ఈ భాగంలో అనుభవాలు:
- బాబాను నమ్ముకుంటే మన భారాన్ని మోస్తూ ఎప్పుడూ మనతోనే ఉంటారు
- సలహా ఇచ్చిన బాబానే సహాయం కూడా చేస్తారు
బాబాను నమ్ముకుంటే మన భారాన్ని మోస్తూ ఎప్పుడూ మనతోనే ఉంటారు
సాయిభక్తులకు నా నమస్కారం. నేను ఒక సాయిభక్తురాలిని. నేను ఇప్పుడు, ‘బాబాను నమ్ముకుంటే మన భారం తన మీద వేసుకుని తాను ఎప్పుడూ మనతోనే ఉంటారు’ అని తెలిపే అనుభవాన్ని పంచుకుంటాను. మా పాపకి బి.టెక్ అయిన వెంటనే పెళ్లి చేయాలని మేము అనుకునేవాళ్ళం. కానీ, బి.టెక్ అయిన తర్వాత తను కొన్నాళ్ళు ఉద్యోగం చేస్తానన్నది. సరేనని తనకు కంప్యూటర్ కోర్సులు నేర్పించాము. తరువాత తను ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగంలో చేరింది. ఒక సంవత్సరంపాటు ఉద్యోగం చేయాలనుకున్నది కాస్తా దాదాపు రెండేళ్ళ నుంచి ఉద్యోగం చేసింది. మేము తనకు పెళ్లి చేద్దామని సంబంధాలు చూస్తున్నా ఏ సంబంధమూ కుదరలేదు. ఈలోపు 2020, మార్చి నెలలో లాక్డౌన్ మొదలైంది. నాకు చాలా బెంగగా అనిపించి, “బాబా! నేను నిన్నే తండ్రిగా అనుకుని నా బాధ్యతను నీ మీద వేశాను. పాపకి మంచి సంబంధం కుదిరి, డిసెంబరు లోపు తనకు వివాహమయ్యేలా ఆశీర్వదించు బాబా!” అని బాబాను వేడుకుని, అయిదు గురువారాలు పూజ చేస్తానని బాబాకు మ్రొక్కుకుని, అయిదు వారాలు పూజ చేశాను. పూజ పూర్తయ్యేసరికి, పాప ఫోటోను ఒక గ్రూపులో చూసిన ఒక సంబంధంవాళ్లు మాకు ఫోన్ చేసి, "ఆన్లైన్‌లో మా పాపను చూసి తమకు నచ్చింద"ని చెప్పారు. బాబా దయతో మా పాపకు మంచి సంబంధం కుదిరిందని మేము చాలా సంతోషించాము. కానీ, ఇంతలో మా పాప, “ఆన్లైన్‌లో చూసి సంబంధం కుదర్చడమేంటి? పరిచయంలేని వాళ్ళని కనీసం చూడకుండా ఎలా పెళ్ళి చేసుకుంటాను?” అని అన్నది. దాంతో నేను ఆందోళన చెంది, “బాబా! నాకు నువ్వు తప్ప ఎవ్వరూ లేరు. నాకు చాలా భయంగా ఉంది. వాళ్ళకి ఏమి సమాధానం చెప్పాలి? రెండురోజుల్లోపల ‘నాకు ఈ పెళ్లి ఇష్టమే!’ అని మా పాప చెప్పేలా నువ్వే చేయి తండ్రీ!” అంటూ కన్నీటితో బాబాను ప్రార్థించాను. నా తండ్రి బాబా చాలా అద్భుతం చేశారు. బాబాను ప్రార్థించిన తరువాత బాబా లీలలు చదువుతూ కూర్చున్నాను. ఇంతలో మా పాప నాకు ఫోన్ చేసి, “ఈ పెళ్లి నాకు ఇష్టమే అమ్మా! నేను మీ మాట ఎలా కాదంటాను? మీకు నచ్చని పని ఎందుకు చేస్తాను? నువ్వు సంతోషంగా ఉండమ్మా!” అని చెప్పింది. ఆ మాట వినగానే నేను ఆనందభాష్పాలతో నా సాయితండ్రికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ఇంత అద్భుతం చేసిన బాబాకు నేను ఏమి చేయగలను, నా ఆఖరి శ్వాస వరకు బాబాను ప్రార్థిస్తూ ఉండటం తప్ప! “థాంక్యూ, థాంక్యూ, థాంక్యూ బాబా!”
సలహా ఇచ్చిన బాబానే సహాయం కూడా చేస్తారు
నా పేరు అనూష. కొన్ని అనారోగ్య కారణాల వల్ల 2020, ఆగస్టు మొదటి వారంలో నా మానసికస్థితి ఏమీ బాగలేక చాలా సతమతమయ్యాను. “బాబా! మీరు నాతో ఉన్నట్టు నాకు ఏదైనా ఒక సంకేతమివ్వండి” అని రోజంతా అడుగుతూ బాబాను కూడా బాగా ఇబ్బందిపెట్టాను. బాబాను నా ఆరోగ్యం గురించి అడిగినప్పుడు, “నల్లకుక్కకి భోజనం పెట్టు, నీ ఆరోగ్యం బాగుంటుంది” అని సమాధానం వచ్చింది. అయితే ఇక్కడ రెండు సమస్యలున్నాయి. మొదటిది - మేమున్న ఇంటి పరిసరాల్లో నల్లకుక్క ఒకటి అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది, కానీ దానికి బిస్కెట్లు పెడితే వాసన చూసి వెళ్ళిపోతుందే తప్ప తినదు. ఎప్పుడైనా నచ్చితే ఒకటి లేదా రెండు బిస్కెట్లు తింటుంది, అది కూడా వేరే కుక్కలు తినటం చూసి. రెండవది - కరోనా భయంతో మా నాన్న మా ఇంట్లో ఎవరినీ గేటు కూడా దాటి బయటికి వెళ్ళనివ్వట్లేదు. ఆయనను కాదని నేను కుక్కకి ఆహారం పెట్టలేను. “నేను అనుకున్న సమయంలో ఆ కుక్క రాదు, వచ్చినా తినదు” అనుకుంటూ, బాబా చెప్పింది ఎలా చేయాలా అని సందిగ్ధంలో పడ్డాను. అయితే మనసులోనే బాబాను వేడుకున్నాను, “మా నాన్న సరుకులు తీసుకురావటానికి బయటికి వెళ్ళినపుడు ఆ కుక్కను పంపండి బాబా, దానికి ఎలాగోలా ఆహారం పెడతాను” అని. బాబా లీల కాకపోతే మరేంటి? బాబాను ప్రార్థించిన తరువాత, ప్రొద్దున ఇటువైపు అసలు రాని కుక్క ఆరోజు వచ్చింది. అది కూడా మా నాన్న ఇంట్లో లేని సమయంలో! ఎప్పుడు బిస్కెట్లు పెట్టినా తినదు, కానీ ఈరోజు బిస్కెట్ ప్యాకెట్ మొత్తం తినేసింది. అప్పటికింకా ఇంట్లో వంట చేయనందువల్ల దానికి బిస్కెట్లు మాత్రమే పెట్టాను. నా ఆరోగ్యం విషయంలో మానసికంగా ఎంతో కృంగిపోయిన నాకు బాబా ఇలా అభయమిచ్చారు. మా నాన్న ఇంట్లో లేని సమయంలో కుక్కని పంపమని నేను బాబాను అడిగిన సంగతే మర్చిపోయాను. కానీ ఆ తండ్రి దానిని నా కోసం పంపారు. నేను బాబా దయను అర్థం చేసుకోలేకపోయాను. అసలు నల్లకుక్క రావటమేంటి? దానికి ఆహారం పెట్టడమేంటి? మా నాన్న అందుకు ఒప్పుకోరని అనుకున్నానేగానీ, సలహా ఇచ్చిన బాబానే సహాయం కూడా చేస్తారని తెలుసుకోలేకపోయాను. ఇంక నేను బాధపడాల్సిన పనిలేదు. నా ఆరోగ్యాన్ని ఆ సాయివైద్యుడి చేతుల్లో పెట్టాను, ఆయనే కాపాడుతారు.
Om Sairam
ReplyDeleteSai always be with me
om sairam
ReplyDeleteJai sairam
ReplyDeleteOm Sairam🌻🌻🌷🌷🙏😊❤️
ReplyDeleteBaba meeru epudu ma pyna daya chuputharo ani edhuru chustuna thandri
ReplyDelete🌺🌸Om sri Sairam🌸🌺🙏🙏🙏🙏🙏
ReplyDeleteOm Sai Ram 🙏🌹🙏
ReplyDelete