సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1629వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఏ సమస్య వచ్చినా తోడుగా ఉంటామన్న ధైర్యమిచ్చిన బాబా
2. ఎంతో దయచూపిన సాయి

ఏ సమస్య వచ్చినా తోడుగా ఉంటామన్న ధైర్యమిచ్చిన బాబా

సాయిభక్తులందరికీ నమస్కారం. నా పేరు లలిత. నేను యుకే వాసిని. గత సంవత్సరం నేను ఒక అనుభవం మీ అందరితో పంచుకున్నాను. ఇప్పుడు దానికి సంబందించిన ఇంకో అనుభవం పంచుకునే అవకాశాన్ని ఆ బాబా నాకిచ్చారు. 2 సంవత్సరాల క్రితం డాక్టరు నాకు సర్వైకల్ స్క్రీనింగ్ టెస్ట్ చేసి, 'రిపోర్టులో ఏవో అసాధారణతలు ఉన్నాయని 3 నెలల తర్వాత అవసరమైతే బయాప్సీ చేయాల'ని చెప్పారు. ఆ 3 నెలలు నాకు చాలా నరకంలా గడిచింది. నేను ఆ సమయంలో 'సాయి దివ్యపూజ, నవగురువార వ్రతం, సచ్చరిత్ర పారాయణ, ఊదీ నీళ్లు తాగడం ఇలా నాకు తెలిసినవన్నీ చేసాను. 3 నెలల తరవాత డాక్టర్ టెస్టు చేసి, "బయాప్సీ అవసరం లేదు. కానీ, కొంచెం సమస్య ఉంది. ఒక సంవత్సరం తరువాత మళ్ళీ టెస్టు చేద్దాం" అని అన్నారు. బాబా దయతో బయాప్సీ తప్పించారని చాలా ఆనందపడ్డాను. కానీ, సమస్య ఇంకా అలానే ఉన్నందున ఒక సంవత్సరం తరువాత టెస్టులో ఏమొస్తుందోనని నాకు టెన్షన్‌గా ఉండేది. బాబా మీద నమ్మకంతో దాదాపు ఒక సంవత్సరం నేను రోజూ ఏదో ఒక సమయంలో 'సాయి స్తవనమంజరి' చదువుతూ, ఊదీ నీళ్ళలో వేసుకొని త్రాగుతూ, 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే నామాన్ని జపిస్తూ గడిపాను. ఆ సమయంలోనే బాబా నన్ను శిరిడీకి పిలిపించుకున్నారు. "ఈ మసీదు మెట్లు ఎక్కిన వారి కష్టాలు, పాపాలు దగ్దమైపోతాయ"ని అని సచ్చరిత్రలో బాబా చెప్పారు. ఆ మాటలు నేను ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ నమ్మకంగా ఉంటుండేదాన్ని. ఒక సంవత్సరం తరువాత టెస్టు చేయించుకుందామని ఎన్నిసార్లు ప్రయత్నించినా అస్సలు కుదరలేదు. దాంతో నేను, "ఏంటి బాబా ఇలా జరుగుతుంది? అంటే నాకింకా సమస్య తగ్గలేదా?" అని బాబాని అడుగుతూ స్తవనమంజరి చదవడం, ఊదీ నీళ్లు త్రాగడం, 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అని జపించడం కొనసాగించాను. ఆఖరికి 5 నెలల తరువాత ఒక గురువారంనాడు టెస్టు చేయించుకొని అవకాశం వస్తే, టెస్టు జరుగుతున్నప్పుడు నేను నా చేతిలో బాబా ఊదీ ప్యాకెట్ పెట్టుకుని బాబా నామస్మరణ చేసుకున్నాను. తరువాత 2023, ఆగస్టు 23న టెస్టు రిపోర్ట్ ఓపెన్ చేసి చూశాను. రిపోర్టులో ఏమి వచ్చిందో వేరే చెప్పాలా? బాబా దయవల్ల ఏ సమస్య లేదని నెగటివ్ రిపోర్టు వచ్చింది. రెండేళ్ల క్రితం పాజిటివ్ వచ్చిన రిపోర్టు ఇపుడు నెగెటివ్ ఎలా అయింది? అసలు ఇది సాధ్యమేనా? ఇదంతా బాబా నా మీద చూపిన కరుణ, ప్రేమ కాకపోతే ఇంకేంటి? ఆయన ఆగిపోయిందనుకున్న నా జీవితాన్ని మళ్లీ మొదలుపెట్టేలా చేశారు. ఈ అనుభవం ద్వారా నా జీవితంలో ఇక ఏ సమస్య వచ్చినా బాబా నాకు తోడుగా ఉంటారన్న ధైర్యం వచ్చింది. "చాలా ధన్యవాదాలు బాబా. ఇలానే ఎప్పుడూ మీ ప్రేమ నాపై ఉండాలని కోరుకొంటున్నాను తండ్రీ".


ఎంతో దయచూపిన సాయి

అందరికీ నమస్కారం. నా పేరు త్రివేణి. నేనిప్పుడు 2023, జూలైలో సాయి నా మీద చూపిన దయను మీతో పంచుకుంటున్నాను. ఒకసారి నేను నా కుటుంబ పరిస్థితుల దృష్ట్యా వేరే చోటుకి బదిలీ చేయించుకోవాల్సి వచ్చి బదిలీ చేయించుకున్నాను. తీరా అక్కడికి వెళ్ళాక ఎప్పుడూ, ఎక్కడికీ వెళ్లని నేను చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. అక్కడ నేను మొదట ఒక నెల రోజులు హాస్టల్లో ఉన్నాను. హాస్టల్ నుండి ఆఫీసుకు మధ్యనున్న దూరం, మీటింగ్లు, ఆఫీసు పనివేళలు మొదలైన అన్నీ నన్ను చాలా డిప్రెషన్‌కు గురిచేశాయి. ముఖ్యంగా ఆఫీసు పనివేళలు నన్ను చాలా కలవరపెట్టాయి. నేను దాని గురించే ఆలోచిస్తూ, 'ఇప్పుడంటే హాస్టల్లో ఉన్నాను కాబట్టి, ఆఫీసు నుండి ఆలస్యంగా వచ్చినా ఇబ్బంది లేదు. కానీ ఒక నెల తర్వాత నా ఫ్యామిలీ ఇక్కడికి వస్తారు. పిల్లల స్కూలు ఉదయం 9.00 నుండి సాయంత్రం 3.30 వరకే ఉంటుంది. కానీ నేను ఆఫీసు నుండి తొందరగా రావాలన్న కూడా కనీసం రాత్రి 8 గంటలు అయిపోతుంది. ఈ పరిస్థితుల్లో పిల్లల గురించి ఏం చేయాల'ని చాలా మదనపడ్డాను. అప్పుడు నేను, "ఈ కష్టం నుండి నన్ను కాపాడు స్వామి" అని సాయిబాబాను వేడుకోవడం మొదలుపెట్టాను. అలా ఒక వారంపాటు సాయిని స్మరించుకున్నాక మా హాస్టల్ రూమ్మేట్ నాకు శిరిడీసాయి ఊదీ, రక్ష ఇచ్చింది. నేను వాటిని తీసుకొని, "బాబా! నా మీద దయ చూపించి నన్ను ఈ కష్టం నుండి బయటపడేస్తే, మీ అనుగ్రహాన్ని బ్లాగు ద్వారా తోటి సాయిభక్తులతో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. రెండురోజుల తర్వాత నేను వెళుతున్న స్కూటీ మీద నుండి కిందపడిపోయాను. చాలా తక్కువ గాయాలతో బయటపడ్డానుగానీ "అయ్యో సాయి, ఏమిటి ఇలా జరిగింది?" అని అనుకున్నాను. అంతలోనే నాకు డిప్యూటేషన్ మీదే వేరే ప్రాంతానికి పంపుతూ ఉత్తర్వులు వచ్చాయి. ఇప్పుడు నా సమస్యలన్నీ తీరిపోయాయి. ప్రస్తుత ఆఫీసు పని వేళలు పిల్లలకు, నా భర్తకు అందరికీ సౌకర్యంగా ఉన్నాయి. అంతా సాయి కృప. "చాలా సంతోషం బాబా. ఇలాగే నేను కోరుకున్న మరొక కోరికను కూడా తీర్చు తండ్రీ. మీకు జీవిత కాలం ఋణపడి ఉంటాను. మీ దయ నా మీద, నా భర్త  మీద, నా పిల్లల మీద, మా కుటుంబం మీద ఎప్పుడూ ఉండాలి స్వామి".

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo