- డిప్రెషన్లో కూరుకుపోకుండా కాపాడిన బాబా
- మా కుటుంబాన్ని చల్లగా ఆశీర్వదించారు బాబా
డిప్రెషన్‍లో కూరుకుపోకుండా కాపాడిన బాబా
సాయినాథ్ మహారాజ్‌కి, సాయిభక్తులకి నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు ధనలక్ష్మీ. నేను సాయిమహారాజ్ సన్నిధి బ్లాగులో పబ్లిష్ ప్రచురితమయ్యే సాయిభక్తుల అనుభవాలన్నీ ప్రతిరోజూ చదువుతూ ఎంతో ఆనందం పొందుతున్నాను. తోటి సాయిభక్తుల అనుభవాలు చదివాక నా అనుభవాన్ని కూడా ఈ బ్లాగు ద్వారా పంచుకోవాలని నాకనిపించింది. నాకు ఎంతో ఆనందంగా ఉంది.
నాకు సాయినాథ్ మహారాజ్‌తో ఎప్పటినుండో అనుబంధం ఉంది. 2020 నాటికి నాకు వివాహమై 17 సంవత్సరాలయింది. అంతకుముందునుండే నాకు సాయిబాబాతో చాలా అనుబంధం ఉంది. నా వివాహం కూడా సాయి మందిరంలోనే జరిగింది. అప్పటినుండి ప్రతి విషయంలోనూ బాబా నాకు రక్షణనిస్తూ వున్నారు. అయితే అప్పట్లో బాబా లీలలు నాకు అంతగా తెలియలేదు, అర్థం కాలేదు. వాటిని 2020లోనే అర్థం చేసుకోగలిగాను. ఆ సంవత్సరం ఆయన లీల నాకు చాలా స్పష్టంగా తెలిసి వచ్చింది.
2020, ప్రథమార్థంలో పెద్ద కష్టం వచ్చి నేను తట్టుకోలేకపోయాను. కొన్ని కారణాల వలన నా భర్త ఉద్యోగ జీవితంలో కొంత విరామం వచ్చింది. కొన్ని కుటుంబసమస్యలు కూడా వచ్చాయి. అవన్నీ మనసులో పెట్టుకొని, వాటి గురించి తీవ్రంగా ఆలోచిస్తూ దాదాపు డిప్రెషన్లోకి వెళ్లిపోయే స్థితికి చేరుకున్నాను. ఆ స్థితిలో సాయిబాబా ఒక్కరే నా సమస్యలకు పరిష్కారం చూపిస్తారనిపించి, నా సమస్యలన్నింటినీ బాబాకు చెప్పుకొని, "నాకు ఒక దారి చూపమ"ని కన్నీళ్లతో బాబాను వేడుకున్నాను. మరుసటిరోజు మా బంధువు ఒకరు నాకు ఫోన్ చేసి, "మా ఇంట్లో ధ్యాన తరగతులు మొదలుపెట్టాము. తరగతులు మొదలై ఐదురోజులు అవుతోంది. నువ్వు కూడా రా" అని చెప్పారు. నేను వెంటనే వెళ్లి ధ్యాన తరగతులలో చేరాను. వాళ్ళు తక్షణమే ధ్యానం ఎలా చేయాలో చెప్పారు. మొదటిరోజే అయినా నాకు ధ్యానం చాలా బాగా కుదిరింది. అంత బాగా ధ్యానం చేయగలుగుతానని నేను అస్సలు అనుకోలేదు. ధ్యానం పూర్తయ్యాక టీవీలో "సాయిబాబా ఏకాదశ సూత్రాలు" పెట్టారు. అవి విన్నాక ‘సాయిబాబానే నన్నిక్కడికి తీసుకొచ్చారు’ అని అర్థం అయింది. అప్పటినుండి 70 రోజుల పాటు ధ్యాన తరగతులకు వెళ్ళాను. బాబా నా సమస్యలను ఒక్కొక్కటీ పరిష్కరిస్తూ నన్ను నడిపించారు. నన్ను, నా కుటుంబాన్ని ఆయన దగ్గరుండి కనిపెట్టుకున్నారు. నాలోనే ఉంటూ నన్ను ధైర్యంగా ముందుకు నడిపించారు. సరైన సమయంలో నాకు మార్గనిర్దేశం చేసి, డిప్రెషన్లో కురుకుపోకుండా నన్ను బయటకు తీసుకొచ్చి కాపాడారు బాబా. "బాబా! మీకు చాలా చాలా కృతజ్ఞతలు". బాబా లీలలు ఎన్నని చెప్పను? చాలా అనుభవాలు ఉన్నాయి.
కుటుంబాన్ని చల్లగా ఆశీర్వదించిన బాబా
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి. సద్గురు సాయినాథుని దివ్య చరణకమలాలకు నా నమస్కారాలు. 2019వ సంవత్సరం ఆరంభంలో ఒక లింక్ ద్వారా నేను 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ వారి వాట్సాప్ గ్రూపులో చేరాను. గ్రూపులో వచ్చే తోటి భక్తుల అనుభవాల ద్వారా మరియు బాబా సశరీరులై ఉన్నప్పుడు వారితో మెలిగిన సన్నిహిత భక్తుల అనుభవాల ద్వారా ఇంకా ఇంకా ఎక్కువగా బాబా గురించి తెలుసుకునే అవకాశాన్ని కల్పించిన బాబాకు చాలా చాలా కృతజ్ఞతలు. నేనిప్పుడు నాకు 2020లో జరిగిన ఒక చిన్న అనుభవాన్ని బ్లాగ్ ద్వారా తోటి భక్తులతో పంచుకుంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.
నేను మహాపారాయణ గ్రూపులోని సభ్యురాలిని. ఊహ తెలిసినప్పటినుండి నేను బాబా భక్తురాలిని. ఏ సమస్య వచ్చినా నేను బాబాకు చెప్పుకొని పారాయణ చేస్తాను. బాబా కూడా ప్రేమతో నా సమస్యలకు పరిష్కారం చూపుతుంటారు. 2020లో అప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో చిన్నగా జ్వరం వచ్చినా చాలా కంగారుపడాల్సి వస్తుండేది. అలాంటి సమయంలో మావారికి జ్వరం వచ్చింది. కరోనా పరీక్ష చేయించమని స్నేహితులు సలహా ఇచ్చారు. మేము చాలా కంగారుపడ్డాము. నేను, "బాబా! మావారికి కరోనా కాకుండా మాములు జ్వరమే అని రిపోర్టు రావాలి. నాలుగురోజుల్లో ఆయన ఆరోగ్యం బాగై మామూలుగా ఉండేలా అనుగ్రహించండి" అని బాబాను వేడుకున్నాను. దయతో బాబా పెద్దగండం నుంచి గట్టెక్కించి చిన్నగా తగ్గిపోయేలా చేసి మా కుటుంబాన్ని ఆశీర్వదించారు. సాయినాథునికి నా కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు.
