సాయి వచనం:-
'నీవు వేల మైళ్ళ దూరాన ఉన్నా చివరిక్షణంలో నా చెంతకు చేర్చుకుంటాను.'

'నలుగురికీ ఉపయోగపడేదేదైనా చేయండి, బాబా సంప్రీతులవుతారు. నలుగురికీ సహాయపడుతూ, ఆపదలో, కష్టాలలో అండగా నిలవడమే శ్రీసాయికి మనం అర్పించే నిజమైన పూదండ' - శ్రీబాబూజీ.

శ్రీరామచంద్ర వాసుదేవ గెయిసాస్




సాయిభక్తుడు రామచంద్ర వాసుదేవ గెయిసాస్ ముంబాయిలోని ఉత్తర దాదర్ నివాసి. ఇతను కొంకణ బ్రాహ్మణుడు. ఇతను పోస్టల్ డిపార్టుమెంటులో ఆర్.ఎమ్.ఎస్ రికార్డు గుమాస్తాగా పనిచేసి పదవీవిరమణ చేశాడు.

రామచంద్ర వాసుదేవ్ గెయిసాస్ సాయిబాబాను ప్రత్యక్షంగా దర్శించలేదు. కానీ ఇతను కాకాసాహెబ్ దీక్షిత్ ద్వారా సాయిబాబా గురించి విన్నాడు. ఇతను 1923 ప్రాంతంలో మన్మాడ్‌లో పనిచేస్తున్నప్పుడు, తరచూ తన పొరుగింటికి కాకాసాహెబ్ దీక్షిత్ వస్తుండేవాడు. అలా వచ్చినప్పుడు ఒకసారి దీక్షిత్ అతనితో సాయిబాబా గురించి చెప్పి, 'తనను బాబా శిరిడీకి రమ్మని పిలిచారని, అందుకే శిరిడీ వెళుతున్నాన'ని చెప్పాడు. అది విన్న రామచంద్ర ఆశ్చర్యపోతూ, “బాబా ఇప్పుడు భౌతికంగా లేరు కదా? వారు మిమ్మల్ని ఎలా పిలిచారు?" అని అడిగాడు. దీక్షిత్ చిన్నగా నవ్వి, “నీవు తెలుసుకుంటావులే” అని చెప్పి, ఒక బాబా పటాన్ని అతనికిచ్చాడు.

కొన్ని నెలలు గడిచిన తరువాత రామచంద్ర భార్య ప్రసవానంతరం అనారోగ్యానికి గురైంది. పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉండటంతో అందరూ ఆమె కోలుకుంటుందనే ఆశను కోల్పోయారు. రామచంద్ర ఆమెకోసం బాబాను ప్రార్థించి, "ఆమె బ్రతుకుతుందా?” అని బాబాను అడిగాడు. ఒకటి, రెండు రోజుల తరువాత అతనికొక కల వచ్చింది. ఆ కలలో అతను, షేక్ కాబూలా అనే ఒక మహమ్మదీయుడు కళ్యాణ్ దగ్గరున్న సముద్రపు పాయలో ఉన్న ఒక పడవలో ఉన్నారు. ఎవరో ఒకతను పడవలోకి వచ్చి తెడ్డు వేయసాగాడు. పడవ ప్రవాహానికెదురుగా అతికష్టంమీద అవతలి ఒడ్డుకు ప్రయాణిస్తోంది. అంతలో ఒక పెద్ద కెరటం వచ్చి పడవ గాలిలోకి ఎగిరింది. మరుక్షణంలో చూసేసరికి వారిరువురు బురదలో ఇరుక్కుపోయారు. తెడ్డు వేసే అతను కనిపించలేదు. పడవలో ఉన్న వారిరువురికీ తెడ్డు వేయడం చేతకాదు. దాంతో వారి పడవ ఇంకా బురదలో కూరుకుపోయింది. కానీ చివరికి పడవ ఎలాగో ఒడ్డుకు చేరింది. అంతటితో ఆ కల ముగిసింది. ఈ కలనుబట్టి  రామచంద్ర తన భార్య బ్రతుకుతుందని, అయితే కొంతకాలం మాత్రం బాధపడవలసి వస్తుందని ఊహించాడు. ఆశ్చర్యకరంగా ఆరోజు నుండి ఆమె కొద్దికొద్దిగా కోలుకోవడం మొదలుపెట్టింది. డాక్టరు పరీక్షించి, "ఆమెకు ప్రమాదస్థితి తప్పింది. ఆమె కోలుకుంటుంది, కాకపోతే ఆమె ఆరోగ్యం నెమ్మదిగా మెరుగవుతుంద"ని చెప్పాడు. తరువాత రామచంద్ర తన కల గురించి దీక్షిత్‌కు చెప్పాడు. అప్పుడు దీక్షిత్, "బాబా సశరీరులుగా లేకున్నా ఆయన ఇప్పటికీ జీవించే ఉన్నారు. వారు "నా సమాధి మాట్లాడుతుంది!” అని ఇచ్చిన హామీని ఇప్పటికీ అమలు చేస్తూనే ఉన్నారు" అని చెప్పాడు.

ఒకసారి రామచంద్ర ఉద్యోగంలో పదోన్నతి రాలేదని చాలా మధనపడుతుండేవాడు. ఆ సమయంలో అతనికి మళ్ళీ ఒక కల వచ్చింది. ఆ కలలో రామచంద్ర ఆర్థిక విషయాలకు సంబంధించి ఒకరితో చర్చిస్తున్నాడు. అకస్మాత్తుగా మరో వ్యక్తి వాళ్ళ ముందు ప్రత్యక్షమై, రామచంద్రను ఉద్దేశించి ఎదుటివ్యక్తితో, "అతడు కోరేది అతనికెందుకు ఇవ్వవు? అతనిని మూడు జతల దండవంకీలు తయారుచేయనివ్వు!” అని అన్నాడు. “అలాగే, మీరు చెప్పినట్లు చేస్తాను!” అని అతను బదులిచ్చిన మరుక్షణం మూడవ వ్యక్తి అంతర్థానమయ్యాడు. అంతటితో ఆ కల ముగిసింది. ఇతర అనుభవాలను, కలలను చెప్పిన విధంగానే ఈ కల విషయం కూడా దీక్షిత్‌కు చెప్పాడు రామచంద్ర. "ఆ మూడవ వ్యక్తి బాబా!" అని చెప్పాడు దీక్షిత్. అప్పుడు రామచంద్ర, "సాధారణంగా ఎవరైనా రెండు వంకీలే కదా ధరించేది. మరి బాబా మూడు జతల వంకీలు ఎందుకడిగార"న్న సందేహాన్ని వ్యక్తం చేశాడు. "బాబా దత్తావతారమని, వారికి మూడు శరీరాలు ఒకటిగా ఉంటాయని, అందుకే మూడు జతల వంకీలు అడిగార"ని దీక్షిత్ వివరించారు. అతడు వెంటనే మూడు జతల వెండి వంకీలు తయారుచేయించి, వాటికి ప్రాణప్రతిష్ఠ చేసి, నిత్యం పూజించే ఒక పెట్టెలో పెట్టాడు. నాలుగు రోజుల తరువాత అతనికి పదోన్నతి లభించింది.

ఒకప్పుడు రామచంద్ర ఏ గ్రంథం పారాయణ చేయాలో తెలియని స్థితిలో ఉన్నప్పుడు బాబా అతనికి కలలో కన్పించి, “53 భిక్షగా ఇవ్వు” అనడిగారు. పేదవాడైనందున అతడు 53 రూపాయలు సమర్పించలేక ప్రతినెలా తన జీతం నుండి 53 కాణీలు (అణాలో నాల్గవ వంతు) బాబాకు ఖర్చుపెట్టేవాడు. ఇలా నాలుగు నెలలు చేసిన తరువాత అతను ఆ కల విషయమై దాభోళ్కరును సంప్రదించాడు. బాబా భిక్షగా అడిగింది రూపాయలు కాదని, 53 అధ్యాయాలున్న పాత ప్రామాణిక గురుచరిత్ర పారాయణ చేయమని ఆ కల సూచిస్తుందని దాభోళ్కర్ వివరణ ఇచ్చాడు. దాంతో అతడు ఆ గ్రంథాన్ని పారాయణ చేయడం ప్రారంభించాడు.

ఒకసారి రామచంద్ర బాబా గురుచరిత్రను సప్తాహం పారాయణ చేయదలచి దాభోళ్కర్ రచించిన శ్రీసాయిసచ్చరిత్రను తెప్పించాడు. ఆరోజు రాత్రి తన ఇంటిలోనికి దొంగలు జొరబడినట్లు అతనికి కల వచ్చింది. దీనినిబట్టి బాబాకు ఈ మార్పు ఇష్టం లేదని, సాంప్రదాయానుసారం పాత ప్రామాణిక గ్రంథమే పారాయణ చేయమని ప్రబోధించినట్లు అతనికి తోచింది. దాంతో అతను సచ్చరిత్రను కాకుండా, గురుచరిత్రనే సప్తాహం పాటు పారాయణ చేశాడు.

1933-1934 సంవత్సరంలో రామచంద్ర భార్యకు పక్షవాతం వచ్చి ఆమె ప్రాణానికే ప్రమాదం ఏర్పడింది. ఆమెకు బాబాపై దృఢమైన భక్తివిశ్వాసాలున్నాయి. ఆ సమయంలో ఆమెకొక కల వచ్చింది. ఆ కలలో ఆమె ఉన్న గది వాకిట్లో బాబా కూర్చుని ఉన్నారు. బాబా ఆమెతో, "నిన్ను రక్షించడానికే నేను ఇక్కడ ఉన్నాను. ఆ యమదూతలను సైతం లోనికి రానివ్వను!" అని అభయమిచ్చారు. అదే కలలో కొందరు వెదురుబొంగులు, మట్టికుండ మొదలైనవి తెచ్చి ఆమె శవాన్ని మోసుకునిపోవడానికి పాడె కడుతున్నారు. బాబా వాళ్ళను అక్కడ నుండి తొలగిపొమ్మని, ఎదురుగా ఉన్న చోటికి వెళ్ళమని గట్టిగా ఆజ్ఞాపించారు. కానీ వారు బాబా మాటలు వినలేదు. దాంతో బాబా వారిని కొట్టి తరిమేసి వెదురుబొంగులను విరిచేశారు. మట్టికుండను పగులగొట్టారు. అంతటితో కల సమాప్తమైంది. రామచంద్ర భార్య రక్షింపబడింది. అదే రాత్రి రామచంద్ర నివసిస్తున్న ఘామత్‌చాల్ ఎదురుగానున్న రంగారీచాల్‌లో ఒక వ్యక్తి చనిపోయాడు. ఇలా రామచంద్ర  భార్యను మృత్యువు నుండి బాబా కాపాడారు. తరువాత ఆమె కోలుకుంది.

శ్రీ కాకాసాహెబ్ దీక్షిత్ రామచంద్రను 'భావూసాహెబ్!' అని పిలిచేవాడు. రామచంద్ర తన సాటి సాయిభక్తులకు చేయగలిగిన సహాయం అందించేవాడు. శిరిడీ వెళ్ళడానికి, తిరిగి రావడానికి రైలులో, బస్సులో టికెట్లు సమకూర్చడం వంటి పనులు చేసిపెడుతూ ఉండేవాడు. సాయిలీలా మాసిక్ పత్రికలో ఒక సంఘటన ప్రచురితమైంది. ఆ సంఘటనలో ఒక భక్తుడు రామచంద్ర ద్వారా బాబా సహాయం పొందినట్లు వ్రాయబడింది. రామచంద్ర శిరిడీ వెళ్ళినప్పుడు ఆ భక్తుడు అతనిని గుర్తుపట్టి “భావూసాహెబ్!” అని సంబోధించి పలకరించాడు.

సమాప్తం.......

Source: Devotees' Experiences of Shri Sai Baba by Shri.B.V.Narasimha Swamiji

10 comments:

  1. very nice experience babas devotees are very lucky.this is new subject.

    ReplyDelete
  2. Very nice and never heard also
    Tq
    Om Sai
    Sri Sai
    Jaya Jaya Sai
    🙏🙏🙏

    ReplyDelete
  3. 🙏🌺🙏ఓం సాయిరాం🙏🌺🙏

    ReplyDelete
  4. Completely involved and forgot myself while reading in this story, very heartful experience and how lucky he is to stay around the baba devotees.

    ReplyDelete
  5. Om Sai Ram 🙏🌹🙏🌹
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete
  6. Om Samardha Sadguru Sree Sai Nadhaya Namaha ❤🙏🕉😊

    ReplyDelete
  7. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  8. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  9. Om sai ram, baba nenu anukunnadi jarigi memu kshamam ga hyd velle la chayandi tandri pls, ma tammudu ardam chesukune la chayandi baba, intlo alage ofce lo situations anni prashantam ga unde la chudandi baba pls, amma nannalu inka andaru kshamam ga arogyam ga unde la chudandi baba pls.

    ReplyDelete
  10. Baba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu vadini bless cheyandi house construction complete cheyandi pl manchivarini rent ki pampandi

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo