సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 532వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

  1. ప్రార్థించినంతనే అనుగ్రహించే చల్లని తండ్రి శ్రీసాయి
  2. మొదటిరోజునే కరోనా భయం నుంచి బయటపడేసిన బాబా ఊదీ

ప్రార్థించినంతనే అనుగ్రహించే చల్లని తండ్రి శ్రీసాయి

పశ్చిమగోదావరి జిల్లా తణుకు నుండి శ్రీమతి లక్ష్మి తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు. 

నా పేరు లక్ష్మి. బాబా నాకు ప్రసాదించిన అనుభవాలను ఆనందంగా తోటి సాయిభక్తులతో పంచుకునే అవకాశం కల్పించిన 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ నిర్వాహకులకు నా కృతజ్ఞతలు.

మొదటి అనుభవం: 

ఉద్యోగరీత్యా నా భర్త సింగపూరులో ఉంటారు. ప్రతిరోజూ ఆయన మాతో ఫోన్లో మాట్లాడుతారు. జూలై 12న తన పుట్టినరోజు. ఆరోజు మాత్రం మేము ఫోన్ చేసినా, మెసేజ్ చేసినా కలవకపోవడం వల్ల తనకు ఏమైందోనని మాకు చాలా భయమేసింది. సాయి నామాన్ని తలచుకుంటూ, బాబాకు మా సమస్య చెప్పుకుంటూ ఎన్నిసార్లు ఫోన్ చేయటానికి ప్రయత్నించినా పరిస్థితిలో ఎలాంటి మార్పూ లేదు. అప్పుడు నేను బాబాకు నమస్కరించుకుని, “బాబా! ఉదయం 4 గంటల నుండి మావారికి ఫోన్ చేయాలని ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు మధ్యాహ్నం 3 గంటలైంది. త్వరగా నా భర్తనుండి ఫోన్ వచ్చేలా చేసి నా ఆందోళనను తగ్గించు బాబా! ఈ ఆందోళన తగ్గితే నా అనుభవాన్ని 'సాయి మహాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను” అని బాబాను వేడుకుని మళ్ళీ మావారికి ఫోన్ చేయాలని ప్రయత్నించాను. ఇంతలో ఆశ్చర్యంగా మావారి దగ్గరనుండి ఫోన్ వచ్చింది. తనతో మాట్లాడాక నా ఆందోళన పూర్తిగా పోయింది. ఈ ఆందోళన తగ్గితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటానని బాబాకు చెప్పిన వెంటనే మావారి నుంచి ఫోన్ రావటంతో నాకు చాలా చాలా ఆనందం వేసింది. మనసారా బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను.

రెండవ అనుభవం: 

ఇటీవల ఒకరోజు సాయంత్రం మా పాపకు ఉన్నట్టుండి తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. తను ఆ బాధను భరించలేకపోవడం చూసి, “బాబా! నా బిడ్డకు ఈ ఆరోగ్య సమస్యలు ఏమిటి? మందులు తేవడానికి నేను తప్ప ఇంట్లో ఎవరూ లేరు. ఈ కరోనా సమయంలో ఆడవాళ్లు బయటకు వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంటుంది బాబా!” అని బాబాకు చెప్పుకుని, “బాబా! నా బిడ్డకు కడుపునొప్పి తగ్గేలా అనుగ్రహించండి. మీ దయవల్ల పాపకు కడుపునొప్పి తగ్గినట్లయితే నేను ఈ అనుభవాన్ని సాటి సాయిభక్తులతో పంచుకుంటాను” అని బాబాను వేడుకుని మందులు తేవటానికి బజారుకు వెళ్ళాను. మందులు తీసుకుని ఇంటికి వచ్చేటప్పటికి మా పాప నవ్వుతూ ఎదురొచ్చి, “అమ్మా! నువ్వు మందులు తేవటం కోసం గేటు దాటిన వెంటనే ఆశ్చర్యంగా నా కడుపునొప్పి తగ్గిపోయింది” అని చెప్పింది. ఇదంతా ఖచ్చితంగా కేవలం సాయి మహిమ మాత్రమే! ప్రార్థించగానే ఇంత త్వరగా పాపకు కడుపునొప్పి తగ్గించినందుకు ఎంతో సంతోషంతో బాబాకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకున్నాను.

మూడవ అనుభవం: 

నాకు ఎప్పటినుంచో పంటి సమస్య ఉండేది. ఒకరోజు నా పన్ను సగం ఊడి మిగతా సగం ఊడి రాకుండా చాలా నొప్పిగా ఉంటుండేది. ఆ పంటినొప్పి వల్ల నేను ఇంట్లోని పనులు కూడా సరిగ్గా చేసుకోలేకపోయేదాన్ని. అంత నొప్పి కలిగేది. ఇలా 5 రోజులు గడిచింది. ఇక ఏమాత్రం నొప్పిని తట్టుకోలేక, “బాబా! ఈ పంటి సమస్య తగ్గితే నాకు కలిగిన మిగతా రెండు అనుభవాలతో పాటు దీన్ని కూడా బ్లాగులో పంచుకుంటాను” అని బాబాను వేడుకున్నాను. తరువాత నేను నా పని చేసుకోవడం మొదలుపెట్టాను. 15 నిమిషాల తరువాత నా నాలుక ఆ పంటికి తగిలి ఏమాత్రం నొప్పి లేకుండా ఆ పన్ను ఊడిపోయింది. “ఎల్లప్పుడూ మీ కరుణను మాపై చూపుతున్నందుకు మీకు అనంతకోటి ప్రణామాలు బాబా!”

మొదటిరోజునే కరోనా భయం నుంచి బయటపడేసిన బాబా ఊదీ

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

ఓం సాయిరామ్! కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల నేను నా పేరు వెల్లడించలేకపోతున్నాను. కరోనా అనే భయం నుంచి నన్ను బాబా ఊదీ ఎలా రక్షించిందో మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఆగస్టు మొదటివారంలో ఒకరోజు ఉదయం నేను చన్నీళ్ళతో తలస్నానం చేశాను. అప్పటినుంచి నాకు కాస్త నీరసంగా అనిపించింది. తరువాత జ్వరం కూడా వచ్చింది. సరిగ్గా అదేసమయంలో నా సహోద్యోగినికి కరోనా పాజిటివ్ వచ్చిందని తెలియటంతో నాకు వచ్చిన జ్వరం కూడా కరోనా అయివుంటుందేమో అని కాస్త భయమేసింది. నిజానికి కరోనా అనే విషయం గురించి నాకు భయంలేదు. కానీ, మేము ఉంటున్న ఊరిలో ఒక్క పాజిటివ్ కేసు కూడా లేదు. పైగా మా ఇంటి చుట్టుప్రక్కల చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఉన్నారు. నావల్ల వాళ్ళకేమైనా ఇబ్బంది అవుతుందని భయమేసింది. నాకు తెలిసిన ఒక డాక్టర్ని సంప్రదిస్తే, “నువ్వు కోవిడ్ పరీక్ష చేయించుకో! కానీ తెలిసీ తెలియక పరీక్ష చేయించుకొని అందరినీ ఇబ్బందిపెట్టకు. నీకు అనుమానం ఉంటే ఇంట్లో ఒంటరిగా (home isolation) ఉండు! టాబ్లెట్స్ వాడు! తరువాత టెస్ట్ చేయించుకో! కానీ, నువ్వు ఎవరితోనూ కలవకుండా ఉండాలి” అని చెప్పారు. నేను బాబాను ప్రార్థించి, “బాబా! మీ ఊదీనే ఔషధంగా వాడుతున్నాను. నాకు ఈ జ్వరం, నీరసం అన్నీ తగ్గిపోయేలా అనుగ్రహించండి” అని కోరుకుని, ప్రతిరోజూ బాబా ఊదీని తీసుకోవటం ప్రారంభించాను. ఒక్కరోజులోనే బాబా ఊదీ అద్భుత ప్రభావం చూపించింది. నాకు జ్వరం, నీరసం తగ్గిపోయాయి. బాబా అనుగ్రహం వల్ల మరెలాంటి ఇబ్బందీ లేకుండా నేను ఆరోగ్యంగా ఉన్నాను. కానీ 10 రోజుల పాటు ఇంట్లోనే ఉండి డాక్టర్ ఇచ్చిన మందులు వేసుకున్నాను. కేవలం బాబా ఊదీ నన్ను మొదటిరోజునే కరోనా అనే భయం నుంచి బయటపడేసింది. “థాంక్యూ బాబా! మీరు నిజంగా వైద్యులకే వైద్యులు! బాబా! అన్నింటితో విసిగిపోయాను. అన్నింటినీ కోల్పోయాను. నాకు ఇంక దేనిమీదా కోరిక లేదు. నాకు మీ మీద భక్తిని స్థిరంగా ఉండేలా చేసి నన్ను మీ దగ్గరకు చేర్చుకోండి బాబా!”.


6 comments:

  1. 🙏🌺🙏ఓం సాయిరాం🙏🌺🙏

    ReplyDelete
  2. Baba eroju ma babu karthikeeya birthday divinchandi baba meeru epudu mathone vundandi ani vedukuntunanu sai thandri

    ReplyDelete
  3. బాబా! అన్నింటితో విసిగిపోయాను. కొడుకుని కోల్పోయాను. నాకు ఇంక దేనిమీదా కోరిక లేదు. నాకు మీ మీద భక్తిని స్థిరంగా ఉండేలా చేసి నన్ను మీ దగ్గరకు చేర్చుకోండి బాబా!”

    ReplyDelete
  4. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo