్తువులు ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నప్పుడు రవిక తీసుకురావడం మరిచిపోయానని అతను గుర్తించాడు. సరిగ్గా అప్పుడే ఒక వ్యక్తి అటుగా వస్తూ కనిపించాడు. ఖిర్విండికర్ అతనిని విచారిస్తే, అతనొక టైలర్‌ని, వారంవారం జరిగే సంతకి వెళ్లి వస్తున్నాడని తెలిసి తనకొక రవిక కావాలని అడిగాడు. అందుకు ఆ టైలర్ తన వద్ద ఒక రవిక ఉందని చెప్పి, దాన్ని ఖిర్విండికర్‌కి ఇచ్చాడు. దాంతో అతను అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాడు.
మరో సందర్భంలో నానాసాహెబ్ శిరిడీలో బాబా సన్నిధిలో గడుపుతున్నాడు. అప్పుడొకరోజు ఉదయం నానా కలెక్టరును కలవడానికి కోపర్గాఁవ్ వెళ్ళాలనుకున్నాడు. అయితే అతను బయలుదేరేముందు సెలవు తీసుకోవడానికి బాబా వద్దకు వెళితే, "రేపు వెళ్ళు" అన్నారు బాబా. అంటే అప్పుడు వెళ్ళడానికి బాబా అతనికి అనుమతిని ఇవ్వలేదు. నానా కంటే తక్కువ విశ్వాసం ఉన్న వాళ్ళు బాబా మాటను పెడచెవిని పెట్టి బయలదేరేవాళ్ళు. కానీ నానాకి బాబా మీద పూర్తి విశ్వాసం, ఫలితంగా ఇంకో రోజు బాబాతో గడిపే ప్రయోజనం పొందాడు. అతను ఆరోజు శిరిడీలో గడిపి మరుసటిరోజు సెలవు తీసుకోవడానికి బాబా వద్దకు వెళ్ళాడు. అప్పుడు బాబా, "నువ్వు ఇప్పుడు వెళ్లి కలెక్టరుని కలుసుకో" అని అన్నారు. నానా బాబాకు ప్రణామాలర్పించి కోపర్గాఁవ్ వెళ్ళాడు. అతను అక్కడికి చేరాక కార్యాలయ సిబ్బందిని "నిన్న ఏం జరిగింది?" అని విచారించాడు. అప్పుడు వాళ్ళు, "ఈరోజు రావడం లేదు. రేపు వస్తానని కలెక్టరు టెలిగ్రాం పంపారు" అని చెప్పారు. ఆ టెలిగ్రాం కాపీ ఏం బాబాకు చేరలేదు. కానీ వారు తమ అంతర్ జ్ఞానంతో కలెక్టరు రావడం మరుసటిరోజుకు వాయిదా పడిందని తెలుసుకొని నానాకు తన గురువుతో ఇంకొక రోజు సమయం గడిపే ప్రయోజనాన్ని ఇచ్చారు. ఈ విధంగా అత్యంత ముఖ్యమైన అధికారిక విషయాలలో కూడా నానా విశ్వాసం బాబా మాటలను పాటించేలా చేసి ప్రాపంచికంగా మరియు ఆధ్యాత్మికంగా చాలా ప్రయోజనకారి అయింది.
ముందు భాగం కోసం బాబా పాదుకలు తాకండి. |
నిర్ధిష్టమైన భాగం కోసం పైన నెంబర్లను తాకితే, ఆ నెంబరుకి సంబంధించిన భాగం ఓపెన్ అవుతుంది. |
తరువాయి భాగం కోసం బాబా పాదాలు తాకండి.
|
ఓం సాయిరామ్
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Omsaisri Sai Jai Sai 🙏🙏🙏🙏🙏🙏 kapadu Tandri
ReplyDelete