1. సాయిబాబా ఈజ్ గ్రేట్2. తలచినంతనే ఫోన్ దొరికేలా అనుగ్రహించిన బాబా
సాయిబాబా ఈజ్ గ్రేట్
సాయిభక్తులకు నమస్కారాలు. నా పేరు సంధ్య. పిలిస్తే పలికే దైవం సాయిబాబా. 2023లో ఆయన నన్ను ఒక పెద్ద ప్రమాదం నుండి చిన్న గాయంతో బయటపడేసారు. ఆ అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. నేను గౌట్ టీచరుని. మా ఊరు నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరిలో ఉద్యోగం చేస్తూ 11 సంవత్సరాలుగా రోజూ స్కూటీ మీద స్కూలుకి వెళ్లొస్తున్నాను. 2023లో మా ఊరుకి సమీపంలో మా స్కూల్లో చదివే పిల్లలు బైక్ మీద వచ్చి నా స్కూటీని డీకొట్టారు. నా ప్రాణం పోయినంత పని అయింది. క్షణకాలం నాకు ఏం జరిగిందో అర్థం కాలేదు. ఆ ప్రమాదంలో నా కాలు విరిగిపోవాల్సిందే కానీ, బాబా ఉన్నారుగా! ఆయన చిన్న గాయంతో బయటపడేసారు. చూసిన వాళ్ళందరూ పెద్ద ప్రమాదం చిన్నదానితో తప్పిపోయింది అన్నారు. చేతి వేళ్ళు విరిగిపోగా చిన్న సర్జరీ జరిగింది. కొన్నిరోజుల తర్వాత నేను, 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు ఓపెన్ చేస్తే, "నీ చావు చీటీ చింపేసాను" అని బాబా మెసేజ్ వచ్చింది. అప్పుడు నేను బాబానే దగ్గరుండి నన్ను కాపాడరని చాలా సంతోషించాను. ఆయన అణుక్షణం తమ భక్తుల వెన్నంటే ఉండి కాపాడుతారు. ఇది 100% నిజం.
2023, జూలై 22న ఉదయం 4 గంటల నుండి మా ఊరిలో ఎడతెరపి లేకుండ వర్షం కురిసి ఊరిలోకి నీళ్లు వచ్చి అన్నీ మునిగిపోయి చాలా నష్టం జరిగింది. మావారు ఫోన్ చేసి, 'వేరే చోట పార్క్ చేసిన మా కారులోకి నీళ్లు చొరబడ్డాయ'ని చెప్పారు. నాకు చాలా భయమేసి, "బాబా కరుణించి వర్షాన్ని శాంతిపజేయండి" అని బాబాను వేడుకున్నాను. అంతే, 20నిమిషాల్లో వాన తగ్గింది. బాబా ఎంత గొప్పవారు? ఆయన దయ లేకుంటే చాలా నష్టం జరిగేది. ఇలా ఎన్నోసార్లు కష్టంలో నన్ను ఆదుకున్నారు బాబా. 'సాయీ' అంటే క్షణాల్లో మనల్ని చేరదీసే తండ్రికి నేనెప్పుడూ ఋణపడి ఉంటాను. సాయిబాబా ఈజ్ గ్రేట్. ఆయన అంతటా ఉన్నారు. "థాంక్యూ బాబా".
తలచినంతనే ఫోన్ దొరికేలా అనుగ్రహించిన బాబా
ముందుగా సాయిభక్తులందరికీ నమస్కారం. నా పేరు వాణి. గత 12 సంవత్సరాలలో సాయి నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చూపించారు. వాటిలో నుండి ఒక అనుభవం మీ అందరితో పంచుకుంటున్నాను. 2023, ఆగస్టు 23న మేము షాపింగ్‌కి వెళ్ళాము. అక్కడినుండి ఇంటికి తిరిగి వచ్చాక మావారి సెల్ ఫోన్ కనిపించలేదు. బ్యాగులో, కారులో, ఇంకా మొత్తం అంతా వెతికినా ఆ ఫోన్ ఎక్కడా కనబడలేదు. అది సుమారు 1500 డాలర్ల ఖరీదైన ఫోన్. ప్రస్తుతం మేమున్న పరిస్థితిలో మళ్ళీ ఫోన్ కొనుక్కొలేము కూడా. సాయి భక్తులకు ఏది జరిగినా మొదట బాబానే గుర్తుకు వస్తారు. అలాగే నేను కూడా బాబాని తలుచుకొని, "బాబా! ఫోన్ దొరికేలా దయచూపండి" అని మనసులో అనుకున్నాను. అంతే, బాబాని తలచినంతనే మావారి ఫోన్ రింగ్ సౌండ్ వినపడింది. అది వింటూనే నా ప్రాణం లేచి వచ్చినట్లై సంతోషం వేసింది. చూస్తే, ఫోన్ కారులోనే ఫ్రంట్ సీటు జిప్‌లో ఉంది. అలా ఫోన్ దొరికేలా అనుగ్రహించిన బాబాకు శతకోటి ధన్యవాదాలు.

