సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

భక్తుల బాధలు తానే భరించే భక్తవత్సలుడు


బద్వేల్ నుండి సాయి కార్తీక్ గారు తమ అనుభవాన్ని ఇలా తెలియజేస్తున్నారు.

సాయిరామ్ సార్,
ఈవిధంగా మీరు సాయిభక్తుల అనుభవాలను షేర్ చేయడం చాలా బాగుంది. ఒక రకంగా మీరు చాలా అదృష్టవంతులు అని చెప్పాలి, ఎందుకంటే నిత్యం శ్రీ సాయిబాబా వారి లీలావిలాసంలో మునుగుతున్నారు. మీరు ఆ లీలావిలాసంలో మమ్మల్ని కూడా ముంచుతున్నారు. ఆవిధంగా మేము కూడా అదృష్టవంతులము సార్.

అందుకు మీకు కృతజ్ఞతలు సాయి.

శ్రీ సాయిబాబా వారి నుంచి ప్రతి ఒక్కరం ఏదో ఒక విధంగా రక్షణ పొందినవారమే... ఒక సందర్భంలో బాబా మా కుటుంబం పైన చూపిన కరుణను నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నాను.

కొన్ని సంవత్సరాల క్రితం మా అమ్మగారికి ఆరోగ్యం బాగాలేకుండా ఉంటే ఆసుపత్రికి వెళ్లారు. కడుపులో ప్రేగు పొక్కినట్లు వుందని, ఆపరేషన్ చేయాలని అన్నారు వైద్యులు. అమ్మ భయపడిపోయింది. అయినా సరే ఆపరేషన్ తప్పనిసరిగా చేయాలని చెప్పారు. డాక్టర్ గారు బ్లడ్ టెస్ట్ చేసి, "రక్తం తక్కువగా వుంది, ఒక నెలరోజులకు మందులు వ్రాసి ఇస్తాను, వాడండి. దానితో రక్తం వృద్ధి చెందుతుంది. తరువాత ఆపరేషన్ చేస్తాను" అని అన్నారు. సరే అని ఇంటికి వచ్చాము. నెల గడిచాక ఆపరేషన్ కోసం హాస్పిటల్ కు బయలుదేరుతూ బాబా వారి దగ్గరకు వెళ్లి, “ఆపరేషన్ కు వెళ్తున్నాం, అంతా మీరే చూసుకోవాలి బాబా!” అని చెప్పి కడప ఆసుపత్రికి వెళ్ళాం.  డాక్టర్ పరీక్షించి, "రక్తం బాగా వృద్ధి అయింది. ఈ రోజు సాయంత్రం ఆపరేషన్ చేస్తాము, అందుకు సిద్ధంగా వుండండి" అని అన్నారు. సరే అని చెప్పాము. ఇంతలో హఠాత్తుగా మా బంధువులలో ఒకామె వచ్చి, నాకు బాగా తెలిసిన వేరే డాక్టర్ వున్నారు, ఆమెకు కూడా ఒకసారి చూపిద్దామని బలవంతంగా ఆ డాక్టర్ వద్దకు తీసుకొని పోయింది. అక్కడికి వెళ్ళాక ఆ డాక్టర్ పరీక్షించి, "దీనికి ఆపరేషన్ అవసరం లేదు, ఇది టాబ్లెట్స్ తో తగ్గుతుంది" అన్నారు. ఇంక సరే అని ఆపరేషన్ చేయించుకోకుండా తిరిగి ఇంటికి వచ్చేశాం. అంతా బాబాగారే చూసుకుంటారులే అని వదిలివేసాం. అప్పటినుండి చాలా రోజుల వరకు అమ్మకు ఈ సమస్య లేకుండా బాగానే ఉంది. 

కాని 9, 10 సంవత్సరాల తరువాత మరలా అదే సమస్య వచ్చింది. అప్పటికి, ఇప్పటికి పరిస్థితులు ఎంతగానో మారాయి. అసలే అమ్మకు భయం. ఇప్పుడున్న పరిస్థితిలో ఆపరేషన్ అంటే చాలా కష్టం అవుతుంది అని ఆసుపత్రికి వెళ్ళడానికి ముందు బాబాతో, “అమ్మకు ఏమీ ప్రాబ్లం లేదని డాక్టర్ చెప్పేలా చేయండి” అని ప్రార్ధించాను. తరువాత నేను, అమ్మ మాత్రమే హాస్పిటల్ కి వెళ్ళాం. అమ్మకు పాత సమస్యే మరలా వచ్చిందని అనుమానం ఎక్కువగా వుండటంతో నేను X-ray తీయమని డాక్టర్ ను అడిగాను. ఆమె, "సరే తీయించండి" అన్నారు. X-ray తీయించిన తరువాత X-ray తీసిన అతనిని, "ఏమైనా ప్రాబ్లం ఉందా?" అని అడిగాను. అతను చెప్పడానికి అంగీకరించక, డాక్టర్ గారు చెప్తారన్నాడు. ఏమీ పర్వాలేదు, చెప్పండి అని అతనిని రిక్వెస్ట్ చేయగా, అతను, ప్రేగు కొంత పొక్కిందని, X-ray లో ఆ స్పాట్ చూపించారు. కడుపు ఎడమవైపు భాగంలో కొంత పొక్కినట్లు స్పష్టంగా కనిపించింది. నాకు చాలా భయం వేసింది. ఈ విషయం అమ్మకు తెలిస్తే ఆమె ఇంకా భయపడిపోతుందని, నాకు ఇంక ఏమి చేయాలో అర్థంకాక బాబాతో, “బాబా! డాక్టర్ అమ్మకు ఈ విషయం చెప్పకుండా, ఏమీ లేదని చెప్పేటట్లు చూడండి” అని మరల బాబాని ప్రార్ధించాను. డాక్టర్ గారి దగ్గరికి వెళ్లి X-ray చూపించాం. ఆశ్చర్యంగా ఆమె, ‘ఏమీలేదు ఈమెకు' అని చెప్పి, బలానికి టాబ్లెట్లు రాసి ఇచ్చారు. అమ్మ అప్పటికి కొంత శాంతించింది. నాకు పూర్తిగా అర్థం కాలేదు.

నిజంగా ఏమీ లేదా?
X-ray అతను తప్పు చెప్పాడా?
బాబా అలా చెప్పించారా? అని అర్థంకాక, నేను ఆ రిపోర్ట్ తీసుకొని వెళ్లి వేరే వాళ్ళను అడిగాను. వాళ్ళు కూడా ప్రేగు కొంత పొక్కిందని అన్నారు.

నేను బాబాతో, “అయ్యా! ఇప్పుడున్న పరిస్థితిలో ఈ విషయం అమ్మకు తెలిస్తే చాలా బాధపడుతుంది, కాబట్టి మీరే ఏదో ఒకటి చేయాలి. మీరు ఏమి చేస్తారో ఏమో నాకు తెలియదు. మీరే ఈ అనారోగ్యాన్ని తీసివేయాలి. అమ్మ సంగతి  మీరే చూసుకోవాలి. ఈభాధ్యత పూర్తిగా మీదే, నాకు తెలియదు” అని చెప్పేశాను. మరలా అమ్మకు బాగాలేకుంటే వేరే స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరకు వెళ్ళాం. అతను కూడా ఏమీ లేదని చెప్పారు.

ఆ తరువాత 15 రోజుల లోపలే ఒక అద్భుతం జరిగింది. మా ఇంట్లో గురువారం అమ్మ బాబా విగ్రహాన్ని నీళ్ళతో కడుగుతున్న సమయంలో బాబా కడుపు ఎడమ వైపు భాగంలో కొంత రంధ్రం పడి ఉండటం గమనించి, తనకి ఏమీ అర్థంకాక, ఆ విషయం నాకు చెప్పింది. బాబాగారి విగ్రహం చూస్తూనే నాకు గుర్తు వచ్చింది, అమ్మ X-ray లో ఏ భాగంలో అయితే స్పాట్ ఉందో, సరిగ్గా బాబా కడుపుపై అదే భాగంలో రంధ్రం వుంది. వెంటనే, 'అమ్మకు ఉన్న కర్మను బాబా స్వీకరించారు' అనే విషయం నాకు అర్థమైంది. నేను ఈ విధంగా భావించినా, నా భావన సరైనదా! కాదా! అని సతమతమవుతూ, అదే విషయం బాబానే అడిగాను. బాబా నుండి, 'నీ భావన నిజమైనదే!' అని సమాధానం వచ్చింది. అప్పటినుంచి అమ్మ ఆరోగ్యం నెమ్మదిగా కుదుటపడటం జరిగింది.

బాబానే నమ్ముకున్నాను


నా పేరు బుజ్జి. నాకు మొదటినుండి దేవుడంటే పెద్దగా నమ్మకమే ఉండేది కాదు. అలాంటి నేను బాబాకి ఎలా దగ్గర అయ్యానో చెప్పలేను గాని, గత 7 సంవత్సరాలుగా బాబానే అంటిపెట్టుకొని ఆయన పట్ల దృఢమైన నమ్మకంతో ఉన్నాను. రీసెంట్ గా జరిగిన ఒక అనుభవాన్ని ఇప్పుడు నేను మీతో పంచుకుంటాను.

సాఫ్ట్ వేర్ జాబు అంటే నాకు చాలా ఇష్టం. ఆ ఇష్టం వలన 2015, డిసెంబర్ లో నేను ఒక చిన్న సాఫ్ట్ వేర్ కంపెనీలో జాయిన్ అయ్యి నా కెరియర్ మొదలు పెట్టాను. అది చాలా చిన్న కంపెనీ కావడంతో జీతం తక్కువగా ఉండేది, కానీ అక్కడ పనిచేసే వాతావరణం బాగానే ఉండేది. అక్కడ పనిచేస్తున్న సమయంలోనే నేను ఒక అమ్మాయిని ప్రాణంగా ప్రేమించాను. కొన్ని పరిస్థితుల వలన ముందుగా ఏ జాబూ చూసుకోకుండా 2018, జనవరిలో నేను అకస్మాత్తుగా ఆ జాబుకి రిజైన్ చేశాను. మా కుటుంబానికి ఉన్న కొన్ని ఆర్ధికపరమైన ఇబ్బందుల వలన అకస్మాత్తుగా నేను తీసుకున్న ఈ నిర్ణయంతో నాకు చాలా భయం వేసింది. "బాబా! నాకు జాబ్ ఎంతో అవసరం. ప్లీజ్.. నాకు త్వరగా జాబు వచ్చేలా అనుగ్రహించండి" అని వేడుకున్నాను. అలా వేడుకున్న మరుసటి రోజే నాకు రెండు పెద్ద MNC కంపెనీల నుండి కాల్స్ మరియు ఒక MNC కంపెనీ నుండి మెయిల్ వచ్చాయి. ఇటువంటి పెద్ద MNC కంపెనీలలో జాబు కోసం సాఫ్ట్ వేర్ ఇంజనీర్స్ అందరూ కలలుకంటూ ఉంటారు. బాబా దయవలన వాటిలో రెండు MNC కంపెనీలలో సెలెక్ట్ అయ్యాను. మా కుటుంబ సభ్యులు, మా బంధువులు అంతా చాలా సంతోషించారు. నాకు కూడా సంతోషమే కాని, నేను ఉన్న సిటీలో కాకుండా బెంగళూరులో జాబు వచ్చింది. అదే నా సమస్యంతా. కారణం నేను ప్రేమించిన అమ్మాయిని వదిలి దూరంగా వెళ్లి ఉండలేను. ఇక్కడే ఉంటే బాబా దయతో ఏదో ఒకరోజు తను నా ప్రేమని అర్ధం చేసుకుంటుందని ఒక ఆశ. అప్పటికీ ఇక్కడే జాబు లొకేషన్ కావాలని అడిగాను. కాని సాధ్యపడలేదు.

ఇక తప్పనిసరై బెంగళూరు వెళ్లి జాబులో జాయిన్ అయ్యాను. మొదటిరోజు చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇక అక్కడ నుండి మొదలయ్యాయి సమస్యలు. అస్సలు అక్కడ ఉండలేకపోయాను. బాధ తట్టుకోలేక ఏడ్చాను. జాబ్ వదిలేసి వచ్చేద్దానుకున్నాను కాని, ఫ్యామిలీ గుర్తుకు వచ్చి ఆగిపోయాను. HRని కలిసి నన్ను ట్రాన్స్ఫర్ చేయమని అడిగాను. కుదరదన్నారు. ఆరోగ్యం పాడైపోయింది. అయినా కూడా ట్రాన్స్ఫర్ చేయడం కుదరదన్నారు. ఇక చివరిగా, "ఏప్రిల్ నెలాఖరుకల్లా నేను హైదరాబాదులో ఉండేలా చేయండి బాబా!" అని సాయిబాబాని గట్టిగా అడిగాను. అంతే! బాబా ఏమి అద్భుతం చేశారో ఏమో గానీ, 2018, ఏప్రిల్ 14న ప్రాజెక్ట్ పని మీద నేను హైదరాబాద్ వెళ్ళాలి అన్నారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే నేను ఇదివరకు హైదరాబాదులోనే ఉన్నది. బాబా నన్ను అనుగ్రహించారు. నాకు హైదరాబాదుకు పెర్మినెంట్ గా ట్రాన్స్ఫర్ కూడా చేశారు. ఏప్రిల్ 27న బెంగళూరు నుండి వచ్చి హైదరాబాదులో జాయిన్ అయ్యాను.

బాబాని నేను ఎంతలా వేడుకున్నానో, బెంగళూరులో ఎంత నరకం అనుభవించానో బాబాకే తెలుసు. అప్పటికే నేను మానసికంగా చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. అటువంటి పరిస్థితి నుండి బాబా నన్ను ప్రేమతో బయటపడేసారు. ఆయన దయే లేకుంటే నాకు ట్రాన్స్ఫర్ అయ్యేదే కాదు. ఎందుకంటే సాధారణంగా జాయిన్ అయిన లొకేషన్ లో రెండు సంవత్సరాలు వర్క్ చేస్తేనే ట్రాన్స్ఫర్ అవుతుంది. కానీ నాకు కేవలం జాయిన్ అయిన 40 రోజులలోనే నేను కోరుకున్న చోటుకి ట్రాన్స్ఫర్ అయ్యింది. బెంగళూరులో ఆఫీసులోని సీనియర్స్, నా సహోద్యోగులు ఇంత త్వరగా ట్రాన్స్ఫర్ అవ్వడం అసాధ్యం అన్నారు. వాళ్ళు చెప్పింది కూడా నిజమే. కానీ నాకు బాబా పట్ల గట్టి నమ్మకం ఉంది, ఆయన తన భక్తుల కోసం అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తారని. ఆ నమ్మకమే నన్ను కాపాడింది. ఇదే నమ్మకం, భక్తి ఎప్పటికీ బాబా పట్ల ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాగే నా ప్రేమని కూడా బాబా గెలిపిస్తారని ఆశిస్తున్నాను. వచ్చే నెల నాన్నకి ఐ సర్జరీ ఉంది, అందుకోసం కావలసిన లోన్ కూడా బాబా అనుగ్రహించారు.ర్జరీ కూడా బాగా జరగాలని బాబాని వేడుకుంటున్నాను.

రీసెంట్ గా షిరిడీ వెళ్లి బాబాని దర్శనం చేసుకున్నాను. దూరం నుండి బాబాని చూడగానే మనసు పులకరించి పోయింది. చాలా చాలా ప్రశాంతంగా అనిపించింది. త్వరలో బాబా నా ప్రేమని గెలిపించాక తనతో, మా ఫ్యామిలీతో షిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకోవాలని నా ఆశ. నేను ప్రేమించిన అమ్మాయి, నా ఫ్యామిలీ, బాబాపై దృఢమైన భక్తి విశ్వాసాలు నాకు ఉంటే అంతే చాలు. ఇంతకన్నా లైఫ్ లో ఇంకేమీ వద్దు. ఎప్పటికీ వాళ్ళు తోడుగా ఉంటే చాలు, వాళ్ళని ప్రాణంగా చూసుకుంటాను. 

మనం ఏమీ చేయనవసరం లేదు, బాబాని నిజాయితీగా నమ్ముకుంటే చాలు, అన్నీ ఆయనే చూసుకుంటారు.

ఓం సాయిరామ్.
బుజ్జి.

బాబా మూడు తలలతో మూడు కిరీటాలతో స్పష్టంగా కనిపిస్తున్నారు


నా పేరు పీసపాటి వెంకట రమణి, మా అమ్మ గారి పేరు పీసపాటి వెంకట సత్యవతి. మాది కోడూరు. మాకు బాబా ప్రసాదించిన ఒక అనుభవాన్ని సాయి బంధువులతో పంచుకొనే అవకాశం ఇచ్చిన బాబా వారికీ నా నమస్కారములు తెలియజేసుకుంటున్నాను.

2009వ సంవత్సరంలో నేను, మా అమ్మ, నాన్న, మా ఫ్రెండ్ పూర్ణ గారు కలిసి ముందు గాణ్గాపురంలో నృసింహ సరస్వతి స్వామిని దర్శంచి షిరిడి పోవాలని గాణ్గాపురం వెళ్లి దర్శనం చేసుకున్నాం. ఔదుంబర వృక్షానికి ప్రదక్షిణ చేస్తూ ఉన్నప్పుడు నాకు ఒక సందేహం కలిగింది. బాబా దత్తావతారం కదా! శ్రీపాద వల్లభులకు నృసంహ సరస్వతికి 3 తలలున్నపుడు బాబాకు మూడు తలలు ఎక్కడా చూడలేదు. ఏమిటి బాబా? నాకు మూడు తలలతో దర్శనం ఇస్తే నా సందేహం తీరుతుంది అని మనసులో అనుకున్నాను. ఈ విషయం ఎవరితో బయటకు చెప్పలేదు సరికదా ప్రయాణంలో నేను కూడా మరచిపోయాను. తర్వాత అక్కడ ఒక అవధూత దర్శనం జరిగింది. తర్వాత షిరిడి చేరాక రూమ్ లో దిగి స్నానాలు కానిచ్చి ముందు ఊరంతా తిరిగి చూశాం. ఎందుకంటే మా నాన్న, అమ్మ గారికి హిందీ రాదు. కొన్ని చోట్లు చెప్పి తప్పిపోతే అక్కడకు రమ్మని చెప్పాను. మా దగ్గర ఫోన్స్ లేవు. సాయంత్రం దర్శనం కోసం వెళ్ళాము. ముందు ద్వారకామాయి దర్శించుకుని ద్వారకామాయిలో నుండి సమాధి మందిరంలోకి తలుపు ఉంది,  అది తెరచి వుంది. అందులోంచి అందరూ వెళ్తుంటే మేము కూడా వెళ్ళాము. అక్కడ ఒక స్టేజ్ వుంది. దానిపై చాలా మంది కూర్చుని బాబాను తన్మయత్వంతో చూస్తున్నారు. దగ్గరకు వెళ్ళి దర్శించుకుందామంటే పార్టిషన్ వుంది క్యూలో రండి అన్నారు. సరే క్యూలో రావాలంటే చాలా దూరం పోవాలి. రేపు పోదాం. ఈరోజుకు ఇక్కడ కూర్చొని ధ్యానం చేద్దామని అని ఆ స్టేజి మీద కూర్చొని ధ్యానం చేస్తున్నాం. 30నిమషాల తర్వాత మా అమ్మగారు కళ్ళు తెరచి బాబానే చూస్తూ నేనెప్పుడు కళ్ళు తెరుస్తానా అని ఆతృతగా యెదురు చూస్తున్నారు. ఇంకో 30నిమషాల తర్వాత నేను కళ్ళు తెరిచాను. షాక్ శరీరానికి కరెంట్ షాక్ కొట్టినట్లైంది. బాబా విగ్రహం వెనుక గోడపై బాబా మూడు తలలతో మూడు కిరీటాలతో స్పష్టంగా కనిపిస్తున్నారు. అక్కడ అలా చెక్కారేమో నా సందేహం తీరిపోయింది అనుకున్నాను. మా అమ్మగారు నన్ను ప్రశ్నించారు. బాబా వెనుక గోడ మీద నీకేమైనా కనిపిస్తోందా అని.  షిరిడికి వచ్చిన మా బంధువులు మమ్మల్ని అక్కడ కలిశారు. వారు మా మాటలు విని అక్కడ ఏమీ లేదు మీరేంటి మూడు తలలున్న బాబా అంటున్నారు అని అడిగారు. మళ్ళీ గోడపై చూశాం. మాకు మాత్రం స్పష్టంగా మూడు తలలు మూడు కిరీటాలతో అలాగే కనిపిస్తోంది. చాలా తర్జన భర్జనల తర్వాత క్యూలో వెళ్ళి దగ్గర నుండి దర్శించి తేల్చుకుందాం అని క్యూలో వెళ్ళాం. మేము దగ్గరగా వెళ్ళేప్పటికి ఆఖరి హారతి మొదలుపెట్టారు. మా దృష్టి బాబా పైన లేదు. ఆయన వెనుక గోడపై వుంది. ఆశ్చర్యం అక్కడ బాబా ఆకారం లీలామాత్రంగా కూడా లేదు. మాకు అప్పటికి అర్ధమైంది. నేనడిగిన ప్రశ్నకు దివ్య దర్శనం బాబా అనుగరహించారని. ఆనందం తట్టుకోలేక నాకు జ్వరం వచ్చేసింది. అప్పటిదాకా ఏ పుట్టలో యే పాముందో అనుకునే మా అమ్మ పూర్తిగా బాబా భక్తురాలైపోయారు.


బాబాయే నాకు అన్నీ


     
సాయిబంధువు కల్పన గారు తన అనుభవాలని మనతో ఇలా పంచుకుంటున్నారు.

నేను బాబా భక్తురాలిని. ఇంతకంటే గొప్పగా నా గురించి పరిచయం చేసుకోలేనేమో. నాకు సాయితో చాలా అనుభవాలు ఉన్నాయి. వాటిలో రెండు సాయి లీలలను ఇక్కడ  మీతో పంచుకుంటున్నాను.

నా మొదటి అనుభవం :
            2013వ సంవత్సరంలో నాకు వరుసగా మూడుసార్లు గర్భస్రావం జరిగింది. దానితో నేను శారీరకంగా బలహీనంగా అయిపోవడమే కాకుండా మానసికంగా చాలా కృంగిపోయాను. బయట ఎక్కడ పిల్లల్ని చూసినా నాకు తెలీకుండానే  ఏడుపు వచ్చేసేది. నాకు ఎందుకు ఇలా జరుగుతుంది? అని నా మదిలో చాలా ప్రశ్నలు మెదిలేవి. "ఎందుకు బాబా, నేనేం చేసాను, నన్ను ఇంతలా శిక్షిస్తున్నావ్?" అని సాయిని తరచూ అడిగేదాన్ని; కానీ ఎప్పుడు సమయం దొరికినా సచ్చరిత్ర పారాయణ చేసేదాన్ని.

          నవంబర్ లో నేను మళ్ళీ గర్భం దాల్చాను. అప్పుడు బాబా నన్ను మా పుట్టింటికి వెళ్లి, అక్కడే డాక్టర్ కి చూపించుకోమని చెప్పారు. నేను బాబా చెప్పినట్లుగానే చేశాను. ఆ డాక్టర్ కి 80 సంవత్సరాల వయస్సు ఉంటుంది. ఆయనని చూస్తే నన్ను, నా బిడ్డని చూసుకోవడానికి బాబానే స్వయంగా వచ్చారా అనిపించేది. డాక్టర్ ఇచ్చిన సలహాలు అన్నీ జాగ్రత్తగా పాటించేదాన్ని. ఆయన 9నెలలపాటు పూర్తి బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు. అందువలన నాకు ఉన్న ఒకే ఒక్క పని - రోజూ సచ్చరిత్ర పారాయణం చేయడం. అలానే డెలివరీ అయ్యే లోపల నేను 36 సార్లు పారాయణ చేసాను. కాని ఈసారైనా నా బిడ్డ క్షేమంగా బయటకు వస్తుందా, ఏమైనా అవంతుందా? అని పలురకాల ఆలోచనలతో చాలా ఆందోళనగా ఉండేది. కానీ బాబా నాకు ఎప్పుడూ కలలో కనిపించి మాట్లాడేవారు. ఒకసారి కలలో, బాబా నాకు తమ చేతులతో బిడ్డను ఇస్తున్నారు. అప్పటి బాబా భంగిమ నా కళ్ళలో ఇప్పటికీ కదలాడుతుంది. నా డెలివరీ చాలా సునాయాసంగా, బాబా ముందే కుదిర్చినట్టే అయిపోయింది.

       ఆగష్టు 13వ తేదీన గర్భంలో కొంచెం ఎక్కువగా కదలికలు తెలిసాయి, కానీ నాకు నొప్పి ఏమీ లేదు. ఎందుకైనా మంచిదని డాక్టర్ ని కలిసాము. స్కాన్ తీసి, బేబీ మెడకి బొడ్డు తాడు చుట్టుకొని ఉందని, ఆలస్యం చేస్తే బిడ్డకి ప్రమాదం అని చెప్పారు. అందువలన వెంటనే హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాను. మరుసటి రోజు ఆగష్టు 14, 2014 గురువారం ఉదయం గం. 9.04ని.లకి పాప పుట్టింది. ఇదంతా జరిగిన 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వ్రాస్తుంటే నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. బాబాయే నన్ను తొమ్మిది నెలలు జాగ్రత్తగా చూసుకుంటూ, డెలివరీకి కాస్త టైం ఉన్నప్పటికీ, లోపల బేబీకి ఉన్న సమస్య గురించి ముందుగా సూచించి, తగిన సమయంలో నాకు పాపని ఇచ్చి నా బాధను దూరం చేసేసారు. బాబా అటువంటి అద్భుతమైన దైవం. అప్పుడు బాబా లేకుంటే నాకు, నా బిడ్డకి ఏమయ్యేదో నేను అసలు ఊహించలేను కూడా. బాబాయే మాకు అన్నీ. అందుకే మా పాపకి “ధన్వి సహస్ర సాయి” అని పేరు పెట్టుకున్నాము. సాయికి కృతజ్ఞతగా పాపని “సాయి” అని పిలుచుకుంటాము. ఇంతకన్నా మనము ఏమి ఇచ్చి సాయి ఋణం తీర్చుకోగలము?

నా రెండవ అనుభవం :
         2016 జూలైలో నేను మళ్ళీ గర్భవతిని అయ్యాను. మొదటి మూడు నెలలు బాగానే ఉన్నా తరువాత ఒకరోజు ఒక్కసారిగా పొత్తి కడుపులో చాలా ఎక్కువగా నొప్పి  వచ్చింది. డాక్టర్ దగ్గరకి వెళ్తే ఇదివరకు మూడుసార్లు గర్భస్రావం జరగడం వలన గర్భసంచి పొర మందం బాగా తగ్గిపోయిందని, కాబట్టి ఏడవ నెల దాక కొనసాగించి, అటు పిమ్మట కష్టం అని చెప్పారు. ఆ సమయంలో మాత్రమే బేబీని జాగ్రత్తగా బయటకు తీయగలం అని చెప్పారు. ఆ లోగా ఏదైనా జరగరానిది జరిగితే తల్లిని కాపాడటం కష్టం అని చెప్పారు. అటువంటి దుర్బరమైన పరిస్థితిలో నేను సాయిపై పూర్తి నమ్మకంతో భారమంతా ఆయనపై వేసాను. ఇంటి నుండే ఆఫీస్ వర్క్ చూసుకుంటూ, ఇంటి పనులు కూడా చూసుకుంటూ రోజుకు సత్చరిత్రలో ఒక అధ్యాయం పారాయణ చేసేదాన్ని. 7వ నెల వచ్చేసరికి గర్భసంచి మందం కొంచెం పెరిగింది, కానీ ఇంకా రెస్ట్ ఉండాలని చెప్పారు. ఇంక ఆఫీస్ కి లీవ్ పెట్టి, ముందులాగే సత్చరిత్ర పారాయణ ప్రారంభించాను. ఈసారి 6 సార్లు పారాయణ పూర్తి చేయగలిగాను.


             బాబు రూపంలో బాబాని చూసుకోవాలని ఈసారి నాకు బాబు కావాలని బాబాని అడిగాను. ఆరోజు రానే వచ్చింది, నేను కోరినట్లుగానే నాకు బాబు పుట్టాడు. కానీ బాబుకి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందని వేరే ఇంకొక చిన్న పిల్లల హాస్పిటల్ లో అడ్మిట్ చేసారు. నేను ఒక హాస్పిటల్లో, నా బాబు ఇంకో హాస్పిటల్లో, వాడికి పాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. డెలివరీ అయిన వెంటనే మత్తు వల్ల నేను బాబుని సరిగా చూడను కూడా చూడలేదు అని చాలా ఏడ్చాను. అలా మూడు రోజులు నరకం చూసాను. అప్పుడు నేను పడిన వేదన సాయికి మాత్రమే తెలుసు. నాకు ఉన్న ఒక్క ఆశల్లా - సాయిని తల్చుకోడం, సాయీ! నా బిడ్డని కాపాడు! అని ప్రార్ధించడం. ఇంతటి ఘోరమైన పరిస్థితుల్లో సాయి నన్ను ఎప్పుడూ ఒంటరిగా వదలనే లేదు. నాకు తోడుగానే ఉన్నారు. జీవితంలో ప్రతిక్షణం సాయి నాతోనే ఉన్నారు. నా ప్రతి కదలిక సాయి వల్లనే అని దృఢంగా విశ్వసిస్తున్నాను.  అందుకే బాబాయే నాకు అన్నీ. సాయికి కృతజ్ఞతగా మా  బాబుకి “ధార్మిక్ శబరి సాయిరామ్“ అని పేరు పెట్టుకున్నాం. అంతకంటే మనము ఏమి ఇవ్వగలము? 'సాయి' 'సాయి' 'సాయి' అని జపించడం తప్ప.

వివాహాలలో సాయిబాబా సహాయం


వివాహాలలో సాయిబాబా సహాయం గురించి శ్రీ బి.వి.నరసింహస్వామి గారు చెప్పిన కొన్ని లీలలు

వివాహ విషయమై ఒక అబ్బాయికి సరైన అమ్మాయిని లేదా ఒక అమ్మాయికి సరైన అబ్బాయిని వెతకడం ఒక పెద్ద సమస్య. ఈ విషయంలో బాబా చేసిన సహాయానికి సంబంధించిన కొన్ని లీలలు.

1. కోలాబా (ముంబై)కి చెందిన జి.డి. పండిట్ తన కుమార్తెకు తగిన వరుడి కోసం ఎంతగానో వెతికాడు గాని, ఒక మంచి పెళ్ళికొడుకుని గుర్తించలేక పోయాడు. పదిహేను రోజులలో తగిన వరుడు దొరికితే షిర్డీ వస్తానని అతను మ్రోక్కుకున్నాడు. తరువాత హైదరాబాద్ నుండి, పండిట్ ఇంటికి ఒక యువకుడు స్వయంగా వచ్చి, అతని కుమార్తెను పదిహేను రోజులలోనే వివాహం చేసుకున్నాడు.

2. బాబా భక్తుడైన గణేష్ కేశవ్ రేగే(జి. కె. రేగే)కు అనేకమంది కుమార్తెలు ఉన్నారు. ముగ్గురు కుమార్తెల పెళ్లి విషయంలో విజయం సాధించాడు. కానీ నాల్గవ కుమార్తె విషయంలో ఎన్ని సంబంధాలు చూసినప్పటికీ సరియైన అబ్బాయిని కనుగొనలేకపోయాడు. కొన్నిసార్లు అంతా అనుకూలంగా కనిపించినప్పటికీ, విధి కీలకమైన సమయంలో తన ఆశలను చెదరగొట్టేది. చివరికి అతను నిరాశతో బాబా పటం ముందు కూర్చున్నాడు. కొద్దిసేపట్లో అకస్మాత్తుగా, "జైరాపూర్ వెళ్ళు" అని అతనికి స్పష్టంగా, గట్టిగా మాటలు వినిపించాయి. కానీ వాటిని పలికిన వ్యక్తి ఎవరూ కనిపించలేదు. అది అతనికి బాబా ఆశీర్వాదంగా అనిపించింది. అందువలన తనకు ప్రయోజనం కలుగుతుందని భావించాడు. కానీ జైరాపూర్ లో ఎవరూ తెలియదు, అక్కడకు ఎలా వెళ్ళాలి అని అతను గందరగోళంలో పడ్డాడు. ఇటువంటి సందిగ్ధతలో అతను ఉండగా, జైరాపూర్ కి బదిలీ చేయబడినట్లు ప్రభుత్వం అతనికి ఉత్తర్వు పంపింది. ఇది అతనికి బాబా ఇచ్చిన బహుమతి. వెంటనే అతను వెళ్లి జైరాపూర్ లో ఉద్యోగ విధులకు హాజరయ్యాడు. ఆ కొత్త స్థలంలో తన కుమార్తెకు తగిన వరుడికై అతను విచారణ చేయగా, త్వరలోనే అన్నివిధాలా అర్హుడైన వరుడు దొరికి ఒక నెల లోపల అతని కుమార్తె వివాహ సమస్య పరిష్కరించబడింది.

3. గణేష్ వైద్యకు పెళ్లీడుకొచ్చిన ఒక కుమార్తె ఉంది. తగిన వరునికై అతను పదేపదే చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇటువంటి పరిస్థితులలో అతను చాలా భయపడిపోయాడు. ఒకరోజు బాబా అతని కలలో కనిపించి, "మీరు ఎందుకు ఆత్రుతగా ఉన్నారు? కేశవ్ దీక్షిత్ కు కుమారుడు ఉన్నాడు" అని చెప్పి, ఆ అబ్బాయి ఫోటో కూడా చూపించారు. వెంటనే అతనికి మెలుకువ వచ్చింది. అతను ఎప్పుడూ కేశవ్ దీక్షిత్ గురించి వినలేదు. అంతేకాదు, కలలో బాబా చూపించిన అబ్బాయిని కూడా ఎప్పుడూ చూడలేదు. తరువాత తన కుమారునికి ఈ కల గురించి చెప్పినప్పుడు, అతడు తన కార్యాలయంలో ఆయన చెప్పిన లక్షణాలను కలిగిన దీక్షిత్ అనే అతను ఉన్నాడని, అతని తండ్రి పేరు కేశవ్ అని చెప్పాడు. తరువాత వారు పూర్తి విచారణ చేసి, వెంటనే అతనికి తన కుమార్తెనిచ్చి వివాహం జరిపించారు. ఆవిధంగా బాబా అతని కుమార్తె పెళ్లి సమస్య పరిష్కరించారు.

మహాసమాధి తర్వాత బాబా సహాయం:

4. ఒక పేద అనాధ అమ్మాయి తన పెళ్లి విషయంలో అనేక అడ్డంకులు ఎదుర్కొంది. 'సాయి సచ్చరిత్ర' పారాయణ చేయమని ఎవరో ఆమెకు సలహా ఇచ్చారు. ఆమె బాబా ఫోటో ముందు కూర్చుని సచ్చరిత్ర పారాయణ చేయడం ప్రారంభించింది. మరుసటి రోజే ఎవరో వ్యక్తి వచ్చి, పారాయణ చేస్తున్న ఆమెను చూసి ఆసక్తి కలిగి, అవసరమైన విచారణ చేసి, ఒక వారం లోపల ఆమెను వివాహం చేసుకున్నాడు.

5. మద్రాస్ లో ఆల్ ఇండియా సాయి సమాజ్ వెనుక ఎతిరాజమ్మల్ అనే ఆమె నివసిస్తుండేవారు. పెళ్లీడుకు వచ్చిన ఆమె కుమార్తె కోసం తగిన వరుడిని వెతకడం చాలా కష్టం అయ్యింది. ఆమె బాబాను ప్రార్థించింది. అదృష్టవశాత్తూ ఒక అబ్బాయి ఆమె కుమార్తెను పెళ్లి చేసుకోవడానికి అంగీకరించాడు. అంతేకాకుండా సాయి సమాజ్ ను సందర్శించే ఒక కాంట్రాక్టర్ రూ. 1700 / - సహాయం అందిస్తానని మాటిచ్చాడు. పెళ్లి ముహుర్తం నిర్ణయించబడింది. కాని ముహుర్తానికి కొన్ని రోజుల ముందు హఠాత్తుగా ఆ కాంట్రాక్టర్ తన వాగ్దానం ఉపసంహరించుకున్నాడు. పూర్తిగా విసుగు చెంది, ఆ అమ్మాయి తన తల్లిదండ్రులతో ఆల్ ఇండియా సాయి సమాజ్ కు వచ్చింది. ఆరోజు గురువారపు భజన జరుగుతుంది. ఆమె బాధాతప్త హృదయముతో బాగా తెలిసిన తమిళ భజన పాట, "ఏమిటి బాబా, మీరు ఇంకా మమ్మల్ని పరీక్షిస్తున్నారా?" పాడింది. మరుసటి రోజు ఉదయం మరొక కాంట్రాక్టర్ సాయి సమాజ్ కి వచ్చి, ఆమె కష్టం గురించి తెలుసుకొని, వెంటనే రూ. 2000 /- చెక్ వ్రాసి, ఆ అమ్మాయికి అందజేయమని నా(శ్రీ బి.వి.నరసింహ స్వామిజీ) చేతిలో ఉంచారు. అనుకున్న ముహుర్తానికి అమ్మాయి వివాహం సాయి మందిరంలో జరిగింది.

6. గోపాల్ గణేష్ శ్రేయాన్ కుమార్తెకు 1924లో ఒక వరునితో వివాహం నిశ్చయమయింది. తాంబూలాలు పుచ్చుకున్నారు కూడా. అయితే వివాహం వరుని చదువు పూర్తయిన తర్వాత అని అనుకున్నారు. చదువు పూర్తయింది. వరుని తండ్రికి ఆశ పుట్టింది. కట్నం తెచ్చే సంబంధం కోసం అతను వెతుకుతున్నాడని గోపాల్ శ్రేయాన్ కు తెలిసింది. సాయిబాబాను ప్రార్ధించటం కన్నా ఆయన ఏమీ చేయలేకపోయాడు. సాయి స్వప్నంలో అతనికి కనిపించి, “భయంలేదులే, రెండేళ్ళలో అదే వరునితో వివాహం అవుతుంది" అన్నారు. సాయి మాట చాలు. గోపాల్ శ్రేయాన్ కు ధైర్యం వచ్చింది. ఓపికగానే వేచియున్నాడు. ఈలోగా ఆ వరునికి అనేక సంబంధాలు కుదిరినట్లు కన్పిస్తున్నాయి, కానీ ఏ ఒక్కటీ కుదరడంలేదు. రెండేళ్ళ తరువాత (సాయి చెప్పినట్లుగానే) గోపాల్ శ్రేయాన్ తో మాట్లాడి, అదే సంబంధం చేసుకోక తప్పలేదు వరుని తండ్రికి. సత్పురుషులను విశ్వసించడమే భక్తుల కర్తవ్యం!


7. 1923 సంవత్సరంలో మోరేశ్వర్ చౌహాన్ సోదరిని వివాహం చేసుకుంటానని ఒక వ్యక్తి తనకు తానుగా అభిప్రాయం వ్యక్తపరిచాడు. అందుకు సంబంధించి వాగ్దానం చేస్తూ ఆమోదయోగ్యమైన ఒక అగ్రిమెంట్ వ్రాసుకున్నారు. కానీ‌, ఆరు నెలలు గడిచిన తర్వాత కూడా అతడు రాలేదు. చౌహాన్ తల్లి వికలమైన మనస్సుతో, "బాబా నీవు అద్భుతమైన అనుభవాలను ఎందరికో ఇచ్చావు. మరి మాకు ఎందుకు ఇవ్వవు? నా కుమార్తె గురించి నేను చాలా ఆందోళన చెందుతున్నాను. నీకు శక్తి ఉంటే, ఇరవై నాలుగు గంటల వ్యవధిలో సంబంధం నిశ్చయం కావాలి" అని ప్రార్ధించింది. 24 గంటలలో ఈ విషయమై బాబా శక్తిని నిరుపించుకోమని ఆమె బాబాకే సవాలు విసిరింది. ఆరాత్రి ఆమెకు ఒక కల వచ్చింది. ఆ కలలో, మరుసటి రోజు ఉదయం ఆమె తన కుమారుని ప్రక్కన కూర్చుని ఉండగా పోస్టుమేన్ వచ్చి ఒక ఉత్తరం ఇచ్చినట్లుగా, ఆ లేఖలో పెళ్ళికొడుకు తరఫు నుండి పెళ్ళికి తమ తుది ఆమోదాన్ని తెలియజేస్తున్నట్లుగా కనిపించింది. మరుసటి రోజు ఉదయం 9 గంటలకు ఆమె తన కొడుకు ప్రక్కన కూర్చుని తనకి వచ్చిన కలను వర్ణించటం మొదలుపెట్టింది. అదే సమయంలో పోస్టుమేన్ వచ్చి ఒక లేఖను ఇచ్చాడు. పెళ్లికొడుకు వాళ్ళు వివాహానికి తమ సమ్మతి తెలుపుతూ పంపిన లేఖ అది. బాబా తమ శక్తిని చాటుకున్నారు.

నిజ దర్శన ప్రాప్తి … కోవా అడిగిన బాబా


సిద్దిపేట సాయిబాబా గుడి పూజారి వెంకట రామ శర్మ గారు తన అనుభవం ఇలా తెలియజేస్తున్నారు.

సాయి బంధువులందరికి సాయి రామ్.

నా పేరు వెంకట రామ శర్మ. నేను సిద్దిపేటలో సాయిబాబా గుడి పూజారిగా పని చేస్తున్నాను. ఒకరోజు గుడిలో జరిగిన లీలను మీతో పంచుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆరోజు నేను "శేజ్ హారతి" ఇవ్వడానికి పదిహేను నిమిషాల ముందు ఒక భక్తునికి పంచాంగం, జ్యోతిష్యం చెబుతూ ఉన్నాను. ఆ సమయంలో ఒక ముసలాయన తెల్లటి వస్త్రం ధరించి, భుజమునకు జోలె తగిలించుకుని గుడి లోపలికి వచ్చారు. "శేజ్ హారతి" సమయం కావస్తు ఉంది కదా! అని జ్యోతిష్యం ముగించి వచ్చి ఆ ముసలాయనకు తీర్థం పెట్టాలా సాయి అని అడిగాను. ఆయన వద్దు అన్నట్టు అభయ హస్తం చూపారు. ప్రసాదం ఇవ్వాలా అని అడిగితే నాకు "కోవా" కావాలి అని అడిగారు. కోవాని కేవలం గురువారం మాత్రమే పంచుతారు ఇప్పుడు లేదని చెప్పినా వినకుండా చిన్న పిల్లలు మారం చేసినట్టు నాకు "కోవా కావాలి" “కోవా కావాలి" అని అన్నారు. లేదు స్వామి అని చెప్పి మీరు ఎక్కడి నుండి వచ్చారు? అని అడిగాను. అందుకు ఆయన నేను "శిరిడీ" నుండి వచ్చానని చెప్పారు. ఇంకా వివరాలు అడుగుదాం అంటే "శేజ్ హారతి" టైం అవుతుంది. అందుకే బాబాకి నైవేద్యం నివేదించి హారతి మొదలుపెట్టే ముందు హారతి పుస్తకం ఇవ్వాలా అని అడిగాను. నాకు అన్ని హారతులు వచ్చు అని చెప్పారు. సరే అని హారతి మొదలు పెట్టాను. ఆయన కూడా హారతి సమయంలో ఉంటూ "అతా స్వామి సుఖే నిద్రా కరా అవధూత బాబా కరా సాయినాథ" అనే చరణం వచ్చిన సమయంలో ముసలాయన అదృశ్యం అయినారు.

 ఆశ్చర్యంగా ఎక్కడ వెతికినా కనిపించలేదు. కానీ, తరువాత అర్ధమైంది. ఆయన వేరెవరో కాదు సాక్షాత్  "బాబా" అని, నాకు నిజ దర్శనం ఇవ్వడానికే వచ్చారని. నిజంగా నా జన్మ ధన్యం అయిపోయింది. కానీ, పక్కన ఉన్నంత వరకు తెలుసుకోలేక పోయా! అదృశ్యం అయ్యాక బాబా అని తెలిసింది.


సాయి కృప - 2వ భాగం....


హైదరాబాదు నుండి శ్రీమతి అర్చన తన అనుభవాలను ఇంకా ఇలా తెలియజేస్తున్నారు...

ప్రతి చిన్న కోరికను నెరవేర్చే కరుణామూర్తి శ్రీసాయి:-

ఆ రెండు రోజులలో బాబా సమాధి, ద్వారకామాయి, చావడిల దర్శనాలు బాగా జరిగాయి. కానీ శరత్‌బాబూజీగారి సాయిపథం, లక్ష్మీబాయిషిండే ఇల్లు, మహల్సాపతి ఇల్లు, శ్యామా ఇల్లు చూడటం కుదరలేదు. ముఖ్యంగా, సాయిపథం దర్శించలేదని చాలా బాధగా అనిపించింది. నిజానికి నేను శిరిడీ వెళ్ళినరోజే నాకు తెలిసిన ఒక సాయిబంధువుకు ఫోన్ చేసి, 'సాయిపథంకి ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉంది?' అని వివరాలు తెలుసుకున్నాను. కానీ సాయిపథం దర్శించలేకపోయాను. సరే, ఇప్పుడు కుదరలేదు, ఇంకోసారి వచ్చినప్పుడు చూద్దామని  అనుకున్నాను. సాయంత్రం 6 గంటలకు బస్సు ఎక్కడానికి ట్రావెల్స్ దగ్గరకి వచ్చాము. వాళ్లు, "బస్సులో ఎ.సి. పనిచేయటం లేదు" అన్నారు. 'చిన్నపిల్లలతో ఎ.సి. లేకుండా ఎలా వెళ్తామ'ని అందరూ పెద్ద గొడవ చేశారు. ట్రావెల్స్ వాళ్లకి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. మేము పోలీస్‌స్టేషన్‌కి ఫోన్ చేస్తే పోలీసులు వచ్చారు. వాళ్ళు మరుసటిరోజు, అంటే 17వ తేదీ ఉదయానికి బస్సు సిద్ధం చేయమని ట్రావెల్స్ వాళ్లకి చెప్పి ఒప్పించారు. అందరూ 'ఏమిటి ఇలా అయ్యింది?' అని అనుకుంటూ ఉంటే, నాకు మాత్రం 'బాబాని మళ్ళీ దర్శించుకోవచ్చు' అని చాలా హ్యాపీగా ఉంది. కానీ, 'బస్సు ఉదయం కాకుండా సాయంత్రం ఉంటే, అప్పుడు ఉదయం కూడా బాబాని దర్శించుకోవచ్చు, వీలైతే నేను చూడాలనుకున్నవన్నీ చూడొచ్చ'ని అనుకున్నాను. అదే బాబాకి చెప్పుకొని పడుకున్నాను. ఉదయాన ట్రావెల్స్ వాళ్లు, 'బస్సు సాయంత్రం బయలుదేరుతుంది' అని అన్నారు. బాబా నా కోరిక మన్నించారని నేను హ్యాపీగా ఖండోబా మందిరం, సాయిపథం, సాయిభక్తుల ఇళ్ళు అన్నీ చూసుకుని, మళ్ళీ ఒకసారి సమాధిమందిరం, ద్వారకామాయి, చావడి దర్శించుకున్నాను. చాలా ఆనందం పొందాను. సాయిపథంలో చాలా ప్రశాంతంగా అనిపించింది.


బాబా అనుగ్రహంతో వేళ కాని వేళ గురువుగారి బుక్స్ అనుగ్రహించుట:-

ఉదయం సాయిపథానికి వెళ్ళినప్పుడు గురువుగారి బుక్స్ తీసుకోవాలని అనుకున్నాను. కానీ అక్కడ బుక్ స్టాల్ తెరచిలేదు. నేను ఫోన్ చేసి ఒక సాయిబంధువును అడిగితే, సాయిపథంలో సత్సంగం ఉన్న సమయాలలో (అంటే, ఉదయం 9 నుండి 10.30 మరియు సాయంత్రం 6 నుండి 8) బుక్ స్టాల్ తెరచి ఉంటుందని చెప్పారు. నాకు ఆ సమయాలలో వెళ్ళే అవకాశం లేదు. సరే, 'వీలైతే మధ్యాహ్నం ఒకసారి వెళ్తాను, బాబా అనుగ్రహం ఉంటే బుక్స్ దొరుకుతాయి' అని అనుకున్నాను. అనుకున్నట్లుగానే మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో సాయిపథానికి మళ్ళీ వెళ్లాను. బుక్ స్టాల్ మూసివేసి ఉంది. దానితో నేను చాలా నిరాశచెందాను. అక్కడ సాయిపథంలో ఒక అబ్బాయి ఉంటే తనని అడిగాను, 'స్టాల్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు?' అని. తను, "సాయంత్రం 4 తరువాతే తీస్తారు, ఈ సమయంలో అసలు తీయరు" అని చెప్పాడు. "సాయంత్రం బస్సుకి మేము వెళ్ళిపోతున్నాం, అందువలన నాకు మళ్ళీ రావడం కుదరదు" అని చెప్పాను. అప్పుడతను, 'సరే, ఇలా రండి!' అని ఒక ఇంటి దగ్గరకి తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఒక అతను భోజనం చేస్తూ ఉన్నారు. అతనితో బుక్స్ కావాలని అడిగితే, 'ఇప్పుడు కుదరదు' అన్నారు. అప్పుడు నేను, "సాయంత్రం ఊరికి వెళ్లిపోవాలి, మళ్ళీ రాలేను. నాకు గురువుగారి బుక్స్ కావాలని ఆశగా వచ్చాను" అని చెపితే, అతను ఒక 15 నిమషాలు వేచి ఉండమన్నారు. తరువాత కొద్దిసేపట్లో అతను వచ్చి బుక్ స్టాల్ ఓపెన్ చేసి నాకు కావాల్సిన బుక్స్ అందించారు. నాకు ఎంత సంతోషం అంటే మాటల్లో చెప్పలేను. ఎంతో ఆశపడ్డ గురువుగారి బుక్స్‌ను బాబా అనుగ్రహించారు. సంతోషంగా కృతజ్ఞతలు చెప్పుకున్నాను.


బాబా ఇచ్చిన వేపాకులు:- 

తరువాత మళ్ళీ లంచ్ చేసిన తరువాత అందరం సమాధిమందిరం దర్శనానికి వెళ్ళాం. దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తరువాత మావారికి గురుస్థాన్‌లో ఉండే వేపచెట్టు ఆకుల యొక్క విశిష్టత గురించి చెబుతూ, "ఇంతవరకు ఒక్క ఆకు కూడా దొరకలేదు" అన్నాను. అప్పుడు మావారు, "కొంచెంసేపు గురుస్థాన్ దగ్గర కూర్చుందాం" అన్నారు. మేము కూర్చున్న తరువాత నేను, 'బాబా! ఇప్పటివరకు ఒక్క వేపాకు కూడా దొరకలేదు, కనీసం ఒక్క ఆకు దొరికినా అదృష్టం కదా' అని అనుకున్నాను. అలా అనుకున్న కాసేపటికి పెద్దగా గాలి వీచింది. చాలా ఆకులు క్రింద రాలాయి. కానీ మావారు, "ఇవి చెట్టు నుండి రాలినవి కావు. రేకుల పైన, నెట్ పైన ఉన్నవి క్రింద పడ్డాయి" అన్నారు. అంతే! మరుక్షణం మళ్ళీ పెద్దగాలి వీచింది. దానితో చెట్టు నుండి పచ్చటి ఫ్రెష్ ఆకులు క్రింద పడ్డాయి. మావారు, "అర్చనా! బాబా నీ ప్రతి కోరికా తీర్చేస్తున్నారు" అన్నారు. నాకు చాలా సంతోషంగా అనిపించింది.  నేను, మావారు, మా బాబు చాలా వేపాకులు తెచ్చుకున్నాము.

తొలిసారి 'నందదీప' దర్శనం:-

తరువాత మందిర ప్రాంగణం నుండి బయటకు వచ్చేశాం. అప్పుడు నాకు ఇంకొక్కసారి లెండీతోటకు వెళ్దామనిపించి సెక్యూరిటీ అతన్ని అడిగితే, అతను 4వ నెంబర్ గేటుగుండా లోపలకి పంపించారు. లెండీతోట అంతా చూసుకుంటూ ఒకవైపుగా వెళ్ళినప్పుడు, అక్కడ రావిచెట్టు, వేపచెట్టు మరియు అక్కడ ఒక దీపాన్ని చూశాను. అక్కడ బోర్డు చూస్తే 'నందదీపం' అని ఉంది. నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే, నేను అప్పటివరకు నందదీపం అంటే గురుస్థాన్ వద్ద ఉన్న దీపమనే అనుకునేదాన్ని. ఆ రెండూ వేరువేరు అని నాకు అస్సలు తెలియదు. కానీ ఇన్నాళ్ళకు, అదీ శిరిడీ నుండి తిరుగు ప్రయాణమయ్యే క్షణంలో బాబా తమ స్వహస్తాలతో వెలిగించిన ఆ పవిత్రజ్యోతిని నాకు చూపించి, నా అజ్ఞానాన్ని తొలగించి నన్ను ధన్యురాలిని చేశారు. మనం ఏదీ ఆయనను అడగకుండానే, చిన్నపిల్లాడి చేయిపట్టుకొని అన్నీ చూపించినట్లు మనకు చూపిస్తారు. అంతటి ప్రేమమూర్తి మన బాబా.

అలా ఒక్కరోజు అనుకున్న మా శిరిడీ ప్రయాణం 3 రోజులు అయ్యింది. అపుడు అనిపించింది, కూతురి పెళ్ళిచేసిన బాబా వెంటనే తనను ఎలా పంపిస్తాడు? అందుకే అమ్మ లాంటి బాబా తన దగ్గర కూతురుని 3 రోజులు వుంచుకుని పంపారు. చక్కగా ఆయన రూపం కళ్లలో నింపుకుని ఆనందంతో తిరిగి వచ్చాను. మరో విషయం, ఎప్పుడూ విపరీతమైన అల్లరి చేసే మా పిల్లలు కూడా శిరిడీలో అల్లరి చేయలేదు. చాలా చక్కగా ఉన్నారు.


బాబా చక్కటి భోజనం పెట్టించారు:-

నేను ప్రతి గురువారం 6 గంటలకి మా ఇంటికి దగ్గరగా ఉండే బాబా గుడిలో పల్లకి సేవకి వెళ్తూ ఉంటాను. సాధారణంగా నేను ఇంటినుండి వర్క్ చేస్తూ ఉండటం వలన సాయంత్రం 6 గంటలకి కాల్స్ అయిపోయిన తరువాత గుడికి వెళ్లి ఒక గంటసేపు ఉండి వస్తాను. ఏప్రిల్ 26న పిల్లలు లేకపోవటం వలన ఆఫీసుకి వెళ్లాను. ఆఫీస్ నించి ఇంటికి వెళ్ళటానికి ఒక గంట సమయం పడుతుంది. ఆరోజు బాబా నాకోసం కాల్స్ తొందరగా ముగించారు. 5 గంటలకే కాల్ అయిపోయింది. అపుడు బయలుదేరితే పల్లకి సేవ టైంకి వెళ్ళగలను. కానీ ఆఫీసులో ఇంకా ఏదో పని చెయ్యాలని వెళ్ళలేదు. ఇక చూడండి, ఒక గంటసేపు ఎంత కష్టపడ్డా ప్రోగ్రాంలో ఎర్రర్స్ వస్తూనే ఉన్నాయి. అప్పుడు, "ఎపుడూ వెళ్ళే బాబా పల్లకి సేవకి వెళ్ళలేదు, అందుకే వర్క్ అవటం లేదు" అని  అనిపించింది. ఇక వెంటనే ఆలస్యం చేయకుండా బాబాను చూడాలని ఆఫీసు నుండి బయలుదేరాను. వెళ్ళేదాకా ఏమీ తినకుండా, గుడిలో బాబా ప్రసాదం తినాలని నా కోరిక. దారిలో, "బాబా! అందరికీ అన్నం పెడతావు, నీ బిడ్డల్ని పస్తులు ఉండనివ్వవు కదా! మరి నేను ఇంటికి వెళ్ళగానే మంచి ఫుడ్ పెడతావా?" అని అనుకున్నాను. గుడికి వెళ్లి బాబా దర్శనం చేసుకుని ప్రసాదం తిన్నాను. తరువాత ఇంటికి వచ్చేసరికి మా ఫ్లోర్‌లో చిన్నపాప పుట్టినరోజు చేసుకుంటున్నారు. ఆ పాప వాళ్ళ అమ్మ నన్ను రమ్మని పిలిచింది. సాధారణంగా మా అపార్ట్‌మెంట్‌లో పుట్టినరోజు ఫంక్షన్లు ఎవరు చేసినా భోజనం పెట్టరు. అలాంటిది ఆవిడ నాకు పఫ్, కేకు, చిప్స్‌తో పాటు అన్నం కూడా తినమని బలవంతం చేసింది. దారిలో నేను అనుకున్నానుగా, బాబా నాకు చక్కటి భోజనం పెట్టించారు.


సాయి కృప - 1వ భాగం....


హైదరాబాదు నుండి శ్రీమతి అర్చన తన అనుభవాలను ఇలా తెలియజేస్తున్నారు...

చిన్నతనంలోనే బాబా అనుగ్రహం:-

నా పేరు అర్చన. చిన్నతనంలోనే నాకు బాబాతో పరిచయం అయింది. నాకు ఆరేళ్ల వయస్సున్నప్పుడు నా స్నేహితురాలు వేరే మతం గురించి చెప్తూ, నన్ను ఆ మతంలోకి మారమని చెప్పేది. ఒకరోజు నా స్నేహితురాలి  అమ్మమ్మ  నన్ను పిలిచి, "నీకు ఒక గొప్ప దేవుడి ఫోటో ఇస్తాను, ఆయన్ని పూజించు. వేరే ఆలోచనలేమీ పెట్టుకోకు" అని చెప్పి, బాబా ఫోటోను నాకు ఇచ్చింది. నేను ఆ ఫోటోను ఇంటికి తెచ్చి మా పూజామందిరంలో పెట్టుకున్నాను. ఒకరోజు నేను ఒక మామిడికాయను కోసి ప్లేటులో పెట్టుకుని పూజగదిలోకి వెళ్ళి ఆ ప్లేటును బాబా ముందు పెట్టి, "బాబా! నువ్వు ఈ మామిడికాయ తినాలి" అని చెప్పి, పూజగది తలుపులు మూసివేశాను. కొంత సమయం తరువాత ప్రసాదం తీసుకోవటానికి వెళ్తే, అక్కడ ప్లేట్ కనిపించలేదు. ఆ విషయం మా ఇంట్లో అందరితో చెపితే ఎవరూ నమ్మలేదు. "ఏదో చిన్నపిల్ల, తనే తినేసి అలా చెప్తోంది" అనుకున్నారు. అలా బాబా నన్ను చిన్నతనంలోనే అనుగ్రహించారు. ఆ తరువాత నా జీవితంలో ఎన్నో బాబా లీలలు, అనుగ్రహాలతో నా చదువు, ఉద్యోగం, పెళ్లి, పిల్లలు అన్నీ చక్కగా సాగాయి. వాటిలో 2018, ఏప్రిల్ నెలలో జరిగిన నా అనుభవాలను ఇప్పుడు మీతో పంచుకుంటాను.


మ్రొక్కిన మ్రొక్కును మరచినా, ప్రేమతో బాబా ఋణవిముక్తురాలిని చేయుట:-

నేను పెళ్ళికాకముందు, "శిరిడీలో పెళ్ళి చేసుకుని, 50,000 రూపాయలు బాబా హుండీలో వేస్తాను" అని మ్రొక్కుకున్నాను. పెద్దవాళ్ళు అన్నీ మాట్లాడుకొని నా పెళ్ళి నిశ్చయం చేసిన తరువాత నేను మా అమ్మకి నా మ్రొక్కు గురించి చెప్పాను. 'ఇప్పుడు చెప్తే బాగోదు, మగపెళ్ళివారు ఒప్పుకుంటారో, లేదో' అని భయపడుతూనే మా అమ్మ నా మ్రొక్కును గురించి వాళ్ళకు చెప్పింది. కానీ వాళ్లు, "మాకు ఉన్నది ఒకే అబ్బాయి. పెళ్ళి బాగా చేయాలని మా ఆశ. అందువలన పెళ్లి ఇక్కడే జరిపిద్దాం. కావాలంటే పెళ్లి అయ్యాక శిరిడీ వెళతారు" అన్నారు. ఇక చేసేదిలేక మా పెళ్ళి గుంటూరులోనే జరిపించారు. పెళ్లి అయిన వెంటనే శిరిడీ వెళ్ళటం కుదరలేదు. కొన్నాళ్ళకు వెళ్ళాముగానీ, మ్రొక్కు తీర్చుకోలేదు. క్రమంగా నేను ఆ మ్రొక్కు సంగతే మరచిపోయాను.

2018, ఏప్రిల్ 15న మా పెళ్ళిరోజు. అందువలన ఏప్రిల్ మొదటివారంలో మావారిని, "ఇంకో వారంలో మన పెళ్ళిరోజు వస్తుంది కదా! మనం శిరిడీ వెళ్దామ"ని అడిగాను. ఆయన, 'చూస్తాను' అన్నారు. నాకు కనీసం రెండు రోజులైనా శిరిడీలో ఉండి బాబాని ప్రశాంతంగా చూసుకోవాలని ఉంది. కానీ మావారికి ఆఫీస్ వర్క్ ఉండటం వలన, "15న శిరిడీ వెళ్లి, మళ్ళీ అదేరోజు రిటర్న్ అవుదాం" అన్నారు. 14 రాత్రి బయలుదేరి 15న బాబా దర్శనం చేసుకుని, అదేరోజు సాయంత్రం రిటర్న్ అయ్యేలా టికెట్స్ బుక్ చేయమని ఆయన చెప్పారు. "సరే, ఏం చేస్తాం? బాబా ఒక్కరోజుకే నాకు అవకాశం ఇస్తున్నారు" అని అనుకుని టికెట్స్ బుక్ చేయడానికి నేను ట్రావెల్స్ దగ్గరకి వెళ్లాను. 14 రాత్రి బయలుదేరడానికి టికెట్స్ దొరికాయి, కానీ 15 రిటర్న్ అవడానికి టికెట్స్ అనుకూలంగా లేవు. మావారికి ఫోన్ చేసి ఆ విషయం చెపితే, ఆయన కొంచెం కష్టంగానే, "అయితే 16న రిటర్న్ చేయించు" అన్నారు. నేను చాలా సంతోషంగా టికెట్స్ బుక్ చేయించాను. టికెట్స్ బుక్ చేసిన మరుక్షణం రోడ్డు వైపు తిరిగి చూసేసరికి దూరంగా వెళ్తున్న ఒక బస్ వెనుక పెద్ద బాబా ఫోటో కనిపించింది. అలా బాబాను చూడగానే, ‘నువ్వు కోరుకున్నట్లు శిరిడీలో రెండు రోజులు ఉండేలా అనుగ్రహించాను, ఇక సంతోషంగా శిరిడీకి రా!’ అని బాబా నన్ను పిలుస్తున్నట్లు అనిపించింది. నా సంతోషానికి హద్దులు లేవు. తీరా బయలుదేరేరోజు మావారికి జ్వరం. దాంతో తను కాస్త నీరసంగా ఉన్నారు. బాబుకు కూడా దగ్గు ఎక్కువగా వస్తోంది. దాంతో నేను బాబాకు నమస్కరించుకుని, "బాబా! నువ్వే దిక్కు, నువ్వే చూసుకో!" అని చెప్పుకున్నాను. ఆ తరువాత అందరం కలిసి శిరిడీ బయలుదేరాము. ఏప్రిల్ 15న మేము ధూప్ ఆరతికి వెళ్ళాము. నేను ప్రతి నెలా జీతం రాగానే 1,000 రూపాయలు బాబాకి తీసి, తరువాతే నేను వాడుకుంటాను. అలా ప్రోగుచేసిన డబ్బును మావారికి ఇచ్చి హుండీలో వేయమన్నాను. ఎంత ఉంటుందో కూడా నేను లెక్కపెట్టలేదు. ఆరతి, దర్శనం అయ్యాక మావారు డబ్బు హుండీలో వేసి వచ్చిన తరువాత, "అర్చనా! నువ్వు ఇచ్చిన డబ్బు 50,000 దాకా ఉంటుంది కదా!" అన్నారు. "ఏమో, నేను లెక్కపెట్టలేదు" అన్నాను. కానీ, తరువాత నాకు నా 50,000 రూపాయల మ్రొక్కు సంగతి గుర్తుకు వచ్చింది. నేను మర్చిపోయినా, పెళ్లికి ముందు నేను మొక్కుకున్న మొత్తాన్ని ఇలా నా పెళ్లిరోజున స్వీకరించడమే కాకుండా, "నాకు నా డబ్బు అందింది" అని మావారి నోటితో చెప్పించారు బాబా. 

నేను శిరిడీలో పెళ్ళి చేసుకోవాలని కూడా మొక్కుకున్నాను కదా! ఒక చిన్న సూత్రం నా గొలుసుకి కట్టుకుని, బాబాను కిటికీ ద్వారా దర్శించుకుంటాం కదా, అక్కడ బాబాకు ఎదురుగా నిల్చుని మావారి చేత నా మెడలో వేయించుకున్నాను. అలా ఆ మ్రొక్కు కూడా  తీర్చుకున్నాను. నాకు చాలా ఆనందంగా అనిపించింది. మనం మ్రొక్కుకున్న మ్రొక్కులను మనం మర్చిపోయినా బాబా మాత్రం వాటిని మనం నేరవేర్చేలా చేసి మనల్ని ఋణవిముక్తులను చేస్తారు. ఆయనకు తన భక్తుల పట్ల ఎంత శ్రద్ధో! ప్రతిక్షణం వారి శ్రేయస్సు కోసమే ఆలోచిస్తూ ఉంటారు.


ఎంతగానో ఇష్టపడే ఫోటోను బాబా తమ ఆశీస్సులతో అనుగ్రహించుట:- 

ఆ తరువాత ద్వారకామాయి, చావడి కళ్లారా తృప్తిగా దర్శించుకున్నాను. ద్వారకామాయిలో బాబా కూర్చొని ఉండే ఫోటో అంటే నాకు ఎంతో ఇష్టం. అలాంటి ఫోటో ఒకటి ఇంట్లో పెట్టుకోవాలని నాకు ఎప్పటినుండో కోరిక. హైదరాబాదులో చాలా షాపుల్లో చూశానుగానీ, నాకు అంతగా నచ్చలేదు. కాబట్టి శిరిడీలో ద్వారకామాయి ఎదురుగా ఉన్న షాపులో అటువంటి ఫోటో కోసం వెతికాను. ఒక ఫోటో నాకు బాగా నచ్చి, రేటు మాట్లాడుకుని ప్యాక్ చేయిస్తుండగా, షాప్ అతను నాతో, "ఈ ఫోటోకి గంధం పెట్టొచ్చుగానీ, కుంకుమ మాత్రం పెట్టవద్దు. కుంకుమ పెడితే ఫోటో పాడవుతుంది" అన్నారు. నాకు చాలా బాధేసింది. 'ఏమిటి బాబా ఇలా అయింది?' అని అనుకున్నాను. అంతలో వేరే గ్లాస్ ఫ్రేమ్ చూశాను. "అది బాగుంది, అలాంటి ఫ్రేమ్ కావాలి" అని అడిగాను. కానీ అతను అక్కడంతా వెతికి, "అలాంటి ఫ్రేములో ఈ ఫోటో లేదు" అన్నాడు. నేను చాలా బాధపడ్డాను. అయితే ఇంతలో వేరే అతను వచ్చి, పైకి వెళ్లి గ్లాస్ ఫ్రేముతో ఉన్న ద్వారకామాయి బాబా ఫోటో తెచ్చి నాకు ఇచ్చి, "దీనికి కుంకుమ కూడా పెట్టుకో దీదీ!" అన్నాడు. చాలా చాలా సంతోషం అనిపించింది. వెంటనే ఆ ఫోటోను ద్వారకామాయికి తీసుకొని వెళ్తే, అక్కడ ఉన్నతను బాబా దగ్గర నా బాబా ఫోటో పెట్టి, నాకు తిరిగి అందిస్తూ ఫోటోతో పాటు రోజాపూలగుత్తి కూడా ఇచ్చారు. అలా బాబా నేను ఎంతగానో ఇష్టపడే ఫోటోను తమ ఆశీస్సులతో నాకు ప్రసాదించారు. నేను చాలా అదృష్టవంతురాలిని.

మరికొన్ని అనుభవాలు రేపటి భాగంలో...



శిరిడీయాత్రకు బాబా ధనసహాయం


నా పేరు రాజేష్ బాబు. మా ఊరు ముప్పాళ్ళ. బాబా నాకు ప్రసాదించిన ఒక లీలను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సాయిబాబా భక్తుడనైన నేను ఎప్పుడూ బాబాని తలచుకుంటూ, వారి రూపాన్ని ధ్యానించుకుంటూ ఉంటాను. కానీ నేను ఎన్నడూ శిరిడీ వెళ్ళలేదు. నాకు శిరిడీ వెళ్లి బాబాను దర్శించుకోవాలనే కోరిక ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను శిరిడీ వెళ్ళలేకపోయాను.

2017 జనవరి 24న నాకు శిరిడీ వెళ్లే అవకాశం వచ్చింది. మా బంధువులు శిరిడీ వెళుతూ నన్ను కూడా వాళ్ళతో రమ్మన్నారు. నాకు బాబా అలా అనుమతినిచ్చినందుకు చాలా సంతోషం కలిగింది. అయితే శిరిడీ వెళ్ళడానికి నా దగ్గర 3,400 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఆ డబ్బులు సరిపోతాయో లేదోనని విచారంతో ఉన్నాను. అలాంటి సందర్భంలో బాబా నాకు 1,000 రూపాయలిచ్చి ఆదుకున్నారు. 

అదెలా అంటే, 2017 జనవరి 22వ తేదీ తెల్లవారుఝామున 4 గంటల 17 నిమిషాలకు నా అకౌంట్‌‌లోకి 1,000 రూపాయలు ట్రాన్స్‌‌ఫర్ అయ్యాయని నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఆ వేయి రూపాయలు నా అకౌంటులో ఎవరు వేశారో నాకు అర్థం కాలేదు. నేను మా అన్నయ్యకి ఫోన్ చేసి అడిగాను, 'మీరేమైనా నాకు డబ్బులు ట్రాన్స్‌‌ఫర్ చేశారా?' అని. మా అన్నయ్య 'చేయలేద'ని చెప్పారు. తరువాత నా స్నేహితులందరినీ అడిగాను. వాళ్ళు కూడా నాకు 'మనీ ట్రాన్స్‌‌ఫర్ చేయలేద'ని చెప్పారు. శిరిడీ ప్రయాణానికి అవసరమని బాబానే నాకు అలా 1,000  రూపాయలు ఇచ్చి ఆదుకున్నారని నా ప్రగాఢ విశ్వాసం.


ఆటోడ్రైవర్ రూపంలో ఆదుకున్న సాయి


విజయవాడ నుండి సాయిభక్తురాలు సుజాత తన అనుభవాన్ని ఇలా తెలియజేస్తున్నారు. 

సాయిభక్తులందరికీ నా వందనాలు. ఎంతోమంది బాబా కృప వలన వారికి జరిగిన అనుభవాలను సాయిభక్తులందరితో పంచుకుని ఆనందం పొందుతున్నారు. నాకు కూడా బాబా వారి దయవలన ఎన్నో అనిర్వచనీయమైన అనుభవాలు జరిగాయి. అందులో ముచ్చటగా ఒకటి మీతో పంచుకోవాలనే ఉద్దేశ్యంతో నా అనుభవాన్ని మీకు తెలియచేస్తున్నాను.
2003 సంవత్సరంలో నేను బి.కామ్. చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్నాను. ఒకరోజు ఎగ్జామ్ సెంటర్‌కి తొందరగా వెళ్ళి, అక్కడే చదువుకుంటూ కూర్చున్నాను. కొంతసేపైన తరువాత వార్నింగ్ బెల్ కొట్టారు. బుక్స్ అన్నీ బయట పెట్టి హాల్‌టికెట్ కోసం చూసుకుంటే పర్సులో లేదు. ఇంటిలో మరచిపోయాను. నా దగ్గర మొబైల్ లేదు. ఇంట్లో కూడా ఫోన్ లేదు. మా నాన్నగారి దగ్గర ఫోన్ ఉన్నప్పటికీ ఆయన వేరే ఊరు వెళ్ళారు. ఏమి చేయాలో అర్థం కాలేదు. నేను ఎగ్జామ్ రాసే గాంధీ మహిళా కాలేజీ మార్కెట్ దగ్గర వుంటుంది. మేము ఉండేది హెచ్.బి.కాలనీ, భవానీపురం. ఏమి చేయాలో అర్థంకాక కాలేజీ గేటు బయటికి వచ్చి నిలుచుని ఆలోచిస్తున్నాను. బాబాని తలచుకొని టెన్షన్ పడుతున్నాను. ఇంతలో ఒక ఆటోడ్రైవర్ నా దగ్గరికి వచ్చి, "ఏంటమ్మా, ఏమయింది?" అని అడిగాడు. విచిత్రం ఏమిటంటే, కాలేజీ దగ్గరకి ఎప్పుడూ ఆటోలు రావు. కొంచెం దూరం నడిచి వెళ్ళి ఆటో ఎక్కాల్సి ఉంటుంది. అలాంటిది ఆటోడ్రైవరే నన్ను వెతుక్కుంటూ వచ్చాడు.

ఆటో ఆయనకి మొత్తం వివరించి, "15 నిమిషాలలో నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ తిరిగి రావాలి" అని చెప్పాను. అందుకు ఆటో ఆయన, "నీకెందుకమ్మా, నేను తీసుకొని వెళతాన"ని అన్నాడు. అది అసలే చిట్టినగర్ మార్కెట్, మంచి ట్రాఫిక్ రోడ్. ఆటో ఆయన మెయిన్ రోడ్డులో కాకుండా షార్ట్‌కట్‌లో సందులు సందులు తిప్పి తీసుకువెళ్తుంటే మోసం చేస్తాడేమోనని భయమేసింది. కానీ ఆయన నన్ను త్వరగా ఇంటికి తీసుకొని వెళ్ళి, నేను హాల్‌టికెట్ తీసుకొన్నాక మళ్ళీ 15 నిమిషాలలో లాస్ట్ వార్నింగ్ బెల్ కొట్టే లోపల కాలేజీలో దించాడు. ఆటో ఆయన రాకపోతే నాకు ఒక సంవత్సరం వేస్ట్ అయ్యుండేది. ఆటో ఆయనకి థాంక్స్ చెప్పి, "డబ్బులు తీసుకోండి, మీరు చేసిన సహాయానికి ఎంత ఇచ్చినా సరిపోదు" అన్నాను. అందుకాయన, "నాకెందుకమ్మా? నువ్వు నమ్ముకున్న దేవుడికి సమర్పించుకో! దేవుడే నీకు నా రూపంలో సహాయం చేశాడు" అని చెప్పి ఏమీ తీసుకోకుండానే వెళ్ళిపోయాడు. నేను 4 అడుగులు ముందుకు వేసి మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే, ఆటోగానీ, ఆటో ఆయనగానీ కనిపించలేదు. ఆ రూపంలో వచ్చి నా సమస్య తీర్చినది నా సాయినాథుడే!


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo